ధేనువకొండ గ్రామ వ్యూ
సాక్షి, అద్దంకి (ప్రకాశం): గుండ్లకమ్మ పునరావాస కాలనీల ప్రజల కష్టాలను తీర్చే విషయంలో ప్రభుత్వానికి తీరిక దొరకలేదు. పునరావాస కాలనీల్లో నివసించే ప్రజలు అసౌకర్యాల నడుమ అల్లాడుతున్నారు. అది అలా ఉంచితే.. ముంపు గ్రామాల ప్రజలు ఓటు వేసి ఇంటికి చేరుకోవడానికి 70 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. అద్దంకి మండలంలోని ఉత్తర ధేనువకొండ గ్రామాన్ని గుండ్లకమ్మ ముంపు గ్రామంగా ప్రకటించారు. పునరావాసం కోసం అద్దంకి పట్టణ సమీపంలోని కొంగపాడు వద్ద బలరామకృష్ణపురం, వేలమూరిపాడు గ్రామ సమీపంలో వైఎస్సార్ పునరావాస కాలనీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ కాలనీల్లో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించకపోవడంతో చాలా మంది పాత ధేనువకొండలో నివాసం ఉంటున్నారు. రెండు కాలనీల్లో 120 కుటుంబాలకు చెందిన 250 మంది ఓటర్లు పునరావాస కాలనీల్లో అరకొర వసతుల మధ్య జీవనం సాగిస్తున్నారు.
పంచాయతీ లేదు.. బూత్ లేదు
పునరావాస కాలనీల్లో నివాసం ఉండే ఓటర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక బూత్ ఏర్పాటు చేయలేదు. ప్రత్యేక పంచాయతీగా గుర్తించకపోవడంతో వారు ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు రానూపోనూ 70 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు. పునరావాస కాలనీలో పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment