
కాంటూర్‌పై కప్పదాటు
►ప్రధాని మోదీని కలిసినా విషయాన్ని ప్రస్తావించని మాగంటి
► జిరాయితీ భూముల పంపిణీపైనే దృష్టి
► కొల్లేరు సమస్యలన్నీ పరిష్కారమైనట్టు ప్రకటనలు
► ఇలాగైతే కొల్లేటి వాసుల వ్యథలు తీరేదెన్నడో
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏలూరు ఎంపీ మాగంటి బాబు వ్యక్తిగతంగా కలిసే అవకాశం వచ్చింది. తన ఇంట జరిగే వివాహానికి హాజరుకావాల్సిందిగా కోరేందుకు మోదీని మాగంటి కలిశారు. ఆ సందర్భంగానైనా కొల్లేరు సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తారేమోనని కొల్లేరువాసులు భావించారు. ప్రధాని మోదీయే స్వయంగా కొల్లేరు సమస్యను గుర్తుకు తెచ్చినా.. మాగంటి బాబు మాత్రం అంతా పరిష్కారమైపోయిందని వ్యాఖ్యానించినట్టు వార్తలొచ్చాయి. జిరాయితీ భూముల పంపిణీకి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ సూత్రప్రాయంగా అంగీకరించారని మోదీకి బాబు చెప్పుకొచ్చారు. అయితే ప్రధాన సమస్య కాంటూర్ కుదింపుపై మాత్రం ప్రస్తావించిన దాఖలా కానరాలేదు. కొల్లేటి వాసుల అసలు సమస్యపై దృష్టి పెట్టకుండా జిరాయితీ భూముల పంపిణీ చేసి చేతులు దలుపుకునే పనిలో పాలకులు ఉన్నారన్న వాదనలు బయలుదేరాయి.
హామీ ఇచ్చి రెండేళ్లు గడచినా..
కొల్లేరు కాంటూర్ కుదింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చి రెండేళ్లు గడచినా కప్పదాటుగానే వ్యవహరిస్తున్నాయి. సరస్సును ఐదో కాంటూర్ నుంచి మూడో కాంటూర్‌కు కుదిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో సాక్షాత్తు నరేంద్ర మోదీతోపాటు చంద్రబాబునాయుడు సైతం హామీ ఇచ్చినా నేటికీ ఆచరణకు నోచుకోలేదు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మొక్కుబడిగా తీర్మానం చేసి చేతులు దులుపుకుంది. కేంద్రం కూడా ఇప్పటివరకు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. తాజాగా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కొల్లేరు నాయకులు కేంద్రమంత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. వానంతా మంత్రులను కలిసిన సందర్భాల్లో కేవలం జిరాయితీ భూముల సమస్యపై తప్ప కాంటూర్ కుదింపుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసిన దాఖలాలే కనిపించడం లేదు.
ప్రధాని జోక్యం చేసుకుంటేనే
పాలకులు కాంటూర్ కుదింపు చేపడితే సుమారు 76 వేల ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేయవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకుంటేనే కాంటూర్ కుదింపు సాధ్యమవుతుంది. కొల్లేరును కుదించి భూ పంపిణీ చేయాలంటే ప్రపంచ బ్యాంక్‌తో ముడిపడి ఉన్న ప్రపంచ పర్యావరణ సంస్థతోపాటు పర్యావరణ వేత్తలను ఒప్పించాలి. ఇందుకు సాక్షాత్తు ప్రధానమంత్రే చొరవ చూపాలి. మోదీని వ్యక్తిగతంగా కలిసే అవకాశం వచ్చినా ఇక్కడి నేతలు కొల్లేరు సమస్యలన్నీ పరిష్కారమైపోయినట్టు వ్యవహరించడం చూస్తుంటే కాంటూర్ కుదింపు ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది.
వైఎస్ హయాంలోనే పట్టాలిచ్చేందుకు శ్రీకారం
కొల్లేరు లంకగ్రామాల ప్రజలను నమ్మించేందుకు జిరాయితీ భూముల పట్టాల మంజూరు అంటూ పాలకులు కొత్త పల్లవి అందుకుంటున్నారు. వాస్తవానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జిరాయితీ భూముల పంపిణీకి శ్రీకారం చుట్టారు. సరిగ్గా ఆయన అకాల మరణానికి ముందు రోజు 2009 సెప్టెంబర్ 1న వైఎస్ కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలోని 7,500 ఎకరాల జిరాయితీ భూములు పంపిణీ ఫైల్‌పై సంతకం చేశారు. ఆయన హఠాన్మరణంతో ఆ ఫైల్‌ను పట్టించుకున్న నాథుడే లేకుండాపోయారు. ఫలితంగా కొల్లేరు ప్రజల ఆశలు నెరవేరలేదు. ఇన్నాళ్లకు పాలకులు అదే ఫైల్‌ను తెరపైకి తీసుకువచ్చి జిరాయితీ భూములున్న వారికి పట్టాలు పంపిణీ చేస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు.