సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అవినీతి, అలసత్వంవల్లే గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు దిగువ భాగం కొట్టుకుపోయిందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టంచేశారు. 2014–19 మధ్య నిపుణులతో కూడిన డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ పలుమార్లు గుండ్లకమ్మ ప్రాజెక్టును తనిఖీ చేసిందని.. కొత్తవి ఏర్పాటుచేసి, గేట్లకు మరమ్మతు చేయాలని నివేదిక ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు.
కానీ, అప్పట్లో ఆ పనులు చేయకుండా.. తూతూమంత్రంగా పనులు చేపట్టి, రూ.5.15 కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని ఆరోపించారు. ఆ నిధులను నిపుణుల కమిటీ సూచించిన పనులకు వెచ్చించి ఉంటే ఇప్పుడు గేట్లు కొట్టుకుపోయేవే కావన్నది వాస్తవం కాదా? అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును అంబటి ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..
బాబుది నీచ మనస్తత్వం..
మిచాంగ్ తుపానువల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి సీఎం జగన్ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబు బురదజల్లుతూ నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఎల్లో మీడియా దిగజారుడు రాతలు రాస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేసిన సాయం కంటే ఇప్పుడు సీఎం జగన్ ఎక్కువ సాయం చేస్తున్నారు.
పవన్‌ను చంద్రబాబే ఓడిస్తాడు..
మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ జెండాలు పట్టుకుని తిరిగిన చోట కాంగ్రెస్ భూస్థాపితమైంది. మరోవైపు.. పవన్ పార్టీకి కూకట్‌పల్లి మినహా ఒక్కచోట కూడా డిపాజిట్ రాలేదు. వీళ్లు ఇప్పుడు ఇక్కడికొచ్చి డప్పాలు కొట్టుకుంటున్నారు. ఎలక్షన్లలో జనసేనకు చంద్రబాబు ముష్టివేసినట్లు సీట్లు వేస్తాడు.. అక్కడ జనసేనకు అభ్యర్థులు లేకపోతే టీడీపీ వారే తమ అభ్యర్థుల్ని అందులోకి ప్రవేశపెడతారు. ఇక పవన్‌ను చంద్రబాబే తుక్కుతుక్కుగా ఓడిస్తాడు. టీడీపీ, జనసేన క్యాన్సర్ గడ్డ కంటే ప్రమాదకరమైనవి.
Comments
Please login to add a commentAdd a comment