సాక్షి ప్రతినిధి, ఒంగోలు : చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో గుండ్లకమ్మ ప్రాజెక్టు పట్టించుకోకపోతే దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు పనులను పూర్తి చేసి జాతికి అంకితం చేశారని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చెప్పారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం అద్దంకిలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు ఎన్నికలొచ్చినప్పుడల్లా టెంకాయలు కొట్టడం తప్ప ప్రాజెక్టు నిర్మాణాన్ని పట్టించుకోలేదన్నారు. వైఎస్ హయాంలో ప్రాజెక్టును పూర్తి చేశారన్నారు. మిగిలి ఉన్న రూ.13 కోట్ల పనులను కూడా నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. దీంతో కుడి కాలువ పరిధిలో 52 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా 5 వేల ఎకరాలకు నీళ్లు అందే పరిస్థితి లేదన్నారు. ఎడమ కాలువ పరిధిలో 28 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా 12 వేల ఎకరాలకు నీరు చేరడం లేదన్నారు. రూ.13 కోట్ల పనులు మిగిలి ఉంటే అప్పుడు అంచనాలను రూ.160 కోట్లకు పెంచుకున్నారని వైఎస్.జగన్ విమర్శించారు.
రూ.170 కోట్లతో భవనాశి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టాలని వైఎస్ హయాంలో భూసేకరణ చేశారన్నారు. బాబు నాలుగేళ్ల పాలనలో ప్రాజెక్టును గాలికొదిలేశారన్నారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం సాగర్ ఆయకట్టు కింద వరి పంటకు నీళ్లివ్వడం లేదన్నారు. తెలంగాణలో వరుసగా వరి పంటకు నీళ్లు ఇస్తుంటే.. మన సర్కారు మాత్రం మొండి చేయి చూపించిందన్నారు. కేసీఆర్‌కు ఉన్నదేమిటి... మన ముఖ్యమంత్రికి లేనిదేమిటని... రైతులు ప్రశ్నిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. జిల్లాలో కందులను కొనే పరిస్థితి లేదన్నారు. మద్దతు ధర ఇవ్వకపోవడంతో కందులను రూ.4 వేలకు టీడీపీ దళారులకు అమ్ముకోవాల్సి వస్తుందని వైఎస్ జగన్ విమర్శించారు. వారి వద్ద లంచాలు తీసుకొని ప్రభుత్వం మద్దతు ధరకు కందులను కొనుగోలు చేస్తోందని ఆయన విమర్శించారు. జిల్లాలో 98 శాతం తక్కువ వర్షపాతంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదన్నారు.
అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త గరటయ్య మాట్లాడుతూ బాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో వర్షాలు పడవన్నారు. రాష్ట్రం బాగుండాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. అప్పుడే రైతులకు మేలు జరుగుతుందన్నారు. అద్దంకి నియోజకవర్గంలో అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు బాచిన కృష్ణచైతన్య, వై.వి.భద్రారెడ్డి, అట్ల చినవెంకటరెడ్డి, శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, యువజన విభాగం అధ్యక్షుడు రామానాయుడు, ఒంగోలు నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ వ్యవస్థకు తూట్లు పొడిచిన చంద్రబాబు
బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థకు తూట్లు పొడిచి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం బాబు ప్రత్యేక హోదాను పక్కనపెట్టి ప్యాకేజీకి ఒప్పుకున్నాడన్నారు. హోదాతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్నారు. హోదా కోసం బాబు చిత్తశుద్ధితో సహకరించకపోతే ఆయన్ను జనం క్షమించరన్నారు. జగన్ పాదయాత్ర చూసి టీడీపీ నేతలు తమ పీఠాలు కదిలిపోతాయని బెంబేలెత్తుతున్నారన్నారు. ఆది నుంచి హోదా కోసం వైఎస్సార్‌సీపీ వైఎస్ జగన్ నేతృత్వంలో దశలవారీగా ఉద్యమాలు చేస్తూ వస్తోందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రత్యేక హోదాతోనే ముడిపడి ఉందన్నారు. హోదా సాధన కోసం ఈ నెల 1న కలెక్టరేట్ల ఎదుట ధర్నా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 5న ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపడుతున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఎంపీలు రాజీనామాలు చేస్తారన్నారు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదని మోపిదేవి విమర్శించారు. పైగా హోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారన్నారు. అవినీతి కేసుల కోసం భయపడే చంద్రబాబు హోదా అడగడం లేదన్నారు. సీబీఐ ఎంక్వయిరీలు, జైలుకు పంపుతారేమోననే భయంతోనే బాబు హోదాను పక్కనపెట్టారన్నారు. బాబు అవినీతికి, ద్వంద్వ నీతికి గుణపాఠం చెప్పే రోజు దగ్గర పడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment