టీడీపీ నేతల కుమ్ములాటలు... | Fighting domination between Vijayawada TDP leaders | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల కుమ్ములాటలు...

Published Sun, Jan 28 2018 2:06 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

Fighting domination between Vijayawada TDP leaders  - Sakshi

పాలకులంటే ప్రజల కష్టాలు తీర్చాలి, సమస్యలు పరిష్కరించి పాలనాదక్షత చాటుకోవాలి. జిల్లా టీడీపీలో మాత్రం అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య విభేదాలు తప్ప ప్రజలకు మంచి చేసే ఏ పనికి, ఏ నాయకుడూ పూను కోవట్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలక నేతల్లోనే కలిసి పనిచేసే లక్షణం లేకపోవడం, గొడవలకు కాలు దువ్వడం, అధినేత పర్యవేక్షణ కొరవడడంతో జిల్లా టీడీపీ మూడు కొట్లాటలు, ఆరు కుమ్ములాటలుగా తయారైంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పార్టీ పరిస్థితిని విశ్లేషిస్తే..

సాక్షి,విజయవాడ: జిల్లా తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య ఆదిపత్య పోరు తారస్థాయికి చేరింది. పలు నియోజకవర్గాల్లో నాయకుల మధ్య విభేదాలు చివరకు రోడ్డెక్కే స్థాయికి చేరాయి. ప్రజలకు అందాల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి పట్టించుకోకుండా, వైరివర్గాన్ని ఎలా దెబ్బతీయాలా అనే దానికే నేతలు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి వంటి కార్యక్రమాల్లోనూ ఒక నాయకుడు పాల్గొంటే మరొక నాయకుడు పాల్గొనట్లేదు. పార్టీ కార్యక్రమాలు కూడా ఎవరికి వారే నిర్వహించుకుంటున్నారు. విభేదాల విషయం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లినా ఏం చేయలేని పరిస్థితి ఉండటంతో నాయకులు నియోజకవర్గాల్లోనే బలాబలాలు తేల్చుకుంటున్నారు.

తారస్థాయికి విభేదాలు
నూజివీడులో ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), నియోజకవర్గ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ముద్దబోయిన వెంకటేశ్వరరావు నియోజకవర్గ ఇన్‌చార్జి కాదంటూ మాగంటి బాబు ప్రకటించడమే కాకుండా   మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పదవిని తన వర్గానికి చెందిన కాపా శ్రీనివాసరావుకు ఇప్పించేందుకు ప్రయత్నించారు. దీన్ని ముద్దరబోయిన వ్యతిరేకించడంతో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఒక దశలో ముద్దరబోయిన వర్గం నాయకులు పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమవ్వడంతో పదవిని నిలుపుదల చేశారు.

గుడివాడ నియోజకవర్గంలో ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు, మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావుకు వరుసకు సోదరుడు అయిన పిన్నమనేని పూర్ణవీరయ్య (బాబ్జీ) వర్గాలు బహిరంగంగానే బాహాబాహీకి దిగుతున్నారు. అంబేడ్కర్‌ జయంతి రోజున పార్టీ కార్యాలయంలోనే గొడవ పడ్డారు. ఆ తరువాత పార్టీ తరఫు కార్యక్రమాలన్నీ ఎవరికు వారే నిర్వహించుకుంటున్నారు.

గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు మధ్య విభేదాలు అందరికీ తెలిసినవే. ఎమ్మెల్యే వంశీ నిర్వహించే నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాలకు దాసరి దూరంగా ఉంటారు. నియోజకవర్గ కార్యాలయం ఎమ్మెల్యే ఆధీనంలో ఉండటంతో దాసరి వర్గం రావడం మానేసింది. దాసరి బాలవర్ధనరావు.. దాసరి ట్రస్టు పేరుతో నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు సొంతంగా నిర్వహించుకుంటున్నారు.

 పామర్రు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆధిపత్యాన్ని హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వర్ల రామయ్య వర్గం అంగీకరించట్లేదు. చంద్రబాబు ఆదేశాల మేరకు వర్ల రామయ్య నియోజకవర్గాన్ని వదిలివేసినప్పటికీ  పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. నిమ్మకూరులో వర్ల రామయ్య వర్గానికి చెందిన నేతలు ఆయన సహాయంతో నేరుగా మంత్రి లోకేష్‌ను కలిసి గ్రామంలోని అభివృద్ధి పనులు చేయించుకుంటున్నారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగుల్‌మీరాకు మధ్య విభేదాలు ఉన్నాయి. నియోజకవర్గంలోని కేవలం రెండు డివిజన్ల అధ్యక్ష పదవులను మాత్రమే మీరాకు ఇచ్చి మిగిలిన డివిజన్లను తనకు అనుకూలంగా ఉన్న వారిని నియమించడంపై మీరా వర్గం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. మీరాకు అనుకూలంగా ఉన్న టీడీపీ కార్పొరేటర్లు జలీల్‌ఖాన్‌కు దూరంగా ఉంటున్నారు.

తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్‌ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం, పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించడం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఇష్టపడట్లేదు.

కార్యకర్తలపై తీవ్ర ఒత్తిడి
పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాల కారణంగా కార్యకర్తలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. రెండో వర్గం చేసే కార్యక్రమాలకు వెళ్ల వద్దంటూ నేతలు చెప్పడంతో ఎవరిపక్షాన నిలబడాల్లో అర్థం కావట్లేదు. రెండు వర్గాల నేతల ఆగ్రహాన్ని చూడకూడదనే ఉద్దేశ్యంతో  అనేకమంది కార్యకర్తలు అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. జన్మభూమి కమిటీల్లో ఉన్న తమ్ముళ్లు ఇరుపక్షాల నేతలు చేసిన సిఫారసులకు ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప వాస్తవంగా అర్హులైన వారికి న్యాయంచేసే పరిస్థితుల్లో లేరు. నేతల్లో క్రమశిక్షణ లోపించడం, వారిని చంద్రబాబు నియంత్రించ లేకపోవడంతో కార్యకర్తలు అసహనానికి గురువుతున్నారు. మరోవైపు నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగకపోవడంతో ప్రజల్లోకి వెళ్తే ఎక్కడ నిలదీస్తారోననే ఉద్దేశంలో తెలుగు తమ్ముళ్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement