జగన్ బాటలో చంద్రబాబు | TDP leaders to arrange a visit to the project Gundlakamma | Sakshi
Sakshi News home page

జగన్ బాటలో చంద్రబాబు

Published Thu, Apr 23 2015 3:22 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

జగన్ బాటలో చంద్రబాబు - Sakshi

జగన్ బాటలో చంద్రబాబు

‘నేనే మోనార్క్‌ని ... అంతా నాకే తెలుసు...నన్నే అందరూ అనుసరించాలి. దేశమే నన్ను ఆదర్శంగా తీసుకోవాలంటూ ’ అప్పుడప్పుడూ గొప్పలకు పోతున్న చంద్రబాబు గత ఎనిమిది నెలల పాలనలో అంతా కాపీ రాయుడిలా సాగింది. మోడీ చీపురు పట్టుకుంటే ఇక్కడ రెండు చీపుర్లు, పిల్లల్ని ఎక్కువ మందిని కనండహో అని కేకేస్తే ఏపీలో కూడా సంతానం పెంచండని పిలుపునిచ్చారు. తెలంగాణాలో రుణమాఫీ చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడా ‘నక్క వాతలు పెట్టుకున్నట్టు’గా  అంటించుకున్నా అసలు రంగు బయటపడుతూనే ఉంది.

ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ అంటే నేను కూడా అంటూ ఎగిరి గంతేశారు. షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుడితే బాబు కూడా బూట్లు తొడిగారు. తాజాగా జగన్ ప్రాజెక్టు బాట పడితే నారా వారు ‘నేనూ’ అంటూ సమాయత్తమవుతున్నారు. వెలుగొండ ప్రాజెక్టును జగన్ సందర్శించడంతో హడావుడిగా సీఎం షెడ్యూల్‌లో ‘ప్రాజెక్టు’ కొత్తగా వచ్చి చేరింది.

 
గుండ్లకమ్మ ప్రాజెక్టు సందర్శనకు టీడీపీ నేతల ఏర్పాట్లు
జగన్ పర్యటన మరుసటి రోజునే ముంపు బాధితులతో కలెక్టర్ సమావేశం
వెనువెంటనే మంత్రి దేవినేని ఉమా కూడా పరిశీలనలు
తాజాగా బాబు కూడా...
వైఎస్సార్ సీపీ కన్నెర్రతోనే ఈ ముచ్చెమటలంటున్న రైతులు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పట్టిసీమ పేరుతో మిగిలిన ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలను నుంచి అనూహ్య స్పందన రావడంతో అధికారపక్షంలో గుబులు మొదలైంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో కూడా ప్రాజెక్టులను సందర్శించే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. మొదట ముండ్లమూరు మండలం  పోలవరం గ్రామంలో నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా, తాజాగా గుండ్లకమ్మ ప్రాజెక్టు సందర్శన కూడా ముఖ్యమంత్రి పర్యటనలో వచ్చి చేరింది.

ఈ నెల 16న విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వెలుగొండ ప్రాజెక్టును సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. పునరావాస పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని ఎత్తి చూపించారు. దీంతో జగన్ పర్యటన ముగిసిన వెంటనే కలెక్టర్ మంపు బాధితులతో సమావేశాలు ఏర్పాటు చేసి యుద్ధప్రాతిపదికన పనులు చేపడతున్నట్లు ప్రకటించారు.

నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించి ఖరీఫ్‌కు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మద్దిపాడు మండలం మల్లవరంలో రూ. 592.18 కోట్లు వ్యయంతో 11,177 ఎకరాల విస్తీర్ణంలో 80,060 ఎకరాల ఆయకట్టును స్థిరీకరంచేందుకు గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. 2004లో వైఎస్ రాజశే ఖరరెడ్డి అధికారంలోకి రాగానే మూడు విడతలుగా విడుదల చేసిన నిధులతో 3.859 టీఎంసీల నీటి సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు.

మద్దిపాడు, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, చీమకర్తి, ఒంగోలు, అద్దంకి, ఇంకొల్లు మండలాల పరిధిలోని సుమారు 30 గ్రామాల పరిధిలోని 80,060 ఎకరాలను సాగులోకి తీసుకురావడం, ఆయా ప్రాంతాలలోని ప్రజలకు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. 21.795 కి.మీ పొడవున నిర్మించిన ఎడమ ప్రధాన కాలువ పరిధిలో 50 వేల ఎకరాలు, 27.262 కి.మీ పొడవున నిర్మించిన కుడి ప్రధాన కాలువ పరిధిలో 30 వేల ఎకరాలను సాగులోకి తీసుకురానున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మాణం గడువు ఈ సంవత్సరం జూన్ 30వ తేదీతో ముగియనున్నప్పటికీ భూవివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

నాగులుప్పలపాడు, ఇంకొల్లు మండలాల పరిధిలో దుద్దుకూరు, చదలవాడ, ఉప్పుగుండూరు, నాగులుప్పలపాడు పరిధిలో 62 ఎకరాల భూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో ఎలైన్‌మెంట్ మార్చాలని రైతులు పట్టుబడుతుండటంతో ఇవి ఇంకా పరిష్కారం కావలసి ఉంది. అధికారులు చొరవ తీసుకొని ఈ మధ్య కొన్ని గ్రామాలలో రైతుల సమస్యలను పరిష్కరించినప్పటికీ దుద్దుకూరులో ఇంకా 37 ఎకరాల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. వీటిని పరిష్కరించడంలో జరుగుతున్న జాప్యంవల్లే ప్రాజెక్టు పూర్తయినా సాగునీరు అందించలేని స్థితిలో ఉంది.

ముఖ్యమంత్రిని తీసుకువచ్చి ఖరీఫ్‌కు నీరు ఇస్తామని చెప్పించడం ద్వారా రైతుల పక్షాన తాము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం అధికార పక్షం నుంచి జరుగుతోంది. నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వారం రోజుల్లో వెలుగొండ పనులు ప్రారంభమవుతాయని చెప్పినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు పెంచకుండా, రైతులను పక్కదారి పట్టించేందుకే గుండ్లకమ్మ ప్రాజెక్టు సందర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు రైతులు విమర్శిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement