వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని పరిశ్రమలు, వ్యాపార వేత్తలతో ఏపీ ప్రభుత్వ సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా లోక్‌సభ ఎంపీ కోటగిరి శ్రీధర్, ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌లు ఏయూఎస్ఐబి (ది ఎలైన్స్ ఫర్ యూఎస్ ఇండియా బిజినెస్) ప్రతినిధి బృందాన్ని కలిశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏయూఎస్ఐబి వ్యవస్థాపక అధ్యక్షుడు సంజయ్ పూరి మాట్లాడుతూ.. వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఏపీలో గొప్ప అవకాశాలున్నాయన్నారు. అమెరికా వ్యాపారస్తులు, పెట్టుబడిదారులతో సరైన భాగస్వామ్యం ఏపీని ప్రపంచ పటంలో వ్యాపార రంగంలో ఉన్నత స్థాయిలో నిలబెడుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం ఏయూఎస్ఐబి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర వ్యాపార నేతలతో మరింత దగ్గరగా పనిచేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
ఎంపీ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగం, రక్షణ రంగం, స్మార్ట్ సిటీల అభివృద్ధికి రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ఉద్ఘాటించారు. విజయవాడ, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పెట్టుబడి ప్రాధాన్యతలైన వ్యవసాయం, మత్స్యకార, స్మార్ట్ సిటీస్, ఆరోగ్యభద్రత, పునరుత్పాదక ఇంధన రంగాల గురించి వాటిలో పెట్టుబడి అవకాశాల గురించి వివరించారు.
ఏయూఎస్ఐబి సిఓఓ మనీష్ చౌహాన్ మాట్లాడుతూ.. ఉన్నత సాంకేతిక రక్షణ ఎగుమతులు, వాణిజ్య, మానవరహిత వాహనాలు, విద్యారంగాల్లో అవకాశాల గురించి ప్రస్తావించారు. వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని ఏయూఎస్ఐబి సీనియర్ కన్సల్టెంట్ జెరేమీ స్పాల్డింగ్ అభిప్రాయపడ్డారు. ప్రాధాన్యత ఉన్న మార్కెట్‌గా భారత్ ఇప్పటికే ఆవిర్భవించిందని కొనియాడారు. ఈ సందర్భంగా ఏయూఎస్ఐబి పారిశ్రామిక సంబంధాల అవకాశాలను గుర్తించి ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అవసరమయ్యే రోడ్ మ్యాప్‌కు ప్రణాళికలను రూపొందించింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఏపీని ఆదర్శంగా నిలిపేలా ఇరుపక్షాలు కార్యాచరణను ప్రారంభించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment