maganti Venkateswara Rao (Babu)
-
మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు మృతి
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు ఇంట్లో మరోసారి విషాదం చోటుచేసుకుంది. మాగంటి రెండో కుమారుడు రవీంద్రనాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. తాగుడు అలవాటునుమానేందుకు రవీంద్రనాథ్ ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. మద్యానికి బానిస అయిన రవీంద్రను ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కుటుంబసభ్యులు చేర్పించారు. ఆసుపత్రి నుంచి తప్పించుకుని హోటల్లో ఉన్నాడు. బ్లడ్ వామిటింగ్తో హయత్ ప్యాలెస్‌లో రవీంద్రనాథ్ చనిపోయారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి పోలీసులు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: టీడీపీ మాజీ ఎంపీ మాగంటి తనయుడు కన్నుమూత -
ఏలూరును ఏలేదెవరో..!
సాక్షి, ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం రాజకీయంగా ప్రత్యేకత కలిగి ఉన్న సెగ్మెంట్. రెండు జిల్లాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉండటంతోపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు దీని పరిధిలోనే ఉంటాయి. అటవీ ప్రాంతం, కొండలు, గోదావరి పరవళ్ళు, కొల్లేరు పక్షుల కిలకిలా రావాలు, పచ్చిక బయళ్ళు, చేపలు, రొయ్యల చెరువులు, మామిడి, సపోటా తోటలు, వరి, పామాయిల్, మొక్కజొన్న, పాపికొండల అందాలు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రత్యేకతలు. జిల్లా ప్రజల చిరకాల స్వప్నం, దివంగత మహానేత మానసపుత్రి పోలవరం ప్రాజెక్టు ఉన్నది ఇక్కడే. కృష్ణా, గోదావరి జిల్లాల కలయిక పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, పోలవరం, చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, కృష్ణాజిల్లాలోని నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు స్థానం లభించింది. ఇప్పటి వరకూ 16 సార్లు ఎన్నికలు జరగ్గా తొమ్మిది సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 5సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మరో రెండు సార్లు సీపీఐ అభ్యర్థులు విజయం సాధించారు. కొమ్మారెడ్డి సూర్యనారాయణ 3 సార్లు, మాగంటి బాబు 2 పర్యాయాలు గెలుపొందారు. తెలంగాణ సంస్కృతి.. రాష్ట్ర విభజనతో ఈ నియోజకవర్గంలోకి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు వచ్చి చేరడంతో అటు తెలంగాణ సంస్కృతి కూడా ఈ నియోజకవర్గానికి ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. స్థానికేతరులకూ మద్దతు నియోజకవర్గంతో సంబంధంలేని బోళ్ళ బుల్లిరామయ్య (తణుకు) నాలుగు సార్లు, కావూరి సాంబశివరావును రెండు సార్లు, సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న ఘట్టమనేని కృష్ణ, తణుకుకు చెందిన చిట్టూరి సుబ్బారావు చౌదరి ఇక్కడి నుంచి గెలుపొందారు. 57 ఏళ్ళుగా కమ్మ సామాజిక వర్గాల వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కనిపించని అభివృద్ధి విభజన అనంతరం రాష్ట్ర రాజధానికి ఈ నియోజకవర్గం వేదికవుతుందని విస్తృత ప్రచారం జరిగింది. తొలుత నూజివీడు ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు పరిశీలన జరుగుతుందని వచ్చిన వార్తలతో ఈ నియోజకవర్గ ప్రజలు తమ జీవితాలు బాగుపడబోతున్నాయని ఆశించారు.అయితే రాజధాని కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యకు తరలిపోవడంతో ప్రజలు నిరాశపడ్డారు. ఏలూరు సమీపంలో నిట్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించినా ఆ విద్యా సంస్థను ఇక్కడకు రాకుండా మోకాలడ్డారు. ఏలూరు సమీపంలోని వట్లూరులో విమాన విడిభాగాల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేయడంతో ఇక్కడ భారీ పరిశ్రమ వస్తుంది, ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వస్తాయి అని ఆశించగా అది శంకుస్థాపనకే పరిమితమైంది. శ్రీధర్ విజయం నల్లేరుపై నడకే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోటగిరి శ్రీధర్ విజయం నల్లేరుపై నడకే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన తండ్రి దివంగత కోటగిరి విద్యాధరరావు రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేసి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. శ్రీధర్ రాజకీయాల్లో ప్రవేశించి, వైసీపీలో చేరిన నాటి నుంచి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 శాసన సభ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ అన్ని ప్రాంతాల్లో నాయకులను కలుపుకొని వెళుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, స్వయంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. మాగుంట చేసింది శూన్యం టీడీపీ అభ్యర్థి మాగుంట వెంకటేశ్వరరావు (బాబు) గత ఐదేళ్లలో చేసిందేమి లేదు. కాంటూరు కుదింపు అంశం గాని, పోలవరం నిర్వాసితుల సమస్యలపై గాని స్పందించిన దాఖలాలు లేవు. కైకలూరులోని తన కార్యాలయంలోనే పేకాట డెన్ నిర్వహించడం ఆధారాలతో మీడియాలో వచ్చింది. తన మాట వినని రిజర్వుడ్ స్థానాల ఎమ్మెల్యేలను పని చేయనివ్వలేదన్న అపవాదు ఉంది. అభ్యర్థులు వీరే.. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ తరపున కోటగిరి శ్రీధర్, టీడీపీ తరపున మాగంటి బాబు, జనసేన అభ్యర్థిగా పెంటపాటి పుల్లారావు, బీజేపీ అభ్యర్థిగా చిన్నం రామకోటయ్య, కాంగ్రెస్ అభ్యర్థిగా జెట్టి గుర్నాథరావు పోటీలో ఉన్నారు. – సీహెచ్ రామకృష్ణంరాజు, ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) -
ఒకే కుటుంబం..ముగ్గురుమంత్రులు
సాక్షి, కొవ్వూరు : జిల్లా రాజకీయాల్లో మాగంటి కుటుంబం దశాబ్దాల నుంచి ఉంది. తల్లిదండ్రులు, తనయుడు ముగ్గురూ మంత్రులుగా అవకాశం దక్కించుకున్న ఆరుదైన ఘనత వీరికి సొంతం. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి జెడ్పీ చైర్మన్‌గా, 1989లో చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 1991 ఉప ఎన్నికల్లో ఆయన భార్య వరలక్ష్మి గెలుపొంది స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వారి కుమారుడు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) 2004లో వైఎస్సార్ ప్రభంజనంలో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఏలూరు ఎంపీగా ఆయన గెలుపొందారు. ఇలా ఒకే కుటుంబంలో ముగ్గురు రాష్ట్ర మంత్రులు పనిచేయడం మాగంటి కుటుంబం ప్రత్యేకం. -
ఎంపీ మాగంటి బాబుకు అస్వస్థత
సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఏంపీ, టీడీపీ నేత మాగంటి బాబు అస్వస్థతకు గురయ్యారు. ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం ఉదయం చింతలపూడిలో టీడీపీ నిర్వహించిన సైకిల్ యాత్రలో ఎంపీ మాగంటి బాబు పాల్గొన్నారు. సైకిల్ యాత్ర పూర్తయ్యాక ఆయన ఇంటికి చేరుకున్నారు. కానీ ఎండలో సైకిల్ తొక్కడం వల్ల ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలుస్తోంది. కుటుంబసభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం ఏలూరులోని ఆస్పత్రికి తరలించారు. మాగంటిని పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించినట్లు సమాచారం. -
టీడీపీ నేతల కుమ్ములాటలు...
పాలకులంటే ప్రజల కష్టాలు తీర్చాలి, సమస్యలు పరిష్కరించి పాలనాదక్షత చాటుకోవాలి. జిల్లా టీడీపీలో మాత్రం అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య విభేదాలు తప్ప ప్రజలకు మంచి చేసే ఏ పనికి, ఏ నాయకుడూ పూను కోవట్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలక నేతల్లోనే కలిసి పనిచేసే లక్షణం లేకపోవడం, గొడవలకు కాలు దువ్వడం, అధినేత పర్యవేక్షణ కొరవడడంతో జిల్లా టీడీపీ మూడు కొట్లాటలు, ఆరు కుమ్ములాటలుగా తయారైంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పార్టీ పరిస్థితిని విశ్లేషిస్తే.. సాక్షి,విజయవాడ: జిల్లా తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య ఆదిపత్య పోరు తారస్థాయికి చేరింది. పలు నియోజకవర్గాల్లో నాయకుల మధ్య విభేదాలు చివరకు రోడ్డెక్కే స్థాయికి చేరాయి. ప్రజలకు అందాల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి పట్టించుకోకుండా, వైరివర్గాన్ని ఎలా దెబ్బతీయాలా అనే దానికే నేతలు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి వంటి కార్యక్రమాల్లోనూ ఒక నాయకుడు పాల్గొంటే మరొక నాయకుడు పాల్గొనట్లేదు. పార్టీ కార్యక్రమాలు కూడా ఎవరికి వారే నిర్వహించుకుంటున్నారు. విభేదాల విషయం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లినా ఏం చేయలేని పరిస్థితి ఉండటంతో నాయకులు నియోజకవర్గాల్లోనే బలాబలాలు తేల్చుకుంటున్నారు. తారస్థాయికి విభేదాలు నూజివీడులో ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ముద్దబోయిన వెంకటేశ్వరరావు నియోజకవర్గ ఇన్చార్జి కాదంటూ మాగంటి బాబు ప్రకటించడమే కాకుండా మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని తన వర్గానికి చెందిన కాపా శ్రీనివాసరావుకు ఇప్పించేందుకు ప్రయత్నించారు. దీన్ని ముద్దరబోయిన వ్యతిరేకించడంతో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఒక దశలో ముద్దరబోయిన వర్గం నాయకులు పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమవ్వడంతో పదవిని నిలుపుదల చేశారు. ♦ గుడివాడ నియోజకవర్గంలో ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు, మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావుకు వరుసకు సోదరుడు అయిన పిన్నమనేని పూర్ణవీరయ్య (బాబ్జీ) వర్గాలు బహిరంగంగానే బాహాబాహీకి దిగుతున్నారు. అంబేడ్కర్ జయంతి రోజున పార్టీ కార్యాలయంలోనే గొడవ పడ్డారు. ఆ తరువాత పార్టీ తరఫు కార్యక్రమాలన్నీ ఎవరికు వారే నిర్వహించుకుంటున్నారు. ♦ గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు మధ్య విభేదాలు అందరికీ తెలిసినవే. ఎమ్మెల్యే వంశీ నిర్వహించే నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాలకు దాసరి దూరంగా ఉంటారు. నియోజకవర్గ కార్యాలయం ఎమ్మెల్యే ఆధీనంలో ఉండటంతో దాసరి వర్గం రావడం మానేసింది. దాసరి బాలవర్ధనరావు.. దాసరి ట్రస్టు పేరుతో నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు సొంతంగా నిర్వహించుకుంటున్నారు. ♦ పామర్రు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆధిపత్యాన్ని హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య వర్గం అంగీకరించట్లేదు. చంద్రబాబు ఆదేశాల మేరకు వర్ల రామయ్య నియోజకవర్గాన్ని వదిలివేసినప్పటికీ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. నిమ్మకూరులో వర్ల రామయ్య వర్గానికి చెందిన నేతలు ఆయన సహాయంతో నేరుగా మంత్రి లోకేష్‌ను కలిసి గ్రామంలోని అభివృద్ధి పనులు చేయించుకుంటున్నారు. ♦ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్‌మీరాకు మధ్య విభేదాలు ఉన్నాయి. నియోజకవర్గంలోని కేవలం రెండు డివిజన్ల అధ్యక్ష పదవులను మాత్రమే మీరాకు ఇచ్చి మిగిలిన డివిజన్లను తనకు అనుకూలంగా ఉన్న వారిని నియమించడంపై మీరా వర్గం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. మీరాకు అనుకూలంగా ఉన్న టీడీపీ కార్పొరేటర్లు జలీల్‌ఖాన్‌కు దూరంగా ఉంటున్నారు. ♦ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం, పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించడం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇష్టపడట్లేదు. కార్యకర్తలపై తీవ్ర ఒత్తిడి పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాల కారణంగా కార్యకర్తలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. రెండో వర్గం చేసే కార్యక్రమాలకు వెళ్ల వద్దంటూ నేతలు చెప్పడంతో ఎవరిపక్షాన నిలబడాల్లో అర్థం కావట్లేదు. రెండు వర్గాల నేతల ఆగ్రహాన్ని చూడకూడదనే ఉద్దేశ్యంతో అనేకమంది కార్యకర్తలు అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. జన్మభూమి కమిటీల్లో ఉన్న తమ్ముళ్లు ఇరుపక్షాల నేతలు చేసిన సిఫారసులకు ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప వాస్తవంగా అర్హులైన వారికి న్యాయంచేసే పరిస్థితుల్లో లేరు. నేతల్లో క్రమశిక్షణ లోపించడం, వారిని చంద్రబాబు నియంత్రించ లేకపోవడంతో కార్యకర్తలు అసహనానికి గురువుతున్నారు. మరోవైపు నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగకపోవడంతో ప్రజల్లోకి వెళ్తే ఎక్కడ నిలదీస్తారోననే ఉద్దేశంలో తెలుగు తమ్ముళ్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. -
ఎంపీ మాగంటి బాబు ఆఫీస్‌లో పేకాట
-
పేకాట డెన్‌గా ఎంపీ ఆఫీస్
సాక్షి, అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ జమానాలో మద్యం ఏరులై పారుతుండగా జూదం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. సాక్షాత్తూ అధికారపార్టీకి చెందిన ఓ ఎంపీ తన కార్యాలయాన్ని పేకాట క్లబ్‌గా మార్చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)కు చెందిన కృష్ణాజిల్లా కైకలూరు కార్యాలయంలో ఏడాదిన్నరగా పేకాట విచ్చలవిడిగా నడుస్తోంది. రూ. 5వేలు రిజిస్ట్రేషన్ చార్జిగా వసూలు చేస్తూ కనీసం రూ.5 లక్షలు తెచ్చినవారినే లోనికి అనుమతిస్తూ జూదం నిర్వహిస్తున్నారు. ఇందులో రోజుకు రూ.12 కోట్లు వరకు చేతులు మారుతున్నట్లు వినిపిస్తోంది. మూడు నెలలుగా కోత ఆట నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ పేకాట కొనసాగుతున్నా వీకెండ్ (శుక్ర,శని,ఆదివారాలు)లో పందేలు మరింత పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. పెద్ద సంఖ్యలో జూదరులు.. కోట్లలో పందేలు.. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు తదితర జిల్లాలతో పాటు హైదారాబాద్ నుంచి ప్రత్యేకంగా పేకాట రాయుళ్లను ఆహ్వానించి కోత ఆట నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజు 80 మంది నుంచి వంద మంది వరకు ఈ కోత ఆటకు వస్తుంటారు. ఎంపీ కార్యాలయంలోని పెద్ద హాలులో నిర్వహించే ఈ పేకాటలో పాల్గొనే జూదరులకు పక్క రూమ్‌లోనే మందు, విందు ఏర్పాట్లు చేయడం గమనార్హం. ప్రతి రోజు రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము 4 గంటల వరకు కోత ఆట జరుగుతూనే ఉంటుంది. రోజుకు కనీసం రూ.5 కోట్లు నుంచి 12 కోట్లకు పైగా బెట్టింగ్‌ల రూపంలో చేతులు మారుతోంది. అధికార పార్టీ ఎంపీ కార్యాలయం కావడంతో పోలీసులు అటువైపు చూసే సాహసం చేయలేకపోతున్నారు. అయినా నెలవారీ మూమూళ్లు షరా మామూలేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కైకలూరు పేకాటపై కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్ కి స్పందించలేదు. అధికార పార్టీ నేతలు, క్రికెట్ బుకీలే నిర్వాహకులు... టీడీపీ ఎంపీ కార్యాలయంలో సాగుతున్న ఈ పేకాట క్లబ్‌కు పశ్చిమగోదావరి జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు, హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, భీమవరం, రాజమండ్రి, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన క్రికెట్ బుకీలు నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారని సమాచారం. కోతాట క్లబ్ నిర్వహిస్తున్నందుకు గాను వారికి కమీషన్లు ముడుతున్నాయని, గత మూడు నెలల్లో సుమారు రూ.23 కోట్ల మేర కమీషన్ల రూపంలో సంపాదించారని తెలిసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రధాన క్రికెట్ బుకీగా పోలీస్ రికార్డులకెక్కిన శ్రీకాకుళంకు చెందిన వ్యక్తి, ఇటీవల నెల్లూరులో పట్టుబడిన క్రికెట్ బుకీలు ఇచ్చిన సమాచారంతో పోలీస్ రికార్డులకెక్కిన మరో వ్యక్తి, హైదరాబాద్‌లో పేకాడుతూ పట్టుబడిన వ్యక్తి, భీమవరం తదితర ప్రాంతాల్లో భారీగా క్రికెట్ పందాలు, పేకాటల్లో ఆరితేరిన వ్యక్తులు ఈ జూద శిబిరానికి నేతృత్వం వహిస్తున్నట్టు వినిపిస్తోంది. ఈ అనధికార పేకాట క్లబ్లో టీడీపీ నేతలు, కోత ఆట నిపుణులకు ఆరు వాటాలుండగా రాష్ట్రంలోని కీలక క్రికెట్ బుకీలకు ఏడవ వాటాగా లాభాలను పంచుతున్నారని సమాచారం. జూదరులకు ఆప్పులిచ్చి మరీ ఆడిస్తున్నారు... ప్రతిరోజూ వచ్చే జూదరులకు వారి పరపతికి తగినట్లు నిర్వాహకులు అప్పులు కూడా ఇస్తున్నారు. పేకాటరాయుళ్లకు అప్పులిచ్చే వ్యక్తి కోత ఆట జరిగే హాలులో ఒక మూలన టేబులు, కుర్చీ వేసుకుని కూర్చుని ఉంటారు. ప్రతీ రోజు దాదాపు రూ.5 కోట్ల మేర అప్పుగా ఇచ్చి వారి పేర్లు నమోదు చేసుకుంటాడు. కరెన్సీకి బదులు రంగు రంగుల కాయిన్స్ ఇస్తాడు. రూ.10 లక్షలను అప్పుగా ఇచ్చినందుకు రోజుకు రూ.20 వేలు కమీషన్‌గా వసూలు చేస్తాడు. మొదటి రోజు అప్పుగా తీసుకున్న మొత్తాన్ని మరుసటి రోజు పేకాటకు వచ్చినప్పుడు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కోత ఆటలో నిర్వాహకులకే ఎక్కువ ఛాన్స్‌లు ఉండటంతో పేకాట రాయుళ్ల జేబులు గుల్లవుతున్నాయి. ఇటీవల కోత ఆటలో భారీగా నష్టపోయిన వైజాగ్, ఒంగోలు, భీమవరం, విజయవాడకు చెందిన పలువురు యువకులు ఆస్తులు అమ్ముకుని అప్పులు తీర్చాల్సిన దుస్థితి వచ్చింది. అప్పులు తీర్చలేక మరికొందరు జూదరులు ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. ఏమిటి ఈ కోత ఆట..?? పేకాటలో అత్యంత ప్రమాదకరమైన గేమ్ ఇది. సహజంగా రిక్రియేషన్, కల్చరల్ క్లబ్‌ల్లో 13 పేక ముక్కలతో ఆడే రమ్మీ (కిల్ గేమ్)ని ఎటువంటి బెట్టింగ్‌లు లేకుండా అధికారులు అనుమతిస్తుంటారు. కానీ బెట్టింగ్‌లతో ఆడే పేకాట, కోత ఆట, కోసు పందేలపై మాత్రం నిషేధం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన కొన్నేళ్లకే గ్యాంబ్లింగ్ యాక్ట్ తెచ్చారు. దాని ప్రకారం స్కిల్ గేమ్ మినహా.. బెట్టింగ్ వేసే ఏ పేకాటను చట్ట ప్రకారం అనుమతి ఇవ్వరు. కోత ఆట అంటే లోనా బయటా ముక్కలు తిప్పుతూ ఎంపిక చేసిన పేక ముక్క ఎటువైపు పడితే అటువైపు పందేలు గెలిచినట్లుగా పరిగణిస్తుంటారు. ఇందులో క్షణాల్లో లక్షలాది రూపాయలు అటో ఇటో తేలిపోతాయి. దీనికంటే ప్రమాదకరమైంది కోసు పందెం. ఇందులో లోనా బయటా పేకలు తిప్పుతూ ఎక్కువ అవకాశాలు నిర్వాహకులకే ఉంచుకుంటారు. çఫలానా పేక ముక్క వస్తే పందెం డబ్బు ఇవ్వబోమని చెబుతారు. రెండో ముక్క, ఒకటో ముక్క ఇలా ఎంపిక చేసిన పేక ముక్క నిర్వాహకులు చెప్పినట్లు వస్తే ఆ మొత్తం నిర్వాహకుల జేబుల్లోకి వెళితాయి. ఒకటికి రెండు, మూడు రెట్లు అదనంగా ఇస్తామని ప్రకటిస్తూ నిర్వాహకులు మోసం చేస్తుంటారు. పేకాట డెన్‌గా ఎంపీ ఆఫీస్ -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
ఏలూరు (మెట్రో): జిల్లాలో రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు డ్రైవర్లు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని అప్పుడే ప్రమాదరహిత జిల్లాగా పశ్చిమను తీర్చిదిద్దగలుగుతామని జిల్లా రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్, ఏలూరు ఎంపీ మాగంటి బాబు అన్నారు. స్థానిక పోలీస్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం జిల్లాస్థాయి రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్‌గా నియమితులైన ఎంపీను రవాణా శాఖాధికారులు ఘనంగా సత్కరించారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సత్యనారాయణమూర్తి దుశ్శాలువాతో ఎంపీను సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. రోడ్డు ప్రమాదాల్లో జిల్లా మొదటి స్థానంలో ఉందని ఈ పరిస్థితిని మార్చి పశ్చిమలో ప్రశాంత వాతావరణంలో ప్రయాణం సాగుతుందనే నమ్మకం కలిగించాలని ఎంపీ సూచించారు. ప్రతి డ్రైవరూ విధినిర్వహణలో మద్యం సేవించకూడదని, అనుక్షణం అప్రమత్తతతో జాగ్రత్తగా వాహనాన్ని నడిపినప్పుడే ప్రమాదాలను నివరించవచ్చని సూచించారు. త్వరలోనే విజయవాడ–ఏలూరు జాతీయ రహదారి గోతులు లేకుండా పటిష్టంగా నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, పనులు వేగవంతంగా జరిగేలా చూస్తామని చెప్పారు. ఆర్టీసీ ఆర్ఎం ఎస్.ధనుంజయరావు, రవాణా శాఖాధికారులు నాగమురళి, సుమ, సిద్ధిక్, ప్రసాద్, ఎం.పౌల్‌రాజు పాల్గొన్నారు. -
వైశ్యులను విమర్శిస్తే వారికి మహిళలే కర్మకాండలు చేస్తారు: టీజీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు/పాతగుంటూరు: ఆర్యవైశ్యులను విమర్శిస్తే ఆర్యవైశ్య మహిళలే వారికి కర్మకాండలు నిర్వహిస్తారంటూ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ హెచ్చరించారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోటలో అర్య వైశ్య కల్యాణ మండపం ప్రారంభోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఏలూరు ఎంపీ మాగంటి బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కామ వరపుకోటలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన టివీఏ.చిన రాజన్న ఆర్యవైశ్య కల్యాణ మండపాన్ని మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ప్రారంభించారు. ఈ సభలో టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులను స్మగ్లర్లుగా పేర్కొంటూ వివాదాస్పద పుస్తకం రాయడం సరికాదని, ఇటువంటి చర్యలకు పాల్పడేవారిని కట్టడి చెయ్యకపోతే సమాజానికి ప్రమాదమన్నారు. అర్యవైశ్యులను విమర్శించిన వారికి అర్యవైశ్య మహిళలే కర్మకాండలు చేస్తారన్నారు. ఏలూరు ఎంపి.మాగంటి బాబు మాట్లాడుతూ కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని, వాటిని సాగనివ్వరా దన్నారు. అర్యవైశ్యులను ఎవరైనా విమర్శిస్తే వారి కాళ్లు విరగ్గొట్టాలని పిలుపునిచ్చారు. -
ఎంపీ సంచలన వ్యాఖ్యలు
-
బరులు రె‘ఢీ’ ..
జిల్లాలో కోడి పందేలకు పక్కా ఏర్పాట్లు వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు.. పేకాటకు గదులు భోగి పండుగనాడు ప్రారంభించాలని ఉవ్విళ్లు పోలీస్, రెవెన్యూ అధికారులకు మామూళ్లు మచిలీపట్నం : సంక్రాంతికి జిల్లాలో కోడిపందేలు, పేకాటకు తెర తీస్తున్నారు. కోడి పందేలపై హైకోర్టు నిషేధం విధించడంతో గురువారం సాయంత్రం వరకు పరిస్థితి తుపాను ముందు ప్రశాంతతలా ఉంది. పోలీసులు కోడిపందేలు వేసేందుకు అనుమతులు లేవని చెబుతుండడంతో పందెంరాయుళ్లు రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నారు. శుక్రవారం ఉదయానికి పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందని పందెం రాయుళ్లు ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం భోగి పండుగ కావటంతో ఆ రోజు నుంచి పందేలు వేసేందుకు బరులు సిద్ధం చేస్తున్నారు. కోడిపందేల శిబిరాల వద్ద పేకాట తదితర జూదాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. నిర్వాహకులకు టీడీపీ నేతల అండదండలు ఉన్నట్టు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దు అప్పనవీడులో కోడిపందేలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ బరిలో వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు, పేకాట ఆడేందుకు ప్రత్యేక గదులను సిద్ధం చేస్తున్నారు. కోడిపందేలకు సంబంధించి ఒక్కొక్క బరికి రూ. లక్ష నుంచి రూ. లక్షన్నర వరకు నగదు చేతులు మారుతోంది. నిర్వాహకులు రెవెన్యూ, పోలీస్ అధికారులకు మామూళ్లు అందజేస్తున్నట్టు సమాచారం. దీంతో కోడిపందేలు నిర్వహించే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నా ఇవేమీ పరిగణనలోకి తీసుకోకుండానే బరులను ఏర్పాటు చేయటం గమనార్హం. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు కత్తులు కట్టకుండా కోడిపందేలు వేసుకోవచ్చని సూచనప్రాయంగా చెబుతుండడం గమనార్హం. పెనమలూరు నియోజకవర్గం ఈడ్పుగల్లులో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, పెదపులిపాకలో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కోడిపందేలను గురువారమే ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా బరులు సిద్ధం ► నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి, తుక్కులూరు, సీతారామపురం, రావిచర్లతోపాటు చాట్రాయి మండలం జనార్ధనవరం, ఆగిరిపల్లి మండలం ఈదర, శోభనాపురంలలో బరులను ఏర్పాటు చేసి పందేలకు సిద్ధమవుతున్నారు. ► అవనిగడ్డ నియోజకవర్గంలోని వెంకటాపురం, నడకుదురు, కొడాలి, శ్రీకాకుళం, మొవ్వ, పెదకళ్లేపల్లి, బార్లపూడి, భట్లపెనుమర్రులలో ఇప్పటికే బరులను సిద్ధం చేశారు. ► బందరు మండలం గోపువానిపాలెం, మేకవానిపాలెం, శ్రీనివాస నగర్లలో బరులను సిద్ధం చేశారు. మచిలీపట్నంలోని ఓ పాఠశాల పక్కనే బరిని సిద్ధం చేశారు. ► కైకలూరు మండలం కొల్లేటికోట, భుజబలపట్నంలలో బరులను సిద్ధం చేశారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు కైకలూరులోనే మకాం చేయడంతో కోడిపందేల బరులను శుక్రవారం ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైందని సమాచారం. ► పెడన మండలం కొంకేపూడి, బల్లిపర్రు, కూడూరు, గూడూరు – పెడన అడ్డరోడ్డు సెంటరులలో, బంటుమిల్లి మండలం నాగేశ్వరరావుపేట, పెందుర్రు, ఆర్తమూరు, నాగన్న చెరువులలో కోడిపందేల బరులు ఏర్పాటు చేశారు. -
కాంటూర్‌పై కప్పదాటు
►ప్రధాని మోదీని కలిసినా విషయాన్ని ప్రస్తావించని మాగంటి ► జిరాయితీ భూముల పంపిణీపైనే దృష్టి ► కొల్లేరు సమస్యలన్నీ పరిష్కారమైనట్టు ప్రకటనలు ► ఇలాగైతే కొల్లేటి వాసుల వ్యథలు తీరేదెన్నడో సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏలూరు ఎంపీ మాగంటి బాబు వ్యక్తిగతంగా కలిసే అవకాశం వచ్చింది. తన ఇంట జరిగే వివాహానికి హాజరుకావాల్సిందిగా కోరేందుకు మోదీని మాగంటి కలిశారు. ఆ సందర్భంగానైనా కొల్లేరు సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తారేమోనని కొల్లేరువాసులు భావించారు. ప్రధాని మోదీయే స్వయంగా కొల్లేరు సమస్యను గుర్తుకు తెచ్చినా.. మాగంటి బాబు మాత్రం అంతా పరిష్కారమైపోయిందని వ్యాఖ్యానించినట్టు వార్తలొచ్చాయి. జిరాయితీ భూముల పంపిణీకి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ సూత్రప్రాయంగా అంగీకరించారని మోదీకి బాబు చెప్పుకొచ్చారు. అయితే ప్రధాన సమస్య కాంటూర్ కుదింపుపై మాత్రం ప్రస్తావించిన దాఖలా కానరాలేదు. కొల్లేటి వాసుల అసలు సమస్యపై దృష్టి పెట్టకుండా జిరాయితీ భూముల పంపిణీ చేసి చేతులు దలుపుకునే పనిలో పాలకులు ఉన్నారన్న వాదనలు బయలుదేరాయి. హామీ ఇచ్చి రెండేళ్లు గడచినా.. కొల్లేరు కాంటూర్ కుదింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చి రెండేళ్లు గడచినా కప్పదాటుగానే వ్యవహరిస్తున్నాయి. సరస్సును ఐదో కాంటూర్ నుంచి మూడో కాంటూర్‌కు కుదిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో సాక్షాత్తు నరేంద్ర మోదీతోపాటు చంద్రబాబునాయుడు సైతం హామీ ఇచ్చినా నేటికీ ఆచరణకు నోచుకోలేదు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మొక్కుబడిగా తీర్మానం చేసి చేతులు దులుపుకుంది. కేంద్రం కూడా ఇప్పటివరకు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. తాజాగా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కొల్లేరు నాయకులు కేంద్రమంత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. వానంతా మంత్రులను కలిసిన సందర్భాల్లో కేవలం జిరాయితీ భూముల సమస్యపై తప్ప కాంటూర్ కుదింపుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసిన దాఖలాలే కనిపించడం లేదు. ప్రధాని జోక్యం చేసుకుంటేనే పాలకులు కాంటూర్ కుదింపు చేపడితే సుమారు 76 వేల ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేయవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకుంటేనే కాంటూర్ కుదింపు సాధ్యమవుతుంది. కొల్లేరును కుదించి భూ పంపిణీ చేయాలంటే ప్రపంచ బ్యాంక్‌తో ముడిపడి ఉన్న ప్రపంచ పర్యావరణ సంస్థతోపాటు పర్యావరణ వేత్తలను ఒప్పించాలి. ఇందుకు సాక్షాత్తు ప్రధానమంత్రే చొరవ చూపాలి. మోదీని వ్యక్తిగతంగా కలిసే అవకాశం వచ్చినా ఇక్కడి నేతలు కొల్లేరు సమస్యలన్నీ పరిష్కారమైపోయినట్టు వ్యవహరించడం చూస్తుంటే కాంటూర్ కుదింపు ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. వైఎస్ హయాంలోనే పట్టాలిచ్చేందుకు శ్రీకారం కొల్లేరు లంకగ్రామాల ప్రజలను నమ్మించేందుకు జిరాయితీ భూముల పట్టాల మంజూరు అంటూ పాలకులు కొత్త పల్లవి అందుకుంటున్నారు. వాస్తవానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జిరాయితీ భూముల పంపిణీకి శ్రీకారం చుట్టారు. సరిగ్గా ఆయన అకాల మరణానికి ముందు రోజు 2009 సెప్టెంబర్ 1న వైఎస్ కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలోని 7,500 ఎకరాల జిరాయితీ భూములు పంపిణీ ఫైల్‌పై సంతకం చేశారు. ఆయన హఠాన్మరణంతో ఆ ఫైల్‌ను పట్టించుకున్న నాథుడే లేకుండాపోయారు. ఫలితంగా కొల్లేరు ప్రజల ఆశలు నెరవేరలేదు. ఇన్నాళ్లకు పాలకులు అదే ఫైల్‌ను తెరపైకి తీసుకువచ్చి జిరాయితీ భూములున్న వారికి పట్టాలు పంపిణీ చేస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. -
పందేలకు సై.. ఆంక్షలు జాన్తానై...
సాక్షి ప్రతినిధి, ఏలూరు: హైకోర్టు ఆదేశాలు, లోకాయుక్త ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలు.. ఇవేమీ కోడి పందేలను అడ్డుకోలేవని అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు నిరూపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బుధవారం ఆ పార్టీకి చెందిన ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు), ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) చెరో కోడి పట్టుకొని పందేలకు సై అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏలూరు స్టేడియంలో జిల్లా అధికారులు నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యేలు కోడి పుంజులను బరిలోకి దింపారు. వాటికి కత్తులు కట్టకుండా డింకీ పందేలను ఆడించారు. నేతలు ఇచ్చిన ఊపుతో టీడీపీ కార్యకర్తలు, చోటామోటా నేతలు అదే స్టేడియంలో డింకీ పందేలకు తెరలేపారు. జిల్లావ్యాప్తంగా మెట్ట, డెల్టా ప్రాంతాల్లో సుమారు వంద బరులు సిద్ధమైనట్లు అంచనా. -
'కోడి పందేల'తో గ్రామాల అభివృద్ధి
- పందేలు చూసేందుకు వచ్చే ఎన్నారైలు గ్రామాభివృద్ధికి విరాళాలిస్తారు - కోడి పందేల కోసం జీవో తెస్తామన్న ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు దేవరపల్లి (పశ్చిమగోదావరి): కోడి పందేలు సంప్రదాయ క్రీడ అని, వీటిని అధికారికంగా నిర్వహించుకునే విషయమై జీవో తీసుకొస్తామని ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాథపురంలో శుక్రవారం జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ విలేకరులతో మాట్లాడారు. సంక్రాంతికి కోడి పందేల నిర్వహన ఏళ్లుగా వస్తోన్న సంప్రదాయమని, న్యాయస్థానాలు వీటిని నిలుపుదల చేయటం సరికాదని, అయితే కోర్టులను తాను గౌరవిస్తున్నానని ఎంపీ బాబు అన్నారు. కోడి పందేల వల్ల పట్టణవాసులకు గ్రామీన వాతావరణ అలవాటవుతుందని, విదేశీయులు, బంధువులు, స్నేహితులు పందేలను తిలకించి ఆనందం పొందుతారని ఎంపీ చెప్పుకొచ్చారు. కోడి పందేలు జూదం కాదన్న మాగంటి.. గ్రామాల అభివీద్ధికి పందేలకు లింకుందన్నారు. పండక్కి పందేలు చూసేందుకు వచ్చే ఎన్నారైలు గ్రామాల అభివృద్ధి కోసం ధారళంగా విరాళాలు అందిస్తున్నారని, జిల్లాలోని గ్రామాల అభివృద్ధికి 12 వేల మంది ఎన్ఆర్ఐలు ముందుకొస్తున్నారని గుర్తుచేశారు. వేల కోట్ల వ్యయంతో గుర్రపు పందేలు నిర్వహించటానికి అనుమతి ఇస్తున్నప్పుడు కోడి పందేలకు అభ్యంతరం దేనికని ప్రశ్నించారు. -
ఎంపీ మాగంటి వ్యాఖ్యలతో రగిలిన చిచ్చు
కొయ్యలగూడెం : అధికార టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన చైతన్యయాత్రలు జనానికి ఎంత వరకూ ఉపయోగపడుతున్నాయన్న మాట అటుంచితే.. ఆ పార్టీలోని వర్గ విభేదాలను మాత్రం బహిర్గతం చేస్తున్నాయి. పోలవరం నియోజకవర్గంలోని ఎంపీ, ఎమ్మెల్యే మధ్య కొనసాగుతున్న విభేదాలకు కన్నాపురంలో శని వారం నిర్వహించిన జనచైతన్య యాత్ర వేదికగా నిలిచింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కన్నాపురంలో జనచైతన్యయాత్ర నిర్వహిస్తున్న సందర్బంగా మెయిన్సెంటర్లోకి చేరుకున్న ర్యాలీని ఉద్దేశించి ఎంపీ మాగంటి బాబు బహిరంగ ప్రసంగం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేను ఉద్దేశించి సూటిగా విమర్శకు దిగడంతో పార్టీ శ్రేణులు విస్తుపోయాయి. ఏం జరుగుతుందో తెలియక పార్టీ నాయకులు , కార్యకర్తలు తలో దిక్కుకు సర్దుకున్నారు. ఎంపీ మాటలపై విస్మయం చెందిన ఎమ్మెల్యే మొడియం జనచైతన్య కార్యక్రమం నుంచి అర్థంతరంగా తప్పుకోగా ఎంపీ సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తి కన్నాపురం జనచైతన్య యాత్రలో ఏలూరు ఎంపీ మాగంటిబాబు పార్టీ నాయకులను అవినీతి అక్రమార్కులుగా అభివర్ణించడంపై ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ తన అనుయాయులు వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పలు ఉన్నత పదవులు నిర్వహించిన మాగంటి బహిరంగ సభలో సొంత పార్టీ వ్యక్తులపై ఇలా విరుచుకుపడడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి దెందులూరు పర్యటన సమయంలో పార్టీ ఆదేశానుసారం తాను జీలుగుమిల్లి జనచైతన్యయాత్రలో పాల్గొన్నానని, ఆ విషయం మరిచి ఎంపీ తప్పుగా పేర్కొనడం తనను బాధించినట్లు ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, జెడ్పీవైస్ చైర్మన్ చింతల వెంకటరమణల వద్ద వాపోయినట్లు తెలిసింది. అదే విధంగా ఒకప్పటి కాంగ్రెస్ వాది అయిన మాగంటి తీరు టీడీపీ విషయంలో అనుమానాస్పదంగా ఉందని కూడా ఆయన అన్నట్లు ప్రచారం జరుగుతోంది. తీవ్ర మనోవేదనకు గురైన మొడియం జరిగిన విషయం అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సమాయాత్తమవుతున్నట్లు సమాచారం. కన్నాపురం జనచైతన్య యాత్రలో పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ ను ఉద్దేశించి ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ‘ఈ నెల 3వ తేదీన దెందులూరు పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాగా మీరు(ఎమ్మెల్యే) హాజరు కాలేదు. ఇది భావ్యం కాదు. అలాగే పోలవరం నియోకవర్గంలో అవినీతి పెచ్చుమీరుతోంది. ప్రతి విషయంలో టీడీపీ నాయకులు దందాల వైఖరి అవలంభిస్తున్నారు. ఇసుక మాఫీయా నుంచి భూ తగాదాల వరకు కూడా సెటిల్మెంట్లు చేస్తున్నారు. అర్అండ్ఆర్ ప్యాకేజీలో లక్షకు రూ.20 వేలు నియోజకవర్గ టీడీపీ నాయకులు రైతుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు. ఎన్ని గొడవలు జరుగుతున్నా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ తన నియోజకవర్గంలో సాధిస్తున్న అభివృద్ధిని చూసి ఏలూరు ఎంపీగా గర్విస్తున్నాను. ఎంపీగా మీరు అభివృద్ధికి ఏం చేస్తున్నారని దెందులూరు పర్యటనలో సీఎం నన్ను ప్రశ్నించారు. ఇప్పటికే పోలవరంలో జరుగుతున్న అవినీతి అక్రమాల చిట్టా అంతా తన వద్ద ఉందని, త్వరలోనే అందరి సంగతి తేల్చుతానని ఆయన హెచ్చరించారు.’ -
కేంద్రమంత్రిని కలిసిన మాగంటి, కావూరి
న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏలూరు ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఢిల్లీలో ఆమె నివాసానికి వెళ్లి కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. విదేశాల నుంచి ఆయిల్ దిగుమతి తగ్గించాలని మంత్రి నిర్మలా సీతారామన్‌ను వారు ఈ సందర్భంగా కోరారు. -
సాగునీటి కోసమే నదుల అనుసంధానం
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పల్లెర్లమూడి(నూజివీడు) : కృష్ణాడెల్టా ఆయకట్టుకు సాగునీటి కొరత తీర్చేందుకు ప్రభుత్వం గోదావరి-కృష్ణా నదుల అనుసంధానాన్ని చేపట్టిందని, ఈ క్రమంలోనే పట్టిసీమ ప్రాజెక్టును తీసుకువచ్చినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మం త్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గోదావరి జలాలను కృష్ణానదికి తరలించే కార్యక్రమంలో భాగంగా బుధవారం పశ్చిమగోదావరి-కృష్ణాజిల్లాల సరిహద్దు నూజివీడు మం డలం పల్లెర్లమూడి సమీపంలోని 119వ కిలోమీటరు వద్ద గోదావరి జలాలకు పోలవరం కాలువలో పూజలు నిర్వహించి కృష్ణాజిల్లాలోకి విడుదల చేశారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు, దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్లతో