Gundlakamma project
-
బాబు అవినీతివల్లే ‘గుండ్లకమ్మ’కు నష్టం
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అవినీతి, అలసత్వంవల్లే గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు దిగువ భాగం కొట్టుకుపోయిందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టంచేశారు. 2014–19 మధ్య నిపుణులతో కూడిన డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ పలుమార్లు గుండ్లకమ్మ ప్రాజెక్టును తనిఖీ చేసిందని.. కొత్తవి ఏర్పాటుచేసి, గేట్లకు మరమ్మతు చేయాలని నివేదిక ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. కానీ, అప్పట్లో ఆ పనులు చేయకుండా.. తూతూమంత్రంగా పనులు చేపట్టి, రూ.5.15 కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని ఆరోపించారు. ఆ నిధులను నిపుణుల కమిటీ సూచించిన పనులకు వెచ్చించి ఉంటే ఇప్పుడు గేట్లు కొట్టుకుపోయేవే కావన్నది వాస్తవం కాదా? అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును అంబటి ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. బాబుది నీచ మనస్తత్వం.. మిచాంగ్ తుపానువల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి సీఎం జగన్ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబు బురదజల్లుతూ నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఎల్లో మీడియా దిగజారుడు రాతలు రాస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేసిన సాయం కంటే ఇప్పుడు సీఎం జగన్ ఎక్కువ సాయం చేస్తున్నారు. పవన్‌ను చంద్రబాబే ఓడిస్తాడు.. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ జెండాలు పట్టుకుని తిరిగిన చోట కాంగ్రెస్ భూస్థాపితమైంది. మరోవైపు.. పవన్ పార్టీకి కూకట్పల్లి మినహా ఒక్కచోట కూడా డిపాజిట్ రాలేదు. వీళ్లు ఇప్పుడు ఇక్కడికొచ్చి డప్పాలు కొట్టుకుంటున్నారు. ఎలక్షన్లలో జనసేనకు చంద్రబాబు ముష్టివేసినట్లు సీట్లు వేస్తాడు.. అక్కడ జనసేనకు అభ్యర్థులు లేకపోతే టీడీపీ వారే తమ అభ్యర్థుల్ని అందులోకి ప్రవేశపెడతారు. ఇక పవన్‌ను చంద్రబాబే తుక్కుతుక్కుగా ఓడిస్తాడు. టీడీపీ, జనసేన క్యాన్సర్ గడ్డ కంటే ప్రమాదకరమైనవి. -
గుండ్లకమ్మ రెండో గేటు స్థానంలో స్టాప్‌లాగ్ గేటు
సాక్షి, అమరావతి: టీడీపీ సర్కార్ అవినీతి, నిర్వహణ లోపంతో తుప్పుపట్టి వరద ఉధృతికి కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు స్థానంలో అధికారులు సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆదివారం హుటాహుటిన స్టాప్‌లాగ్ గేటును ఏర్పాటుచేశారు. దీంతో ప్రాజెక్టులో 0.75 టీఎంసీలు కడలిపాలు కాకుండా అడ్డుకట్ట వేశారు. ప్రాజెక్టులో 1.1 టీఎంసీల నిల్వకు మార్గం సుగమం చేశారు. నీరు నిల్వ ఉన్నా.. వరద కొనసాగుతున్నా.. మిచాంగ్ తుపాను ప్రభావంవల్ల ప్రకాశం జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలతో గుండ్లకమ్మ వరదెత్తింది. ఈ ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరగడంతో అప్పటికే తుప్పుపట్టిన రెండో గేటు 8న కొట్టుకుపోయింది. నిజానికి.. ఇలా కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటుచేయాలంటే సాధారణంగా ప్రాజెక్టులో నీటిని ఖాళీచేస్తారు. డెడ్ స్టోరేజీ స్థాయికి నీటినిల్వ చేరాక.. వరద ప్రవాహం తగ్గాక స్టాప్‌లాగ్ గేటును ఏర్పాటుచేస్తారు. కానీ.. ప్రాజెక్టులో నీరునిల్వ ఉన్నా.. వరద కొనసాగుతున్నా.. సీఈ మురళీనాథ్‌రెడ్డి సారథ్యంలో అధికారులు శ్రమించి కొట్టుకుపోయిన రెండో గేటు స్థానంలో ఒక్కో ఎలిమెంట్‌ను దించుతూ స్టాప్‌లాగ్ గేటును విజయవంతంగా ఏర్పాటుచేశారు. -
గుండ్లకమ్మ నుంచి ఖరీఫ్‌కు నీరిస్తాం
మద్దిపాడు: వచ్చే రబీ సీజన్‌కల్లా గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్‌కు, వచ్చే రబీ సీజన్లో పంటలకు ప్రాజెక్టు నుంచి నీరందిస్తామని, తాగు నీరు కూడా అందిస్తామని తెలిపారు. ఆయన శనివారం ప్రకాశం జిల్లాలోని కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశయాన్ని పరిశీలించారు. గడ్డర్లు ఊడిపోయిన మూడో గేటును పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిజర్వాయర్‌లో నీటిని 1.25 టీఎంసీలకు తగ్గించి పనులు చేస్తామన్నారు. సాగు నీటి సరఫరాకు ఏ ఇబ్బందీ కలగదని, అవసరమైతే సాగర్ కాలువల ద్వారా రిజర్వాయర్ నింపుతామని తెలిపారు. మూడో నంబర్ గేటుతో పాటు మరో తొమ్మిది గేట్లకు మరమ్మతులు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారన్నారు. ఈ పనులకు కాంట్రాక్టర్‌ను కూడా ఖరారు చేశామని చెప్పారు. నీరు కిందకు పోవడంవల్ల రైతులకు నష్టం జరుగుతోందంటూ టీడీపీ అధినాయకుడి డైరెక్షన్లో పచ్చ పత్రికలు వికృత భాషలో వండి వారుస్తున్నాయని మండిపడ్డారు. గేటు విరగడం నిన్న, మొన్న జరిగింది కాదని, 2014 – 19 మధ్య టీడీపీ ప్రభుత్వం రిజర్వాయర్‌కు మరమ్మతులు చేయించలేదని తెలిపారు. వారి హయాంలో మరమ్మతులకు రూ.6 కోట్లు మంజూరు చేయించుకుని గేట్లు, స్పిల్‌వేను పట్టించుకోలేదని చెప్పారు. ఆ డబ్బుతో రిజర్వాయర్ వద్ద బ్యూటిఫికేషన్, గెస్ట్ హౌస్‌లు అంటూ టీడీపీ నేతలు కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. పచ్చ పత్రికలకు ఇవేమీ కనిపించవని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పులిచింతలలో కొట్టు కుపోయిన గేటు రిపేరు చేస్తున్నామన్నారు. డ్యాములకు రిపేర్లు రావడం ఈ రోజు వచ్చిన సమస్య కాదని చెప్పారు. గత ప్రభుత్వం డ్యాముల నిర్వహణను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. అన్ని డ్వామ్‌లకు మరమ్మతులు చేపడతామని అన్నారు. రాష్ట్రానికి ఏ పరిశ్రమ రాకూడదని ప్రతిపక్షం కుట్రలు పన్నుతోందన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ రాకుండా కేంద్రానికి టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడు పర్యావరణ ఇబ్బందులు వస్తాయంటూ లేఖలు రాస్తున్నారని, ఇదేం పద్ధతని ప్రశ్నించారు. మూడు రాష్ట్రాలకు మాత్రమే డ్రగ్ పార్కులకు అవకాశం దక్కిందన్నారు. డ్రగ్ పార్క్ ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, వేలాది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. అటువంటి ప్రాజక్టును అడ్డుకోవడం వారి దుర్బుద్ధికి నిదర్శనమని చెప్పారు. -
టూరిస్ట్ హబ్ కానున్న ప్రకాశం
సాక్షి, ఒంగోలు మెట్రో: ఎన్నో చారిత్రక, సాంస్కృతిక విశిష్టతలున్న జిల్లా పర్యాటక రంగం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వం అసలు పట్టించుకోని పర్యాటక విభాగాన్ని తొలి ఏడాదిలోనే పట్టించుకుని తొలి విడత మూడు ప్రాంతాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. విడతల వారీగా జిల్లాలోని అన్ని చారిత్రక, సాంస్కృతిక విశిష్టతలను గుర్తించి అభివృద్ధి చేసి జిల్లాను టూరిస్ట్ హబ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. మూడు ప్రాంతాల ఎంపిక.. జిల్లాలో తొలి విడతగా 2019–20 వార్షిక సంవత్సరానికి గాను మూడు ప్రాంతాలను పర్యాటక అభివృద్ధి కోసం ఎంపిక చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రాంతం, దాని సమీపంలోని అన్నంగి ప్రాంతంతో పాటు కొత్తపట్నం సముద్రతీరాన్ని కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సర్వే శాఖ అధికారులను సర్వే చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ ఆదేశించారు. అయితే, ఈ మూడు ప్రాంతాలనూ ప్రభుత్వ ప్రవేటు భాగస్వామ్యంతో ప్రత్యేక కన్సల్టెంట్స్తో అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద బోటు షికారు ఇప్పటికే ఉన్నప్పటికీ అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. తద్వారా పర్యాటకులను ఆకర్షించేందుకు, ఆ ప్రాంతాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు త్వరలో చర్యలు చేపట్టనున్నారు. ఇక గుండ్లకమ్మలో బోటు షికారు కోసం బోట్ల సంఖ్య కూడా పెంచనున్నారు. అన్నంగి ప్రాంతంలో 13 ఎకరాలలో ప్రత్యేకంగా పర్యాటక శాఖ సహకారంతో అభివృద్ధి చేసి అన్నంగి కొండ మీద ఒంగోలు గిత్త పెద్ద ప్రతిమను ఏర్పాటు చేసి ఈ ప్రాంత విశిష్టతను పర్యాటకులకు తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి సర్వే చేసి సూచనలు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తపట్నం బీచ్‌లో వసతులు.. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఎంపిక చేసిన మూడు ప్రాంతాల్లో కొత్తపట్నం బీచ్ ఒకటి. సందర్శకులకు సరైన వసతి సౌకర్యాలు కల్పించి తీర ప్రాంతం పర్యాటకులకు ఆహ్లాదం కలిగేట్టు తీర్చిదిద్దనున్నారు.కలెక్టర్ సూచనలను అనుసరించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇలా తొలి విడతగా ఈ మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసి సందర్శకుల సంఖ్య పెంచటం లక్ష్యంగా తద్వారా పర్యాటక ప్రాంతంగా జిల్లాను తీర్చిదిద్దేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
ఎమ్మెల్యే సారూ.. ఏంటిదీ!
సాక్షి, ఒంగోలు అర్బన్: ప్రజల సమక్షంలో నగరాభివృద్ధి జపం చేసే స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్.. తెరవెనుక మాత్రం అభివృద్ధి కంటే అయినవారే ముఖ్యం అన్నట్లు కోట్లాది రూపాయలు వారికి దోచిపెడుతున్నారు. అందుకు ప్రతిగా లక్షల్లో ముడుపులు తీసుకోవడంతో నాటి కమిషనర్.. ఎమ్మెల్యే పావులు కదిపారు. నగరపాలక సంస్థ తరఫున చేసే ప్రతిదానికి నాటి నగరపాలక కమిషనర్‌ను ఎమ్మెల్యే అడ్డుపెట్టి కోట్ల రూపాయాలు ప్రజాధనం వాటాలు వేసుకుని పంచుకున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నారు. అమృత్ పథకం ద్వారా రూ.140 కోట్లతో గుండ్లకమ్మ పైపులైను నిర్మాణ పనులు చేపట్టి సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి కాకపోవడం వెనుక ఎమ్మెల్యే, కమిషనర్ల పాత్ర బట్టబయలు అయింది. నష్టపరిహారం పేరుతో నిర్మాణ పనులు నిలుపుదల చేయించారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. పైపు లైన్ పనులు కాంట్రాక్టర్‌కు అప్పంగించడంలో దామచర్ల కొత్తగా నిర్మించతలపెట్టిన నివాసం సదరు కాంట్రాక్టర్‌తో నిర్మించేలా ఒప్పందం చేసుకున్నారని తీవ్రమైన విమర్శలు అప్పట్లో వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆయన లబ్ధి పొందడంతో పాటు పైపు లైనుకు సంబంధించి ఆయన అనుచరులకు కూడా కోట్లు కుమ్మరించేలా నాటి కమిషనర్‌తో కలిసి చతురత చూపారని నగరవాసులు గుసగుసలాడుతున్నారు. మాజీ ఏఎంసీ చైర్మన్ అడ్డుకోవడంతో.. గుండ్లకమ్మ పైపు లైను పనుల్లో భాగంగా హైవే నుంచి నగరంలోని వెంకటేశ్వర కాలనీ ద్వారా సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు వరకు 1200 డయాతో నిర్మాణం జరుగుతోంది. స్థానిక ప్రజలు పైపు లైను నిర్మాణాలకు సంబంధించి కావాల్సిన స్థలాన్ని స్వచ్ఛందంగా ఉచితంగా అందజేశారు. కాలనీలో స్థల సేకరణ అయిన మేరకు పబ్లిక్ హెల్స్ డిపార్టుమెంట్ పైపులైను పనులు చేసింది. అయితే అక్కడే ఉన్న ఎమ్మెల్యే అనుచరునిగా ఉన్న మాజీ ఏఎంసీ చైర్మన్‌తో పాటు మరోవ్యక్తి సంబంధించిన స్థలం ఇవ్వకుండా పైపులైను నిర్మాణ పనులను అడ్డుకున్నారు. దీంతో కోట్ల రూపాయలతో తలపెట్టిన గుండ్లకమ్మ పైపులైను పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నష్ట పరిహారం ఇస్తేనే స్థలం ఇస్తామని టీడీపీకి చెందిన ఎమ్మెల్యే అనుచరుడు మెలిక పెట్టడంతో అధికారులు దిక్కుతోచని పరిస్థితులో పడ్డారు. తర్వాత నష్టపరిహారం ఇప్పించేందుకు ఎమ్మెల్యేతో సెటిల్మెంట్ కాకపోవడంతో సదరు అనుచరుడు ఎమ్మెల్యే మధ్య కొంతకాలం గ్యాప్ కూడా వచ్చింది. 25 సెంట్లకు కోటి రూపాయలు అయితే ఎన్నికలు సమీపిస్తుండటంతో అనుచరుడి వ్యతిరేకత లేకుండా చూసుకునేందుకు అధికారం అడ్డుపెట్టుకొని లోపాయికారిగా ఒప్పందం చేసుకుని ఏకంగా రూ.1,07,73,840 నష్టపరిహారం ఇవ్వాలంటూ గత నెల 25వ తేదీ జీఓ నంబర్ 136ను విడుదల చేశారు. అయితే పరిహారం ఓఎంసీ నుంచి కాకుండా పైపులైన్ పనుల నిధుల నుంచి ఇవ్వాలని జీఓలో పేర్కొవడం గమనార్హం.ఇదిలా ఉంటే పనులు ఆలస్యం కావడంతో ప్రాజెక్టు అంచనాలు పెరిగే అవకాశం ఉంది. పైగా ఈ నిధుల నుంచే కోటి తగ్గిపోవాల్సిన పరిస్థితి. ఇదే జరిగితే పనులు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులే అంటున్నారు. నష్టపరిహారం చెల్లించే విషయంలో ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ పరిశీలస్తుండగా ఆయనతో పనికాదని తెలిసి ఎమ్మెల్యే జీవో విడుదల చేయించారనే ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానికులు మండిపడుతున్నారు. తమ అందరి వద్ద నగరాభివృద్ధి పేరుతో స్వచ్ఛందంగా ఇవ్వాలని అడిగి తీసుకుని ఇప్పుడు ఎమ్మెల్యే మనుషులకు కోట్లలో నష్టపరిహారం ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమకు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టును ఆశ్రయిస్తామని స్థానికులంటున్నారు. నేడో రేపో జిల్లా కలెక్టర్‌ను కలుస్తామంటున్నారు. పైపులైన్ పనులు నిర్వహిస్తున్న పబ్లిక్ హెల్త్ అధికారులు మాత్రం తమకు పైపులైన్ నిర్మాణం నిలిచిపోయింది 70 మీటర్ల పొడవు, 2మీటర్ల వెడల్పు స్థలం వద్ద మాత్రమే అన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం 5 లేదా 6 సెంట్లు అవసరం. నగరపాలక టౌన్‌ప్లానింగ్ అధికారులు తమకు ఆస్థలం చూపిస్తే నిర్మాణం చేపడతామంటున్నారు. అసలు చరిత్ర ఇలా.. గతంలో జాతీయ రహదారి నుంచి వెంకటేశ్వర కాలనీకి వెళ్లాలంటే హైవేకు పడమరగా ఉడ్ కాంప్లెక్స్ ద్వారా వెళ్లి అక్కడి నుంచి ఉత్తరం వైపుగా కొంతదూరం ఆ తర్వాత పడమర వైపుగా తిరిగి వెళ్లాల్సి వచ్చేది. 2001–2002 సమయంలో అన్ని మెలికలు లేకుండా నేరుగా రోడ్డు ఉండేలా అక్కడి రైతులు, స్థానికులు 20 అడుగుల వెడల్పుతో రోడ్డును ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలో సదరు ఎమ్మెల్యే అనుచరుడు కూడా ఆ రోడ్డు కోసం స్థలం ఇచ్చాడు. కాలక్రమేణా సిమెంట్ రోడ్డుగా కూడా మారింది. అక్కడి ప్రజలు స్థలాలు, పొలాలు క్రయ విక్రయాలు జరిపితే షెడ్యూల్లో హద్దుల్లో ఆ రోడ్డును పలకరిస్తున్నారు. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన షెడ్యూల్లో కూడా రోడ్డును హద్దులుగా గుర్తించారు. ఇప్పుడు పైపులైను నిర్మాణం కోసం రోడ్డు నుంచి 2 మీటర్ల వరకు అదనపు వెడల్పు అవసరం కావడంతో స్థానికులు స్వచ్ఛందంగా అందించారు. దీంతో పైపులైన్ పనులను ఆదునుగా భావించిన ఎమ్మెల్యే అనుచరుడు మాత్రం స్థలం ఇవ్వకుండా అడ్డుకున్నాడు. దీంతో ఎమ్మెల్యే, నాటి కమిషనర్లు దాదాపుగా రూ.20 లక్షలకు ఒప్పందం చేసుకుని ప్రత్యేక అధికారి ద్వారా నష్టపరిహారం కోసం ప్రభుత్వానిక సిఫార్సు చేసినట్లు సమాచారం. అయితే ప్రత్యేక అధికారి పరిశీలనలో ఉండగానే జీఓ విడుదల అయింది. అయితే పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్ నిలిచిపోయిన పైపులైన్ తాలుకు స్థల విస్తీర్ణం సుమారు. 5 నుంచి 6 సెంట్లు ఉండగా జీఓలో 25 సెంట్లు పేర్కొనడంతో గతంలో రోడ్డుకు ఇచ్చిన స్థలానికి కూడా నష్టపరిహారం ఇస్తున్నట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఓఎంసీ కమిషనర్ ఏమన్నారంటే.. జీవో ప్రకారం నష్టపరిహారం చెల్లించేందుకు 25 సెంట్లు స్థలం ఉంది. ల్యాండ్ ఎక్విజిషేన్ కింద ఎంత ఉందనేది సంబంధిత అధికారులను అడిగి చెప్తాను. అయితే వారు అందుబాటులో లేనందున చెప్పలేకపోతున్నా. స్థలం చూపాలి, పబ్లిక్ హెల్త్ ఈఈ పైపులైన్ నిర్మాణ పనులకు సంబంధించి 70 మీటర్ల పొడవు 2 మీటర్ల వెడల్పు స్థలానికి సంబంధించి పనులు నిలిచిపోయాయి. నగరపాలక సంస్థ ఆ స్థలం చూపితే పనులు ప్రారంభం అవుతాయి. స్థలం చూపాల్సిన బాధ్యత నగరపాలక సంస్థది. -
ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కక్ష.. ఆ నియోజకవర్గాలపై వివక్ష..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎమ్మెల్యే అంటే హోదా, గౌరవం. ఎమ్మెల్యేలకు హక్కులతో పాటు బాధ్యతలూ ఉంటాయి. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. అయితే చంద్రబాబు ఐదేళ్ల పాలన అందుకు భిన్నంగా నడిచింది. బాబు అలా నడిపించారు. ఆయన పాలన నియంతృత్వ పోకడలను తలపించింది. ఎమ్మెల్యేల హక్కులను, బాధ్యతలను కాలరాసింది. ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినా ప్రభుత్వ పరంగా నియోజకవర్గాలకు కేటాయించిన నిధులు వారి ప్రతిపాదనల ద్వారానే ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ఖర్చు చేయాల్సి ఉంది. ఇది ఆనవాయితీ కూడా. అయితే గత ఐదేళ్లలో చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకే హక్కులు, బాధ్యతలు కల్పించిన బాబు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను పూచిక పుల్లల్లా చూశారు. వారికి నిధులు ఇవ్వలేదు. బాధ్యతలు పంచలేదు. ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై వివక్ష చూపించారు. వారికి ఇవ్వాల్సిన నిధులను ఆ నియోజకవర్గంలో ఓడిపోయిన ఎమ్మెల్యేల పేరున ఏకంగా జీవోలే జారీ చేసి మంజూరు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల గౌరవానికి భంగం కలిగించారు. ప్రజా తీర్పును అగౌరవ పరిచారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిధులివ్వకపోగా ప్రలోభాలు జిల్లాలో మార్కాపురం, యర్రగొండపాలెం, సంతనూతలపాడు, గిద్దలూరు, కందుకూరు, అద్దంకి నియోజకవర్గాల్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జంకె వెంకటరెడ్డి, డేవిడ్ రాజు, ఆదిమూలపు సురేష్, ముత్తుమల అశోక్‌రెడ్డి, పోతులరామారావు, గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా ప్రలోభాలకు గురిచేయడంతో మార్కాపురం, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు జంకె, సురేష్ మినహా మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి ఏ ప్రతిపాదనలు ఇచ్చినా ప్రభుత్వం వాటిని పక్కన బెట్టింది. దీంతో ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటుపడింది. జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను సైతం ఏకపక్షంగా అమలు చేశారు. అభివృద్ధి పనులు వారు సూచించిన చోటే చేపట్టారు. స్థానిక శాసన సభ్యులు ప్రతిపాదనలిచ్చినా అ«ధికారపార్టీ నేతల ఒత్తిడితో అధికారులు వాటిని పక్కన పెట్టేశారు. దీంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో అభివృద్ది పనులు కుంటు పడ్డాయి. మరోవైపు ఓడిపోయిన వ్యక్తుల పేరున అభివృద్ధి పనులకు సంబంధించి ఏకంగా జీఓలు జారిచేసి చంద్రబాబు సర్కారు కొత్త ఆచారానికి తెరలేపడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రాజెక్టులపై నిర్లక్ష్యం ♦ మార్కాపురం నియోజకవర్గంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు దాదాపు నిలిచిపోయాయి. టన్నెల్–1 పనులు రెండు నెలలుగా పూర్తిగా నిలిచిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఇక ఈ ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ, పునరావాసం పనులు ఎప్పుడో ఆగిపోయాయి. మార్కాపురం శివారులోని సుందరయ్య కాలనీ ప్రాంతంలో 350 మంది పేదలు ఏళ్ల తరబడి నివసిస్తున్నారు. వీరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అధికారులకు పలుమార్లు విన్నవించడమే కాకుండా అసెంబ్లీలో సైతం ఎమ్మెల్యే మాట్లాడినా పట్టించుకోలేదు. పొదిలి మండలం కేశవాపురం, మార్కాపురం మండలం పెద్దనాగులవరంలలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములున్నా నిరుపయోగంగా మారాయి. వాటి అభివృద్ధిని ప్రభుత్వం గాలికొదిలింది. పొదిలి టౌన్, రూరల్ పరిధిలో ప్రజలకు తాగునీరు అందించేందుకు రూ.52 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో గతంలో ప్రతిపాదనలు పంపగా చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కన పెట్టింది. ఎమ్మేల్యే పలుమార్లు కోరినా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించలేదు. ♦ సంతనూలపాడు నియోజకవర్గంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలో పునరావాస పనులు పెండింగ్‌లో ఉన్నాయి. చంద్రబాబు సర్కారు నిధులు ఇవ్వకపోవడంతో ఈ పనులు పూర్తికాలేదు. ప్రాజెక్టు పరిధిలో కాలువ పనులు సైతం పూర్తి కాకపోవడంతో ప్రాజెక్టుకి నీరు చేరినా సక్రమంగా పొలాలకు చేరే పరిస్థితి లేదు. బోడపాలెం, బొడ్డూరిపాలెం రోడ్లు చాలాకాలంగా అభివృద్ధికి నోచుకోలేదు. నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి సమస్య ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. సంక్షేమ పథకాలకు సంబంధించి పింఛన్లు, రేషన్ కార్డులు, పక్కా గృహాలు అరకొరగా కూడా మంజూరు చేయలేదు. ఎమ్మెల్యే ప్రతిపాదనలు ఇచ్చినా అధికార పార్టీ ఒత్తిళ్లతో అధికారులు పట్టించుకోవడంలేదు. ఎమ్మెల్యేలు నేరుగా నిధులు అడిగినా పట్టించుకోని బాబు వైఎస్సార్ సీపీ శాసనసభ్యులున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులివ్వాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సురేష్, జంకె ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం కోరారు. ఒక్కో నియోజకవర్గంలో పనులకు రూ.4 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చారు. అయినా కూడా ముఖ్యమంత్రి స్పందించలేదు. -
ఓటు కోసం 70 కి.మీ ప్రయాణం..!
సాక్షి, అద్దంకి (ప్రకాశం): గుండ్లకమ్మ పునరావాస కాలనీల ప్రజల కష్టాలను తీర్చే విషయంలో ప్రభుత్వానికి తీరిక దొరకలేదు. పునరావాస కాలనీల్లో నివసించే ప్రజలు అసౌకర్యాల నడుమ అల్లాడుతున్నారు. అది అలా ఉంచితే.. ముంపు గ్రామాల ప్రజలు ఓటు వేసి ఇంటికి చేరుకోవడానికి 70 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. అద్దంకి మండలంలోని ఉత్తర ధేనువకొండ గ్రామాన్ని గుండ్లకమ్మ ముంపు గ్రామంగా ప్రకటించారు. పునరావాసం కోసం అద్దంకి పట్టణ సమీపంలోని కొంగపాడు వద్ద బలరామకృష్ణపురం, వేలమూరిపాడు గ్రామ సమీపంలో వైఎస్సార్ పునరావాస కాలనీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ కాలనీల్లో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించకపోవడంతో చాలా మంది పాత ధేనువకొండలో నివాసం ఉంటున్నారు. రెండు కాలనీల్లో 120 కుటుంబాలకు చెందిన 250 మంది ఓటర్లు పునరావాస కాలనీల్లో అరకొర వసతుల మధ్య జీవనం సాగిస్తున్నారు. పంచాయతీ లేదు.. బూత్ లేదు పునరావాస కాలనీల్లో నివాసం ఉండే ఓటర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక బూత్ ఏర్పాటు చేయలేదు. ప్రత్యేక పంచాయతీగా గుర్తించకపోవడంతో వారు ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు రానూపోనూ 70 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు. పునరావాస కాలనీలో పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
గుండ్లకమ్మను పూర్తిచేసింది వైఎస్సారే..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో గుండ్లకమ్మ ప్రాజెక్టు పట్టించుకోకపోతే దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు పనులను పూర్తి చేసి జాతికి అంకితం చేశారని వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెప్పారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం అద్దంకిలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు ఎన్నికలొచ్చినప్పుడల్లా టెంకాయలు కొట్టడం తప్ప ప్రాజెక్టు నిర్మాణాన్ని పట్టించుకోలేదన్నారు. వైఎస్ హయాంలో ప్రాజెక్టును పూర్తి చేశారన్నారు. మిగిలి ఉన్న రూ.13 కోట్ల పనులను కూడా నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. దీంతో కుడి కాలువ పరిధిలో 52 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా 5 వేల ఎకరాలకు నీళ్లు అందే పరిస్థితి లేదన్నారు. ఎడమ కాలువ పరిధిలో 28 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా 12 వేల ఎకరాలకు నీరు చేరడం లేదన్నారు. రూ.13 కోట్ల పనులు మిగిలి ఉంటే అప్పుడు అంచనాలను రూ.160 కోట్లకు పెంచుకున్నారని వైఎస్.జగన్ విమర్శించారు. రూ.170 కోట్లతో భవనాశి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టాలని వైఎస్ హయాంలో భూసేకరణ చేశారన్నారు. బాబు నాలుగేళ్ల పాలనలో ప్రాజెక్టును గాలికొదిలేశారన్నారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం సాగర్ ఆయకట్టు కింద వరి పంటకు నీళ్లివ్వడం లేదన్నారు. తెలంగాణలో వరుసగా వరి పంటకు నీళ్లు ఇస్తుంటే.. మన సర్కారు మాత్రం మొండి చేయి చూపించిందన్నారు. కేసీఆర్‌కు ఉన్నదేమిటి... మన ముఖ్యమంత్రికి లేనిదేమిటని... రైతులు ప్రశ్నిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. జిల్లాలో కందులను కొనే పరిస్థితి లేదన్నారు. మద్దతు ధర ఇవ్వకపోవడంతో కందులను రూ.4 వేలకు టీడీపీ దళారులకు అమ్ముకోవాల్సి వస్తుందని వైఎస్ జగన్ విమర్శించారు. వారి వద్ద లంచాలు తీసుకొని ప్రభుత్వం మద్దతు ధరకు కందులను కొనుగోలు చేస్తోందని ఆయన విమర్శించారు. జిల్లాలో 98 శాతం తక్కువ వర్షపాతంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదన్నారు. అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త గరటయ్య మాట్లాడుతూ బాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో వర్షాలు పడవన్నారు. రాష్ట్రం బాగుండాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. అప్పుడే రైతులకు మేలు జరుగుతుందన్నారు. అద్దంకి నియోజకవర్గంలో అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు బాచిన కృష్ణచైతన్య, వై.వి.భద్రారెడ్డి, అట్ల చినవెంకటరెడ్డి, శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, యువజన విభాగం అధ్యక్షుడు రామానాయుడు, ఒంగోలు నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ వ్యవస్థకు తూట్లు పొడిచిన చంద్రబాబు బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థకు తూట్లు పొడిచి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం బాబు ప్రత్యేక హోదాను పక్కనపెట్టి ప్యాకేజీకి ఒప్పుకున్నాడన్నారు. హోదాతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్నారు. హోదా కోసం బాబు చిత్తశుద్ధితో సహకరించకపోతే ఆయన్ను జనం క్షమించరన్నారు. జగన్ పాదయాత్ర చూసి టీడీపీ నేతలు తమ పీఠాలు కదిలిపోతాయని బెంబేలెత్తుతున్నారన్నారు. ఆది నుంచి హోదా కోసం వైఎస్సార్సీపీ వైఎస్ జగన్ నేతృత్వంలో దశలవారీగా ఉద్యమాలు చేస్తూ వస్తోందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రత్యేక హోదాతోనే ముడిపడి ఉందన్నారు. హోదా సాధన కోసం ఈ నెల 1న కలెక్టరేట్ల ఎదుట ధర్నా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 5న ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపడుతున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఎంపీలు రాజీనామాలు చేస్తారన్నారు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదని మోపిదేవి విమర్శించారు. పైగా హోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారన్నారు. అవినీతి కేసుల కోసం భయపడే చంద్రబాబు హోదా అడగడం లేదన్నారు. సీబీఐ ఎంక్వయిరీలు, జైలుకు పంపుతారేమోననే భయంతోనే బాబు హోదాను పక్కనపెట్టారన్నారు. బాబు అవినీతికి, ద్వంద్వ నీతికి గుణపాఠం చెప్పే రోజు దగ్గర పడిందన్నారు. -
అధికారంలోకొస్తే.. వెలిగొండ పూర్తి చేస్తాం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అందరి ఆశీస్సులు, దీవెనలతో అధికారంలోకి వస్తూనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి అందరి మన్ననలు అందుకుంటానని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శనివారం మధ్యాహ్నం కనిగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిం చారు. జిల్లాలోని రామతీర్థం, గుండ్లకమ్మ ప్రాజెక్టులనిర్మాణం ప్రారంభించి పూర్తి చేసింది దివంగత నేత వైఎస్సార్ అన్నారు. రామతీర్థం ద్వారా కనిగిరి, కందుకూరు ప్రాంతా లకు తాగునీరిచ్చిన ఘనత ఆయనదేనన్నారు. వెలి గొండ ప్రాజెక్టు పనులు వైఎస్ హయాంలోనే వేగంగా జరిగాయన్నారు. 18 కి.మీ. ఉన్న టన్నెల్–1 పనులను వైఎస్ హయాంలో 13 కి.మీ., అంతే పొడవున్న టన్నెల్–2 పనులను 9 కి.మీ. మేర పూర్తి చేశారన్నారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు పట్టుమని 4 కి.మీ. పనులు కూడా పూర్తి చేయలేదన్నారు. చంద్రబాబు పాలనలో ప్రజల ఇబ్బందులు: తొలుత పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నాలుగేళ్ల పాటు చంద్రబాబు పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందే పరిస్థితి లేదన్నారు. అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే పథకాలను పంచిపెడుతున్నారని విమర్శించారు. ప్రజల కష్టాలు చూసి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. యాత్ర ద్వారా ప్రజా సమస్యలను గుర్తించి నాడు వైఎస్ తరహాలో వాటి పరిష్కారానికి జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తారన్నారు. వైఎస్ పాలన రావాలంటే జగన్మోహన్రెడ్డి ముఖ్య మంత్రి కావాలన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి జగన్ కృషి చేస్తారన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తూనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ తాగునీటి సమస్య: కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్ మాట్లాడుతూ కనిగిరి ప్రాంత ప్రజలు వరుస కరువులతో అల్లాడిపోతున్నారన్నారు. ప్రతి గ్రామంలోనూ తాగు, సాగునీరు సమస్య ఉందన్నారు. ఫ్లోరైడ్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే కొంత మేర ఉపశమనం లభిస్తుందన్నారు. వైఎస్.జగన్ ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంత సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ డి.సి గోవిందరెడ్డి, సమన్వయకర్తలు ఐ.వి.రెడ్డి, తూమాటి మాధవరావు, పార్టీ నేతలు ఎం.ఎం.కొండయ్య, గంగాడ సుజాత, వైఎం ప్రసాదరెడ్డి, రంగనాయకులు రెడ్డి, ఎస్కె బుజ్జి, బొల్లా మాల్యాద్రి చౌదరి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. హోదా సాధించే వరకు పోరాటం: ఎంపీ వైవీ ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ నాలుగేళ్ల టీడీపీ పాలనలో అబద్ధపు హామీలతో అన్ని వర్గాల ప్రజలను మోసగించారన్నారు. ప్రజల కష్టాలను చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అవినీతిమయం చేశాడన్నారు. పార్లమెంట్ హామీలను అమలు చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. హోదా రాకపోవడంతో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తుందన్నారు. చంద్రబాబు ఇప్పుడు హోదా పల్లవి అందుకున్నాడని విమర్శించారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 6న ఎంపీ పదవులకు రాజీనామాలు చేస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు జిల్లాకు వెన్నుముక అన్నారు. చంద్రబాబు ప్రాజెక్టు పనులను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని విమర్శించారు. జిల్లాలో ఫ్లోరైడ్ అధికంగా ఉందన్నారు. వైఎస్ జగన్ జిల్లాను సందర్శిస్తున్నాడని తెలిసి ప్రభుత్వం అప్పటికప్పుడు డయాలసిస్ కేంద్రాలను ప్రకటించిందన్నారు. ఫ్లోరైడ్ సమస్య కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ చెప్పారు. జిల్లాలో 53 గ్రామాల్లో విషమ పరిస్థితి ఉందన్నారు. -
పునరావాస కాలనీల గురించి పట్టించుకోరా?
► అధికారులపై జేసీ నాగలక్ష్మి ఆగ్రహం ► త్వరగా పూర్తిచేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక ఒంగోలు టౌన్ : గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలోని పునరావాస కాలనీల్లో పనులు నత్తనడక సాగడంపై జాయింట్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత కాలవ్యవధిలోగా పనులు పూర్తి చేయకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో గుండ్లకమ్మ ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోని పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల కల్ప నపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుండ్లకమ్మ ప్రాజెక్టు పునరావాస కాలనీల్లో పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కాలనీల్లో నిర్మించనున్న ఆలయాలకు టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంపట్ల అసహనం వ్యక్తం చేశారు. రెండు మూడు ఆలయాల నిర్మాణాలను ఒక ప్యాకేజీ కింద టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. మంచినీటి పథకాల నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాల భవనాలు, అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణాలు పూర్తయినందున వాటి నిర్వహణను సంబంధిత శాఖలు తీసుకోవాలన్నారు. పునరావాస కాలనీల్లో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలకు వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. వెలుగొండపై నివేదిక ఇవ్వాలి.. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, పునరావాస కాలనీలకు సంబంధించి నివేదిక అందించాలని సంబంధిత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను నాగలక్ష్మి ఆదేశించారు. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలన్నారు. అదేవిధంగా పునరావాస కాలనీల్లో మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి నిర్వహించే సమావేశానికి కచ్చితంగా పురోగతి కనిపించాలన్నారు. ఈ సమావేశంలో పీఏ టు స్పెషల్ కలెక్టర్ వెంకటరావు, గుండ్లకమ్మ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉదయభాస్కర్, వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భాస్కరనాయుడు, కొండయ్య, ఆర్‌డబ్లు్యఎస్ ఈఈ ఆలి, ప్రాజెక్టŠస్ ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
గుండ్లకమ్మకు పోటెత్తిన వరద
రాచర్ల: ఆగకుండా కురుస్తున్న వానలతో ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని గుండ్లకమ్మ వాగుకు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆలయ సమీపంలోని రంగనాయకస్వామి ఆలయ సమీపంలోకి వరద చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయానికి బస్సుల రాకపోకలను నిలిపివేశారు. భక్తులను వెనక్కి పంపించారు. ఎవరూ అక్కడికి వెళ్లకుండా చూసేందుకు ముగ్గురు ఎస్సైలతోపాటు సిబ్బందిని అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ శ్రీరాం తెలిపారు. -
కరువుని తరిమేద్దాం
⇒ ప్రణాళికలు సిద్ధం చేయండి ⇒ అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ⇒ గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాను కరువు రహిత జిల్లాగా తయారు చేయడం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. సమగ్ర నీటి యాజమాన్యం ద్వారా నీటి వనరులన్నింటినీ సమీకృతం చేసుకుని భూగర్భ జలాలను అభివృద్ధి చేయాలని, ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో ఉన్న గుండ్లకమ్మ రిజర్వాయర్‌ను శనివారం ముఖ్యమంత్రి పరిశీలించారు. మోడల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించి ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ప్రాజెక్టుపైకి నడుచుకుంటూ వచ్చి పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు ఆవరణలో ఉన్న కల్యాణ మండపంలో ఆయన సమీక్ష జరిపారు. వ్యవసాయ, ఉద్యానవన, ఇరిగేషన్ శాఖల అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీటిపారుదల శాఖ, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్య్సశాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఏ గ్రామంలో పడ్డ వర్షపు నీరు ఆ గ్రామంలో నిల్వ చేయడానికి కృషి చేయాలన్నారు. అదే సమయంలో నదుల ద్వారా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాగార్జునసాగర్ కాల్వల ఆధునీకరణకు ప్రపంచబ్యాంకు నిధులు కేటాయించామని, ఈ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. గుండ్లకమ్మతో పాటు కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయడానికి అవసరమైన భూసేకరణ పూర్తి చేసి 1.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ఆదేశించారు. వెలుగొండ ప్రాజెక్టు కింద మొదటి సొరంగం నిర్మాణం వచ్చే సంవత్సరానికి పూర్తి చేసి, ఆ నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులను నింపడం వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఫ్లోరోసిస్ సమస్యను కూడా పరిష్కరించవచ్చన్నారు. జిల్లాలో ఉపాధి హామీ కింద రూ. 50 కోట్లు నిధులు, ప్రభుత్వం ఇచ్చిన రూ. 30 కోట్లు నిధులతోపాటు నీటిపారుదల, వాటర్‌షెడ్ నిధులన్నీ కలిపి వాగులు, చెరువులు, కాలువలు, చెక్‌డ్యామ్‌లు మరమ్మత్తులు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి ప్రాముఖ్యత ఉందని, రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు 25 శాతం ఉండగా, ఇక్కడ 39 శాతం ఉండటం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ జిల్లా పరిస్థితులను వివరించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రోడ్లు రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు, జెడ్పీ ఛైర్మన్ నూకసాని బాలాజీ, ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, ఏలూరి సాంబశివరావు, ఆమంచి కృష్ణమోహన్, కదిరి బాబూరావు, డీసీసీబీ ఛైర్మన్ ఈదర మోహన్, పార్టీ నేతలు కరణం బలరామ్, బీఎన్ విజయకుమార్, కరణం వెంకటేష్, పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. రైతులకు రుణమాఫీ చేసినట్లే ... డ్వాక్రా మహిళలకు చేస్తాం ఒంగోలు/తాళ్ళూరు/ముండ్లమూరు: రైతులకు రుణమాఫీ చేసినట్టేనని, ఇక మిగిలింది డ్వాక్రా రుణాలేనని, అవి కూడా మాఫీ చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం మధ్యాహ్నం ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరం గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులకు హాజరైన ఆయన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. పదేళ్ళ కాంగ్రెస్ అవినీతి పాలన మూలంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు పూర్తయినా కనీసం ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేకపోతున్నామన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణాశాఖా మంత్రి శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో పూర్తి స్థాయి అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేశామని, ఇంటర్నేషనల్ డ్రై వింగ్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నీటి పారుదలశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత టీడీపీదేనన్నారు. మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పోలవరం గ్రామాన్ని నీరు- చెట్టు పథకంలో ఎంపిక చేయటం గ్రామస్తులు అదృష్టమని చెప్పారు. రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు కరణం బలరామక్రిష్ణమూర్తి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, కదిరి బాబూరావు, డోల బాల వీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు, యువ పారిశ్రామికవేత్త శిద్ధా సుధీర్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, దివి శివరామ్, చీరాల, అద్దంకి ఇన్చార్జులు పోతుల సునీత, కరణం వెంకటేష్‌బాబు, కలెక్టర్ హరి జవహార్‌లాల్, డీఆర్డీఏ, డ్వామా పీడీ ఎస్.మురళి, పోలప్ప, దర్శి నియోజకర్గ ప్రత్యేక అధికారి రవి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, ఎంపీపీ మందలపు వెంకటరావు, జెడ్పీటీసీ కొక్కెర నాగరాజు, పోలవరం సర్పంచి ఎం. మల్లిఖార్జున రావు, సర్పంచులు కూరపాటి శ్రీనివాసరావు, మేదరమిట్ల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
వేదికపై దళిత ఎంపీ, ఎమ్మెల్యేలకు చోటులేదు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దళితులకు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం లేదని వస్తున్న ఆరోపణలను నిజం చేసేలా శనివారం ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం జరిగింది. గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అక్కడి కల్యాణ మండపంలో నీరు-చెట్టు కార్యక్రమంపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వేదికపై ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు శిద్దా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ హరిజవహర్‌లాల్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, జెడ్పీ ఛైర్మన్ నూకసాని బాలాజీ, రాష్ట్ర తెలుగురైతు విభాగం అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి కూర్చున్నారు. కరణం బలరామ్‌కు ఎటువంటి ప్రోటోకాల్ లేకపోయినా ఆయన కొద్దిసేపు వేదికపై కూర్చుని తర్వాత పోలవరం మీటింగ్ కోసం వెళ్లిపోయారు. అయితే గుండ్లకమ్మ ప్రాజెక్టు ఉన్న ప్రాంతం సంతనూతలపాడు నియోజవకర్గం పరిధిలోకి వస్తుంది. ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ను వేదికపైకి పిలవాల్సి ఉంది. అయితే ఆయన విపక్షానికి చెందిన వారు కాబట్టి పిలవలేదు అనుకున్నా, స్థానిక ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి కూడా సమావేశానికి వచ్చారు. ఆయనను కనీసం వేదికపైకి పిలవకపోవడంతో సమావేశంలో అధికారులు, మిగిలిన ఎమ్మెల్యేలతోపాటు కూర్చుండిపోయారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ప్రొటోకాల్ కొంతమందికే ఉంటుందని, దళితులకు ఉండదని ఆ సమావేశం చూసిన వారు వ్యాఖ్యానించారు. -
జగన్ బాటలో చంద్రబాబు
‘నేనే మోనార్క్‌ని ... అంతా నాకే తెలుసు...నన్నే అందరూ అనుసరించాలి. దేశమే నన్ను ఆదర్శంగా తీసుకోవాలంటూ ’ అప్పుడప్పుడూ గొప్పలకు పోతున్న చంద్రబాబు గత ఎనిమిది నెలల పాలనలో అంతా కాపీ రాయుడిలా సాగింది. మోడీ చీపురు పట్టుకుంటే ఇక్కడ రెండు చీపుర్లు, పిల్లల్ని ఎక్కువ మందిని కనండహో అని కేకేస్తే ఏపీలో కూడా సంతానం పెంచండని పిలుపునిచ్చారు. తెలంగాణాలో రుణమాఫీ చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడా ‘నక్క వాతలు పెట్టుకున్నట్టు’గా అంటించుకున్నా అసలు రంగు బయటపడుతూనే ఉంది. ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ అంటే నేను కూడా అంటూ ఎగిరి గంతేశారు. షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుడితే బాబు కూడా బూట్లు తొడిగారు. తాజాగా జగన్ ప్రాజెక్టు బాట పడితే నారా వారు ‘నేనూ’ అంటూ సమాయత్తమవుతున్నారు. వెలుగొండ ప్రాజెక్టును జగన్ సందర్శించడంతో హడావుడిగా సీఎం షెడ్యూల్లో ‘ప్రాజెక్టు’ కొత్తగా వచ్చి చేరింది. ⇒ గుండ్లకమ్మ ప్రాజెక్టు సందర్శనకు టీడీపీ నేతల ఏర్పాట్లు ⇒ జగన్ పర్యటన మరుసటి రోజునే ముంపు బాధితులతో కలెక్టర్ సమావేశం ⇒ వెనువెంటనే మంత్రి దేవినేని ఉమా కూడా పరిశీలనలు ⇒ తాజాగా బాబు కూడా... ⇒ వైఎస్సార్ సీపీ కన్నెర్రతోనే ఈ ముచ్చెమటలంటున్న రైతులు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పట్టిసీమ పేరుతో మిగిలిన ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలను నుంచి అనూహ్య స్పందన రావడంతో అధికారపక్షంలో గుబులు మొదలైంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో కూడా ప్రాజెక్టులను సందర్శించే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. మొదట ముండ్లమూరు మండలం పోలవరం గ్రామంలో నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా, తాజాగా గుండ్లకమ్మ ప్రాజెక్టు సందర్శన కూడా ముఖ్యమంత్రి పర్యటనలో వచ్చి చేరింది. ఈ నెల 16న విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వెలుగొండ ప్రాజెక్టును సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. పునరావాస పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని ఎత్తి చూపించారు. దీంతో జగన్ పర్యటన ముగిసిన వెంటనే కలెక్టర్ మంపు బాధితులతో సమావేశాలు ఏర్పాటు చేసి యుద్ధప్రాతిపదికన పనులు చేపడతున్నట్లు ప్రకటించారు. నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించి ఖరీఫ్‌కు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మద్దిపాడు మండలం మల్లవరంలో రూ. 592.18 కోట్లు వ్యయంతో 11,177 ఎకరాల విస్తీర్ణంలో 80,060 ఎకరాల ఆయకట్టును స్థిరీకరంచేందుకు గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. 2004లో వైఎస్ రాజశే ఖరరెడ్డి అధికారంలోకి రాగానే మూడు విడతలుగా విడుదల చేసిన నిధులతో 3.859 టీఎంసీల నీటి సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. మద్దిపాడు, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, చీమకర్తి, ఒంగోలు, అద్దంకి, ఇంకొల్లు మండలాల పరిధిలోని సుమారు 30 గ్రామాల పరిధిలోని 80,060 ఎకరాలను సాగులోకి తీసుకురావడం, ఆయా ప్రాంతాలలోని ప్రజలకు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. 21.795 కి.మీ పొడవున నిర్మించిన ఎడమ ప్రధాన కాలువ పరిధిలో 50 వేల ఎకరాలు, 27.262 కి.మీ పొడవున నిర్మించిన కుడి ప్రధాన కాలువ పరిధిలో 30 వేల ఎకరాలను సాగులోకి తీసుకురానున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మాణం గడువు ఈ సంవత్సరం జూన్ 30వ తేదీతో ముగియనున్నప్పటికీ భూవివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నాగులుప్పలపాడు, ఇంకొల్లు మండలాల పరిధిలో దుద్దుకూరు, చదలవాడ, ఉప్పుగుండూరు, నాగులుప్పలపాడు పరిధిలో 62 ఎకరాల భూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో ఎలైన్మెంట్ మార్చాలని రైతులు పట్టుబడుతుండటంతో ఇవి ఇంకా పరిష్కారం కావలసి ఉంది. అధికారులు చొరవ తీసుకొని ఈ మధ్య కొన్ని గ్రామాలలో రైతుల సమస్యలను పరిష్కరించినప్పటికీ దుద్దుకూరులో ఇంకా 37 ఎకరాల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. వీటిని పరిష్కరించడంలో జరుగుతున్న జాప్యంవల్లే ప్రాజెక్టు పూర్తయినా సాగునీరు అందించలేని స్థితిలో ఉంది. ముఖ్యమంత్రిని తీసుకువచ్చి ఖరీఫ్‌కు నీరు ఇస్తామని చెప్పించడం ద్వారా రైతుల పక్షాన తాము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం అధికార పక్షం నుంచి జరుగుతోంది. నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వారం రోజుల్లో వెలుగొండ పనులు ప్రారంభమవుతాయని చెప్పినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు పెంచకుండా, రైతులను పక్కదారి పట్టించేందుకే గుండ్లకమ్మ ప్రాజెక్టు సందర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు రైతులు విమర్శిస్తున్నారు.