
'కోడి పందేల'తో గ్రామాల అభివృద్ధి
- పందేలు చూసేందుకు వచ్చే ఎన్నారైలు గ్రామాభివృద్ధికి విరాళాలిస్తారు
- కోడి పందేల కోసం జీవో తెస్తామన్న ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు
దేవరపల్లి (పశ్చిమగోదావరి): కోడి పందేలు సంప్రదాయ క్రీడ అని, వీటిని అధికారికంగా నిర్వహించుకునే విషయమై జీవో తీసుకొస్తామని ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాథపురంలో శుక్రవారం జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ విలేకరులతో మాట్లాడారు. సంక్రాంతికి కోడి పందేల నిర్వహన ఏళ్లుగా వస్తోన్న సంప్రదాయమని, న్యాయస్థానాలు వీటిని నిలుపుదల చేయటం సరికాదని, అయితే కోర్టులను తాను గౌరవిస్తున్నానని ఎంపీ బాబు అన్నారు.
కోడి పందేల వల్ల పట్టణవాసులకు గ్రామీన వాతావరణ అలవాటవుతుందని, విదేశీయులు, బంధువులు, స్నేహితులు పందేలను తిలకించి ఆనందం పొందుతారని ఎంపీ చెప్పుకొచ్చారు. కోడి పందేలు జూదం కాదన్న మాగంటి.. గ్రామాల అభివీద్ధికి పందేలకు లింకుందన్నారు. పండక్కి పందేలు చూసేందుకు వచ్చే ఎన్నారైలు గ్రామాల అభివృద్ధి కోసం ధారళంగా విరాళాలు అందిస్తున్నారని, జిల్లాలోని గ్రామాల అభివృద్ధికి 12 వేల మంది ఎన్‌ఆర్‌ఐలు ముందుకొస్తున్నారని గుర్తుచేశారు. వేల కోట్ల వ్యయంతో గుర్రపు పందేలు నిర్వహించటానికి అనుమతి ఇస్తున్నప్పుడు కోడి పందేలకు అభ్యంతరం దేనికని ప్రశ్నించారు.