ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్
దిగ్గజ నేత కోటగిరి విద్యాధరరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కోటగిరి శ్రీధర్ వైఎస్సార్‌సీపీ తరఫున ఏలూరు లోక్‌సభా స్థానం అభ్యర్థిగా తొలిసారి పోటీ చేస్తున్నారు. బీబీఎం చదివి అమెరికాలోని ఓ కంపెనీలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ప్రజా సేవ చేయాలనే ఆకాంక్షతో వచ్చిన ఆయన మనోగతం ..
ప్రశ్న : వ్యక్తిగత వివరాలు?
శ్రీధర్ : కృష్ణాజిల్లా నూజివీడులో 1973లో జన్మించా. మా తండ్రి స్వర్గీయ కోటగిరి విద్యాధరరావు అందరికీ సుపరిచితులే. ఆయన చనిపోయే నాటికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నా భార్య కె.సరిత యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ నిపుణురాలు. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రజా సేవ కోసం వచ్చా.
ప్రశ్న : రాజకీయ రంగ ప్రవేశం ఎలా ?
శ్రీధర్ : మా తండ్రి రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రచార బాధ్యతలు తీసుకునే వాడిని. 2006 స్థానిక సంస్థల ఎన్నికల్లో పరోక్షంగా పనిచేశా. అత్యధిక ఎంపీటీసీ స్థానాలు గెలవడంలో కీలక భూమిక పోషించా. మా తండ్రి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాను.
ప్రశ్న : మీరు వైఎస్సార్‌సీపీలోకి ఎలా వచ్చారు ?
శ్రీధర్ : మా నాన్న విధ్యాధరరావు టీడీపీ నేత. ఆయన ఆ పార్టీలో మాత్రం చేరవద్దని నాతో చెప్పారు. అక్కడ ఒక సామాజికవర్గానికే ప్రాధాన్యం ఇవ్వడం నచ్చలేదు. దీనికితోడు పేదల పక్షాన నిరంతరం పోరాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అయితేనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని నిర్ణయించుకున్నా. దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు నన్ను ఆకర్షించాయి.
ప్రశ్న : ఎంపీగా గెలిస్తే మీ ప్రాధాన్యతలు?
శ్రీధర్ : మెట్ట ప్రాంతంలో ఆయిల్‌పామ్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలనేది నా కోరిక. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి. కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల్లో సాగునీటి కష్టాలు దూరం చేయాలి. కొల్లేరు గ్రామాలకు న్యాయం చేస్తాం. కాంటూరు పరిధిని రీసర్వే చేయిస్తాం. ఉప్పుటేరుతో ఉత్పన్నమయ్యే సమస్యలు పరిష్కరిస్తాం. గ్రామాల్లో మౌలిక సదుపాయలు కల్పిస్తాం. ఏలూరును మరింత అభివృద్ధిచేస్తాం.
ప్రశ్న : ప్రజలకు ఏం చెప్పాలనుంది?
శ్రీధర్ : ఐదేళ్లపాటు టీడీపీ రాక్షస పాలన చూశారు. ఈ సారి వైఎస్సార్‌సీపీకి అవకాశం ఇవ్వండి. ప్రజలు శభాష్ అనేలా పనిచేస్తాం. అభివృద్ధిచేసి చూపిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment