
సాక్షి, అమరావతి: పట్టణాలు, నగరాల్లో తాగునీరు, భూగర్భ మురుగునీటి పారుదల వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ పథకం రెండో దశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మొదటి దశలో రూ.3,700 కోట్లతో 32 పట్టణాల్లో చేపట్టిన పనులు చివరి దశకు చేరాయి. రాష్ట్రంలో రెండోదశ అమలుకు ప్రతిపాదనలు పంపాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం కోరింది. దీంతో రెండో దశకు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం రూ.12 వేల కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
అమృత్ పథకంలో పనులకు నిధులను కేంద్ర ప్రభుత్వం ఆయా పట్టణాల జనాభాను బట్టి మంజూరు చేస్తుంది. పది లక్షల జనాభా దాటిన నగరాలకు ప్రతిపాదన వ్యయంలో 25 శాతం, లక్ష మందికి పైగా జనాభా ఉన్న పట్టణాలకు సుమారు 33 శాతం, లక్షలోపు జనాభా గల పట్టణాలకు 50 శాతం నిధులను అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.