అధికార అండతో బరితెగింపు | The ring of power with the backing of fearlessness | Sakshi
Sakshi News home page

అధికార అండతో బరితెగింపు

Published Thu, Jul 30 2015 3:30 AM | Last Updated on Fri, Aug 10 2018 4:31 PM

అధికార అండతో బరితెగింపు - Sakshi

అధికార అండతో బరితెగింపు

♦ కైకలూరు టౌన్‌హాల్‌లో పేకాట శిబిరం
♦ అనుమతులు లేకుండా నిర్వహణ
♦ పోలీసుల దాడిలో 9 మంది అరెస్టు
♦ గతంలోనే క్లబ్బుల ఏర్పాటును వ్యతిరేకించిన ఎమ్మెల్యే నాని
 
 కైకలూరు : అధికారం అండ.. ప్రజాప్రతినిధుల భరోసాతో పట్టపగలే పేకాట శిబిరాన్ని తెరిచేశారు. నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన కైకలూరు టౌన్‌హాల్‌లో బుధవారం పేకాట ఆడడానికి ప్రయత్నిస్తున్న తొమ్మిది మందిని కైకలూరు సీఐ జె.మురళీకృష్ణ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. వారం రోజులుగా ఈ తంతు జరుగుతున్నా పోలీసులకు తెలియదనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టౌన్‌హాల్ పూర్వం క్లబ్‌గా ఉండేది. తదనంతరం లెసైన్సును రద్దు చేశారు. 2014 ప్రారంభంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) గుడివాడ, కైకలూరులో క్లబ్‌లు తెరిస్తే ఆందోళన చేస్తానని చెప్పడంతో అప్పట్లో నాయకులు ఆ యోచన విరమించుకున్నారు.

స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ మాగంటి బాబుల వద్ద ప్రధాన అనుచరులుగా పేరుగడించిన కొందరు బడా వ్యాపారులు ఎట్టి పరిస్థితుల్లోనూ టౌన్‌హాలులో పేకాట ఆడతామని శపథం చేశారు. దీంతో ముందుగానే అక్కడ జనరేటర్‌ను ఏర్పాటు చేశారు. వారం రోజుల కిందట టౌన్‌హాలును శుభ్రం చేయించి, పేకాట కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వారం రోజులుగా రాత్రి వేళల్లో పేకాట ఆడుతున్నారు.

 బుధవారం కూడా వాహనాలతో టౌన్‌హాలుకు చేరుకున్నారు. వారం రోజుల తర్వాత విషయం తెలుసుకున్న పోలీసులు ముందుగా నలుగురు రాగా ఎవరూ లెక్కచేయలేదు. బయటి పట్టణాల్లో పేకాటకు వెళ్లాల్సి వస్తోందని, కొంచెం సహకరించండని సదరు వ్యక్తులు బతిమలాడటం కనిపించింది.

 పోలీసుల ముందే దర్జాగా...
 టౌన్‌హాలులో పేకాట నిర్వహణకు ఎటువంటి అనుమతులు లేవు. సీఐ జె.మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఎట్టకేలకు నాలుగు మండలాల నుంచి వచ్చిన పోలీసులు టౌన్‌హాలులో పేక ముక్కల బాక్సులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద రూ.1800 నగదు లభించిందని చెప్పారు. తమ బైకులు, కార్లలోనే పోలీసులతో కలసి స్టేషన్‌కు వెళ్లిన పేకాటరాయుళ్లు అనంతరం బెయిల్‌పై ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ ఘటనపై గుడివాడ డీఎస్పీ అంకినీడు ప్రసాద్‌ను వివరణ కోరగా టౌన్‌హాలులో పేకాడుతున్న విషయం తెలిసిన తర్వాత స్థానిక సీఐని అప్రమత్తం చేశామన్నారు. సీఐ మురళీకృష్ణను పేకాట శిబిరంపై వివరణ కోరగా పోలీసులు పుష్కరాల విధుల్లో ఉండటం వల్ల అడ్డుకోవడం ఆలస్యమైందన్నారు. ఎట్టిపరిస్థితుల్లో పేకాటను సాగనివ్వబోమని చెప్పారు. టౌన్‌హాలు వద్ద పోలీసులను గస్తీ పెడుతున్నట్లు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement