విజయవాడ - గుంటూరు మధ్యే రాజధాని
- ఎంపీ మాగంటి బాబు
కైకలూరు : రాష్ట్ర రాజధాని విజయవాడ - గుంటూరు మధ్యే ఏర్పాటవుతుందని ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆటపాకలోని ఆయన నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాలకు మధ్యలో రాజధాని ఏర్పాటు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 14 కార్పొరేషన్లకు వంట గ్యాస్‌ను పైపుల ద్వారా సరఫరా చేసే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని అన్నారు. నియోజకవర్గాల అభివృద్ధికి రూ. 5కోట్ల ఎంపీ నిధులను ప్రభుత్వం కేటాయించిందన్నారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చలమలశెట్టి రామానుజయ్య మాట్లాడుతూ నందిగామలో దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్య పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టడం భావ్యం కాదన్నారు. పలువురు ఎంపీ మాగంటికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు సయ్యపురాజు గుర్రాజు, కెవిఎన్‌ఎం.నాయుడు, గంగునేని వరప్రసాద్, అట్లూరి భవానీ ప్రసాద్, గంగుల వెంకటేశ్వర రావు, నున్న కాళీవరప్రసాద్‌లు, నంగెడ్డ శివ తదీతరులు పాల్గొన్నారు.