మనం ఎందుకు పట్టించుకోం? | Is Nitish Kumar a living witness to the unfortunate truth about Indian politics | Sakshi
Sakshi News home page

మనం ఎందుకు పట్టించుకోం?

Published Mon, Feb 5 2024 3:43 AM | Last Updated on Mon, Feb 5 2024 3:43 AM

Is Nitish Kumar a living witness to the unfortunate truth about Indian politics - Sakshi

భారత రాజకీయాల గురించి ఒక శోచనీయమైన, దురదృష్టకరమైన నిజానికి నితీశ్‌ కుమార్‌ ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచారా? ఈ విధమైన అవకాశవాదం, పదేపదే మిత్రపక్షాలను మార్చటం ఏ పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశంలోనూ ఆమోదయోగ్యమైనది కాదు. అది ఆ నాయకుడి విశ్వసనీయతను, పార్టీ ప్రతిష్ఠను నాశనం చేస్తుంది.

నితీశ్‌ కుమార్‌ పిల్లిమొగ్గలతో పోల్చలేం కానీ, 2010లో యూకేలో కన్జర్వేటివ్‌లతో లిబరల్స్‌ పొత్తు పెట్టుకున్నప్పుడు అదొక నీతిమాలిన చర్యగా పరిగణన పొందింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో లిబరల్‌ పార్టీ కుప్పకూలింది. మరి ఈ ‘దుముకుళ్లను’ మన ఓటర్లు ఎందుకు సమ్మతిస్తారు? తమను గెలిపించిన వారికి ద్రోహం చేసి వెళ్లిన రాజకీయ నాయకులకు మన ఓటర్లు ఎందుకు శిక్ష విధించరు?

నాయకులు పార్టీని వదిలి వెళ్లడం, వేరే పార్టీలో చేరడం మన అందరికీ బాగా తెలి సిన విషయమే. మనం ఆశించినంతగా ఏమీ వారు అసాధారణమైన వ్యక్తులు కారు. కానీ నితీశ్‌ కుమార్‌ అంత బుద్ధిహీనమైన పని చేసిఉండాల్సింది కాదని మీరు అంగీకరిస్తారా? ఆయన అలా చేయకుండా ఉండలేరని అందరూ ఊహిస్తున్నదే అయినప్పటికీ ఆయన ప్రవర్తన నాకు నిజంగా చాలా దిగ్భ్రాంతిని కలుగజేసింది. ఆత్మగౌరవం గల ఒక మనిషి – రాజకీయ నాయకుడే అయినా – తన సొంత రాజకీయ మనుగడ కోసం తను కట్టుబడి ఉండవలసిన విలువల్ని, సిద్ధాంతా లను వెనక్కు నెట్టేయగలిగినంతగా దిగజార గలడని నేను నమ్మ లేకపోయాను.

2013 నుండి, నితీశ్‌ తన వ్యక్తిగత రాజకీయ జీవితాన్నిముందుకు తీసుకెళ్లడానికి హఠాత్తుగా కూటములను మార్చేయటం ఇది ఐదోసారి. అయితే నా సహోద్యోగి అశోక్‌ ఉపాధ్యాయ అనటం ఏమిటంటే – మీరు కనుక నితీశ్‌ 1994లో సమతా పార్టీని స్థాపించడం కోసం లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో, జనతాదళ్‌తో తెగతెంపులు చేసు కోవటాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ఆయన అలా చేయడం ఆరో సారి అవుతుందని! నేను అంతగా ఎందుకు ఆశ్చర్యపోయానని మీరు నన్ను అడగ వచ్చు. రెండు కారణాలు. నితీశ్‌ మళ్లీ అలాంటి పని చేస్తాడని నేను ఊహించలేదు. అలా చేస్తే కనుక విశ్వసనీయత ప్రమాదంలో పడి పోయే స్థాయికి ఆయన ఇప్పటికే చేరుకుని ఉన్నారని నా భావన. 

ఆయన అలా చేస్తాడని నేను అనుకోకపోవటానికి రెండో కారణం మరింతగా నిస్సందేహమైనది. బీజేపీతో తిరిగి కలిసే అవకాశంపై ఆయన, ఆయన్ని తిరిగి రెండోసారి కూటమిలోకి చేర్చుకునే విషయమై బీజేపీ... ‘అసలు అలాంటి ఆలోచనే లేదన్నట్లు’గా స్పష్టం చెయ్యటం జరిగింది.   ఏడాది క్రితమే 2023 జనవరి 30న, ‘‘ఏదో ఒక రోజు మీరు బీజే పీలో తిరిగి కలుస్తారా?’’ అని అడిగినప్పుడు నితీశ్‌ ఇలా అన్నారు: ‘‘మర్‌ జానా కబూల్‌ హై, ఉన్‌ కే సాథ్‌ జానా హమ్‌కో కభీ కబూల్‌ నహీ హై. యే అచ్ఛీ తరహ్‌ జాన్‌ లీజియేగా.’’ (చావనైనా చస్తాను కానీ, వాళ్లతో వెళ్లి కలిసేది లేదు. దీనిని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి.)తర్వాత కొన్ని వారాలకు 2023 ఫిబ్రవరి 25న ఇదే ప్రశ్న హోంమంత్రి అమిత్‌ షాకు ఎదురైంది. బీజేపీ నితీశ్‌ను మరొకసారి అక్కున చేర్చుకోటానికి సుముఖంగా ఉందా? ‘ది హిందూ’లో వచ్చిన దానిని బట్టి అమిత్‌ షా ఈ విధంగా సమాధానం చెప్పారు: ‘‘ఆయా రామ్, గయా రామ్‌లు ఇక చాలు. నితీశ్‌ కుమార్‌కు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూతపడ్డాయి.’’

సరే, నితీశ్‌ కుమార్‌ ఏడాది క్రితం స్పష్టంగా మరణం కంటే అధ్వాన్నం అని భావించిన దానినే ఇప్పుడు కోరుకున్నారు. ఇక ‘ఎప్పటికీ’ అనేది అమిత్‌ షా ఉద్దేశంలో కేవలం తాత్కాలికం అని మాత్రమే కాదు, హాస్యాస్పదంగా అది ఎంతో స్వల్పకాలిక వ్యవధి అని కూడా!ఈ వైఖరులపై అవమానకరమైన మాటలు వచ్చి పడటంలోవింతేమీ లేదు. నితీశ్‌ని పల్టూరామ్, పల్టూమార్, పల్టూపుత్ర అంటు న్నారు. శశి థరూర్‌ అయితే సహజంగానే ఇప్పుడంతగా వాడుకలో లేని ఆంగ్ల పదాన్ని నితీశ్‌కు అన్వయించడం కోసం తవ్వి తీశారు. ‘స్నోలీగోస్టర్‌’ అనే మాట అది. ‘తెలివైన, కానీ విలువల్లేని వ్యక్తి’ అని ఆ మాటకు అర్థం.  ఏమైనా ఈ పరిణామంపై నా ఆందోళన ఇక్కడితో ఆగటం లేదు.

 భారతదేశ రాజకీయాల గురించి విచారం వ్యక్తం చేయదగిన, దురదృష్టకరమైన ఒక నిజానికి నితీశ్‌ కుమార్‌ సాక్ష్యంగా నిలిచారా? ఈ విధమైన అవకాశవాదం, పదేపదే మిత్రపక్షాలను మార్చటం అనేది ఏ ప్రధాన పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశంలోనూ ఆమోదయోగ్యమైనది కాదు. పైగా ఖండించదగినది. అది ఆ నాయకుడి విశ్వసనీయతను, పార్టీ ప్రతిష్ఠను నాశనం చేస్తుంది. నితీశ్‌ కుమార్‌ పిల్లి మొగ్గలతో పోల్చలేం కానీ, 2010లో బ్రిటన్‌లో లిబరల్స్‌ అనేవాళ్లు కన్జర్వేటివ్‌ లతో పొత్తు పెట్టుకున్నప్పుడు అదొక నీతి మాలిన చర్యగా పరిగణన పొందింది.

ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఓట్లు రాబట్టలేక లిబరల్‌ పార్టీ కుప్పకూలింది... ఇండియాలో జరగని విధంగా! మన భారతీయులం భిన్నంగా ఎలా ఆలోచి స్తామో, భిన్నంగా ఎలా స్పందిస్తామో చూపించటానికి అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ కొన్ని ఉదాహ రణలు మాత్రమే. మధ్యప్రదేశ్‌లో ప్రతి పక్షంలో ఉన్న బీజేపీని అధికారంలోకి తీసుకు రావటానికి కాంగ్రెస్‌ను విడిచిపెట్టి బీజేపీలో చేరినవారు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ గత ఏడాది డిసెంబర్‌ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీని సాధించారు.
 
ఈ దుముకుళ్లను మన ఓటర్లు ఎందుకు సమ్మ తిస్తారు? తమను గెలిపించిన వారికి ద్రోహం చేసి వెళ్లిన రాజకీయ నాయకులకు మన ఓటర్లు ఎందుకు శిక్ష విధించరు? ప్రజాసేవ కంటే, నమ్మిన సిద్ధాంతాల పట్ల నిబద్ధత కంటే తమ ప్రయోజనాలకు, సంపాదనకు ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా ఎందుకు మన ఓటర్లు పట్టించుకోరు?ఎందుకు అన్నదానిపై అనేక విధాలైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా కూడా నా దగ్గర సమాధానమైతే లేదు. వాటిల్లో ఒక అభిప్రాయం... అలాంటి రాజకీయ నాయకులు తమ నియోజక వర్గాలకు కావలసినవన్నీ చేసిపెడుతుంటారని; అలాగే వారి  నేర్పరి తనం, రాజకీయ చలనశీలత వారిపై వ్యతిరేకతను కాక, ప్రజల మన్ననను పొందేలా చేస్తోందని! కానీ ఆ అభిప్రాయాలు సరైనవని అనిపించేవి కావు. సాకులు లేదా, అనుకూల వాదనలు. లేదంటే నిలబడని సమర్థింపులు. 

చివరికి చెప్పొచ్చేదేమంటే, లోపం మనలో ఉన్నదే కానీ, మన తలరాతలో ఉన్నది కాదు. తెలిసే మనం ఇలాంటి నాయకులకు, తమ స్వార్థం కోసమే తప్ప మరింత గొప్ప లక్ష్యాలకు, గొప్ప ప్రజా ప్రయో జనాలకు కట్టుబడి ఉండని వారికి – వాళ్లెప్పుడైనా ప్రజలకు కొంత మేలు చేస్తే చేసి ఉండొచ్చుగాక – ఓటు వేస్తాం. అది కొనసాగినంత కాలం భారతదేశ నితీశ్‌కుమార్‌లు మన రాజకీయాలను స్వేచ్ఛగా నడిపిస్తూనే ఉంటారు. మన భవిష్యత్తును కూడా! 

- వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌
- కరణ్‌ థాపర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement