Officials review
-
చరిత్రలో లేని విధంగా ఇళ్లు నిర్మాణం : సీఎం జగన్
సాక్షి, అమరావతి: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదలకు ఇళ్లు ఇస్తున్నామని.. సౌకర్యవంతంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. వైఎస్సార్ జగనన్న కాలనీలు ఆదర్శంగా ఉండాలే తప్ప, మురికివాడలుగా మారకూడదని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సకాలంలో నిధులు విడుదలయ్యేలా కార్యాచరణ వేసుకోవాలని సీఎం తెలిపారు. సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ద పెట్టండి, ప్రతీ ఒక్క లేఔట్‌ను రీవిజిట్ చేసి దానికి తగిన విధంగా అందంగా, అహ్లాదంగా తీర్చిదిద్దాలని చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు, కాలనీల్లో కల్పించనున్న మౌలిక సదుపాయాలపై సమగ్రంగా సమీక్షించారు. మౌలిక సదుపాయాల విషయంలో పలు సూచనలు చేశారు. 15 లక్షల ఇళ్ల నిర్మాణం ఇళ్ల నిర్మాణానికి ఏయే సమయాల్లో ఎంత నిధులు విడుదలచేయాలన్నదానిపై ఒక ప్రణాళిక వేయాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనివల్ల పేదలకు ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా ముందుకు సాగుతాయని పేర్కొన్నారు. తొలి విడతలో దాదాపు 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మూడు ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఇప్పటికి 83 శాతం లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. మిగతా వారినుంచి కూడా వెంటనే ఆప్షన్లు స్వీకరించాలని సీఎం తెలిపారు. మూడు ఆప్షన్లలో ఏ ఆప్షన్ ఎంచుకున్నా.. లబ్ధిదారుకు రాయితీపై సిమెంటు, స్టీల్‌ను అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిర్మాణ సామగ్రి కూడా అందరికీ అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. మంచి జీవన ప్రమాణాలు ఉండాలి అన్ని ఇళ్లనూ జియో ట్యాగింగ్ చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎక్కడా నిధుల కొరత లేకుండా చూడాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని, వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందాలని ఆకాంక్షించారు. రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, పార్క్‌లు ఇతరత్రా మౌలిక సదుపాయాలు ఉండాలని స్పష్టం చేశారు. కొత్తగా నిర్మాణం కానున్న కాలనీల్లో ప్రతి 2 వేల జనాభాకు అంగన్వాడీ ఉండాలని, ప్రతి 1,500 నుంచి 5వేల ఇళ్లకు గ్రంథాలయం అందుబాటులో ఉండాలని తెలిపారు. పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు సరసమైన ధరలకు ప్లాట్లు ఇవ్వడం ద్వారా ఏర్పాటు కానున్న కాలనీల్లో కూడా మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలనే అంశంపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా కాలనీల డిజైన్లను సీఎం పరిశీలించారు. కాలనీల్లో ఆహ్లాదం ఆరోగ్యం అందించే మొక్కలను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్‌కుమార్ ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రతీప్ కుమార్, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, స్టేట్ హౌజింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: ప్లాంట్‌పై అసెంబ్లీ తీర్మానం చేస్తాం: సీఎం జగన్ ఉన్నత విద్యకు కొత్త రూపు: సీఎం జగన్ -
‘గ్రేటర్’కు చెడ్డ పేరు తేవద్దు
అధికారులపై మేయర్ నరేందర్ ఆగ్రహం విధులను నిర్లక్ష్యం చేస్తే చర్య తీసుకోవాలని ఆదేశం అధికారులతో సమీక్ష వరంగల్ అర్బన్ : కొంతమంది అధికారులు, ఉద్యోగులు బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, గ్రేటర్‌కు చెడ్డపేరు తేవద్దని గ్రేటర్ మేయర్ నన్నపునేని నరేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో వింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లోని ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని అన్నారు. అధికారులు, ఉద్యోగుల విధులపై నిఘా ఉంచాలని అడిషనల్ కమిషనర్ షాహిద్ మసుద్‌కు సూచించారు. నిర్లక్ష్యపు అధికారులపై చర్య తీసుకోవాలని హెచ్చరించారు. ప్రజారోగ్య విభాగానికి 25 సంవత్సరాలుగా ఒకే కాంట్రాక్టర్ రసాయనాలను సరఫరా చేయడం సరికాదని, కాంట్రాక్టర్‌ను మార్చలని ఎంహెచ్వో రాజారెడ్డిని ఆదేశించారు. స్వచ్ఛత ఆటోలు రాబోతున్నాయని, డస్ట్బిన్లు కొనుగోలు చేయాలని ఈఈ లింగామూర్తిని ఆదేశించారు. మహానగరంలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు, చూసీచూడనట్లుగా వ్యవహరించడం సరికాదన్నారు. క్షేత్ర స్థాయిలో తనీఖీలు నిర్వహించి అక్రమార్కులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఆన్లైన్ అనుమతులు, గ్రీవెన్స్ సెల్ ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ షాహిద్ మసుద్, డిప్యూటీ కమిషనర్ ఇంద్రసేనా రెడ్డి, సెక్రటరీ నాగరాజ రావు, ఇన్చార్జి ఎస్ఈ భిక్షపతి, ఇన్చార్జి సీపీ చంద్రిక, ఈఈ లింగామూర్తి, ఎంహెచ్వో రాజారెడ్డి, ఏసీపీ శైలజ,గణపతి, శ్యాంకుమార్, రవి,ఇన్చార్జ్ ఉద్యాన వన అధికారి సదానందం పాల్గొన్నారు. -
వేసవి రక్షణ చర్యలపై టీటీడీ జేఈవో సమీక్ష
తిరుమల : వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల రక్షణ చర్యలపై టీటీడీ జేఈవో కెఎస్.శ్రీనివాసరాజు మంగళవారం స్థానిక అన్నమయ్య భవనంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఈ వేసవిలో ఎక్కువ సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారని, అన్ని విభాగాల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేసవిలో భక్తులకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర మందులను అవసరమైనంత స్టాక్ ఉంచుకోవాలని వైద్యాధికారిని ఆదేశించారు. ఘాట్‌రోడ్డులోని పలు ప్రదేశాల్లో నీటి తొట్టెలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నీటిని నింపాల్సిన అవసరముందని ఆటవీ శాఖాధికారులకు సూచించారు. తిరుమలలోని వంట చెరుకు డిపోను రింగురోడ్డు ప్రాంతానికి మార్పు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులకు శిక్షణ కార్యక్రమాన్ని మరింత మెరుగుపరచాలన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ 1, 2, ఇతర ప్రాం తాల్లో వృథాగా ఉన్న కుర్చీలు, బల్లలు తదితర సామగ్రిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. వర్షం కురిసినప్పుడు ఏటీసీ ప్రాంతంలో ఎక్కువగా వర్షపు నీరు నిలిస్తోందని, భక్తులకు ఇబ్బంది లేకుం డా సత్వరం తొలగించే చర్యలు చేపట్టాల న్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్ఈ- శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్ఈ(ఎలక్ట్రికల్) శ్రీవేంకేటశ్వర్లు, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ శివారెడ్డి, ట్రాన్స్‌పోర్టు జీఎమ్ శేషారెడ్డి, డీఎఫ్‌వో శివరాంప్రసాద్, డెప్యూటీఈవో కోదండరామారావు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
కరువుని తరిమేద్దాం
⇒ ప్రణాళికలు సిద్ధం చేయండి ⇒ అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ⇒ గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాను కరువు రహిత జిల్లాగా తయారు చేయడం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. సమగ్ర నీటి యాజమాన్యం ద్వారా నీటి వనరులన్నింటినీ సమీకృతం చేసుకుని భూగర్భ జలాలను అభివృద్ధి చేయాలని, ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో ఉన్న గుండ్లకమ్మ రిజర్వాయర్‌ను శనివారం ముఖ్యమంత్రి పరిశీలించారు. మోడల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించి ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ప్రాజెక్టుపైకి నడుచుకుంటూ వచ్చి పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు ఆవరణలో ఉన్న కల్యాణ మండపంలో ఆయన సమీక్ష జరిపారు. వ్యవసాయ, ఉద్యానవన, ఇరిగేషన్ శాఖల అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీటిపారుదల శాఖ, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్య్సశాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఏ గ్రామంలో పడ్డ వర్షపు నీరు ఆ గ్రామంలో నిల్వ చేయడానికి కృషి చేయాలన్నారు. అదే సమయంలో నదుల ద్వారా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాగార్జునసాగర్ కాల్వల ఆధునీకరణకు ప్రపంచబ్యాంకు నిధులు కేటాయించామని, ఈ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. గుండ్లకమ్మతో పాటు కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయడానికి అవసరమైన భూసేకరణ పూర్తి చేసి 1.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ఆదేశించారు. వెలుగొండ ప్రాజెక్టు కింద మొదటి సొరంగం నిర్మాణం వచ్చే సంవత్సరానికి పూర్తి చేసి, ఆ నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులను నింపడం వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఫ్లోరోసిస్ సమస్యను కూడా పరిష్కరించవచ్చన్నారు. జిల్లాలో ఉపాధి హామీ కింద రూ. 50 కోట్లు నిధులు, ప్రభుత్వం ఇచ్చిన రూ. 30 కోట్లు నిధులతోపాటు నీటిపారుదల, వాటర్‌షెడ్ నిధులన్నీ కలిపి వాగులు, చెరువులు, కాలువలు, చెక్‌డ్యామ్‌లు మరమ్మత్తులు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి ప్రాముఖ్యత ఉందని, రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు 25 శాతం ఉండగా, ఇక్కడ 39 శాతం ఉండటం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ జిల్లా పరిస్థితులను వివరించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రోడ్లు రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు, జెడ్పీ ఛైర్మన్ నూకసాని బాలాజీ, ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, ఏలూరి సాంబశివరావు, ఆమంచి కృష్ణమోహన్, కదిరి బాబూరావు, డీసీసీబీ ఛైర్మన్ ఈదర మోహన్, పార్టీ నేతలు కరణం బలరామ్, బీఎన్ విజయకుమార్, కరణం వెంకటేష్, పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. రైతులకు రుణమాఫీ చేసినట్లే ... డ్వాక్రా మహిళలకు చేస్తాం ఒంగోలు/తాళ్ళూరు/ముండ్లమూరు: రైతులకు రుణమాఫీ చేసినట్టేనని, ఇక మిగిలింది డ్వాక్రా రుణాలేనని, అవి కూడా మాఫీ చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం మధ్యాహ్నం ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరం గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులకు హాజరైన ఆయన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. పదేళ్ళ కాంగ్రెస్ అవినీతి పాలన మూలంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు పూర్తయినా కనీసం ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేకపోతున్నామన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణాశాఖా మంత్రి శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో పూర్తి స్థాయి అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేశామని, ఇంటర్నేషనల్ డ్రై వింగ్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నీటి పారుదలశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత టీడీపీదేనన్నారు. మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పోలవరం గ్రామాన్ని నీరు- చెట్టు పథకంలో ఎంపిక చేయటం గ్రామస్తులు అదృష్టమని చెప్పారు. రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు కరణం బలరామక్రిష్ణమూర్తి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, కదిరి బాబూరావు, డోల బాల వీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు, యువ పారిశ్రామికవేత్త శిద్ధా సుధీర్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, దివి శివరామ్, చీరాల, అద్దంకి ఇన్చార్జులు పోతుల సునీత, కరణం వెంకటేష్‌బాబు, కలెక్టర్ హరి జవహార్‌లాల్, డీఆర్డీఏ, డ్వామా పీడీ ఎస్.మురళి, పోలప్ప, దర్శి నియోజకర్గ ప్రత్యేక అధికారి రవి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, ఎంపీపీ మందలపు వెంకటరావు, జెడ్పీటీసీ కొక్కెర నాగరాజు, పోలవరం సర్పంచి ఎం. మల్లిఖార్జున రావు, సర్పంచులు కూరపాటి శ్రీనివాసరావు, మేదరమిట్ల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
నిద్రమత్తు వదిలించారు
ఒకటో డివిజన్లో ఉదయం 5.30 గంటలకే కమిషనర్ పర్యటన చెట్టు కిందే అధికారులతో సమీక్ష పన్ను వసూళ్లపై దృష్టిపెట్టాలని ఆదేశం విజయవాడ సెంట్రల్ : మంగళవారం ఉదయం 5.30 గంటలు... ఇంకా మంచుతెరలు వీడలేదు... కానీ, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండ్యన్ ఒకటో వార్డుకు చేరుకున్నారు. డివిజన్లో పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ పి.శివరంజని వచ్చి కారులో వెళదామని చెప్పినా, తిరస్కరించి రెండు గంటలపాటు నడుచుకుంటూ డివిజన్ మొత్తం కలియతిరిగారు. సిద్ధార్థనగర్, ఊర్మిళానగర్, గుణదల ప్రాంతాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేశారు. మర్రిచెట్టు కిందే అధికారులతో సమావేశం ఏర్పాటుచేశారు. డివిజన్లో స్థితిగతులపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఏం చేయాలి.. ఎప్పటిలోపు పూర్తిచేయాలనే విషయాలపై పలు సూచలు, సలహాలు ఇచ్చారు. ఎన్నడూ లేనివిధంగా తెల్లవారక ముందే డివిజన్ పర్యటనకు శ్రీకారం చుట్టిన కమిషనర్ అధికారులకు నిద్రమత్తు వదిలించారు. మీ సమస్యలు చెప్పాలని ప్రజల నుంచే నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరులోపు పన్నులు వసూలు చేయాలని ఆదేశం ఖాళీ స్థలాల వివరాల గురించి రెవెన్యూ అధికారులను ఆరా తీశారు. వెయ్యి ఖాళీ స్థలాలు ఉన్నాయని, ఇప్పటివరకు 500 స్థలాలకు సంబంధించి మాత్రమే పన్ను వసూలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. మిగిలిన వాటి నుంచి ఎందుకు వసూలు చేయలేదని కమిషనర్ ప్రశ్నించారు. నీళ్లు నమిలిన అధికారులు వచ్చే నెల 5వ తేదీలోపు వసూలు చేస్తామని బదిలిచ్చారు. ఈ నెలాఖరులోపు మొత్తం పన్నులు వసూలుచేయాని కమిషనర్ ఆదేశించారు. రికార్డులను పరిశీలించారు. ఖాళీ స్థలాలు, ఆస్తిపన్ను వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. చెత్తపై అవగాహన కల్పించాలి కాల్వల్లో చెత్త, వ్యర్థాలను వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి కమిషనర్ సూచించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కాల్వగట్లపై పర్యటించాలని ప్రజారోగ్య విభాగం సిబ్బందిని ఆదేశించారు. కార్పొరేటర్ సహకారంతో సమావేశాలు ఏర్పాటుచేసి చెత్త వేయవద్దని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని చెప్పారు. గృహనిర్మాణాల ప్లాన్లు త్వరగా మంజూరుచేయాలని టౌన్‌ప్లానింగ్ అధికారులకు సూచించారు. ఏలూరురోడ్డు, బీఆర్టీఎస్రోడ్డు, జాతీయ రహదారిపై ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్లను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. రైల్వేట్రాక్ సమీపంలో ఉంటున్న 60 కుటుంబాలకు మంచినీటి కనెక్షన్లు ఇవ్వాలని కార్పొరేటర్ కోరగా, సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపొందించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. బుడమేరు వంతెనపై రెయిలింగ్ ఏర్పాటుకు నివేదిక సిద్ధం చేయాలని చెప్పారు. ఊర్మిళానగర్ ప్రాంతంలో రోడ్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా, కమిషనర్ సానుకూలంగా స్పందించారు. కార్పొరేటర్ పి.శివరంజనీ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్, డెప్యుటీ కమిషనర్ (రెవెన్యూ) డి.వెంకటలక్ష్మి, ఈఈ ధనుంజయ, సిటీప్లానర్ ఎస్.చక్రపాణి, ఏసీపీ వి.సునీత, ఏఎంహెచ్ఓ పి.రత్నావళి తదితరులు పాల్గొన్నారు.