పనులు నిలిచిపోవడంతో పక్కన పెట్టిన 1200 డయా పైపులు
సాక్షి, ఒంగోలు అర్బన్: ప్రజల సమక్షంలో నగరాభివృద్ధి జపం చేసే స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్.. తెరవెనుక మాత్రం అభివృద్ధి కంటే అయినవారే ముఖ్యం అన్నట్లు కోట్లాది రూపాయలు వారికి దోచిపెడుతున్నారు. అందుకు ప్రతిగా లక్షల్లో ముడుపులు తీసుకోవడంతో నాటి కమిషనర్.. ఎమ్మెల్యే పావులు కదిపారు. నగరపాలక సంస్థ తరఫున చేసే ప్రతిదానికి నాటి నగరపాలక కమిషనర్‌ను ఎమ్మెల్యే అడ్డుపెట్టి కోట్ల రూపాయాలు ప్రజాధనం వాటాలు వేసుకుని పంచుకున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నారు. అమృత్ పథకం ద్వారా రూ.140 కోట్లతో గుండ్లకమ్మ పైపులైను నిర్మాణ పనులు చేపట్టి సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి కాకపోవడం వెనుక ఎమ్మెల్యే, కమిషనర్‌ల పాత్ర బట్టబయలు అయింది.
నష్టపరిహారం పేరుతో నిర్మాణ పనులు నిలుపుదల చేయించారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. పైపు లైన్ పనులు కాంట్రాక్టర్‌కు అప్పంగించడంలో దామచర్ల కొత్తగా నిర్మించతలపెట్టిన నివాసం సదరు కాంట్రాక్టర్‌తో నిర్మించేలా ఒప్పందం చేసుకున్నారని తీవ్రమైన విమర్శలు అప్పట్లో వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆయన లబ్ధి పొందడంతో పాటు పైపు లైనుకు సంబంధించి ఆయన అనుచరులకు కూడా కోట్లు కుమ్మరించేలా నాటి కమిషనర్‌తో కలిసి చతురత చూపారని నగరవాసులు గుసగుసలాడుతున్నారు.
మాజీ ఏఎంసీ చైర్మన్ అడ్డుకోవడంతో..
గుండ్లకమ్మ పైపు లైను పనుల్లో భాగంగా హైవే నుంచి నగరంలోని వెంకటేశ్వర కాలనీ ద్వారా సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు వరకు 1200 డయాతో నిర్మాణం జరుగుతోంది. స్థానిక ప్రజలు పైపు లైను నిర్మాణాలకు సంబంధించి కావాల్సిన స్థలాన్ని స్వచ్ఛందంగా ఉచితంగా అందజేశారు. కాలనీలో స్థల సేకరణ అయిన మేరకు పబ్లిక్ హెల్స్ డిపార్టుమెంట్ పైపులైను పనులు చేసింది. అయితే అక్కడే ఉన్న ఎమ్మెల్యే అనుచరునిగా ఉన్న మాజీ ఏఎంసీ చైర్మన్‌తో పాటు మరోవ్యక్తి సంబంధించిన స్థలం ఇవ్వకుండా పైపులైను నిర్మాణ పనులను అడ్డుకున్నారు. దీంతో కోట్ల రూపాయలతో తలపెట్టిన గుండ్లకమ్మ పైపులైను పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నష్ట పరిహారం ఇస్తేనే స్థలం ఇస్తామని టీడీపీకి చెందిన ఎమ్మెల్యే అనుచరుడు మెలిక పెట్టడంతో అధికారులు దిక్కుతోచని పరిస్థితులో పడ్డారు. తర్వాత నష్టపరిహారం ఇప్పించేందుకు ఎమ్మెల్యేతో సెటిల్‌మెంట్ కాకపోవడంతో సదరు అనుచరుడు ఎమ్మెల్యే మధ్య కొంతకాలం గ్యాప్ కూడా వచ్చింది.
25 సెంట్లకు కోటి రూపాయలు
అయితే ఎన్నికలు సమీపిస్తుండటంతో అనుచరుడి వ్యతిరేకత లేకుండా చూసుకునేందుకు అధికారం అడ్డుపెట్టుకొని లోపాయికారిగా ఒప్పందం చేసుకుని ఏకంగా రూ.1,07,73,840 నష్టపరిహారం ఇవ్వాలంటూ గత నెల 25వ తేదీ జీఓ నంబర్ 136ను విడుదల చేశారు. అయితే పరిహారం ఓఎంసీ నుంచి కాకుండా పైపులైన్ పనుల నిధుల నుంచి ఇవ్వాలని జీఓలో పేర్కొవడం గమనార్హం.ఇదిలా ఉంటే పనులు ఆలస్యం కావడంతో ప్రాజెక్టు అంచనాలు పెరిగే అవకాశం ఉంది. పైగా ఈ నిధుల నుంచే కోటి తగ్గిపోవాల్సిన పరిస్థితి. ఇదే జరిగితే పనులు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులే అంటున్నారు. నష్టపరిహారం చెల్లించే విషయంలో ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ పరిశీలస్తుండగా ఆయనతో పనికాదని తెలిసి ఎమ్మెల్యే జీవో విడుదల చేయించారనే ప్రచారం జరుగుతోంది.
దీంతో స్థానికులు మండిపడుతున్నారు. తమ అందరి వద్ద నగరాభివృద్ధి పేరుతో స్వచ్ఛందంగా ఇవ్వాలని అడిగి తీసుకుని ఇప్పుడు ఎమ్మెల్యే మనుషులకు కోట్లలో నష్టపరిహారం ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమకు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టును ఆశ్రయిస్తామని స్థానికులంటున్నారు. నేడో రేపో జిల్లా కలెక్టర్‌ను కలుస్తామంటున్నారు. పైపులైన్ పనులు నిర్వహిస్తున్న పబ్లిక్ హెల్త్ అధికారులు మాత్రం తమకు పైపులైన్ నిర్మాణం నిలిచిపోయింది 70 మీటర్ల పొడవు, 2మీటర్ల వెడల్పు స్థలం వద్ద మాత్రమే అన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం 5 లేదా 6 సెంట్లు అవసరం. నగరపాలక టౌన్‌ప్లానింగ్ అధికారులు తమకు ఆస్థలం చూపిస్తే నిర్మాణం చేపడతామంటున్నారు.
అసలు చరిత్ర ఇలా..
గతంలో జాతీయ రహదారి నుంచి వెంకటేశ్వర కాలనీకి వెళ్లాలంటే హైవేకు పడమరగా ఉడ్ కాంప్లెక్స్ ద్వారా వెళ్లి అక్కడి నుంచి ఉత్తరం వైపుగా కొంతదూరం ఆ తర్వాత పడమర వైపుగా తిరిగి వెళ్లాల్సి వచ్చేది. 2001–2002 సమయంలో అన్ని మెలికలు లేకుండా నేరుగా రోడ్డు ఉండేలా అక్కడి రైతులు, స్థానికులు 20 అడుగుల వెడల్పుతో రోడ్డును ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలో సదరు ఎమ్మెల్యే అనుచరుడు కూడా ఆ రోడ్డు కోసం స్థలం ఇచ్చాడు. కాలక్రమేణా సిమెంట్ రోడ్డుగా కూడా మారింది. అక్కడి ప్రజలు స్థలాలు, పొలాలు క్రయ విక్రయాలు జరిపితే షెడ్యూల్‌లో హద్దుల్లో ఆ రోడ్డును పలకరిస్తున్నారు. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన షెడ్యూల్లో కూడా రోడ్డును హద్దులుగా గుర్తించారు.
ఇప్పుడు పైపులైను నిర్మాణం కోసం రోడ్డు నుంచి 2 మీటర్ల వరకు అదనపు వెడల్పు అవసరం కావడంతో స్థానికులు స్వచ్ఛందంగా అందించారు. దీంతో పైపులైన్ పనులను ఆదునుగా భావించిన ఎమ్మెల్యే అనుచరుడు మాత్రం స్థలం ఇవ్వకుండా అడ్డుకున్నాడు. దీంతో ఎమ్మెల్యే, నాటి కమిషనర్లు దాదాపుగా రూ.20 లక్షలకు ఒప్పందం చేసుకుని ప్రత్యేక అధికారి ద్వారా నష్టపరిహారం కోసం ప్రభుత్వానిక సిఫార్సు చేసినట్లు సమాచారం. అయితే ప్రత్యేక అధికారి పరిశీలనలో ఉండగానే జీఓ విడుదల అయింది. అయితే పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్ నిలిచిపోయిన పైపులైన్ తాలుకు స్థల విస్తీర్ణం సుమారు. 5 నుంచి 6 సెంట్లు ఉండగా జీఓలో 25 సెంట్లు పేర్కొనడంతో గతంలో రోడ్డుకు ఇచ్చిన స్థలానికి కూడా నష్టపరిహారం ఇస్తున్నట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఓఎంసీ కమిషనర్ ఏమన్నారంటే..
జీవో ప్రకారం నష్టపరిహారం చెల్లించేందుకు 25 సెంట్లు స్థలం ఉంది. ల్యాండ్ ఎక్విజిషేన్ కింద ఎంత ఉందనేది సంబంధిత అధికారులను అడిగి చెప్తాను. అయితే వారు అందుబాటులో లేనందున చెప్పలేకపోతున్నా.
స్థలం చూపాలి, పబ్లిక్ హెల్త్ ఈఈ
పైపులైన్ నిర్మాణ పనులకు సంబంధించి 70 మీటర్ల పొడవు 2 మీటర్ల వెడల్పు స్థలానికి సంబంధించి పనులు నిలిచిపోయాయి. నగరపాలక సంస్థ ఆ స్థలం చూపితే పనులు ప్రారంభం అవుతాయి. స్థలం చూపాల్సిన బాధ్యత నగరపాలక సంస్థది.
Comments
Please login to add a commentAdd a comment