కలసి మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం కాలువలోకి విడుదల చేసిన 500 క్యూసెక్కుల నీరు పల్లెర్లమూడి వద్దకు చేరుకోగా రైతులు హారతులు ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈనెల 15న ఇబ్రహీంపట్నం వద్ద గోదావరి జలాలను కృష్ణమ్మలో అనుసంధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారని తెలిపారు. ఎంపీ మా గంటి బాబు మాట్లాడుతూ గోదావరి- కృష్ణా నదుల అనుసంధానంతో రైతాంగానికి సాగునీటి కష్టాలు తొలగిపోతాయన్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, పల్లెర్లమూడి సర్పంచి ఉషారాణి, ఎంపీపీ శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ సంధ్యారాణి, ఆర్డీవో రంగయ్య, తహశీల్దార్ ఇంత్యాజ్పాషా పాల్గొన్నారు. -
అధికార అండతో బరితెగింపు
♦ కైకలూరు టౌన్హాల్లో పేకాట శిబిరం ♦ అనుమతులు లేకుండా నిర్వహణ ♦ పోలీసుల దాడిలో 9 మంది అరెస్టు ♦ గతంలోనే క్లబ్బుల ఏర్పాటును వ్యతిరేకించిన ఎమ్మెల్యే నాని కైకలూరు : అధికారం అండ.. ప్రజాప్రతినిధుల భరోసాతో పట్టపగలే పేకాట శిబిరాన్ని తెరిచేశారు. నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన కైకలూరు టౌన్హాల్లో బుధవారం పేకాట ఆడడానికి ప్రయత్నిస్తున్న తొమ్మిది మందిని కైకలూరు సీఐ జె.మురళీకృష్ణ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. వారం రోజులుగా ఈ తంతు జరుగుతున్నా పోలీసులకు తెలియదనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టౌన్‌హాల్ పూర్వం క్లబ్‌గా ఉండేది. తదనంతరం లెసైన్సును రద్దు చేశారు. 2014 ప్రారంభంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) గుడివాడ, కైకలూరులో క్లబ్‌లు తెరిస్తే ఆందోళన చేస్తానని చెప్పడంతో అప్పట్లో నాయకులు ఆ యోచన విరమించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ మాగంటి బాబుల వద్ద ప్రధాన అనుచరులుగా పేరుగడించిన కొందరు బడా వ్యాపారులు ఎట్టి పరిస్థితుల్లోనూ టౌన్‌హాలులో పేకాట ఆడతామని శపథం చేశారు. దీంతో ముందుగానే అక్కడ జనరేటర్‌ను ఏర్పాటు చేశారు. వారం రోజుల కిందట టౌన్‌హాలును శుభ్రం చేయించి, పేకాట కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వారం రోజులుగా రాత్రి వేళల్లో పేకాట ఆడుతున్నారు. బుధవారం కూడా వాహనాలతో టౌన్‌హాలుకు చేరుకున్నారు. వారం రోజుల తర్వాత విషయం తెలుసుకున్న పోలీసులు ముందుగా నలుగురు రాగా ఎవరూ లెక్కచేయలేదు. బయటి పట్టణాల్లో పేకాటకు వెళ్లాల్సి వస్తోందని, కొంచెం సహకరించండని సదరు వ్యక్తులు బతిమలాడటం కనిపించింది. పోలీసుల ముందే దర్జాగా... టౌన్‌హాలులో పేకాట నిర్వహణకు ఎటువంటి అనుమతులు లేవు. సీఐ జె.మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఎట్టకేలకు నాలుగు మండలాల నుంచి వచ్చిన పోలీసులు టౌన్‌హాలులో పేక ముక్కల బాక్సులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద రూ.1800 నగదు లభించిందని చెప్పారు. తమ బైకులు, కార్లలోనే పోలీసులతో కలసి స్టేషన్‌కు వెళ్లిన పేకాటరాయుళ్లు అనంతరం బెయిల్‌పై ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ ఘటనపై గుడివాడ డీఎస్పీ అంకినీడు ప్రసాద్‌ను వివరణ కోరగా టౌన్‌హాలులో పేకాడుతున్న విషయం తెలిసిన తర్వాత స్థానిక సీఐని అప్రమత్తం చేశామన్నారు. సీఐ మురళీకృష్ణను పేకాట శిబిరంపై వివరణ కోరగా పోలీసులు పుష్కరాల విధుల్లో ఉండటం వల్ల అడ్డుకోవడం ఆలస్యమైందన్నారు. ఎట్టిపరిస్థితుల్లో పేకాటను సాగనివ్వబోమని చెప్పారు. టౌన్‌హాలు వద్ద పోలీసులను గస్తీ పెడుతున్నట్లు తెలిపారు. -
విజయవాడ - గుంటూరు మధ్యే రాజధాని
ఎంపీ మాగంటి బాబు కైకలూరు : రాష్ట్ర రాజధాని విజయవాడ - గుంటూరు మధ్యే ఏర్పాటవుతుందని ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆటపాకలోని ఆయన నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాలకు మధ్యలో రాజధాని ఏర్పాటు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 14 కార్పొరేషన్లకు వంట గ్యాస్‌ను పైపుల ద్వారా సరఫరా చేసే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని అన్నారు. నియోజకవర్గాల అభివృద్ధికి రూ. 5కోట్ల ఎంపీ నిధులను ప్రభుత్వం కేటాయించిందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చలమలశెట్టి రామానుజయ్య మాట్లాడుతూ నందిగామలో దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్య పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టడం భావ్యం కాదన్నారు. పలువురు ఎంపీ మాగంటికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు సయ్యపురాజు గుర్రాజు, కెవిఎన్‌ఎం.నాయుడు, గంగునేని వరప్రసాద్, అట్లూరి భవానీ ప్రసాద్, గంగుల వెంకటేశ్వర రావు, నున్న కాళీవరప్రసాద్లు, నంగెడ్డ శివ తదీతరులు పాల్గొన్నారు.