
పందేలకు సై.. ఆంక్షలు జాన్తానై...
సాక్షి ప్రతినిధి, ఏలూరు: హైకోర్టు ఆదేశాలు, లోకాయుక్త ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలు.. ఇవేమీ కోడి పందేలను అడ్డుకోలేవని అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు నిరూపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బుధవారం ఆ పార్టీకి చెందిన ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు), ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) చెరో కోడి పట్టుకొని పందేలకు సై అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏలూరు స్టేడియంలో జిల్లా అధికారులు నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యేలు కోడి పుంజులను బరిలోకి దింపారు. వాటికి కత్తులు కట్టకుండా డింకీ పందేలను ఆడించారు.
నేతలు ఇచ్చిన ఊపుతో టీడీపీ కార్యకర్తలు, చోటామోటా నేతలు అదే స్టేడియంలో డింకీ పందేలకు తెరలేపారు. జిల్లావ్యాప్తంగా మెట్ట, డెల్టా ప్రాంతాల్లో సుమారు వంద బరులు సిద్ధమైనట్లు అంచనా.