సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అందరి ఆశీస్సులు, దీవెనలతో అధికారంలోకి వస్తూనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి అందరి మన్ననలు అందుకుంటానని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శనివారం మధ్యాహ్నం కనిగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిం చారు. జిల్లాలోని రామతీర్థం, గుండ్లకమ్మ ప్రాజెక్టులనిర్మాణం ప్రారంభించి పూర్తి చేసింది దివంగత నేత వైఎస్సార్ అన్నారు. రామతీర్థం ద్వారా కనిగిరి, కందుకూరు ప్రాంతా లకు తాగునీరిచ్చిన ఘనత ఆయనదేనన్నారు. వెలి గొండ ప్రాజెక్టు పనులు వైఎస్ హయాంలోనే వేగంగా జరిగాయన్నారు. 18 కి.మీ. ఉన్న టన్నెల్–1 పనులను వైఎస్ హయాంలో 13 కి.మీ., అంతే పొడవున్న టన్నెల్–2 పనులను 9 కి.మీ. మేర పూర్తి చేశారన్నారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు పట్టుమని 4 కి.మీ. పనులు కూడా పూర్తి చేయలేదన్నారు.
చంద్రబాబు పాలనలో ప్రజల ఇబ్బందులు:
తొలుత పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నాలుగేళ్ల పాటు చంద్రబాబు పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందే పరిస్థితి లేదన్నారు. అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే పథకాలను పంచిపెడుతున్నారని విమర్శించారు. ప్రజల కష్టాలు చూసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. యాత్ర ద్వారా ప్రజా సమస్యలను గుర్తించి నాడు వైఎస్ తరహాలో వాటి పరిష్కారానికి జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తారన్నారు. వైఎస్ పాలన రావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య మంత్రి కావాలన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి జగన్ కృషి చేస్తారన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తూనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు.
ప్రతి గ్రామంలోనూ తాగునీటి సమస్య:
కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్ మాట్లాడుతూ కనిగిరి ప్రాంత ప్రజలు వరుస కరువులతో అల్లాడిపోతున్నారన్నారు. ప్రతి గ్రామంలోనూ తాగు, సాగునీరు సమస్య ఉందన్నారు. ఫ్లోరైడ్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే కొంత మేర ఉపశమనం లభిస్తుందన్నారు. వైఎస్.జగన్ ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంత సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ డి.సి గోవిందరెడ్డి, సమన్వయకర్తలు ఐ.వి.రెడ్డి, తూమాటి మాధవరావు, పార్టీ నేతలు ఎం.ఎం.కొండయ్య, గంగాడ సుజాత, వైఎం ప్రసాదరెడ్డి, రంగనాయకులు రెడ్డి, ఎస్‌కె బుజ్జి, బొల్లా మాల్యాద్రి చౌదరి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
హోదా సాధించే వరకు పోరాటం: ఎంపీ వైవీ
ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ నాలుగేళ్ల టీడీపీ పాలనలో అబద్ధపు హామీలతో అన్ని వర్గాల ప్రజలను మోసగించారన్నారు. ప్రజల కష్టాలను చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అవినీతిమయం చేశాడన్నారు. పార్లమెంట్ హామీలను అమలు చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. హోదా రాకపోవడంతో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తుందన్నారు. చంద్రబాబు ఇప్పుడు హోదా పల్లవి అందుకున్నాడని విమర్శించారు.
వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 6న ఎంపీ పదవులకు రాజీనామాలు చేస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు జిల్లాకు వెన్నుముక అన్నారు. చంద్రబాబు ప్రాజెక్టు పనులను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని విమర్శించారు. జిల్లాలో ఫ్లోరైడ్ అధికంగా ఉందన్నారు. వైఎస్ జగన్ జిల్లాను సందర్శిస్తున్నాడని తెలిసి ప్రభుత్వం అప్పటికప్పుడు డయాలసిస్ కేంద్రాలను ప్రకటించిందన్నారు. ఫ్లోరైడ్ సమస్య కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ చెప్పారు. జిల్లాలో 53 గ్రామాల్లో విషమ పరిస్థితి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment