ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధన ఉల్లంఘనకు పాల్పడ్డారు: కేటీఆర్
బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి రూ.1,137 కోట్ల పనులను అప్పగించారు.. విచారణ జరిపి టెండర్లను రద్దు చేయాలి
రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి
కేంద్ర మంత్రి ఖట్టర్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: అమృత్ పథకం టెండర్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీస్థాయిలో అవినీతికి పాల్పడ్డారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి తన బావమరిది సృజన్ రెడ్డికి చెందిన కంపెనీకి రూ.1,137 కోట్ల విలువ చేసే పనులను అప్పగించారన్నారు. కేవలం సీఎం బావమరిది అనే ఒకే ఒక్క అర్హతతో ఇంత పెద్దఎత్తున పనులను కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించి అధికార దురి్వనియోగానికి పాల్పడ్డారని విమర్శలు సంధించారు. ఈ మేరకు సోమవారం రాత్రి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదరరావు, సురేశ్‌రెడ్డి, మాజీ ఎంపీలు మాలోత్ కవిత, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి కేటీఆర్ కేంద్ర మంత్రి ఖట్టర్‌ను కలిసి అమృత్ టెండర్లలో జరిగిన స్కాంపై ఫిర్యాదు చేశారు.
అనుభవం, అర్హత లేని కంపెనీకి..
అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి చెందిన కంపెనీ ‘శోధా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్’రూ.1,137 కోట్ల పనులను దక్కించుకుందని కేటీఆర్ ఆరోపించారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 2.20 కోట్ల లాభాన్ని చూపించిన కంపెనీకి రూ.1,137 కోట్ల పనులు ఎలా కట్టబెడతారని ఫిర్యాదులో ప్రశ్నించారు. ఏమాత్రం అనుభవం, అర్హత లేని కంపెనీకి ఇన్ని కోట్ల పనులు అప్పగించారంటే తెర వెనుక భారీ అవినీతి బాగోతం నడిచిందనే విషయం అర్థమవుతోందని చెప్పారు. ఈ వ్యవహారంలో స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అవినీతికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ కావటంతోనే ఇండియన్ హ్యూమ్ పైప్స్ లిమిటెడ్ సంస్థ మొత్తం ప్రాజెక్ట్‌లో 80 శాతం పనులను శోధా సంస్థకు అప్పగించిందన్నారు. ఈ టెండర్లలో సీఎం బావమరిది ప్రధాన భాగస్వామి అని తెలిపారు.
ఆ నిబంధన కింద వేటువేయొచ్చు..
ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా.. వారిపై వేటు వేయొచ్చని కేటీఆర్ చెప్పారు. ఇందుకు సంబంధించి పలు కేసులను కూడా ఆయన ఉదహరించారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గనుల కేటాయింపు, 1983లో బిహారిలాల్ దోబ్రే వర్సెస్ రోషన్ లాల్ దోబ్రే కేసు, 2005లో శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు వర్సెస్ వైరిచెర్ల ప్రదీప్ కుమార్ దేవ్ కేసు, 2001లో జయా బచ్చన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, 2003లో దివ్య ప్రకాష్ వర్సెస్ కులతార్ చంద్ రాణా కేసులను కేటీఆర్ కేంద్రమంత్రికి వివరించారు. 2014లో హరియాణాలో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కేసులనూ ప్రస్తావించారు. ముఖ్యమంత్రి అవినీతిని అరికట్టాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. టెండర్లలో చట్టవిరుద్ధంగా జరిగిన కేటాయింపులు, అక్రమ ఒప్పందాలపై విచారణ జరపాలని, అక్రమాలు నిజమని తేలితే టెండర్లను రద్దు చేసి రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
అప్పుడే వణికితే ఎలా?
కేంద్ర మంత్రి ఖట్టర్‌తో భేటీ నిమిత్తం కేటీఆర్ ఢిల్లీకి రాగా.. కేసుల నుంచి తప్పించుకోవడానికే ఆయన ఢిల్లీకి వెళ్లారంటూ రాష్ట్ర మంత్రులు ఆరోపించారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి కేటీఆర్ తన ‘ఎక్స్’ఖాతా ద్వారా స్పందించారు. ‘జస్ట్ ఇప్పుడే ఢిల్లీలో ల్యాండ్ అయ్యాను. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రకంపనలు వస్తున్నాయని విన్నాను. అప్పుడు వణికిపోతే ఎలా?’అంటూ పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment