
ఏలూరు (మెట్రో): జిల్లాలో రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు డ్రైవర్లు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని అప్పుడే ప్రమాదరహిత జిల్లాగా పశ్చిమను తీర్చిదిద్దగలుగుతామని జిల్లా రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్, ఏలూరు ఎంపీ మాగంటి బాబు అన్నారు. స్థానిక పోలీస్ కమ్యూనిటీ హాల్‌లో ఆదివారం జిల్లాస్థాయి రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్‌గా నియమితులైన ఎంపీను రవాణా శాఖాధికారులు ఘనంగా సత్కరించారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సత్యనారాయణమూర్తి దుశ్శాలువాతో ఎంపీను సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. రోడ్డు ప్రమాదాల్లో జిల్లా మొదటి స్థానంలో ఉందని ఈ పరిస్థితిని మార్చి పశ్చిమలో ప్రశాంత వాతావరణంలో ప్రయాణం సాగుతుందనే నమ్మకం కలిగించాలని ఎంపీ సూచించారు.
ప్రతి డ్రైవరూ విధినిర్వహణలో మద్యం సేవించకూడదని, అనుక్షణం అప్రమత్తతతో జాగ్రత్తగా వాహనాన్ని నడిపినప్పుడే ప్రమాదాలను నివరించవచ్చని సూచించారు. త్వరలోనే విజయవాడ–ఏలూరు జాతీయ రహదారి గోతులు లేకుండా పటిష్టంగా నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, పనులు వేగవంతంగా జరిగేలా చూస్తామని చెప్పారు. ఆర్టీసీ ఆర్‌ఎం ఎస్.ధనుంజయరావు, రవాణా శాఖాధికారులు నాగమురళి, సుమ, సిద్ధిక్, ప్రసాద్, ఎం.పౌల్‌రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment