amrit scheme
-
అమృత్ టెండర్లలో సీఎం భారీ అవినీతి!: కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: అమృత్ పథకం టెండర్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీస్థాయిలో అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి తన బావమరిది సృజన్ రెడ్డికి చెందిన కంపెనీకి రూ.1,137 కోట్ల విలువ చేసే పనులను అప్పగించారన్నారు. కేవలం సీఎం బావమరిది అనే ఒకే ఒక్క అర్హతతో ఇంత పెద్దఎత్తున పనులను కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించి అధికార దురి్వనియోగానికి పాల్పడ్డారని విమర్శలు సంధించారు. ఈ మేరకు సోమవారం రాత్రి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదరరావు, సురేశ్‌రెడ్డి, మాజీ ఎంపీలు మాలోత్ కవిత, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి కేటీఆర్ కేంద్ర మంత్రి ఖట్టర్‌ను కలిసి అమృత్ టెండర్లలో జరిగిన స్కాంపై ఫిర్యాదు చేశారు. అనుభవం, అర్హత లేని కంపెనీకి.. అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి చెందిన కంపెనీ ‘శోధా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్’రూ.1,137 కోట్ల పనులను దక్కించుకుందని కేటీఆర్ ఆరోపించారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 2.20 కోట్ల లాభాన్ని చూపించిన కంపెనీకి రూ.1,137 కోట్ల పనులు ఎలా కట్టబెడతారని ఫిర్యాదులో ప్రశ్నించారు. ఏమాత్రం అనుభవం, అర్హత లేని కంపెనీకి ఇన్ని కోట్ల పనులు అప్పగించారంటే తెర వెనుక భారీ అవినీతి బాగోతం నడిచిందనే విషయం అర్థమవుతోందని చెప్పారు. ఈ వ్యవహారంలో స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అవినీతికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ కావటంతోనే ఇండియన్ హ్యూమ్ పైప్స్ లిమిటెడ్ సంస్థ మొత్తం ప్రాజెక్ట్‌లో 80 శాతం పనులను శోధా సంస్థకు అప్పగించిందన్నారు. ఈ టెండర్లలో సీఎం బావమరిది ప్రధాన భాగస్వామి అని తెలిపారు. ఆ నిబంధన కింద వేటువేయొచ్చు.. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా.. వారిపై వేటు వేయొచ్చని కేటీఆర్ చెప్పారు. ఇందుకు సంబంధించి పలు కేసులను కూడా ఆయన ఉదహరించారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గనుల కేటాయింపు, 1983లో బిహారిలాల్ దోబ్రే వర్సెస్ రోషన్ లాల్ దోబ్రే కేసు, 2005లో శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు వర్సెస్ వైరిచెర్ల ప్రదీప్ కుమార్ దేవ్ కేసు, 2001లో జయా బచ్చన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, 2003లో దివ్య ప్రకాష్ వర్సెస్ కులతార్ చంద్ రాణా కేసులను కేటీఆర్ కేంద్రమంత్రికి వివరించారు. 2014లో హరియాణాలో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కేసులనూ ప్రస్తావించారు. ముఖ్యమంత్రి అవినీతిని అరికట్టాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. టెండర్లలో చట్టవిరుద్ధంగా జరిగిన కేటాయింపులు, అక్రమ ఒప్పందాలపై విచారణ జరపాలని, అక్రమాలు నిజమని తేలితే టెండర్లను రద్దు చేసి రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పుడే వణికితే ఎలా? కేంద్ర మంత్రి ఖట్టర్‌తో భేటీ నిమిత్తం కేటీఆర్ ఢిల్లీకి రాగా.. కేసుల నుంచి తప్పించుకోవడానికే ఆయన ఢిల్లీకి వెళ్లారంటూ రాష్ట్ర మంత్రులు ఆరోపించారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి కేటీఆర్ తన ‘ఎక్స్’ఖాతా ద్వారా స్పందించారు. ‘జస్ట్ ఇప్పుడే ఢిల్లీలో ల్యాండ్ అయ్యాను. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రకంపనలు వస్తున్నాయని విన్నాను. అప్పుడు వణికిపోతే ఎలా?’అంటూ పోస్ట్ చేశారు. -
రూ.12 వేల కోట్లతో ‘అమృత్’ ప్రతిపాదనలు!
సాక్షి, అమరావతి: పట్టణాలు, నగరాల్లో తాగునీరు, భూగర్భ మురుగునీటి పారుదల వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ పథకం రెండో దశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మొదటి దశలో రూ.3,700 కోట్లతో 32 పట్టణాల్లో చేపట్టిన పనులు చివరి దశకు చేరాయి. రాష్ట్రంలో రెండోదశ అమలుకు ప్రతిపాదనలు పంపాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం కోరింది. దీంతో రెండో దశకు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం రూ.12 వేల కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అమృత్ పథకంలో పనులకు నిధులను కేంద్ర ప్రభుత్వం ఆయా పట్టణాల జనాభాను బట్టి మంజూరు చేస్తుంది. పది లక్షల జనాభా దాటిన నగరాలకు ప్రతిపాదన వ్యయంలో 25 శాతం, లక్ష మందికి పైగా జనాభా ఉన్న పట్టణాలకు సుమారు 33 శాతం, లక్షలోపు జనాభా గల పట్టణాలకు 50 శాతం నిధులను అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఎమ్మెల్యే సారూ.. ఏంటిదీ!
సాక్షి, ఒంగోలు అర్బన్: ప్రజల సమక్షంలో నగరాభివృద్ధి జపం చేసే స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్.. తెరవెనుక మాత్రం అభివృద్ధి కంటే అయినవారే ముఖ్యం అన్నట్లు కోట్లాది రూపాయలు వారికి దోచిపెడుతున్నారు. అందుకు ప్రతిగా లక్షల్లో ముడుపులు తీసుకోవడంతో నాటి కమిషనర్.. ఎమ్మెల్యే పావులు కదిపారు. నగరపాలక సంస్థ తరఫున చేసే ప్రతిదానికి నాటి నగరపాలక కమిషనర్‌ను ఎమ్మెల్యే అడ్డుపెట్టి కోట్ల రూపాయాలు ప్రజాధనం వాటాలు వేసుకుని పంచుకున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నారు. అమృత్ పథకం ద్వారా రూ.140 కోట్లతో గుండ్లకమ్మ పైపులైను నిర్మాణ పనులు చేపట్టి సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి కాకపోవడం వెనుక ఎమ్మెల్యే, కమిషనర్ల పాత్ర బట్టబయలు అయింది. నష్టపరిహారం పేరుతో నిర్మాణ పనులు నిలుపుదల చేయించారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. పైపు లైన్ పనులు కాంట్రాక్టర్‌కు అప్పంగించడంలో దామచర్ల కొత్తగా నిర్మించతలపెట్టిన నివాసం సదరు కాంట్రాక్టర్‌తో నిర్మించేలా ఒప్పందం చేసుకున్నారని తీవ్రమైన విమర్శలు అప్పట్లో వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆయన లబ్ధి పొందడంతో పాటు పైపు లైనుకు సంబంధించి ఆయన అనుచరులకు కూడా కోట్లు కుమ్మరించేలా నాటి కమిషనర్‌తో కలిసి చతురత చూపారని నగరవాసులు గుసగుసలాడుతున్నారు. మాజీ ఏఎంసీ చైర్మన్ అడ్డుకోవడంతో.. గుండ్లకమ్మ పైపు లైను పనుల్లో భాగంగా హైవే నుంచి నగరంలోని వెంకటేశ్వర కాలనీ ద్వారా సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు వరకు 1200 డయాతో నిర్మాణం జరుగుతోంది. స్థానిక ప్రజలు పైపు లైను నిర్మాణాలకు సంబంధించి కావాల్సిన స్థలాన్ని స్వచ్ఛందంగా ఉచితంగా అందజేశారు. కాలనీలో స్థల సేకరణ అయిన మేరకు పబ్లిక్ హెల్స్ డిపార్టుమెంట్ పైపులైను పనులు చేసింది. అయితే అక్కడే ఉన్న ఎమ్మెల్యే అనుచరునిగా ఉన్న మాజీ ఏఎంసీ చైర్మన్‌తో పాటు మరోవ్యక్తి సంబంధించిన స్థలం ఇవ్వకుండా పైపులైను నిర్మాణ పనులను అడ్డుకున్నారు. దీంతో కోట్ల రూపాయలతో తలపెట్టిన గుండ్లకమ్మ పైపులైను పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నష్ట పరిహారం ఇస్తేనే స్థలం ఇస్తామని టీడీపీకి చెందిన ఎమ్మెల్యే అనుచరుడు మెలిక పెట్టడంతో అధికారులు దిక్కుతోచని పరిస్థితులో పడ్డారు. తర్వాత నష్టపరిహారం ఇప్పించేందుకు ఎమ్మెల్యేతో సెటిల్మెంట్ కాకపోవడంతో సదరు అనుచరుడు ఎమ్మెల్యే మధ్య కొంతకాలం గ్యాప్ కూడా వచ్చింది. 25 సెంట్లకు కోటి రూపాయలు అయితే ఎన్నికలు సమీపిస్తుండటంతో అనుచరుడి వ్యతిరేకత లేకుండా చూసుకునేందుకు అధికారం అడ్డుపెట్టుకొని లోపాయికారిగా ఒప్పందం చేసుకుని ఏకంగా రూ.1,07,73,840 నష్టపరిహారం ఇవ్వాలంటూ గత నెల 25వ తేదీ జీఓ నంబర్ 136ను విడుదల చేశారు. అయితే పరిహారం ఓఎంసీ నుంచి కాకుండా పైపులైన్ పనుల నిధుల నుంచి ఇవ్వాలని జీఓలో పేర్కొవడం గమనార్హం.ఇదిలా ఉంటే పనులు ఆలస్యం కావడంతో ప్రాజెక్టు అంచనాలు పెరిగే అవకాశం ఉంది. పైగా ఈ నిధుల నుంచే కోటి తగ్గిపోవాల్సిన పరిస్థితి. ఇదే జరిగితే పనులు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులే అంటున్నారు. నష్టపరిహారం చెల్లించే విషయంలో ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ పరిశీలస్తుండగా ఆయనతో పనికాదని తెలిసి ఎమ్మెల్యే జీవో విడుదల చేయించారనే ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానికులు మండిపడుతున్నారు. తమ అందరి వద్ద నగరాభివృద్ధి పేరుతో స్వచ్ఛందంగా ఇవ్వాలని అడిగి తీసుకుని ఇప్పుడు ఎమ్మెల్యే మనుషులకు కోట్లలో నష్టపరిహారం ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమకు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టును ఆశ్రయిస్తామని స్థానికులంటున్నారు. నేడో రేపో జిల్లా కలెక్టర్‌ను కలుస్తామంటున్నారు. పైపులైన్ పనులు నిర్వహిస్తున్న పబ్లిక్ హెల్త్ అధికారులు మాత్రం తమకు పైపులైన్ నిర్మాణం నిలిచిపోయింది 70 మీటర్ల పొడవు, 2మీటర్ల వెడల్పు స్థలం వద్ద మాత్రమే అన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం 5 లేదా 6 సెంట్లు అవసరం. నగరపాలక టౌన్‌ప్లానింగ్ అధికారులు తమకు ఆస్థలం చూపిస్తే నిర్మాణం చేపడతామంటున్నారు. అసలు చరిత్ర ఇలా.. గతంలో జాతీయ రహదారి నుంచి వెంకటేశ్వర కాలనీకి వెళ్లాలంటే హైవేకు పడమరగా ఉడ్ కాంప్లెక్స్ ద్వారా వెళ్లి అక్కడి నుంచి ఉత్తరం వైపుగా కొంతదూరం ఆ తర్వాత పడమర వైపుగా తిరిగి వెళ్లాల్సి వచ్చేది. 2001–2002 సమయంలో అన్ని మెలికలు లేకుండా నేరుగా రోడ్డు ఉండేలా అక్కడి రైతులు, స్థానికులు 20 అడుగుల వెడల్పుతో రోడ్డును ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలో సదరు ఎమ్మెల్యే అనుచరుడు కూడా ఆ రోడ్డు కోసం స్థలం ఇచ్చాడు. కాలక్రమేణా సిమెంట్ రోడ్డుగా కూడా మారింది. అక్కడి ప్రజలు స్థలాలు, పొలాలు క్రయ విక్రయాలు జరిపితే షెడ్యూల్లో హద్దుల్లో ఆ రోడ్డును పలకరిస్తున్నారు. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన షెడ్యూల్లో కూడా రోడ్డును హద్దులుగా గుర్తించారు. ఇప్పుడు పైపులైను నిర్మాణం కోసం రోడ్డు నుంచి 2 మీటర్ల వరకు అదనపు వెడల్పు అవసరం కావడంతో స్థానికులు స్వచ్ఛందంగా అందించారు. దీంతో పైపులైన్ పనులను ఆదునుగా భావించిన ఎమ్మెల్యే అనుచరుడు మాత్రం స్థలం ఇవ్వకుండా అడ్డుకున్నాడు. దీంతో ఎమ్మెల్యే, నాటి కమిషనర్లు దాదాపుగా రూ.20 లక్షలకు ఒప్పందం చేసుకుని ప్రత్యేక అధికారి ద్వారా నష్టపరిహారం కోసం ప్రభుత్వానిక సిఫార్సు చేసినట్లు సమాచారం. అయితే ప్రత్యేక అధికారి పరిశీలనలో ఉండగానే జీఓ విడుదల అయింది. అయితే పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్ నిలిచిపోయిన పైపులైన్ తాలుకు స్థల విస్తీర్ణం సుమారు. 5 నుంచి 6 సెంట్లు ఉండగా జీఓలో 25 సెంట్లు పేర్కొనడంతో గతంలో రోడ్డుకు ఇచ్చిన స్థలానికి కూడా నష్టపరిహారం ఇస్తున్నట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఓఎంసీ కమిషనర్ ఏమన్నారంటే.. జీవో ప్రకారం నష్టపరిహారం చెల్లించేందుకు 25 సెంట్లు స్థలం ఉంది. ల్యాండ్ ఎక్విజిషేన్ కింద ఎంత ఉందనేది సంబంధిత అధికారులను అడిగి చెప్తాను. అయితే వారు అందుబాటులో లేనందున చెప్పలేకపోతున్నా. స్థలం చూపాలి, పబ్లిక్ హెల్త్ ఈఈ పైపులైన్ నిర్మాణ పనులకు సంబంధించి 70 మీటర్ల పొడవు 2 మీటర్ల వెడల్పు స్థలానికి సంబంధించి పనులు నిలిచిపోయాయి. నగరపాలక సంస్థ ఆ స్థలం చూపితే పనులు ప్రారంభం అవుతాయి. స్థలం చూపాల్సిన బాధ్యత నగరపాలక సంస్థది. -
పట్టణాల్లో కురవని 'అమృత్'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అటల్ మిషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్(అమృత్) పథకం పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొన్ని సంస్థలకే టెండర్లు దక్కేలా నిబంధనలు రూపొందించడం, ఆ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం, రక్షిత మంచినీటి పథకాల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను ప్రభుత్వం కేటాయించలేకపోవడంతో ‘అమృత్’ పథకం పడకేసింది. నగరాలు, పట్టణాలను పట్టిపీడిస్తున్న రక్షిత మంచినీరు, మురుగునీటి సరఫరా సమస్యలు ‘అమృత్’ పథకంతో పరిష్కారం అవుతాయని ప్రజలు ఆశించారు. అయితే, తొలిదశలో విడుదలైన నిధులను మున్సిపాల్టీలు, నగర పాలక సంస్థలు పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేకపోయాయి. రెండో దశలో చేపట్టనున్న పథకాలకు నిధులు విడుదల చేయాలని అందచేసిన ప్రతిపాదనలకు మోక్షం కలగడం లేదు. దీంతో సమస్యలన్నీ అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతితోపాటు 31 నగర పాలక సంస్థలు, మున్సిపాల్టీలను ‘అమృత్’ అమలుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కనీసం లక్ష జనాభా కలిగిన నగరాలు, పట్టణాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం నిబంధన విధించింది. విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు వంటి కార్పొరేషన్లతోపాటు మచిలీపట్నం, గుడివాడ, ఆదోని, నరసరావుపేట, చిలకలూరిపేట వంటి చిన్న మున్సిపాల్టీలను అమృత్ పథకం కింద ఎంపిక చేశారు. ఈ పథకం అమలుకు కేంద్రం ఐదేళ్లపాటు విడతల వారీగా నిధులను విడుదల చేస్తుంది. తొలిదశలో రూ.2,717 కోట్లను విడుదల చేసింది. ఇందులో ఇప్పటిదాకా రూ.400 కోట్లు ఖర్చు పెట్టారు. అయినా పనులు ఆశించిన స్థాయిలో జరగలేదు. విశాఖపట్నంలో పాతపైపుల స్థానంలో కొత్తవి ఏర్పాటుకు, నివాస గృహాలకు కుళాయిలు, మురుగునీటి శుద్ధిప్లాంట్ నిర్మాణాలకు నిధులు విడుదల కాగా, నిర్మాణ సంస్థలు పనుల్లో జాప్యం చేస్తున్నాయి. 75 వేల కుళాయిలను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటిదాకా 23 వేల కుళాయిలనే ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరంలో రూ.82 కోట్లతో ఇంటింటికీ కుళాయిలు, పార్కుల సుందరీకరణ, ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇందులో రూ.17.80 కోట్లతో నిర్మించనున్న ఎస్టీపీ ప్లాంట్ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. నిధులున్నా.. పనులేవీ? గుంటూరు జిల్లా తెనాలిలో రక్షిత మంచినీటి పథకం అమల్లో భాగంగా ఇచ్చే కుళాయి కనెక్షన్లు మందకొడిగా సాగుతున్నాయి. దీనికోసం అమృత్ పథకం కింద రూ.9 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పట్టణంలోని 21,748 గృహాలకు రక్షిత మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించగా, 12 వేల కనెక్షన్లు మాత్రమే ఇచ్చారు. మరో రెండు నెలల్లో ఒప్పందం కాలపరిమితి ముగియనుంది. మచిలీపట్నం మున్సిపాల్టీకి రూ.37.25 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో నాలుగు ఓవర్‌హెడ్ ట్యాంకులు, 9,158 కుళాయిలు, 156.465 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్ పైప్లైన్లు, 8.42 కిలోమీటర్ల మేర పంపింగ్ మెయిన్ల ఏర్పాటు వంటి పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. తిరుపతిలో రూ.72 కోట్లతో కొత్త పైప్లైన్ల నిర్మాణం, ఐదు రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. మూడేళ్ల నుంచి ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఖరారు కాని టెండర్లు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొన్ని నిర్మాణ సంస్థలకే టెండర్లు దక్కేలా నిబంధనలు విధించారు. దాంతో కొన్ని సంస్థలకు ఐదారు నగరాల్లోని పనులు గంపగుత్తుగా లభించాయి. ఆ సంస్థలు సకాలంలో పనులు పూర్తి చేయలేకపోతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 25 రక్షిత మంచినీటి పథకాలకు సంబంధించిన పనులకు టెండర్లు ఆహ్వానిస్తే 23 పథకాల నిర్మాణ పనులు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. మూడు ప్రాజెక్టులకు టెండర్లు ఖరారు కాలేదు. 60 పార్కుల సుందరీకరణకు టెండర్లు ఆహ్వానిస్తే 56 పార్కులకు టెండర్లు ఖరారయ్యాయి. వీటిలో 41 పార్కుల పనులు కేవలం 30 నుంచి 40 శాతం వరకు పూర్తయ్యాయి. ఇక మురుగునీటి శుద్ధిప్లాంట్ల నిర్మాణాలకు నిర్మాణ సంస్థలు ముందుకు రాకపోవడంతో నగరాలు, పట్టణాల్లో మురుగునీటి సమస్య వేధిస్తోంది. -
తెలంగాణ నగరాలకు రూ. 1673 కోట్లు!
అటల్ మిషన్ ఇన్వెస్ట్మెంట్స్ కింద తెలంగాణలోని 12 నగరాలకు కలిపి మొత్తం రూ. 1673 కోట్లను రాబోయే ఐదేళ్లలో వెచ్చించనున్నారు. పట్టణాలు, నగరాల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులు వెచ్చిస్తారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ. 832 కోట్లను సాయంగా అందిస్తుంది. ఇందులో భాగంగా వరంగల్ నగరంలో నీటి సదుపాయాన్ని అభివృద్ధి చేసేందుకు రాబోయే మూడేళ్లలో రూ. 425 కోట్లు వెచ్చించనున్నారు. కేంద్ర ప్రయోజిత పథకమైన 'అమృత్' కింద మొత్తం ఈ రూ. 1673 కోట్లు వెచ్చిస్తారు. మొత్తం నిధులను 2019-20 లోగా ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 703 కోట్లు పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనలను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు ఆమోదించారు. దాంతో ఈ మిషన్ కింద పెట్టుబడుల మొత్తం రూ. 1673 కోట్లకు చేరుకుంది. అమృత్ మిషన్ కింద ప్రతి కుటుంబానికి రక్షిత మంచినీరు అందించాలని, అందులో ఒక్కో మనిషికి రోజుకు 135 లీటర్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతోపాటు మురుగునీటి పైపులైన్లను విస్తరించడం, నగరాల్లో ప్రతియేటా బహిరంగ, హరిత ప్రాంతాలను విస్తరించడం తప్పనిసరి అని లక్ష్యం విధించారు. ఇందుకు దేశవ్యాప్తంగా 500 నగరాలను ఎంపిక చేయగా, వాటిలో తెలంగాణ రాష్ట్రంలోనివి 12 ఉన్నాయి. నగరం నీటిసరఫరా (రూ. కోట్లలో) మురుగునీటి వ్యవస్థ (రూ. కోట్లలో) పార్కులు (రూ. కోట్లలో) మొత్తం (రూ. కోట్లలో) వరంగల్ 424.26 0 1.44 425.70 సిద్దిపేట 0 100 1.5 101.5 ఖమ్మం 47.84 0 1 48.84 మహబూబ్‌నగర్ 41.58 0 1.5 43.08 నిజామాబాద్ 4.52 26 1.79 32.31 కరీంనగర్ 24.98 0 1.5 26.48 నల్లగొండ 11.28 0 0.75 12.03 మిర్యాలగూడ 4.07 0 1.80 5.87 సూర్యాపేట 1.45 0 1.28 2.70 జీహెచ్ఎంసీ 0 0 2.02 2.02 రామగుండం 0 0 1.50 1.50 ఆదిలాబాద్ 0 0 0.95 0.95 -
సిరిసిల్ల రూపురేఖలు మార్చుతా
► రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్లే.. ► అమృత్ పథకంలో ప్రత్యేక స్థానం ► రూ. పది కోట్ల వ్యయంతో ఎయిర్టెల్ మోడల్ స్కూల్ ► నేతన్నలకు ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సిరిసిల్ల : రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల రూపురేఖ లు మార్చుతానని రాష్ట్ర ఐటీ, పీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గుడ్ల మంజుల, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కొండ అనూష, కత్తెర విజయలక్ష్మితోసహా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి నివాసంలో శుక్రవారం టీఆర్ఎస్ చేరారు. ఈసందర్భంగా మంత్రి మా ట్లాడుతూ సిరిసిల్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. అమృత్ పథకంలో సిరిసిల్లకు స్థానం కల్పించేలా చూస్తామన్నారు. రూ.60 కోట్ల వ్యయంతో రింగు రోడ్డు, మరో రూ.10 కోట్ల వ్యయంతో ఎయిర్‌టె ల్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. తనకున్న పరిచయాలతో కార్పొరేట్ కంపనీలు ఏర్పాటు ఉపాధి అవకాశాలు పెంచుతామని అన్నారు. నేతన్నలకు ముఖ్యమంత్రితో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేయిస్తానని వివరించారు. 1500 డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేయిస్తానని తెలిపారు. సిరిసిల్లకు చెందిన గుడ్ల శంకరయ్య, కట్టెకోల లక్ష్మీనారాయణ, మ్యాన శంకర్, చిటికెన కనకయ్య, గుడ్ల శ్రీనివాస్, మ్యాన ప్రసాద్, గెంట్యాల శ్రీనివాస్, గుడ్ల బాలకిషన్, పుల్లూరి ప్రసాద్, ఉప్పుల లక్ష్మారెడ్డి, ఆకునూరి అశోక్, సామల పోశెట్టి, వంగరి దేవదాస్, ఏనుగు క్రిష్ణహరి, ప్రభాకర్‌తోపాటు పాతిక మంది మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ చేరారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సెస్ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు జిందం చక్రపాణి, కొమిరె సంజీవ్, గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.