సాక్షి,హైదరాబాద్: గుండోడు, బండోడు, బక్కోడు, బికారీ.. గ్రేటర్ ఎన్నికల వేళ సోషల్ మీడియాలో విద్వేషం హద్దులు దాటుతోంది. ప్రత్యర్థులపై అభ్యంతరకర, రాయలేని వ్యాఖ్యలతో చెలరేగుతున్నారు, రెచ్చగొడుతున్నారు. నాయకుల అలవాట్లు, ఆహార్యంపై సెటైర్లు, కుళ్లుజోకులు వేస్తున్నారు. వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. ప్రత్యర్థులను చులకన చేసే ప్రయత్నంలో దిగజారుడు పోస్టులు పెడుతున్నారు. రాజకీయ వేడిలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అరాచకమిది.
పార్టీలకు అనుకూలంగా వారి సోషల్‌మీడియా విభాగాలు చేసే పోస్టులు పద్ధతిగానే ఉంటున్నాయి. కానీ, కొందరు సానుభూతిపరులు, అతివాదులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ పోస్టులపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఇలాంటి విద్వేషపు పోస్టింగులకు దిగిన వారిపై ఐటీయాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.
కొత్త ఓటర్లు, యువతకు గాలం..
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ నిత్యావసర వస్తువుగా మారింది. ఆన్‌లైన్ క్లాసుల పుణ్యమాని ఇప్పుడు ప్రతీ విద్యార్థికి స్మార్ట్‌ఫోన్ ఉంది. ముఖ్యంగా 18 ఏళ్లు దాటి డిగ్రీ, ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థుల ఓట్లే లక్ష్యంగా ఈ వ్యంగ్యపు, వెకిలి పోస్టులు రూపొందిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగించే యువతలో నూటికి 90 శాతం వినోదానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే, వారి దృష్టిని తమవైపు తిప్పుకునేందుకు, ప్రత్యర్థి పార్టీలపై కుళ్లుజోకులతో బాడీషేమింగ్‌కు దిగుతున్నారు. చేసిన, చేయబోయే పనులను చెప్పుకొని ఓట్లు అడగటం, ప్రత్యర్థులను విమర్శలతో ప్రశ్నించడం మంచి రాజకీయం.
కానీ కొందరు అత్యుత్సాహపరులు తమ ప్రత్యర్థి పార్టీల నాయకులను తాగుబోతు, వదరుబోతు, గుండోడు, బండోడు, బక్కోడు, బికారీ అంటూ ఆకారం, అలవాట్ల ఆధారంగా కుళ్లుజోకులు వేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీపై యువత మనసులో విద్వేషపు బీజాలు నాటుతున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లలో ఇలాంటి పోస్టులకు కొదవలేదు. వ్యక్తులను కించపరుస్తూ వీడియోలు, సినిమాల్లోని హాస్యపు బిట్లు, మీమ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కులతో పోస్టులు రూపొందిస్తూ కొత్త ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఇలాంటివారు అరెస్టయినా... పార్టీకి సంబంధం లేదని, స్వచ్ఛందంగానే తాము ఇలా చేశామని పోలీసులకు వివరణ ఇస్తుండటం గమనార్హం.
ప్రైవేటు ఆర్మీల పేరుతో..
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కొందరు సానుభూతిపరులు రాజకీయ పార్టీలతో పరోక్షంగా సంబంధాలు నెరుపుతూ సోషల్‌మీడియా ప్రైవేటు ఆర్మీల పేరిట ప్రత్యేక విభాగాలు నడిపిస్తున్నారు. సాధారణంగా పార్టీ అధికారిక సోషల్‌మీడియా వింగుల్లో ఎలాంటి అసభ్యతకు తావుండదు. కానీ, అభిమానుల ముసుగులో ప్రైవేటు ఆర్మీలు తమ పోస్టింగులతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్న తీరు ఆందోళనకరంగా ఉందని పోలీసులే వ్యాఖ్యానిస్తున్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలుగొచ్చని, దాడులకు పురిగొలిపే ప్రమాదముందని పోలీసులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే వీటి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే.. పార్టీల సానుభూతిపరులు అప్పటికపుడు ప్రత్యేకంగా కంటెంట్ రైటర్లు, డీటీపీ ఆపరేటర్లు, వీడియో ఎడిటర్లను నియమించుకున్నారు. కేవలం 20 రోజులకే వీరికి రూ.30 వేల నుంచి 40 వేల వరకు చెల్లిస్తూ ఇలాంటి పోస్టులను ప్రోత్సహిస్తున్నారు.
సీనియర్ ఐపీఎస్‌లతో పర్యవేక్షణ!
విద్వేషపు పోస్టులపై గ్రేటర్ సీపీ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్‌లు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశామని, ఇకపై పునరావృతమైనా సహించేది లేదని తెలిపారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేసేవారిని ఉపేక్షించమని స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయం ఆదేశాల మేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లోని సీసీఎస్ డీసీపీలతోపాటు, కొందరు సీనియర్ ఐపీఎస్‌లు ఈ తరహా పోస్టింగులపై నిఘా వేశారు. ప్రజలు, నాయకులు చేసే ఫిర్యాదుల పైనే కాకుండా అవసరమైతే పోలీసులు కూడా స్వచ్ఛందంగా కేసులు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment