అడుగుజాడలు.. | AP CM YS Jagan Steps towards welfare governance | Sakshi
Sakshi News home page

అడుగుజాడలు..

Published Mon, Sep 2 2019 2:39 AM | Last Updated on Mon, Sep 2 2019 2:39 AM

AP CM YS Jagan Steps towards welfare governance - Sakshi

పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం మా నాన్న గారు ఒకడుగు ముందుకు వేస్తే.. ఆయన కొడుకుగా ప్రజల సంక్షేమం కోసం నేను రెండడుగులు ముందుకు వేస్తాను.. నాన్న గారు చనిపోయాక ప్రతి ఇంటిలోనూ ఆయన ఫొటో పెట్టుకున్నారు. నాకూ అదే ఆశ.. నేను మరణించిన తర్వాత కూడా ప్రతి ఇంటా ఆయన ఫొటో పక్కన నా ఫొటో ఉండాలని, ప్రజల హృదయాల్లో కలకాలం నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. 
– ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రతిపక్ష నేత హోదాలో అన్న మాటలివి. 

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత అక్షరాలా పై మాటలను నిజం చేస్తూ ప్రజలకు మేలు చేసే దిశగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వడి వడిగా అడుగులు వేస్తున్నారు. అసలు తెలుగు నాట పేదరిక నిర్మూలన కోసం విప్లవాత్మక రీతిలో ప్రజా సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టిందే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి. సామాన్యులకు మేలు చేయాలంటే ప్రధానంగా వారికి వైద్యం, విద్య అందుబాటులోకి తేవాలన్నది వైఎస్‌ లక్ష్యం. అదే ఆలోచనతో ఆయన నిరుపేదలకు సైతం కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందుబాటులోకి తెచ్చారు. డబ్బు లేక ఉన్నత విద్యకు దూరం కారాదన్న ఒకే ఒక్క సదాశయంతో పేద విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని వర్తింపజేశారు. అంతలోనే ఆయన మనందరికీ దూరమయ్యారు. తదనంతర రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసిందే.

మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్న వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే.. తాను ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన మేరకు ‘నవరత్నాలు’ అమలు చేసేందుకు నడుం బిగించారు. నవరత్నాల ద్వారా ఇప్పటి వరకూ దేశంలో కనీ వినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలను రూపొందించారు. ప్రజలు తనకు 151 శాసనసభ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాల్లో చరిత్రాత్మక విజయం అందించాక తన తొలి ప్రసంగంలో.. ‘ఆరు నెలలు లేదా సంవత్సరంలోనే మీ అందరి (ప్రజలు) చేత జగన్‌ మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను’ అన్నారు. ఆ మాటలను నిజం చేసేలా ముందుకు దూసుకెళ్తున్నారు. ఏదైనా ఒక మాట ఇస్తే తప్పని గుణం దివంగత వైఎస్‌కు ఉండేది. అదే విధానాన్ని తాను కూడా పుణికిపుచ్చుకున్న జగన్‌ ప్రజాసంకల్ప యాత్రలో లక్షలాది మంది జనం సమక్షంలో ఇచ్చిన హామీలను అమలు పరిచేందుకు తహ తహ లాడటం చూస్తుంటే ఆ కుటుంబం జన్యువుల్లోనే మాట తప్పని గుణం ఇమిడి ఉందనేది అవగతం అవుతుంది.
 
అదే వేగం.. అంతకు మించిన దూకుడు.. 
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు.. మే 30వ తేదీన తొలి సంతకంతో రాష్ట్రంలోని యావత్‌ అవ్వా తాతల పింఛన్లు పెంచారు. వారికి ఇచ్చే నెల పింఛన్‌ మొత్తాన్ని రూ.2000 నుంచి రూ.2250కి పెంచడమే కాకుండా ఏటా రూ.250 చొప్పున పెంచుతూ రూ.3000కు తీసుకెళ్లే ఫైలుపై తొలి సంతకం చేశారు. అచ్చంగా దివంగత వైఎస్‌ కూడా.. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే అదే వేదికపై నుంచి వ్యవసాయం కుదేలై కునారిల్లుతున్న రైతులకు మేలు కలిగిస్తూ ఉచిత విద్యుత్‌ ఫైలుపై సంతకం చేయడం తెలిసిందే. అప్పటి నుంచి వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా నేటికీ కొనసాగుతోంది. ఇప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి కాగానే ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు అంశాలపై తొలి సంతకాలు చేశారు. కానీ ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు.  

జగన్‌ సీఎం కావడం కాకతాళీయం కాదు 
వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం కాకతాళీయం కాదు. క్లిష్టమైన పరిస్థితుల మధ్య పదేళ్లకు పైగా పోరాడి అనేక సంక్షోభాలను ఎదుర్కొని ముఖ్యమంత్రి గద్దె నెక్కారు. తండ్రీ కొడుకులు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కావడం కొత్తేమీ కాదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రథమం. ఎన్నికల్లో గెలిచాక ప్రజలకు మేలు చేయడానికి మీన మేషాలు లెక్కించడం ఎందుకు? అని జగన్‌ భావించారు. ఇలా అనుకున్నదే తడవుగా గద్దె నెక్కిన పక్షం రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ జరిగిన మూడో రోజునే సుమారు ఏకబిగిన 8 గంటల పాటు సాగిన తొలి మంత్రివర్గ సమావేశంలో పలు సంక్షేమ పథకాల అమలుకు నిర్ణయం తీసుకోవడం ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా జరగలేదు. 

తొలి అడుగుల్లో తనదైన ముద్ర 
తొలి బడ్జెట్‌ సమావేశాల్లోనే 19 బిల్లులను ప్రవేశ పెట్టి ఆమోదింప జేసిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానిదేనని చెప్పాలి. ప్రజాహితం కోరి తానొక నిర్ణయం తీసుకుంటే దానిని ఎంత చిత్తశుద్ధితో అమలు చేస్తారనేది జగన్‌ ఈ సమావేశాల్లో నిరూపించారు. ముఖ్యమైన బిల్లులివి.. 
- శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటు 
నామినేటెడ్‌ పదవుల్లో బీసీ ఎస్సీ,ఎస్టీ మైనారిటీలకు 50% రిజర్వేషన్లు 
నామినేటెడ్‌ పనుల్లో బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు 50% రిజర్వేషన్లు 
నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు 
- నామినేటెడ్‌ పనుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు 
టీటీడీ మినహా అన్ని ఆలయాలు, ట్రస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు 50% రిజర్వేషన్లు 
పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే  
ఆంధ్రప్రదేశ్‌ పంట సాగుదారు హక్కుల బిల్లు 
మద్య నియంత్రణ చట్టానికి సవరణ.. దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధం
ముందస్తు న్యాయ పరిశీలన అనంతరమే టెండర్లు
లోకాయుక్త ఏర్పాటు 8 ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం 
ఏపీ వ్యవసాయ ఉత్పత్తుల,పశు సంపద మార్కెట్ల సవరణ బిల్లు 
- పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ 
ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement