'2018 నాటికి పోలవరం పూర్తిచేస్తాం'
► ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా
అమరావతి : పోలవరం ప్రాజెక్టును 2018నాటికి పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు చెప్పారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం సమీక్షించినట్లు తెలిపారు. ప్రాజెక్టుల కాంక్రీట్ పనులను ఈనెల 19న ప్రారంభిస్తామన్నారు.
సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ప్రాజెక్ట్ డిజైన్స్ పూర్తి కావస్తున్నాయన్నారు. 19 సిమెంట్ కంపెనీలతో సీఎం చంద్రబాబు సోమవారం సమావేశమయ్యారని.. సిమెంట్‌ను బస్తా రూ. 250లకు ఇస్తామని కంపెనీల వారు సీఎంకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పోలవరం డ్యామ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా 2200 కోట్లు ఖర్చుచేసిందన్నారు. ఈ నిధులు త్వరగా విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.
నవంబరులో 96శాతం వర్షపాతం తక్కువగా ఉందని, అయినా ఏ ఒక్క ఎకరాను ఎండనివ్వమన్నారు. ఖరీఫ్‌లో కోటి ఎకరాల పంట కాపాడుతున్నామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని 2017కు, రెండో సొరంగాన్ని 2018కి పూర్తిగా నిర్మిస్తామని, ప్రాజెక్టును అనంతరం ప్రారంభిస్తామని ఉమ చెప్పారు.