సాక్షి, ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం రాజకీయంగా ప్రత్యేకత కలిగి ఉన్న సెగ్మెంట్. రెండు జిల్లాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉండటంతోపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు దీని పరిధిలోనే ఉంటాయి. అటవీ ప్రాంతం, కొండలు, గోదావరి పరవళ్ళు, కొల్లేరు పక్షుల కిలకిలా రావాలు, పచ్చిక బయళ్ళు, చేపలు, రొయ్యల చెరువులు, మామిడి, సపోటా తోటలు, వరి, పామాయిల్, మొక్కజొన్న, పాపికొండల అందాలు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రత్యేకతలు. జిల్లా ప్రజల చిరకాల స్వప్నం, దివంగత మహానేత మానసపుత్రి పోలవరం ప్రాజెక్టు ఉన్నది ఇక్కడే.
కృష్ణా, గోదావరి జిల్లాల కలయిక
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, పోలవరం, చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, కృష్ణాజిల్లాలోని నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు స్థానం లభించింది. ఇప్పటి వరకూ 16 సార్లు ఎన్నికలు జరగ్గా తొమ్మిది సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 5సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మరో రెండు సార్లు సీపీఐ అభ్యర్థులు విజయం సాధించారు. కొమ్మారెడ్డి సూర్యనారాయణ 3 సార్లు, మాగంటి బాబు 2 పర్యాయాలు గెలుపొందారు.
తెలంగాణ సంస్కృతి..
రాష్ట్ర విభజనతో ఈ నియోజకవర్గంలోకి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు వచ్చి చేరడంతో అటు తెలంగాణ సంస్కృతి కూడా ఈ నియోజకవర్గానికి ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.
స్థానికేతరులకూ మద్దతు
నియోజకవర్గంతో సంబంధంలేని బోళ్ళ బుల్లిరామయ్య (తణుకు) నాలుగు సార్లు, కావూరి సాంబశివరావును రెండు సార్లు, సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న ఘట్టమనేని కృష్ణ, తణుకుకు చెందిన చిట్టూరి సుబ్బారావు చౌదరి ఇక్కడి నుంచి గెలుపొందారు. 57 ఏళ్ళుగా కమ్మ సామాజిక వర్గాల వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కనిపించని అభివృద్ధి
విభజన అనంతరం రాష్ట్ర రాజధానికి ఈ నియోజకవర్గం వేదికవుతుందని విస్తృత ప్రచారం జరిగింది. తొలుత నూజివీడు ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు పరిశీలన జరుగుతుందని వచ్చిన వార్తలతో ఈ నియోజకవర్గ ప్రజలు తమ జీవితాలు బాగుపడబోతున్నాయని ఆశించారు.అయితే రాజధాని కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యకు తరలిపోవడంతో ప్రజలు నిరాశపడ్డారు. ఏలూరు సమీపంలో నిట్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించినా ఆ విద్యా సంస్థను ఇక్కడకు రాకుండా మోకాలడ్డారు. ఏలూరు సమీపంలోని వట్లూరులో విమాన విడిభాగాల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేయడంతో ఇక్కడ భారీ పరిశ్రమ వస్తుంది, ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వస్తాయి అని ఆశించగా అది శంకుస్థాపనకే పరిమితమైంది.
శ్రీధర్ విజయం నల్లేరుపై నడకే..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోటగిరి శ్రీధర్ విజయం నల్లేరుపై నడకే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన తండ్రి దివంగత కోటగిరి విద్యాధరరావు రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేసి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. శ్రీధర్ రాజకీయాల్లో ప్రవేశించి, వైసీపీలో చేరిన నాటి నుంచి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 శాసన సభ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ అన్ని ప్రాంతాల్లో నాయకులను కలుపుకొని వెళుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, స్వయంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు.
మాగుంట చేసింది శూన్యం
టీడీపీ అభ్యర్థి మాగుంట వెంకటేశ్వరరావు (బాబు) గత ఐదేళ్లలో చేసిందేమి లేదు. కాంటూరు కుదింపు అంశం గాని, పోలవరం నిర్వాసితుల సమస్యలపై గాని స్పందించిన దాఖలాలు లేవు. కైకలూరులోని తన కార్యాలయంలోనే పేకాట డెన్ నిర్వహించడం ఆధారాలతో మీడియాలో వచ్చింది. తన మాట వినని రిజర్వుడ్ స్థానాల ఎమ్మెల్యేలను పని చేయనివ్వలేదన్న అపవాదు ఉంది.
అభ్యర్థులు వీరే..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తరపున కోటగిరి శ్రీధర్, టీడీపీ తరపున మాగంటి బాబు, జనసేన అభ్యర్థిగా పెంటపాటి పుల్లారావు, బీజేపీ అభ్యర్థిగా చిన్నం రామకోటయ్య, కాంగ్రెస్ అభ్యర్థిగా జెట్టి గుర్నాథరావు పోటీలో ఉన్నారు.
– సీహెచ్ రామకృష్ణంరాజు, ఏలూరు(ఆర్‌ఆర్‌పేట)
Comments
Please login to add a commentAdd a comment