నిద్రమత్తు వదిలించారు
ఒకటో డివిజన్‌లో ఉదయం 5.30 గంటలకే కమిషనర్ పర్యటన
చెట్టు కిందే అధికారులతో సమీక్ష
పన్ను వసూళ్లపై దృష్టిపెట్టాలని ఆదేశం
విజయవాడ సెంట్రల్ : మంగళవారం ఉదయం 5.30 గంటలు... ఇంకా మంచుతెరలు వీడలేదు... కానీ, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండ్యన్ ఒకటో వార్డుకు చేరుకున్నారు. డివిజన్‌లో పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ పి.శివరంజని వచ్చి కారులో వెళదామని చెప్పినా, తిరస్కరించి రెండు గంటలపాటు నడుచుకుంటూ డివిజన్ మొత్తం కలియతిరిగారు. సిద్ధార్థనగర్, ఊర్మిళానగర్, గుణదల ప్రాంతాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేశారు. మర్రిచెట్టు కిందే అధికారులతో సమావేశం ఏర్పాటుచేశారు. డివిజన్‌లో స్థితిగతులపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఏం చేయాలి.. ఎప్పటిలోపు పూర్తిచేయాలనే విషయాలపై పలు సూచలు, సలహాలు ఇచ్చారు. ఎన్నడూ లేనివిధంగా తెల్లవారక ముందే డివిజన్ పర్యటనకు శ్రీకారం చుట్టిన కమిషనర్ అధికారులకు నిద్రమత్తు వదిలించారు. మీ సమస్యలు చెప్పాలని ప్రజల నుంచే నేరుగా అడిగి తెలుసుకున్నారు.
ఈ నెలాఖరులోపు పన్నులు వసూలు చేయాలని ఆదేశం
ఖాళీ స్థలాల వివరాల గురించి రెవెన్యూ అధికారులను ఆరా తీశారు. వెయ్యి ఖాళీ స్థలాలు ఉన్నాయని, ఇప్పటివరకు 500 స్థలాలకు సంబంధించి మాత్రమే పన్ను వసూలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. మిగిలిన వాటి నుంచి ఎందుకు వసూలు చేయలేదని కమిషనర్ ప్రశ్నించారు. నీళ్లు నమిలిన అధికారులు వచ్చే నెల 5వ తేదీలోపు వసూలు చేస్తామని బదిలిచ్చారు. ఈ నెలాఖరులోపు మొత్తం పన్నులు వసూలుచేయాని కమిషనర్ ఆదేశించారు. రికార్డులను పరిశీలించారు. ఖాళీ స్థలాలు, ఆస్తిపన్ను వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
చెత్తపై అవగాహన కల్పించాలి
కాల్వల్లో చెత్త, వ్యర్థాలను వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి కమిషనర్ సూచించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కాల్వగట్లపై పర్యటించాలని ప్రజారోగ్య విభాగం సిబ్బందిని ఆదేశించారు. కార్పొరేటర్ సహకారంతో సమావేశాలు ఏర్పాటుచేసి చెత్త వేయవద్దని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని చెప్పారు. గృహనిర్మాణాల ప్లాన్లు త్వరగా మంజూరుచేయాలని టౌన్‌ప్లానింగ్ అధికారులకు సూచించారు. ఏలూరురోడ్డు, బీఆర్టీఎస్‌రోడ్డు, జాతీయ రహదారిపై ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్లను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. రైల్వేట్రాక్ సమీపంలో ఉంటున్న 60 కుటుంబాలకు మంచినీటి కనెక్షన్లు ఇవ్వాలని కార్పొరేటర్ కోరగా, సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపొందించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. బుడమేరు వంతెనపై రెయిలింగ్ ఏర్పాటుకు నివేదిక సిద్ధం చేయాలని చెప్పారు. ఊర్మిళానగర్ ప్రాంతంలో రోడ్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా, కమిషనర్ సానుకూలంగా స్పందించారు. కార్పొరేటర్ పి.శివరంజనీ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్, డెప్యుటీ కమిషనర్ (రెవెన్యూ) డి.వెంకటలక్ష్మి, ఈఈ ధనుంజయ, సిటీప్లానర్ ఎస్.చక్రపాణి, ఏసీపీ వి.సునీత, ఏఎంహెచ్‌ఓ పి.రత్నావళి తదితరులు పాల్గొన్నారు.