గుండ్లకమ్మ ప్రాజెక్టు, వెలిగొండ ప్రాజెక్టు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎమ్మెల్యే అంటే హోదా, గౌరవం. ఎమ్మెల్యేలకు హక్కులతో పాటు బాధ్యతలూ ఉంటాయి. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. అయితే చంద్రబాబు ఐదేళ్ల పాలన అందుకు భిన్నంగా నడిచింది. బాబు అలా నడిపించారు. ఆయన పాలన నియంతృత్వ పోకడలను తలపించింది. ఎమ్మెల్యేల హక్కులను, బాధ్యతలను కాలరాసింది. ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినా ప్రభుత్వ పరంగా నియోజకవర్గాలకు కేటాయించిన నిధులు వారి ప్రతిపాదనల ద్వారానే ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ఖర్చు చేయాల్సి ఉంది. ఇది ఆనవాయితీ కూడా. అయితే గత ఐదేళ్లలో చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలకే హక్కులు, బాధ్యతలు కల్పించిన బాబు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను పూచిక పుల్లల్లా చూశారు. వారికి నిధులు ఇవ్వలేదు. బాధ్యతలు పంచలేదు. ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై వివక్ష చూపించారు. వారికి ఇవ్వాల్సిన నిధులను ఆ నియోజకవర్గంలో ఓడిపోయిన ఎమ్మెల్యేల పేరున ఏకంగా జీవోలే జారీ చేసి మంజూరు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల గౌరవానికి భంగం కలిగించారు. ప్రజా తీర్పును అగౌరవ పరిచారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
నిధులివ్వకపోగా ప్రలోభాలు
జిల్లాలో మార్కాపురం, యర్రగొండపాలెం, సంతనూతలపాడు, గిద్దలూరు, కందుకూరు, అద్దంకి నియోజకవర్గాల్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జంకె వెంకటరెడ్డి, డేవిడ్ రాజు, ఆదిమూలపు సురేష్, ముత్తుమల అశోక్‌రెడ్డి, పోతులరామారావు, గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా ప్రలోభాలకు గురిచేయడంతో మార్కాపురం, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు జంకె, సురేష్ మినహా మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి ఏ ప్రతిపాదనలు ఇచ్చినా ప్రభుత్వం వాటిని పక్కన బెట్టింది.
దీంతో ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటుపడింది. జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను సైతం ఏకపక్షంగా అమలు చేశారు. అభివృద్ధి పనులు వారు సూచించిన చోటే చేపట్టారు. స్థానిక శాసన సభ్యులు ప్రతిపాదనలిచ్చినా అ«ధికారపార్టీ నేతల ఒత్తిడితో అధికారులు వాటిని పక్కన పెట్టేశారు. దీంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో అభివృద్ది పనులు కుంటు పడ్డాయి. మరోవైపు ఓడిపోయిన వ్యక్తుల పేరున అభివృద్ధి పనులకు సంబంధించి ఏకంగా జీఓలు జారిచేసి చంద్రబాబు సర్కారు కొత్త ఆచారానికి తెరలేపడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ప్రాజెక్టులపై నిర్లక్ష్యం
♦ మార్కాపురం నియోజకవర్గంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు దాదాపు నిలిచిపోయాయి. టన్నెల్–1 పనులు రెండు నెలలుగా పూర్తిగా నిలిచిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఇక ఈ ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ, పునరావాసం పనులు ఎప్పుడో ఆగిపోయాయి. మార్కాపురం శివారులోని సుందరయ్య కాలనీ ప్రాంతంలో 350 మంది పేదలు ఏళ్ల తరబడి నివసిస్తున్నారు. వీరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అధికారులకు పలుమార్లు విన్నవించడమే కాకుండా అసెంబ్లీలో సైతం ఎమ్మెల్యే మాట్లాడినా పట్టించుకోలేదు. పొదిలి మండలం కేశవాపురం, మార్కాపురం మండలం పెద్దనాగులవరంలలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములున్నా నిరుపయోగంగా మారాయి. వాటి అభివృద్ధిని ప్రభుత్వం గాలికొదిలింది. పొదిలి టౌన్, రూరల్ పరిధిలో ప్రజలకు తాగునీరు అందించేందుకు రూ.52 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో గతంలో ప్రతిపాదనలు పంపగా చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కన పెట్టింది. ఎమ్మేల్యే పలుమార్లు కోరినా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించలేదు.
♦ సంతనూలపాడు నియోజకవర్గంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలో పునరావాస పనులు పెండింగ్‌లో ఉన్నాయి. చంద్రబాబు సర్కారు నిధులు ఇవ్వకపోవడంతో ఈ పనులు పూర్తికాలేదు. ప్రాజెక్టు పరిధిలో కాలువ పనులు సైతం పూర్తి కాకపోవడంతో ప్రాజెక్టుకి నీరు చేరినా సక్రమంగా పొలాలకు చేరే పరిస్థితి లేదు. బోడపాలెం, బొడ్డూరిపాలెం రోడ్లు చాలాకాలంగా అభివృద్ధికి నోచుకోలేదు. నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి సమస్య ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. సంక్షేమ పథకాలకు సంబంధించి పింఛన్లు, రేషన్ కార్డులు, పక్కా గృహాలు అరకొరగా కూడా మంజూరు చేయలేదు. ఎమ్మెల్యే ప్రతిపాదనలు ఇచ్చినా అధికార పార్టీ ఒత్తిళ్లతో అధికారులు పట్టించుకోవడంలేదు.
ఎమ్మెల్యేలు నేరుగా నిధులు అడిగినా పట్టించుకోని బాబు
వైఎస్సార్ సీపీ శాసనసభ్యులున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులివ్వాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సురేష్, జంకె ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం కోరారు. ఒక్కో నియోజకవర్గంలో పనులకు రూ.4 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చారు. అయినా కూడా ముఖ్యమంత్రి స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment