సాగునీటి కోసమే నదుల అనుసంధానం
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
పల్లెర్లమూడి(నూజివీడు) : కృష్ణాడెల్టా ఆయకట్టుకు సాగునీటి కొరత తీర్చేందుకు ప్రభుత్వం గోదావరి-కృష్ణా నదుల అనుసంధానాన్ని చేపట్టిందని, ఈ క్రమంలోనే పట్టిసీమ ప్రాజెక్టును తీసుకువచ్చినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మం త్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గోదావరి జలాలను కృష్ణానదికి తరలించే కార్యక్రమంలో భాగంగా బుధవారం పశ్చిమగోదావరి-కృష్ణాజిల్లాల సరిహద్దు నూజివీడు మం డలం పల్లెర్లమూడి సమీపంలోని 119వ కిలోమీటరు వద్ద గోదావరి జలాలకు పోలవరం కాలువలో పూజలు నిర్వహించి కృష్ణాజిల్లాలోకి విడుదల చేశారు.
ఏలూరు ఎంపీ మాగంటి బాబు, దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌లతో కలసి మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం కాలువలోకి విడుదల చేసిన 500 క్యూసెక్కుల నీరు పల్లెర్లమూడి వద్దకు చేరుకోగా రైతులు హారతులు ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈనెల 15న ఇబ్రహీంపట్నం వద్ద గోదావరి జలాలను కృష్ణమ్మలో అనుసంధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారని తెలిపారు.
ఎంపీ మా గంటి బాబు మాట్లాడుతూ గోదావరి- కృష్ణా నదుల అనుసంధానంతో రైతాంగానికి సాగునీటి కష్టాలు తొలగిపోతాయన్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, పల్లెర్లమూడి సర్పంచి ఉషారాణి, ఎంపీపీ శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ సంధ్యారాణి, ఆర్డీవో రంగయ్య, తహశీల్దార్ ఇంత్యాజ్‌పాషా పాల్గొన్నారు.