Kotagiri Sridhar
-
‘ఇన్సైడర్’తో కోట్లు పోగేసుకోవాలనుకున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని అమరావతికి సంబంధించిన ఇన్సైడర్ సమాచారంతో 4 వేల ఎకరాలు కొనుగోలు చేసిన టీడీపీ నేతలు.. వ్యక్తిగతంగా కోట్లాది రూపాయల సంపద పోగేసుకోవాలని చూశారని వైఎస్సార్సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం జరిగిన చర్చలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ మాట్లాడగా వాటిని తిప్పి కొడుతూ కోటగిరి శ్రీధర్ ప్రసంగించారు. ‘నా సహచరుడు జయదేవ్ గల్లా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పలు అంశాలు లేవనెత్తారు. వాటికి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ మెజారిటీతో తిరిగి అధికారం చేపట్టారు. అంతకు ముందు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ.. ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రాదనే ఉద్దేశంతో పొత్తు వదిలేసింది. చంద్రబాబునాయుడు దేశవ్యాప్తంగా తిరిగి మోదీ వ్యతిరేక ప్రచారంలో తానే ఛాంపియన్ అని చెప్పుకున్నారు. పార్టీలన్నీ మోదీకి వ్యతిరేకంగా పనిచేసేలా ప్రయత్నించారు. ఇలా పుంజుకున్న శక్తులన్నీ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో బీజేపీని ఓడించగలిగాయని ఆయన టీవీ చర్చల్లో గొప్పలు చెప్పుకొన్నారు. చంద్రబాబు తీసుకున్న అస్థిర, విశ్వసనీయతలేని నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొంది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తన ముగ్గురు ఎంపీలను కేంద్రంలోని అధికార పార్టీకి దగ్గర చేయడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది’ అని కోటగిరి శ్రీధర్ పేర్కొన్నారు. రూ. 60 వేల కోట్ల బిల్లులు చెల్లించలేదు ‘రాష్ట్రానికి ఉన్న రూ. 70 వేల కోట్ల అప్పును టీడీపీ ప్రభుత్వం రూ. 2.5 లక్షల కోట్లకు పెంచింది. తన హయాంలోని రూ. 60 వేల కోట్ల బిల్లులు చెల్లించకుండా వదిలేసింది. ఎన్నికలకు ముందు రోజు రూ. 30 వేల కోట్లు ఖర్చు చేసి ప్రజలను ఉచితాల పేరుతో మభ్యపెట్టాలని చూసింది. ప్రపంచ స్థాయి రాజధాని అన్న పేరుతో అభివృద్ధిని కేవలం ఒకే చోట కేంద్రీకరించాలని, అక్కడ భారీగా వ్యక్తిగత సంపద కూడబెట్టుకోవాలని టీడీపీ నేతలు ప్రణాళిక రచించారు. ఈ వంచనలకు తగిన రీతిలో స్పందించిన ప్రజలు వారిని ఇంటికి పంపించేశారు..’ అని పేర్కొన్నారు. కేంద్రం మద్దతు కావాలి ‘వైఎస్సార్సీపీ శాసనసభలో 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ 151 స్థానాలు గెలుచుకుంది. 25 ఎంపీ సీట్లకు గాను 22 సీట్లు గెలుచుకుంది. కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న అధికార పార్టీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేక అంశాల్లో మద్దతుగా నిలుస్తూ వచ్చింది. ట్రిపుల్ తలాఖ్ బిల్లు, ఆర్టికల్ 370 రద్దు బిల్లు తదితర బిల్లులకు మేం మద్దతు ఇచ్చాం. నిర్లక్ష్యానికి గురైన మా రాష్ట్రానికి మీ మద్దతు ఉంటే వేగవంతంగా అభివృద్ధి సాధించగలమనే ఉద్దేశంతో మీ సాయం కోరుతున్నాం. అయితే కేంద్రం సానుకూలంగా స్పందించడం లేదనే అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో ఉంది. మా సీఎం పేదరిక నిర్మూలనకు సమర్థవంతంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ద్వారా పాలనను ఇంటి వద్దకే తీసుకొచ్చారు. ఈ సభలోనే మా రాష్ట్రానికి ఎలా అన్యాయం జరిగిందో మీరు చూశారు. గత ప్రభుత్వ హయాంలో మా రాష్ట్రం ఎదుర్కొన్న అన్యాయాన్ని ప్రస్తుత మోదీ ప్రభుత్వం సరిదిద్దాలని అభ్యర్థిస్తున్నాం. మా రాష్ట్రానికి ఇవ్వవలసిన బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని కోరుతున్నాం. పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేలా త్వరితగతిన నిధులు కేటాయించాలి. మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్‌కు కూడా న్యాయం చేయాలి. బకింగ్çహామ్ కెనాల్, కొవ్వూరు–భద్రాచలం రైల్వే లైన్ పెండింగ్ పనులపై దృష్టి పెట్టాలి’ అని కోరారు. -
పెట్టుబడులే లక్ష్యంగా ఎంపీ శ్రీధర్ అమెరికా టూర్!
వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని పరిశ్రమలు, వ్యాపార వేత్తలతో ఏపీ ప్రభుత్వ సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా లోక్‌సభ ఎంపీ కోటగిరి శ్రీధర్, ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌లు ఏయూఎస్ఐబి (ది ఎలైన్స్ ఫర్ యూఎస్ ఇండియా బిజినెస్) ప్రతినిధి బృందాన్ని కలిశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏయూఎస్ఐబి వ్యవస్థాపక అధ్యక్షుడు సంజయ్ పూరి మాట్లాడుతూ.. వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఏపీలో గొప్ప అవకాశాలున్నాయన్నారు. అమెరికా వ్యాపారస్తులు, పెట్టుబడిదారులతో సరైన భాగస్వామ్యం ఏపీని ప్రపంచ పటంలో వ్యాపార రంగంలో ఉన్నత స్థాయిలో నిలబెడుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం ఏయూఎస్ఐబి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర వ్యాపార నేతలతో మరింత దగ్గరగా పనిచేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఎంపీ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగం, రక్షణ రంగం, స్మార్ట్ సిటీల అభివృద్ధికి రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ఉద్ఘాటించారు. విజయవాడ, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పెట్టుబడి ప్రాధాన్యతలైన వ్యవసాయం, మత్స్యకార, స్మార్ట్ సిటీస్, ఆరోగ్యభద్రత, పునరుత్పాదక ఇంధన రంగాల గురించి వాటిలో పెట్టుబడి అవకాశాల గురించి వివరించారు. ఏయూఎస్ఐబి సిఓఓ మనీష్ చౌహాన్ మాట్లాడుతూ.. ఉన్నత సాంకేతిక రక్షణ ఎగుమతులు, వాణిజ్య, మానవరహిత వాహనాలు, విద్యారంగాల్లో అవకాశాల గురించి ప్రస్తావించారు. వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని ఏయూఎస్ఐబి సీనియర్ కన్సల్టెంట్ జెరేమీ స్పాల్డింగ్ అభిప్రాయపడ్డారు. ప్రాధాన్యత ఉన్న మార్కెట్‌గా భారత్ ఇప్పటికే ఆవిర్భవించిందని కొనియాడారు. ఈ సందర్భంగా ఏయూఎస్ఐబి పారిశ్రామిక సంబంధాల అవకాశాలను గుర్తించి ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అవసరమయ్యే రోడ్ మ్యాప్‌కు ప్రణాళికలను రూపొందించింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఏపీని ఆదర్శంగా నిలిపేలా ఇరుపక్షాలు కార్యాచరణను ప్రారంభించనున్నాయి. -
వాషింగ్టన్లో వైఎస్సార్సీపీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనం
వాషింగ్టన్ డీసీ : వియన్నా, వర్జీనియా, అమెరికాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు, తెలుగు సంఘాల నాయకులు, అభిమానులు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో మీట్ & గ్రీట్(ఆత్మీయ సమ్మేళనం) కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నవంబర్ 4(సోమవారం)న జరిగిన ఈ ఈవెంట్లో ఏలూరు వైఎస్సార్సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్‌తో పాటు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి(ఉత్తర అమెరికా) రత్నాకర్ పండుగాయల హాజరయ్యారు. హోటల్ బాంబే తందూర్ రెస్టారెంట్లో నిర్వహించిన ఈ సభలో 200 మందికి పైగా పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని స్మరిస్తూ రమేష్ రెడ్డి వ్యాఖ్యాతగా అతిథులను సభకు పరిచయం చేశారు. అనంతరం అభిమానులు నాయకులు పుష్పగుచ్చాలతో, శాలువాలతో అతిథులను సత్కరించారు. అనంతరం రత్నాకర్ పండుగాయల ప్రసంగిస్తూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలను కొనియాడుతూ, ప్రస్తుత ప్రభుత్వ తీరు తెన్నులను ప్రశంసించారు. 'రాష్ట్ర ప్రభుత్వం తరపున నార్త్ అమెరికాలో ప్రత్యేక ప్రతినిధిగా నాకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తాను. ఏపీ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను. అందుకు మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం' అని అన్నారు. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఏలూరు వైఎస్సార్సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ.. పెద్దాయన ఏర్పరిచిన ఆశయాల దారిలో నడుస్తున్న నేటి తరం యువనేత సీఎం జగన్‌కు సంపూర్ణ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. తరాలు మారినా రాజశేఖరుడి లాంటి గొప్ప రాజకీయవేత్త, పేదలపాలిటి పెన్నిధి మనకు కనిపించరని, కులమత ప్రాంతాలకు అతీతంగా ఆయన సామాన్యుడి మదిలో నిలిచిపోయారని ప్రస్తావించారు. అలాంటి మహనీయుని ఆశయాలకు వారసుడిగా ఆశయ సాధనలో ధీరుడిగా పాలన అందిస్తున్న వైఎస్ జగన్ తీరు గొప్పదని కొనియాడారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా ప్రజల మనస్సులో నిలిచిన నేత వైఎస్సార్ అని, దివంగత మహానేత అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాల రూపంలో ఆయన ఇప్పటికీ మనందరి గుండెల్లో నిలిచి ఉన్నారని చెప్పారు. రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, తెలుగు ప్రజలు ఆయనను ఎప్పటికీ మరవరని పేర్కొన్నారు, రాజన్న సువర్ణ యుగం నాటి రాష్ట్రం, ప్రస్తుత పాలకుడు జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను పెంచి గౌరవంగా తల ఎత్తుకునే విధంగా చేయగల నాయకుడు జననేత వైఎస్ జగన్ ఒక్కరే అని వారు ధీమాగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గడచినా 5 నెలల్లో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అత్యంత అద్భుతమని అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో తెలుగు ప్రజలంతా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. పేదల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేసిన మహానేత డాక్టర్ వైఎస్సార్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమర్థవంతమైన నాయకుడిగా మంచి చేస్తారన్న ధీమా వ్యక్తం చేశారు. 2019 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకొని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం చాలా ఆనంద దాయకమని వారు సంతోషం వ్యక్తం చేశారు. అతి తక్కువ వ్యవధిలోనే ఈ సభకు హాజరై, సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. చివరగా బాంబే తందూర్ భోజనంతో రత్నాకర్ పండుగాయల, కోటగిరి శ్రీధర్ గారి మీట్ & గ్రీట్ (ఆత్మీయ సమ్మెళనం)కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. -
ఏలూరును ఏలేదెవరో..!
సాక్షి, ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం రాజకీయంగా ప్రత్యేకత కలిగి ఉన్న సెగ్మెంట్. రెండు జిల్లాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉండటంతోపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు దీని పరిధిలోనే ఉంటాయి. అటవీ ప్రాంతం, కొండలు, గోదావరి పరవళ్ళు, కొల్లేరు పక్షుల కిలకిలా రావాలు, పచ్చిక బయళ్ళు, చేపలు, రొయ్యల చెరువులు, మామిడి, సపోటా తోటలు, వరి, పామాయిల్, మొక్కజొన్న, పాపికొండల అందాలు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రత్యేకతలు. జిల్లా ప్రజల చిరకాల స్వప్నం, దివంగత మహానేత మానసపుత్రి పోలవరం ప్రాజెక్టు ఉన్నది ఇక్కడే. కృష్ణా, గోదావరి జిల్లాల కలయిక పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, పోలవరం, చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, కృష్ణాజిల్లాలోని నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు స్థానం లభించింది. ఇప్పటి వరకూ 16 సార్లు ఎన్నికలు జరగ్గా తొమ్మిది సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 5సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మరో రెండు సార్లు సీపీఐ అభ్యర్థులు విజయం సాధించారు. కొమ్మారెడ్డి సూర్యనారాయణ 3 సార్లు, మాగంటి బాబు 2 పర్యాయాలు గెలుపొందారు. తెలంగాణ సంస్కృతి.. రాష్ట్ర విభజనతో ఈ నియోజకవర్గంలోకి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు వచ్చి చేరడంతో అటు తెలంగాణ సంస్కృతి కూడా ఈ నియోజకవర్గానికి ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. స్థానికేతరులకూ మద్దతు నియోజకవర్గంతో సంబంధంలేని బోళ్ళ బుల్లిరామయ్య (తణుకు) నాలుగు సార్లు, కావూరి సాంబశివరావును రెండు సార్లు, సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న ఘట్టమనేని కృష్ణ, తణుకుకు చెందిన చిట్టూరి సుబ్బారావు చౌదరి ఇక్కడి నుంచి గెలుపొందారు. 57 ఏళ్ళుగా కమ్మ సామాజిక వర్గాల వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కనిపించని అభివృద్ధి విభజన అనంతరం రాష్ట్ర రాజధానికి ఈ నియోజకవర్గం వేదికవుతుందని విస్తృత ప్రచారం జరిగింది. తొలుత నూజివీడు ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు పరిశీలన జరుగుతుందని వచ్చిన వార్తలతో ఈ నియోజకవర్గ ప్రజలు తమ జీవితాలు బాగుపడబోతున్నాయని ఆశించారు.అయితే రాజధాని కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యకు తరలిపోవడంతో ప్రజలు నిరాశపడ్డారు. ఏలూరు సమీపంలో నిట్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించినా ఆ విద్యా సంస్థను ఇక్కడకు రాకుండా మోకాలడ్డారు. ఏలూరు సమీపంలోని వట్లూరులో విమాన విడిభాగాల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేయడంతో ఇక్కడ భారీ పరిశ్రమ వస్తుంది, ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వస్తాయి అని ఆశించగా అది శంకుస్థాపనకే పరిమితమైంది. శ్రీధర్ విజయం నల్లేరుపై నడకే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోటగిరి శ్రీధర్ విజయం నల్లేరుపై నడకే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన తండ్రి దివంగత కోటగిరి విద్యాధరరావు రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేసి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. శ్రీధర్ రాజకీయాల్లో ప్రవేశించి, వైసీపీలో చేరిన నాటి నుంచి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 శాసన సభ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ అన్ని ప్రాంతాల్లో నాయకులను కలుపుకొని వెళుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, స్వయంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. మాగుంట చేసింది శూన్యం టీడీపీ అభ్యర్థి మాగుంట వెంకటేశ్వరరావు (బాబు) గత ఐదేళ్లలో చేసిందేమి లేదు. కాంటూరు కుదింపు అంశం గాని, పోలవరం నిర్వాసితుల సమస్యలపై గాని స్పందించిన దాఖలాలు లేవు. కైకలూరులోని తన కార్యాలయంలోనే పేకాట డెన్ నిర్వహించడం ఆధారాలతో మీడియాలో వచ్చింది. తన మాట వినని రిజర్వుడ్ స్థానాల ఎమ్మెల్యేలను పని చేయనివ్వలేదన్న అపవాదు ఉంది. అభ్యర్థులు వీరే.. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ తరపున కోటగిరి శ్రీధర్, టీడీపీ తరపున మాగంటి బాబు, జనసేన అభ్యర్థిగా పెంటపాటి పుల్లారావు, బీజేపీ అభ్యర్థిగా చిన్నం రామకోటయ్య, కాంగ్రెస్ అభ్యర్థిగా జెట్టి గుర్నాథరావు పోటీలో ఉన్నారు. – సీహెచ్ రామకృష్ణంరాజు, ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) -
తండ్రి ఆశయాల సాధనే లక్ష్యం
దిగ్గజ నేత కోటగిరి విద్యాధరరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కోటగిరి శ్రీధర్ వైఎస్సార్సీపీ తరఫున ఏలూరు లోక్‌సభా స్థానం అభ్యర్థిగా తొలిసారి పోటీ చేస్తున్నారు. బీబీఎం చదివి అమెరికాలోని ఓ కంపెనీలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ప్రజా సేవ చేయాలనే ఆకాంక్షతో వచ్చిన ఆయన మనోగతం .. ప్రశ్న : వ్యక్తిగత వివరాలు? శ్రీధర్ : కృష్ణాజిల్లా నూజివీడులో 1973లో జన్మించా. మా తండ్రి స్వర్గీయ కోటగిరి విద్యాధరరావు అందరికీ సుపరిచితులే. ఆయన చనిపోయే నాటికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నా భార్య కె.సరిత యూఎస్‌లో సాఫ్ట్వేర్ నిపుణురాలు. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రజా సేవ కోసం వచ్చా. ప్రశ్న : రాజకీయ రంగ ప్రవేశం ఎలా ? శ్రీధర్ : మా తండ్రి రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రచార బాధ్యతలు తీసుకునే వాడిని. 2006 స్థానిక సంస్థల ఎన్నికల్లో పరోక్షంగా పనిచేశా. అత్యధిక ఎంపీటీసీ స్థానాలు గెలవడంలో కీలక భూమిక పోషించా. మా తండ్రి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాను. ప్రశ్న : మీరు వైఎస్సార్సీపీలోకి ఎలా వచ్చారు ? శ్రీధర్ : మా నాన్న విధ్యాధరరావు టీడీపీ నేత. ఆయన ఆ పార్టీలో మాత్రం చేరవద్దని నాతో చెప్పారు. అక్కడ ఒక సామాజికవర్గానికే ప్రాధాన్యం ఇవ్వడం నచ్చలేదు. దీనికితోడు పేదల పక్షాన నిరంతరం పోరాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితేనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని నిర్ణయించుకున్నా. దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు నన్ను ఆకర్షించాయి. ప్రశ్న : ఎంపీగా గెలిస్తే మీ ప్రాధాన్యతలు? శ్రీధర్ : మెట్ట ప్రాంతంలో ఆయిల్‌పామ్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలనేది నా కోరిక. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి. కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల్లో సాగునీటి కష్టాలు దూరం చేయాలి. కొల్లేరు గ్రామాలకు న్యాయం చేస్తాం. కాంటూరు పరిధిని రీసర్వే చేయిస్తాం. ఉప్పుటేరుతో ఉత్పన్నమయ్యే సమస్యలు పరిష్కరిస్తాం. గ్రామాల్లో మౌలిక సదుపాయలు కల్పిస్తాం. ఏలూరును మరింత అభివృద్ధిచేస్తాం. ప్రశ్న : ప్రజలకు ఏం చెప్పాలనుంది? శ్రీధర్ : ఐదేళ్లపాటు టీడీపీ రాక్షస పాలన చూశారు. ఈ సారి వైఎస్సార్సీపీకి అవకాశం ఇవ్వండి. ప్రజలు శభాష్ అనేలా పనిచేస్తాం. అభివృద్ధిచేసి చూపిస్తాం. -
‘వైఎస్సార్ పాలనలో ప్రజలు ధైర్యంగా ఉన్నారు’
సాక్షి, పశ్చిమ గోదావరి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో కొల్లేరు ప్రాంతాల ప్రజలు ధైర్యంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ నేతలు ఆళ్ల నాని, కోటగిరి శ్రీధర్, కొఠారు అబ్బయ్య చౌదరి, పుప్పాల వాసుబాబు, దూలం నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. గురువారం కొల్లేరు నేతల సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొల్లేరు గ్రామంలో మంచి నీటి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చారు. కొల్లేరు డెవలప్మెంట్ బోర్డును పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కొల్లేరు అంటే ఆదాయ వనరులుగా, ఆ ప్రాంత భూములను ఎలాగ కాజేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. మళ్లీ కొల్లేరుకు పూర్వవైభవం రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. కొల్లేరు సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తామని చెప్పారు. -
చంద్రబాబుకు ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదు
ఏలూరు(పశ్చిమగోదావరి జిల్లా): ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిన్న(మంగళవారం) వైఎస్సార్సీపీ కన్వీనర్ ఎలీజాను అరెస్ట్ చేసి సుమారు 6 గంటల పాటు పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్‌లు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. పర్యటనల పేరుతో ముఖ్యమంత్రి ప్రతిపక్షాలు, రైతు సంఘం నేతలను అదుపులోకి తీసుకోవడం దారుణమన్నారు. తాను చేసిన తప్పులను ప్రశ్నిస్తారనే భయంతోనే చంద్రబాబు ఎక్కడ పర్యటన చేసినా అక్కడ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. తాను చేసిన మోసాలు, అక్రమాలకు చంద్రబాబుకు ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని విమర్శించారు. నీచ రాజకీయాలతో ఎన్ని కుయుక్తులు చేసినా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధిచెబుతారని వ్యాఖ్యానించారు. ఐఆర్ఎస్ అధికారిగా 30 ఏళ్ల పాటు పనిచేసిన ఎలీజా లాంటి నేతలను అరెస్ట్ చేసి మంచినీరు, ఆహారం కూడా ఇవ్వకుండా ఆరు గంటల పాటు అక్రమంగా నిర్బంధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆళ్ల నాని, కోటగిరి శ్రీధర్, ఎలీజా సమక్షంలో లింగపాలెం మండలం రాయుడు పాలెంలో సుమారు 200 మంది టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
అన్నొచ్చాడు.. సమస్యలు తీరుస్తాడు
సాక్షి, ఏలూరు: అప్రహితంగా సాగుతున్న వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా 2 వేల కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా ఏలూరు మండలం వెంకటాపురంలో పైలాన్ ఆవిష్కరణ తర్వాత పాత బస్టాండ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఆళ్ల నాని, కోటగిరి శ్రీధర్, ఈశ్వరిలు ప్రసంగించారు. ‘అన్నొచ్చాడు.. మన సమస్యలు తీరుస్తాడు’ అంటూ అక్కడి ప్రజానీకానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. (చరిత్రాత్మక ఘట్టం) పాలనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని వైఎస్సార్ సీపీ నేత కోటగిరి శ్రీధర్ విమర్శించారు. త్వరలో ప్రజా ప్రభుత్వం వస్తుందని, జగనన్న ప్రజల సమస్యలన్నీ తీరుస్తాడని శ్రీధర్ చెప్పారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టారని ఎమ్మెల్సీ ఆళ్ల నాని తెలిపారు. చంద్రబాబు పాలనలో అన్ని అబద్ధాలు, మోసాలేనని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ తన పాదయాత్రతో ప్రతి ఒక్కరికి భరోసా కల్పిస్తున్నారన్నారు. నాలుగేళ్లలో చంద్రబాబు ఈ ప్రాంతానికి ఏమీ చెయ్యలేదని, ఏలూరులో తాగు నీటి, వరద ముంపు సమస్యలను పరిష్కరించిన ఘనత దివంగత నేత వైఎస్సార్‌దేనని ఆళ్ల నాని పేర్కొన్నారు. రాబోయేది రాజన్న రాజ్యం... ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో రాబోయేది రాజన్న రాజ్యమని వైఎస్సార్ సీపీ నేత మధ్యాహ్నపు ఈశ్వరి పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందేనని ఆమె అన్నారు. టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె చెప్పారు. లక్షల మందికి వైఎస్సార్ ఇళ్లు కట్టించారని, కానీ, చంద్రబాబు పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. తన పాదయాత్రతో వైఎస్ జగన్ ఐదు కోట్ల మందికి భరోసా కల్పించారని ఈశ్వరి అన్నారు. -
వైఎస్సార్సీపీలోకి ‘కోటగిరి’ తనయుడు
వైఎస్ జగన్మోహన్రెడ్డితో కోటగిరి శ్రీధర్ భేటీ 29న ద్వారకా తిరుమలలో బహిరంగ సభ సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, దివంగత నేత కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీధర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల వైఎస్సార్సీపీ నేతలతో కలిసి ఆయన ఆదివారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకున్నారు. వైఎస్సార్సీపీలో చేరాలన్న తన అభీష్టాన్ని వెల్లడించారు. ఈ నెల 29న పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో నిర్వహించే బహిరంగ సభలో పార్టీలో చేరతానని శ్రీధర్ మీడియాకు వివరించారు. సీఎం కావడానికి జగన్ అర్హుడు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ బాగా రాణిస్తున్నారని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ అనుభవం గడించారని కోటగిరి శ్రీధర్ చెప్పారు. ముఖ్యమంత్రి కావడానికి జగన్ అన్ని విధాలా సరైన నాయకుడని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి కొత్త వారు రావాలన్నదే తన అభిమతమని తెలిపారు. అందువల్లే తాను వైఎస్సార్సీపీలో జగన్‌తో కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు వివరించారు. ఏలూరు లోక్‌సభనియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ కో–ఆర్డినేటర్ల సమన్వయంతో ఇవాళ తాను పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని ఆయన వెల్లడించారు. శ్రీధర్‌కు తాము ఆత్మీయ స్వాగతం పలుకుతున్నామని పార్టీ సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ద్వారకా తిరుమలలో ఈ నెల 29న జరిగే సభలో ఏలూరు మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఎం.బలరాం కూడా పార్టీలో చేరుతారని పేర్కొన్నారు. అక్కడే ఉన్న ఆయనను మీడియాకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా పార్టీ నేత చలమలశెట్టి సునీల్, పశ్చిమగోదావరి జిల్లా నేతలు ఆళ్ల నాని, తెల్లం బాలరాజు, దూలం నాగేశ్వరరావుతో తదితరులు పాల్గొన్నారు.