‘ఇన్‌సైడర్‌’తో కోట్లు పోగేసుకోవాలనుకున్నారు  | 4000 acres were purchased by TDP leaders in Amaravati | Sakshi
Sakshi News home page

‘ఇన్‌సైడర్‌’తో కోట్లు పోగేసుకోవాలనుకున్నారు 

Published Thu, Feb 6 2020 6:12 AM | Last Updated on Thu, Feb 6 2020 6:12 AM

4000 acres were purchased by TDP leaders in Amaravati - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని అమరావతికి సంబంధించిన ఇన్‌సైడర్‌ సమాచారంతో 4 వేల ఎకరాలు కొనుగోలు చేసిన టీడీపీ నేతలు.. వ్యక్తిగతంగా కోట్లాది రూపాయల సంపద పోగేసుకోవాలని చూశారని వైఎస్సార్‌సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్‌ విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం జరిగిన చర్చలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ మాట్లాడగా వాటిని తిప్పి కొడుతూ కోటగిరి శ్రీధర్‌ ప్రసంగించారు. ‘నా సహచరుడు జయదేవ్‌ గల్లా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పలు అంశాలు లేవనెత్తారు. వాటికి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను.

సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ మెజారిటీతో తిరిగి అధికారం చేపట్టారు. అంతకు ముందు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ.. ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రాదనే ఉద్దేశంతో పొత్తు వదిలేసింది. చంద్రబాబునాయుడు దేశవ్యాప్తంగా తిరిగి మోదీ వ్యతిరేక ప్రచారంలో తానే ఛాంపియన్‌ అని చెప్పుకున్నారు. పార్టీలన్నీ మోదీకి వ్యతిరేకంగా పనిచేసేలా ప్రయత్నించారు. ఇలా పుంజుకున్న శక్తులన్నీ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో బీజేపీని ఓడించగలిగాయని ఆయన టీవీ చర్చల్లో గొప్పలు చెప్పుకొన్నారు. చంద్రబాబు తీసుకున్న అస్థిర, విశ్వసనీయతలేని నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొంది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తన ముగ్గురు ఎంపీలను కేంద్రంలోని అధికార పార్టీకి దగ్గర చేయడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది’ అని కోటగిరి శ్రీధర్‌ పేర్కొన్నారు. 

రూ. 60 వేల కోట్ల బిల్లులు చెల్లించలేదు 
‘రాష్ట్రానికి ఉన్న రూ. 70 వేల కోట్ల అప్పును టీడీపీ ప్రభుత్వం రూ. 2.5 లక్షల కోట్లకు పెంచింది. తన హయాంలోని రూ. 60 వేల కోట్ల బిల్లులు చెల్లించకుండా వదిలేసింది. ఎన్నికలకు ముందు రోజు రూ. 30 వేల కోట్లు ఖర్చు చేసి ప్రజలను ఉచితాల పేరుతో మభ్యపెట్టాలని చూసింది. ప్రపంచ స్థాయి రాజధాని అన్న పేరుతో అభివృద్ధిని కేవలం ఒకే చోట కేంద్రీకరించాలని, అక్కడ భారీగా వ్యక్తిగత సంపద కూడబెట్టుకోవాలని టీడీపీ నేతలు ప్రణాళిక రచించారు. ఈ వంచనలకు తగిన రీతిలో స్పందించిన ప్రజలు వారిని ఇంటికి పంపించేశారు..’ అని పేర్కొన్నారు. 

కేంద్రం మద్దతు కావాలి
‘వైఎస్సార్‌సీపీ శాసనసభలో 175 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 151 స్థానాలు గెలుచుకుంది. 25 ఎంపీ సీట్లకు గాను 22 సీట్లు గెలుచుకుంది. కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న అధికార పార్టీకి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనేక అంశాల్లో మద్దతుగా నిలుస్తూ వచ్చింది. ట్రిపుల్‌ తలాఖ్‌ బిల్లు, ఆర్టికల్‌ 370 రద్దు బిల్లు తదితర బిల్లులకు మేం మద్దతు ఇచ్చాం. నిర్లక్ష్యానికి గురైన మా రాష్ట్రానికి మీ మద్దతు ఉంటే  వేగవంతంగా అభివృద్ధి సాధించగలమనే ఉద్దేశంతో మీ సాయం కోరుతున్నాం. అయితే కేంద్రం సానుకూలంగా స్పందించడం లేదనే అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో ఉంది. మా సీఎం పేదరిక నిర్మూలనకు సమర్థవంతంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ద్వారా పాలనను ఇంటి వద్దకే తీసుకొచ్చారు.

ఈ సభలోనే మా రాష్ట్రానికి ఎలా అన్యాయం జరిగిందో మీరు చూశారు. గత ప్రభుత్వ హయాంలో మా రాష్ట్రం ఎదుర్కొన్న అన్యాయాన్ని ప్రస్తుత మోదీ ప్రభుత్వం సరిదిద్దాలని అభ్యర్థిస్తున్నాం. మా రాష్ట్రానికి ఇవ్వవలసిన బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని కోరుతున్నాం. పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేలా త్వరితగతిన నిధులు కేటాయించాలి. మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్‌కు కూడా న్యాయం చేయాలి. బకింగ్‌çహామ్‌ కెనాల్, కొవ్వూరు–భద్రాచలం రైల్వే లైన్‌ పెండింగ్‌ పనులపై దృష్టి పెట్టాలి’ అని కోరారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement