కరువుని తరిమేద్దాం
⇒ ప్రణాళికలు సిద్ధం చేయండి
⇒ అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
⇒ గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాను కరువు రహిత జిల్లాగా తయారు చేయడం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. సమగ్ర నీటి యాజమాన్యం ద్వారా నీటి వనరులన్నింటినీ సమీకృతం చేసుకుని భూగర్భ జలాలను అభివృద్ధి చేయాలని, ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో ఉన్న గుండ్లకమ్మ రిజర్వాయర్‌ను శనివారం ముఖ్యమంత్రి పరిశీలించారు. మోడల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించి ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ప్రాజెక్టుపైకి నడుచుకుంటూ వచ్చి పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు ఆవరణలో ఉన్న కల్యాణ మండపంలో ఆయన సమీక్ష జరిపారు. వ్యవసాయ, ఉద్యానవన, ఇరిగేషన్ శాఖల అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీటిపారుదల శాఖ, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్య్సశాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఏ గ్రామంలో పడ్డ వర్షపు నీరు ఆ గ్రామంలో నిల్వ చేయడానికి కృషి చేయాలన్నారు.
అదే సమయంలో నదుల ద్వారా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాగార్జునసాగర్ కాల్వల ఆధునీకరణకు ప్రపంచబ్యాంకు నిధులు కేటాయించామని, ఈ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. గుండ్లకమ్మతో పాటు కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయడానికి అవసరమైన భూసేకరణ పూర్తి చేసి 1.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ఆదేశించారు. వెలుగొండ ప్రాజెక్టు కింద మొదటి సొరంగం నిర్మాణం వచ్చే సంవత్సరానికి పూర్తి చేసి, ఆ నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులను నింపడం వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఫ్లోరోసిస్ సమస్యను కూడా పరిష్కరించవచ్చన్నారు.
జిల్లాలో ఉపాధి హామీ కింద రూ. 50 కోట్లు నిధులు, ప్రభుత్వం ఇచ్చిన రూ. 30 కోట్లు నిధులతోపాటు నీటిపారుదల, వాటర్‌షెడ్ నిధులన్నీ కలిపి వాగులు, చెరువులు, కాలువలు, చెక్‌డ్యామ్‌లు మరమ్మత్తులు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి ప్రాముఖ్యత ఉందని, రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు 25 శాతం ఉండగా, ఇక్కడ 39 శాతం ఉండటం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ జిల్లా పరిస్థితులను వివరించారు.
ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రోడ్లు రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు, జెడ్పీ ఛైర్మన్ నూకసాని బాలాజీ, ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, ఏలూరి సాంబశివరావు, ఆమంచి కృష్ణమోహన్, కదిరి బాబూరావు, డీసీసీబీ ఛైర్మన్ ఈదర మోహన్, పార్టీ నేతలు కరణం బలరామ్, బీఎన్ విజయకుమార్, కరణం వెంకటేష్, పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు.
రైతులకు రుణమాఫీ చేసినట్లే ... డ్వాక్రా మహిళలకు చేస్తాం
ఒంగోలు/తాళ్ళూరు/ముండ్లమూరు: రైతులకు రుణమాఫీ చేసినట్టేనని, ఇక మిగిలింది డ్వాక్రా రుణాలేనని, అవి కూడా మాఫీ చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం మధ్యాహ్నం ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరం గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులకు హాజరైన ఆయన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. పదేళ్ళ కాంగ్రెస్ అవినీతి పాలన మూలంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు పూర్తయినా కనీసం ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేకపోతున్నామన్నారు.
రాష్ట్ర రోడ్డు రవాణాశాఖా మంత్రి శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో పూర్తి స్థాయి అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేశామని, ఇంటర్నేషనల్ డ్రై వింగ్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నీటి పారుదలశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత టీడీపీదేనన్నారు. మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పోలవరం గ్రామాన్ని నీరు- చెట్టు పథకంలో ఎంపిక చేయటం గ్రామస్తులు అదృష్టమని చెప్పారు. రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు కరణం బలరామక్రిష్ణమూర్తి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, కదిరి బాబూరావు, డోల బాల వీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు, యువ పారిశ్రామికవేత్త శిద్ధా సుధీర్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, దివి శివరామ్, చీరాల, అద్దంకి ఇన్‌చార్జులు పోతుల సునీత, కరణం వెంకటేష్‌బాబు, కలెక్టర్ హరి జవహార్‌లాల్, డీఆర్‌డీఏ, డ్వామా పీడీ ఎస్.మురళి, పోలప్ప, దర్శి నియోజకర్గ ప్రత్యేక అధికారి రవి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, ఎంపీపీ మందలపు వెంకటరావు, జెడ్పీటీసీ కొక్కెర నాగరాజు, పోలవరం సర్పంచి ఎం. మల్లిఖార్జున రావు, సర్పంచులు కూరపాటి శ్రీనివాసరావు, మేదరమిట్ల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.