పునరావాస కాలనీల గురించి పట్టించుకోరా?
► అధికారులపై జేసీ నాగలక్ష్మి ఆగ్రహం
► త్వరగా పూర్తిచేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక
ఒంగోలు టౌన్ : గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలోని పునరావాస కాలనీల్లో పనులు నత్తనడక సాగడంపై జాయింట్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత కాలవ్యవధిలోగా పనులు పూర్తి చేయకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో గుండ్లకమ్మ ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోని పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల కల్ప నపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గుండ్లకమ్మ ప్రాజెక్టు పునరావాస కాలనీల్లో పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కాలనీల్లో నిర్మించనున్న ఆలయాలకు టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంపట్ల అసహనం వ్యక్తం చేశారు. రెండు మూడు ఆలయాల నిర్మాణాలను ఒక ప్యాకేజీ కింద టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. మంచినీటి పథకాల నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల భవనాల నిర్మాణాలు పూర్తయినందున వాటి నిర్వహణను సంబంధిత శాఖలు తీసుకోవాలన్నారు. పునరావాస కాలనీల్లో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలకు వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు.
వెలుగొండపై నివేదిక ఇవ్వాలి..
వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, పునరావాస కాలనీలకు సంబంధించి నివేదిక అందించాలని సంబంధిత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను నాగలక్ష్మి ఆదేశించారు. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలన్నారు. అదేవిధంగా పునరావాస కాలనీల్లో మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి నిర్వహించే సమావేశానికి కచ్చితంగా పురోగతి కనిపించాలన్నారు. ఈ సమావేశంలో పీఏ టు స్పెషల్ కలెక్టర్ వెంకటరావు, గుండ్లకమ్మ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉదయభాస్కర్, వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భాస్కరనాయుడు, కొండయ్య, ఆర్‌డబ్లు్యఎస్ ఈఈ ఆలి, ప్రాజెక్టŠస్ ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.