Dominant fighting
-
డిష్యుం..డిష్యుం
అధికారపార్టీలో కుమ్ములాటలు తారస్థాయికి చేరుకున్నాయి. జిల్లాలో ఇప్పటికే మంత్రులు, మాజీ మంత్రుల మధ్య సాగుతున్న వార్ అన్ని నియోజకవర్గాలకు పాకింది. పర్యవసానంగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. ముఖ్యంగా కోవూరు, ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో రగడ యథాతథంగా కొనసాగుతోంది. ఈక్రమంలో అన్నింటిని సమన్వయం చేసుకోవాల్సిన జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర పూర్తిగా పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో సమస్య తీవ్రత పెరిగి అందరూ అధిష్టానం వద్ద తాడోపెడో తెల్చుకోవటానికి క్యూకడుతున్నారు. మొత్తం మీద జిల్లాలో అధికారపార్టీ గ్రూప్ వివాదాలు నేతలకు తలనొప్పిగా, ఆశావాహులకు కొత్త చికాకులు తెచ్చేలా ఉండడం గమనార్హం. ఇక ఇన్చార్జ్ మంత్రి కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డికి టిక్కెట్ నీదే అని భరోసా ఇవ్వడంతో అన్ని నియోజకవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా అధికారపార్టీలో రోజుకో కొత్త సమస్య ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే మంత్రులు సోమిరెడ్డి, నారాయణ మధ్య ఆధిపత్యపోరు సాగుతుండగా సోమిరెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి మధ్య కూడా వార్ కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో పలు నియోజకవర్గాల్లో సమస్యలు అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో పాత, కొత్త నేతల రగడ గత కొన్ని నెలలుగా సాగుతోంది. పార్టీ నేత చేజర్ల వెంకటేశ్వరరెడ్డి వర్గం తమకి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇవ్వడం లేదని, బూత్ కమిటీల్లో చోటు కల్పించలేదని, పూర్తిగా పార్టీలో కొత్తగా వచ్చిన వారినే నియమించారని సీఎం చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గత నెల రోజులుగా పార్టీలో కోవూరు చర్చ సాగుతూనే ఉంది. దీంతో జిల్లా ఇన్చార్జ్ మంత్రి అమర్నాథ్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఎమ్మెల్యే పోలంరెడ్డి నివాసానికి వెళ్లి టిక్కెట్ ఆయనకేనని ప్రకటించి బాగా పనిచేయాలని సూచించడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు తమను కూడా ప్రకటించాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకురావడంతోపాటు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కర్నూలులో మంత్రి లోకేష్ ఇదే తరహాలో ప్రకటిస్తే అక్కడి నేతలు నేరుగా ప్రశ్నించిన తరుణంలో పార్టీ అధిష్టానాన్ని కాదని మంత్రి, ఎమ్మెల్సీ టిక్కెట్ ఎలా ప్రకటిస్తారనే చర్చ సాగుతోంది. దీనిపై పార్టీ ముఖ్య నేతలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వెంకటగిరిలో వార్ వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఇటీవలే చేనేత దినోత్సవం రోజున చేనేత మహిళ అయిన శారదను ఎమ్మెల్యే అవమానించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే స్థానికంగా జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని తెలుస్తోంది. ఇక ఆత్మకూరు వ్యవహారం కూడా గత కొంతకాలంగా అనేక మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా గతంలో అధికార పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన కన్నబాబు పార్టీ కార్యాలయంలోనే నిరసన దీక్ష నిర్వహించడంపై పార్టీ కొంత సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆత్మకూరు టిక్కెట్‌ను ఆశిస్తూ అక్కడ పార్టీ నేతలు మెట్టకూరు ధనుంజయ్‌రెడ్డి, కన్నబాబు, విజయరా>మిరెడ్డి, బొల్లినేని కృష్ణయ్య తదితర పేర్లు తెరపైకి వచ్చి ఎవరిస్థాయిలో వారు స్థానికంగా మంత్రుల సహకారంతో యత్నాలు సాగిస్తుండడంతో క్యాడర్లో తీవ్ర గందరగోళం నెలకొంది. బీద తీరుపై అసమ్మతి ఇదిలా ఉంటే నియోజకవర్గాల్లో సమస్యలు పెద్దగా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ బీద రవిచంద్రపై పార్టీ రాష్ట్ర నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మూడు నెలలుగా మూడు నియోజకవర్గాల్లో రగడ సాగి అధిష్టానం వరకు ఫిర్యాదులు వస్తున్నా స్థానికంగా స్పందిచడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మంత్రి అమర్నాథ్రెడ్డితో వెళ్లి కోవూరు వ్యవహారం చక్కదిద్దకుండా ఎమ్మెల్యేకు భోరోసా ఇవ్వడాన్ని పార్టీ అధిష్టానానికి కొందరు ఫిర్యాదులు చేశారు. దీంతో కొత్త పంచాయతీకి తెరలేచింది. -
సాయంపాలెంలో మానని గాయం
‘‘వాళ్లు తప్పుచేయలేదు... కానీ శిక్ష అనుభవిస్తున్నారు. అకారణంగా ఒకరిని చెట్టుకు కట్టేసి కొడితే, మనస్తాపంతో ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మరొకరు మేనకోడలి కోసం పోలీస్‌స్టేషన్‌లో బాధను అనుభవిస్తుంటే.. ఇంకొకరు భార్యపై నిందతో మానసిక వేదనను భరించలేక ఆత్మహత్యే శరణ్యమని పురుగుమందు తాగారు. వాస్తవానికి ఈ ముగ్గురూ చేసిన తప్పేమీ లేదు. మరో ఇద్దరు వ్యక్తుల కారణంగా నలిగిపోతున్నారు. కుటుంబాలు సైతం విచ్ఛిన్నం అయ్యే దారుణస్థితి ఏర్పడింది. వాస్తవాలు మరుగుచేసినా... రెండు కుటుంబాల్లోని ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ వారిని వెంటాడుతోంది. క్షణికమైన ఆవేశాలతో తీసుకునే నిర్ణయాలకు భారీ మూల్యం తప్పదనే అనుభవాన్ని కాలం వారికి నేర్పుతోంది. కొడుకు తప్పునకు తండ్రి... మేనకోడలి తప్పునకు మేనమామ, భర్త తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.’’ ఏలూరు టౌన్/టి.నర్సాపురం : టి.నరసాపురం మండలం సాయంపాలెం గ్రామంలో ఒక వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. కొడుకు నాగేంద్ర ఒక వివాహిత మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆమె బంధువులు తండ్రి ఆడమిల్లి సంజీవరావుపై తమ అక్కసు తీర్చుకున్నారు. ఇదే ఘటనలో కీలక వ్యక్తిగా వ్యవహరించిన మహిళ మేనమామను పోలీసులు అరెస్టు చేశారు. ఇక భార్య కారణంగా పరువుపోయిందనే మానసిక వేదనతో భర్త నాగేంద్రప్రసాద్ శుక్రవారం అర్ధరాత్రి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భర్త పురుగుల మందు తాగాడని తెలియటంతో తానెందుకు మిగలాలంటూ వివాహిత కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. వరుసగా మూడు రోజులుగా సాయంపాలెంలో చోటుచేసుకుంటున్న సంఘటనలు ఇరువర్గాలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మొత్తానికి గ్రామంలో ఇరు కుటుంబాలు, వారి బంధువుల మధ్య సంబంధాలు పూర్తిగా విచ్ఛిన్నమై ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసే ప్రమాదం నెలకొంది. కేవలం ఇద్దరు వ్యక్తుల అనాలోచిత, అవాంఛనీయ చర్య గ్రామంలో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. వైరి వర్గాలుగా మారి కేసులు, ప్రతికేసులతో ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అడ్డదారులు తొక్కేందుకు వెనుకాడడంలేదు. కేవలం ఇద్దరు వ్యక్తులే సాయంపాలెంను ‘హేయం’పాలెంగా మార్చేయటంలో కీలకపాత్రధారులుగా ఉన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లరు : సాయంపాలెం గ్రామస్తులు ‘సాయం’ కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లరు. ఏది జరిగినా గ్రామంలోని కులపెద్దలు పంచాయితీ పెట్టి వారే తీర్పు చెబుతారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీని ప్రస్తుత సంఘటన బ్రేక్ చేసింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రజలే ఇక్కడ జీవిస్తున్నా... వైరి వర్గంలా మారి ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాటాలు చేసుకోవటం పరిపాటిగా మారింది. ఒకే వర్గంలో పెత్తనం కోసం పరితపించే పెద్ద మనుషులు ఐక్యతను కాకుండా వైషమ్యాలను నూరిపోస్తున్నారు. ఫోన్ రికార్డింగ్‌లున్నాయని బెదిరింపులు: గ్రామంలోని కొందరు యువకులు తమ వద్ద ఫోన్లో రికార్డు చేసిన మాటలు ఉన్నాయని మీరు తమను ఏమీ చేయలేరని బెదిరించడంతోపాటు అసభ్యంగా మాట్లాడుతూ వివాహిత భర్తను బెదిరించారు. తీవ్ర మానసిక వేదనకు గురైన అతను శుక్రవారం అర్ధరాత్రి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భర్త పురుగుల మందు తాగటంతో భార్య కూడా పురుగుల మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఆమె తన భర్తను కొందరు యువకులు బెదిరిస్తున్నట్లు వాంగ్మూలం ఇచ్చింది. ఇక తన మేనమామను వెంటనే అరెస్టు చేసిన పోలీసులు తనను చేయిపట్టుకుని వేధించిన ఆడమిల్లి నాగేంద్ర అనే వ్యక్తిని మాత్రం ఇంతవరకూ పట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్యాభర్తలను జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ శనివారం పరామర్శించి న్యాయం చేస్తానని చెప్పారు. నాగేంద్రప్రసాద్ పరిస్థితి విషమంగా ఉందని, రెండు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించాల్సి ఉంటుందని బంధువులు తెలిపారు. -
టీడీపీ చెట్టు నీడలో...వికసించని కమలం!
ఒక్క ఎమ్మెల్యే లేడు... ఎమ్మెల్సీ కూడా లేడు... ఎంపీపీలు, జెడ్పీటీసీలు కూడా లేరు... చివరకు గ్రామస్థాయిలో ఒక్క సర్పంచ్ కూడా లేడు! ఇదీ జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో టీడీపీని భాగస్వామిని చేసుకున్న భారతీయ జనతాపార్టీ పరిస్థితి! గత సాధారణ ఎన్నికల్లో పొత్తుధర్మంలో భాగంగా ఇచ్ఛాపురం, నరసన్నపేట అసెంబ్లీ సీట్లు బీజేపీకి కేటాయించినా ఆఖరి నిమిషంలో టీడీపీ నాయకులు నిరసనకు దిగడంతో చేజారిన సంగతి తెలిసిందే. కనీసం గత ఏడాది స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ కోరినా ఫలితం దక్కలేదు. ఇక అనేక రాజకీయ పరిణామాల మధ్య పట్టభద్రుల కోటాలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటు పీవీఎన్ మాధవ్‌కు దక్కినా గెలవడానికి అష్టకష్టాలు పడాల్సివచ్చింది! మొత్తంమీద పొత్తుధర్మం అంటూనే టీడీపీ శ్రేణులు తమను తొక్కేస్తున్నారని బీజేపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: భారతీయ జనతా పార్టీ ఉనికి జిల్లాలో రెండు దశాబ్దాలుగా ఉంది. కానీ ఆయా వర్గాలన్నీ టీడీపీతోనే ఎక్కువకాలం భాగస్వాములుగా ఉన్నాయి. గత సాధారణ ఎన్నికలలో టీడీపీతో పొత్తు వల్ల జిల్లాలో బలపడతామని ఆశించినప్పటికీ అదెక్కడా ఆచరణలో కానరాలేదు. కనీసం అటు కేంద్ర ప్రభుత్వంలో టీడీపీని భాగస్వామిని చేసుకున్నా, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో టీడీపీతో జతకట్టినా జిల్లాలో తమకు ఎలాంటి అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం చేయట్లేదని, కనీసం ప్రభుత్వపరమైన, అధికారిక కార్యక్రమాలకు సైతం ఆహ్వానం కూడా ఉండట్లేదనే బీజేపీ శ్రేణుల ఆవేదన అరణ్యరోదనే అవుతోంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లున్నా... టీడీపీని నమ్ముకోకుండా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాలని బీజేపీ జిల్లా నాయకులు తలపోస్తున్నాయి. అయితే వారిలో మాజీ ఎంపీ కణితి విశ్వనాథం, పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలం తదితర ఒకరిద్దరు నాయకులు తప్ప శ్రేణులను కార్యోన్ముఖులను చేసేవారే పార్టీలో కరువయ్యారు. కణితి విశ్వనాథం గత సాధారణ ఎన్నికల వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ రాజకీయ పరిణామాలతో ఆయన బీజేపీ పంచన చేరారు. పలాస నియోజకవర్గంలో ఆయనతో పాటు వెళ్లిన కొద్దిమంది సర్పంచులు మాత్రమే గ్రామస్థాయిలో కొంతమేర పనిచేయగలుగుతున్నారు. అంతకుమించి బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, కమలం గుర్తుపై గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేకపోవడం పెద్దలోటు. దీంతో అధికారిక వేదికలు, రాజకీయ సమావేశాల్లో బీజేపీ వాణి వినిపించే నాయకులు లేకపోవడం పెద్దలోటుగా ఉంది. టీడీపీతో తగాదాలు మామూలే... జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలోనే టీడీపీ ఆధిపత్యం బీజేపీపై స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం ఉండట్లేదు. ఇక్కడ బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నా వారికి గౌరవం ఇచ్చిన దాఖలాలు లేవు. అంతేకాదు బీజేపీలోనూ వర్గవిభేదాలకు టీడీపీ నాయకులు ఆజ్యం పోస్తున్నారు. బీజేపీలో అంతర్గత కుమ్ములాటలతో టీడీపీ నాయకులు క్యాష్ చేసుకుంటున్నారు. ఎచ్చెర్ల నియోజక వర్గం జి.సిగడాంలో దీపం పథకం గ్యాస్ సిలిండర్ల పంపకంలో టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీడీవో బదిలీ వరకు వెళ్లాయి. గత 20 ఏళ్ల నుంచి బీజేపీలో ఉన్నా తమకు టీడీపీ నాయకులు గౌరవించటం లేదని కమలం పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. పింఛన్లు, ఇళ్లు, రేషన్ కార్డుల మంజూరులో తమ సిఫారసులకు జన్మభూమి కమిటీలు పట్టించుకోవటం లేదని చెబుతున్నారు. రాజాం నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆధిపత్యంతో బీజేపీ కేడర్ చిత్తయింది. అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు తమకు ఆహ్వానాలు ఉండట్లేదని రాజాం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు, పురిపండ శ్రీనివాస్ వంటివారే ఆవేదన చెందుతున్నారు. గత సాధారణ ఎన్నికలలో నరసన్నపేట సీటు బీజేపీకి మొదట్లో కేటాయించారు. కానీ టీడీపీ నాయకులు వెంకయ్యనాయుడుతో మాట్లాడుకొని తామే లాగేసుకున్నారు. అప్పటినుంచి నరసన్నపేట నియోజకవర్గంలో టీడీపీపై బీజేపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. పలాస నియోజకవర్గంలో బీజేపీ నాయకుల సిఫారసుతో ఏ సంక్షేమ పథకానికి దరఖాస్తులు వచ్చినా పక్కన పెట్టేస్తున్నారు. ఇది పార్టీని అణచివేయడమేనని బీజేపీ నాయకులు కణితి విశ్వనాథం, పలాస పట్టణ కన్వీనర్ పాలవలస వైకుంఠరావు, నియోజకవర్గ కన్వీనర్ కొర్రాయి బాలకృష్ణ ఆరోపిస్తున్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు బీజేపీ శ్రేణులను ఏ విషయంలోనూ భాగస్వామ్యం చేయలేదు. జన్మభూమి కమిటీల్లోనూ చోటు దక్కట్లేదు. కంచిలి మండలంలో గోకర్ణపురం, శాసనాం పంచాయతీల సర్పంచ్‌లు బీజేపీ తీర్థం పుచ్చుకున్నా అక్కడ టీడీపీ నేతలను జన్మభూమి కమిటీ సభ్యులుగా నియమించి, స్థానికంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఆ పంచాయతీల్లో బీజేపీకి టీడీపీ నేతలే ప్రతిపక్షంగా మారిపోయారు. ఒక సందర్భంలో గోకర్ణపురం పంచాయతీలో జన్మభూమి కార్యక్రమంలో ఇరువర్గాలు కొట్టుకున్నారు. ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది మొదలు బీజేపీని ఎదగనీయకుండా అడ్డుకుంది. జన్మభూమి కమిటీల్లో, అధికారిక కమిటీల్లో అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టం చేసింది. ఇటీవల తమ పార్టీ నాయకుడు, వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు కొన్నాళ్ల క్రితం పాలకొండ వచ్చినప్పుడు వారంతా తమ గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేకపోయింది. ఆమదాలవలస నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ పొత్తు సక్రమంగా కొనసాగుతోంది. కుల రాజకీయాలతో బంధుత్వాలు కలుపుకొని బీజేపీ, టీడీపీ కార్యకర్తలు, నాయకులు తమతమ పనులను ఎప్పటికప్పుడు చక్కదిద్దుకొంటున్నారు. -
టీడీపీ నేతల కుమ్ములాటలు...
పాలకులంటే ప్రజల కష్టాలు తీర్చాలి, సమస్యలు పరిష్కరించి పాలనాదక్షత చాటుకోవాలి. జిల్లా టీడీపీలో మాత్రం అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య విభేదాలు తప్ప ప్రజలకు మంచి చేసే ఏ పనికి, ఏ నాయకుడూ పూను కోవట్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలక నేతల్లోనే కలిసి పనిచేసే లక్షణం లేకపోవడం, గొడవలకు కాలు దువ్వడం, అధినేత పర్యవేక్షణ కొరవడడంతో జిల్లా టీడీపీ మూడు కొట్లాటలు, ఆరు కుమ్ములాటలుగా తయారైంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పార్టీ పరిస్థితిని విశ్లేషిస్తే.. సాక్షి,విజయవాడ: జిల్లా తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య ఆదిపత్య పోరు తారస్థాయికి చేరింది. పలు నియోజకవర్గాల్లో నాయకుల మధ్య విభేదాలు చివరకు రోడ్డెక్కే స్థాయికి చేరాయి. ప్రజలకు అందాల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి పట్టించుకోకుండా, వైరివర్గాన్ని ఎలా దెబ్బతీయాలా అనే దానికే నేతలు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి వంటి కార్యక్రమాల్లోనూ ఒక నాయకుడు పాల్గొంటే మరొక నాయకుడు పాల్గొనట్లేదు. పార్టీ కార్యక్రమాలు కూడా ఎవరికి వారే నిర్వహించుకుంటున్నారు. విభేదాల విషయం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లినా ఏం చేయలేని పరిస్థితి ఉండటంతో నాయకులు నియోజకవర్గాల్లోనే బలాబలాలు తేల్చుకుంటున్నారు. తారస్థాయికి విభేదాలు నూజివీడులో ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ముద్దబోయిన వెంకటేశ్వరరావు నియోజకవర్గ ఇన్చార్జి కాదంటూ మాగంటి బాబు ప్రకటించడమే కాకుండా మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని తన వర్గానికి చెందిన కాపా శ్రీనివాసరావుకు ఇప్పించేందుకు ప్రయత్నించారు. దీన్ని ముద్దరబోయిన వ్యతిరేకించడంతో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఒక దశలో ముద్దరబోయిన వర్గం నాయకులు పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమవ్వడంతో పదవిని నిలుపుదల చేశారు. ♦ గుడివాడ నియోజకవర్గంలో ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు, మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావుకు వరుసకు సోదరుడు అయిన పిన్నమనేని పూర్ణవీరయ్య (బాబ్జీ) వర్గాలు బహిరంగంగానే బాహాబాహీకి దిగుతున్నారు. అంబేడ్కర్ జయంతి రోజున పార్టీ కార్యాలయంలోనే గొడవ పడ్డారు. ఆ తరువాత పార్టీ తరఫు కార్యక్రమాలన్నీ ఎవరికు వారే నిర్వహించుకుంటున్నారు. ♦ గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు మధ్య విభేదాలు అందరికీ తెలిసినవే. ఎమ్మెల్యే వంశీ నిర్వహించే నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాలకు దాసరి దూరంగా ఉంటారు. నియోజకవర్గ కార్యాలయం ఎమ్మెల్యే ఆధీనంలో ఉండటంతో దాసరి వర్గం రావడం మానేసింది. దాసరి బాలవర్ధనరావు.. దాసరి ట్రస్టు పేరుతో నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు సొంతంగా నిర్వహించుకుంటున్నారు. ♦ పామర్రు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆధిపత్యాన్ని హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య వర్గం అంగీకరించట్లేదు. చంద్రబాబు ఆదేశాల మేరకు వర్ల రామయ్య నియోజకవర్గాన్ని వదిలివేసినప్పటికీ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. నిమ్మకూరులో వర్ల రామయ్య వర్గానికి చెందిన నేతలు ఆయన సహాయంతో నేరుగా మంత్రి లోకేష్‌ను కలిసి గ్రామంలోని అభివృద్ధి పనులు చేయించుకుంటున్నారు. ♦ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్‌మీరాకు మధ్య విభేదాలు ఉన్నాయి. నియోజకవర్గంలోని కేవలం రెండు డివిజన్ల అధ్యక్ష పదవులను మాత్రమే మీరాకు ఇచ్చి మిగిలిన డివిజన్లను తనకు అనుకూలంగా ఉన్న వారిని నియమించడంపై మీరా వర్గం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. మీరాకు అనుకూలంగా ఉన్న టీడీపీ కార్పొరేటర్లు జలీల్‌ఖాన్‌కు దూరంగా ఉంటున్నారు. ♦ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం, పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించడం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇష్టపడట్లేదు. కార్యకర్తలపై తీవ్ర ఒత్తిడి పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాల కారణంగా కార్యకర్తలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. రెండో వర్గం చేసే కార్యక్రమాలకు వెళ్ల వద్దంటూ నేతలు చెప్పడంతో ఎవరిపక్షాన నిలబడాల్లో అర్థం కావట్లేదు. రెండు వర్గాల నేతల ఆగ్రహాన్ని చూడకూడదనే ఉద్దేశ్యంతో అనేకమంది కార్యకర్తలు అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. జన్మభూమి కమిటీల్లో ఉన్న తమ్ముళ్లు ఇరుపక్షాల నేతలు చేసిన సిఫారసులకు ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప వాస్తవంగా అర్హులైన వారికి న్యాయంచేసే పరిస్థితుల్లో లేరు. నేతల్లో క్రమశిక్షణ లోపించడం, వారిని చంద్రబాబు నియంత్రించ లేకపోవడంతో కార్యకర్తలు అసహనానికి గురువుతున్నారు. మరోవైపు నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగకపోవడంతో ప్రజల్లోకి వెళ్తే ఎక్కడ నిలదీస్తారోననే ఉద్దేశంలో తెలుగు తమ్ముళ్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. -
కలహాల కాపురం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతల్లో లుకలుకలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కర్నూలులో తమకే పార్టీ టికెట్ అని ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ అంటుంటే.. కాదు తనకే అని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి చెబుతున్నారు. తాను చెప్పిన వారికే పింఛన్ ఇవ్వాలని కోడుమూరు నియోజకవర్గంలో ఒక నేత హుకుం జారీచేస్తుంటే.. ఎమ్మెల్యే కాబట్టి తన మాటకే ప్రాధాన్యతివ్వాలని మణిగాంధీ అంటున్నారు. ఇక ఏకంగా ఫ్లెక్సీలోనూ సాక్షాత్తూ డిప్యూటీ సీఎం ఫొటోనూ వేసేది లేదని తుగ్గలి నాగేంద్ర తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే విభేదాలు గుప్పుమంటున్న నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి వస్తుండటంతో రాజకీయం మరింత వేడెక్కుతోంది. పార్టీ మారిన ఎంపీ బుట్టా రేణుకతో తనకు ఇబ్బందులు తప్పవనుకుంటున్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి.. ఎంపీతో కనీసం కలిసేందుకూ ససేమిరా అంటున్నారు. నంద్యాలలో మార్కెట్ కమిటీ ఎంపిక విషయంలో ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, శాసన మండలి చైర్మన్ ఫరూఖ్ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఆళ్లగడ్డ సీటు తనదేనంటూ ఏవీ సుబ్బారెడ్డి కొత్త రాగం అందుకున్నారు. అన్ని చోట్లా ఇదే తీరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో ఇప్పటికే ఎస్వీ మోహన్ రెడ్డి, టీజీ భరత్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక కర్నూలు మార్కెట్ కమిటీ ఎంపిక విషయంలో ఎంపీ టీజీ, ఎమ్మెల్యే ఎస్వీ మధ్య ఏకాభిప్రాయం ఏమాత్రమూ కుదరడం లేదు. దీంతో మార్కెట్ కమిటీ ఎంపిక ఏడాదిన్నరగా జరగడం లేదు. నంద్యాల మార్కెట్ కమిటీ విషయంలోనూ ఇదే పరిస్థితి. ఒక వర్గానికి ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మరో వర్గానికి ఫరూఖ్ మద్దతు ఇస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో పూర్తిస్థాయిలో మద్దతిచ్చినా.. ఇదేనా తమకిచ్చే గౌరవమని ఫరూఖ్ వర్గం మండిపడుతోంది. కోడుమూరు నియోజకవర్గంలో ఏకంగా పింఛనుదారుల ఎంపిక నుంచీ విభేదాలు గుప్పుమంటున్నాయి. ఆళ్లగడ్డలో విందు పేరిట ఏవీ సుబ్బారెడ్డి చేస్తున్న రాజకీయాలను అడ్డుకునేందుకు మంత్రి అఖిలప్రియ ఎంతగా ప్రయత్నిస్తున్నా.. సాధ్యం కావడం లేదు. ఆయన ఏకంగా భూమా కుటుంబ సభ్యులను కూడా తన విందుకు రప్పించుకున్నారు. పైగా ఆళ్లగడ్డ సీటు తనదేనని మిత్రుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో పనులన్నీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి మాత్రమే చేస్తున్నారని, తమకు ఇవ్వడం లేదని మిగిలిన నేతలు మండిపడుతున్నారు. స్వయాన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇలాకాలోనూ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తుగ్గలి నాగేంద్ర వేసే ఏ ఫ్లెక్సీలోనూ కేఈ వారి పేరు కనీసం ప్రస్తావించడం లేదంటే విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఊసేలేని సమన్వయ కమిటీ.. అప్పటికే పార్టీలో ఉన్న వారికి, గోడ దూకి వచ్చిన ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు తలెత్తే ప్రమాదం ఉందని భావించిన అధికార పార్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జిల్లా ఇన్చార్జ్ మంత్రితో పాటు జిల్లా అధ్యక్షుడు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఉన్నారు. కొద్దికాలం నుంచి క్రమంగా పెరుగుతున్న విభేదాలను పరిష్కరించేందుకు సమన్వయ కమిటీ కనీసం భేటీ కూడా కావడం లేదు. గతంలో నెలకొక్కసారి కూర్చుని మాట్లాడేవారు. ఇప్పుడు కమిటీ పత్తా లేకుండా పోయింది. అంటే ఈ విభేదాలను ఇక పరిష్కరించలేమని అధికార పార్టీ నేతలు భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది. -
ఆధిపత్య పోరు.. అంతా బేజారు
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో వర్గ రాజకీయాలకు అధికార తెలుగుదేశం పార్టీ పెట్టింది పేరుగా మారింది. ప్రతి నియోజకవర్గంలో రెండు మూడు గ్రూపులు తయారవడంతో ద్వితీయ నాయకుల్లో వ్యతిరేకత ఎక్కువైంది. ఇప్పటి నుంచే టిక్కెట్ల పోరుతో పరువు బజారున పడింది. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి చేరి మంత్రిగా కొనసాగుతున్న ఆదినారాయణరెడ్డి, మాజీమంత్రి పీఆర్, ఎంపీ సీఎం రమేష్‌తోపాటు ఇతర నేతల మధ్య ఇప్పటివరకు సమన్వయం లేదు. మంత్రి ఆది, ఎంపీ రమేష్ వర్గాలుగా విడిపోయి ఎవరికివారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి పార్టీ బలోపేతం కోసం ఆయా వర్గాలతో చర్చించిన దాఖలా లేదు. ఇదే సమయంలో విప్ మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి, పార్టీ శిక్షణ శిబిరాల సంచాలకుడు రాంగోపాల్‌రెడ్డి సైతం సొంత ప్రయోజనాలకు తప్ప, పార్టీకి సంబంధించిన వ్యవహారాలను పట్టించుకోకపోవడం కూడా ప్రధాన సమస్యగా మారింది. దీంతో నేతలకు, కిందిస్థాయి కార్యకర్తలకు మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. జిల్లాలో ఎవరికి వారే.. జిల్లాలో టీడీపీ గెలుపొందిన ఏకైక స్థానం రాజంపేట. అక్కడా రెండు గ్రూపులు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే మేడా, మాజీ ఎమ్మెల్యే బ్రహ్మయ్య మధ్య సఖ్యత లేదు. ఎవరికి వారే అన్నట్లు ఉంటున్నారు. మేడా తన సామాజికవర్గానికి పెద్దపీట వేస్తున్నారన్న కారణంతో పార్టీసీనియర్లు ఆగ్రహంతో ఉన్నారు. నియోజకవర్గంలో బలమైన ఓ సామాజికవర్గం వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ మొదలెట్టినట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇక జమ్మలమడుగులోనూ వర్గ రాజకీయాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఇక్కడ ఎమ్మెల్సీ పీఆర్, మంత్రి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఆది నుంచి ఉంది. ఒకే వేదిక పై ఇద్దరు ఉన్నా.. ఎడ మొహం పెడమొహం అన్నట్లుగా ఉంటున్నారు. గ్రామాల్లో కార్యకర్తలు సైతం వర్గాలుగా విడిపోయి పనిచేసుకుంటుండడం గమనార్హం. ప్రొద్దుటూరులోనూ వర్గ విభేదాలే తారా స్థాయికి చేరాయి. ఇక్కడ వరదరాజులరెడ్డి, పార్టీ ఇన్చార్జి లింగారెడ్డిల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈస్థానం నుంచి పోటీచేయాలనే యోచనలో మంత్రి ఆది ఉన్నట్లు తెలుస్తోంది. కమలాపురంలో టిక్కెట్ గోల కమలాపురంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డిలకు ఒకరంటే ఒకరికి పడటం లేదు. పుత్తా నియోజకవర్గంలో తన పట్టుకోసం ప్రయత్నిస్తున్నాడు. మంత్రి లోకేష్, బాలకృష్ణలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్టు లభిస్తుందన్న ఆశతో పుత్తా ఉన్నారు. కానీ వీరశివారెడ్డి మాత్రం ఈసారి టిక్కెట్ తనకేనని బహిరంగంగానే చెబుతున్నారు. కార్యకర్తల సమావేశాలు పెడుతున్నారు. జిల్లాలో ఏకైక ఎస్సీ రిజర్వు స్థానమైన రైల్వే కోడూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగలరాయుడు, పార్టీ ఇన్చార్జి విశ్వనాథనాయుడు మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. తన మాటే నెగ్గాలన్న పట్టుదల ఇద్దరిలో ఉంది. ఇప్పటివరకు పార్టీ కోసం రూ.50కోట్ల వరకు ఖర్చుచేశాను కాబట్టి తాను సూచించిన వ్యక్తికే టిక్కెట్టు ఇవ్వాలని విశ్వనాథనాయుడు పట్టుపడుతున్నారు. ఇవ్వకపోతే పార్టీ వీడే ఆలోచనలోనూ ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. పులివెందులలో పట్టుకోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న అధికారపార్టీకి అక్కడి గ్రూపు రాజకీయాలు తలనొప్పిగా మారా యి. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ బీటెక్ రవి, సతీష్‌రెడ్డి, పార్టీ శిక్షణ శిబిరాల సంచాలకుడు రాంగోపాల్రెడ్డిలు మూడు గ్రూపులుగా విడిపోయి పనిచేస్తున్నారు. రాంగోపాల్‌రెడ్డికి సతీష్‌రెడ్డిల మధ్య మొదటి నుంచి సరిపోదు. ఇటీవల వీరిద్దరి మధ్య రాజీ కుదిరింది. అయినా టిక్కెట్టు విషయానికి వచ్చేసరికి మళ్లీ కత్తులు దూసుకోవడం ఖాయమని తెలుస్తోంది. జిల్లాలో బలం అంతంతే.. జిల్లాలో 2014 ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజ యం ఎదురైంది. అప్పటి నుంచి జిల్లాలో పాగా వేయాలని ఆ పార్టీ అధినేత శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా జిల్లాలో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్నారు. ఇప్పటివరకు సీఎం హోదాలో ఆయన 14సార్లు జిల్లాలో పర్యటించడం వెనుక ఉన్న రహస్యమిదే. చివరకు వైఎస్సార్సీపీ జెండాపై గెలిచిన జయరాములు, ఆదినారాయణరెడ్డిలకు తాయిలాలు ఎరవేసి తనవైపు లాక్కున్నా, జిల్లాలో పట్టు సాధించలేకపోయారు. బద్వేలులో మూడు ముక్కలాట బద్వేలు, రాయచోటి, కడప నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. బద్వేలులో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే జయరాములు ఎవరి వర్గం వారు అన్నట్లుగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో విజయమ్మ మద్దతులో టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న విజయజ్యోతి మాత్రం ఇద్దరితో అంటిముట్టనట్టుగానే ఉంది. అయితే వీరి ముగ్గురు మధ్య బద్వేలు–పోరుమామిళ్ల రహదారి పనుల్లో కమీషన్ల కోసం కుమ్ములాట జరుగుతోంది. రాయచోటి విషయానికి వచ్చేసరికి పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడు, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి రమేష్‌రెడ్డిలకు సరిపడడం లేదు. కడప నుంచి వచ్చే ఎన్నికల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. అయితే ఈ స్థానం తమకే ఇవ్వాలని మైనార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక సమస్యతో ఆ పార్టీ ఇబ్బంది పడుతోంది. -
అధికార పార్టీలో అంతర్యుద్ధం!
అవును ఆ పార్టీలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఒకరితో ఒకరికి పొసగడంలేదు. వారి మధ్య సమన్వయం ఉండట్లేదు. ఒకరు సమావేశం పెడితే మరొకరు తప్పుకుంటారు. ఒకరు ప్రతిపాదిస్తే మరొకరు అడ్డుకుంటారు. ఒకరిని పదవికోసం సిఫారసు చేస్తే మరొకరు రద్దు చేయమంటారు. రాష్ట్రస్థాయిలో పంచాయితీలు జరిగినా పరిష్కరించుకోలేకపోతున్నారు. అధినేత వచ్చినపుడూ... తరచూ ఈ పరిస్థితులు ప్రత్యక్షమవుతున్నా... ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఆయనది. ఒకరిపై ఒకరికి ఫిర్యాదులు చేసుకుంటున్నా... వాస్తవాలు తెలుసుకునేందుకూ తీరికలేని పరిస్థితి ఆయనది. అందుకే ఇక్కడ విభేదాలు మూడు మీటింగులు... ఆరు ఫిర్యాదులుగా వర్థిల్లుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో టీడీపీ నేతలు జనం ఇబ్బందులు, వారి కష్టాలను గాలికొదిలేశారు. పోనీ స్వపార్టీ వారితోనైనా సఖ్యంగా ఉంటున్నారా అంటే అదీ లేదు. మంత్రుల దగ్గర్నుంచి, ద్వితీయ శ్రేణి నేతల వరకూ ఎవరికి వారు సొంత గ్రూఫులు కట్టుకుని తమలో తామే తెగ పోట్లాడుకుంటున్నారు. ఇది ఏ ఒక్క నియోజకవర్గానికో పరిమితం కాలేదు. అన్ని చోట్లా ఇదే పరి స్థితి కొనసాగుతోంది. బొబ్బిలి నియోజకవర్గంలో పాత టీడీపీ కొత్త టీడీపీ అనే రెండు వర్గాలు తయారయ్యాయి. ఇక కొత్త వర్గంలో మంత్రి సుజయ కృష్ణరంగారావు ఇచ్చిన ఆదేశాలను కొన్ని సార్లు అతని సోదరుడు బేబీ నాయన కూడా పాటించనీయడం లేదు. ఒకరు ఆదేశాలు పట్టుకుని వస్తే మరొకరు రద్దు చేయమని సిఫారసు చేస్తున్నా రు. ఈ విధానం ప్రభుత్వాధికారులను సైతం విస్తుపోయేలా చేస్తోంది. పార్టీ పదవులను, స్థానిక సంస్థల పదవులను భర్తీ చేయడంలో తాత్సారం చేయడంతో నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య వైరం నెలకొంది. విభేదాల పురం పార్వతీపురం మున్సిపాలిటీలో ఛైర్పర్సన్ కౌన్సిల్ సభ్యులకు చెప్పకుండా నిర్ణయాలు తీసుకోవడంతో వారంతా గుర్రుగా ఉన్నారు. పలుమార్లు సమావేశాలను బహిష్కరిద్దామని నిర్ణయించినా ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి వారిని బతిమిలాడుకుంటున్నారు. అయినా ఇక్కడ అంతర్గత లుకలుకలున్నాయి. ఈ ప్రభావం కురుపాంలోనూ కనిపిస్తోంది. పార్టీ పుట్టిన నాటి నుంచి ఉన్న టీడీపీ నాయకులు వలస నాయకుడైన శత్రుచర్ల విజయరామరాజు నాయకత్వాన్ని ఇష్టపడటం లేదు. ఆయనకు దూరంగానే ఉంటున్నారు. పార్టీ మారిన వారికి నాయకత్వం అప్పగించడాన్ని బహిరంగంగానే విమర్శించడమే గాదు... అధినేత దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఒకరి అవినీతిపై మరొకరు ఏకంగా కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో బట్టబయలు చేసుకున్నారు. వివాదాల నగరం విజయనగరంలో మీసాల గీతతో మున్సిపల్ చైర్పర్సన్ ప్రసాదుల రామకృష్ణ వైరంగా ఉన్నారు. గత అసెంబ్లీ టిక్కెట్ ఆశించిన రామకృష్ణ ఈ సారైనా తనకు దక్కాలని భావిస్తున్నారు. మరో పక్క జిల్లా యువత అధ్యక్షుడి పదవిని నేటికీ భర్తీ చేయకుండా వదిలేశారు. మంత్రి మృణాళిని కుమారుడు నాగార్జునకు ఇస్తామని చెప్పినా నేటికీ ప్రకటించలేకపోయా రు. ఎస్ కోటలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభ హైమావతికి స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి మధ్య ఇటీవల రాష్ట్రమంత్రి నారా లోకేష్ వచ్చి స్వయంగా చిచ్చు పెట్టారని స్థానిక నాయకులు ఆరో పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ లలితకుమారికే టిక్కెట్ ఇస్తామని చెప్పడంతో జడ్పీ ఛైర్పర్సన్ స్వాతి రాణి, ఆమె తల్లి హైమావతిలు కినుక వహించారు. పెదవుల్లో నవ్వులు.. పొట్టలో కత్తులు... సాలూరులో అసెంబ్లీ టిక్కెట్ కోసం మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్, ఎమ్మెల్సీ సంధ్యారాణి మధ్య విభేదాలు న్నాయి. వారు కలసి తిరుగుతున్నా... పెదవులపై నవ్వులు పులుముకుంటున్నా.. కడుపులో కత్తులు గుచ్చుకుంటున్నారు. దీనికి తోడు సాలూరు మున్సిపల్ చైర్పర్సన్ భర్త గొర్లె మధుకు భంజ్‌దేవ్‌కు మధ్య పొరపొచ్చాలున్నాయి. ఏఎంసీ ఛైర్మన్ పదవిని తనకు కాకుండా చేశారని గొర్లె మధు అలుక వహిం చారు. గజపతినగరంలో ఎమ్మెల్యే కేఏ నాయుడుకు స్వయానా సోదరుడే శత్రువుగా మారారు. ఒకరిపై మరొకరు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసుకున్న దాఖ లాలూ ఉన్నాయి. మంత్రిపదవి రాకుండా చేశాడని కేఏ నాయుడు మండిపడుతుండగా తనకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి రాకుండా చేశాడని తమ్ముడిపై కొండల రావు ఆగ్రహంతో ఉన్నారు. వీరు తమ సొంత వ్యాపారాల్లోనూ పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం గమనార్హం. అలాగే వైస్ ఎం పీపీ బొడ్డు రాము బొబ్బిలి రాజులతో తిరుగుతున్నాడని కేఏ నాయుడు ఆయనను దూరం పెట్టారు. మక్కువ శ్రీధర్ కూడా కేఏ నాయుడుతో కొన్ని విషయాల్లో విభేదిస్తున్నారు. నివురుగప్పినపల్లి చీపురుపల్లిలో ఎమ్మెల్యే మృణాళినితో త్రిమూర్తులు రాజు అసెంబ్లీ టిక్కెట్ రాకపోయిన దగ్గర నుంచీ వైరంగానే ఉన్నారు. ఈయనతో పాటు జడ్పీటీసీ మీసాల వరహాల నాయుడు, రౌతు కాము నాయుడు కూడా మృణాళినికి వ్యతిరేకంగా ఉన్నారు. మండల స్థాయి విషయాల్లోనూ ఎమ్మెల్యే వేలు పెట్టి వారికి ప్రాధాన్యమివ్వనీయకుండా చేస్తున్నారని వారంతా విడివిడిగా ఎమ్మెల్యేకు దూరంగా ఉన్నారు. నెల్లిమర్లలో గ్రూపులు తారాస్థాయికి చేరుకున్నాయి. నగర పంచాయతీలో జన్మభూమి కమిటీ సభ్యుడు చిక్కాల సాంబశివరావు ఎమ్మెల్యే, టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో చిక్కాలను సస్పెండ్ చేయాలని టీడీపీ నాయకులు రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఏఎంసీ ఛైర్మన్ పదవిని ఇవ్వకపోవడంతో దంతులూరి సూర్యనారాయణ రాజు, ఎంపీపీ కర్రోతు బంగార్రాజుల మధ్య తీవ్ర స్థాయి విభేదాలున్నాయి. దంతులూరి సూర్యనారాయణ రాజు పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉండటం, ఆయనకు పట్టున్నగ్రామాల్లో పార్టీ కార్యక్రమాలను సైతం జరగనీయడం లేదు. డెంకాడలో ఎంపీపీ కంది చంద్రశేఖరరావుకు, జెడ్పీటీసీ సభ్యుడు పతివాడ అప్పలనారాయణకు పడటంలేదు. నెల్లిమర్ల మండలంలో ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి నాయుడు మండల నాయకులు సువ్వాడ రవిశేఖర్, గేదెల రాజారావుల మధ్య పొరపొచ్చాలకు కారణమవుతున్నారు. గేదెల రాజారావుకు ఎమ్మెల్యే సహకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తమ్మీద ఈ వివాదాలు పరిష్కరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. -
పోతుల కస్సు.. దివి బుస్సు
కందుకూరు అర్బన్: కందుకూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ఇద్దరూ ఉనికిని కాపాడుకోవడం కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రామారావు కస్సుమంటే, శివరాం బుస్సు మంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆపార్టీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జిగా దివి శివరాం రెండేళ్లపాటు కొనసాగారు. ఆ రెండేళ్లలో కార్యకర్తలను విస్మరించారని, కొంతమందినే చేరదీశారనేది ఆ పార్టీ కార్యకర్తల ఆరోపణ. ముఖ్యంగా అధికార యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకుని స్వప్రయోజనాలే ధ్యేయంగా అభివృద్ధిని పాతాళానికి తొక్కారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏదీ అభివృద్ధి..? అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు అభివృద్ధి పేరుతో అధికార పార్టీలో చేశారు. టీడీపీ కండువా కప్పుకొని 15 నెలలు గడుస్తున్నా నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కొత్త నిధులు మంజూరు సంగతి దేవుడెరుగు కనీసం ఉన్న నిధులు కూడా సద్వినియోగం చేసుకోవడంలో విఫలం చెందారని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు మూడు నెలల క్రితం రూ.10 కోట్లకు టెండర్లు పిలవగా ఎమ్మెల్యే కాంట్రాక్ట్లర్లను పిలిచి రూ.5 కోట్లకు టెండర్లు వేసుకోవాలని, మిగిలిన 5 కోట్ల టెండర్లు తమ కార్యకర్తలకు ఇస్తామని సూచించినట్టు తెలిసింది. ఇది తెలిసిన శివరాం తన మనుషులతో టెండర్లు వేయించారు. దీంతో రామారావు ఆ టెండర్లను రద్దు చేయించారు. శివరాం అనుచరులను కూడగట్టుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆదే స్థాయిలో రామారావు కూడా తమ వర్గం జారిపోకుండా కాపాడుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇద్దరు బయటకు ఒకరిపై ఒకరు ప్రేమ ఒలకబోసుకుంటూనే మరో వైపు పార్టీ సమావేశాలు జరిగిన ప్రతి సారీ తమ అనుచరులతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయించుకొంటున్నారు. దీంతో కందుకూరు అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. పోర్టు సాధనలో విఫలం.. రామాయపట్నం పోర్టు వస్తే దానికి అనుబంధ పరిశ్రమలు ఏర్పడి దాదాపు లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. కూలీలకు ఉపాధి దొరుకుతుంది. ఇతర వ్యాపారాలు పెరుగుతాయి. దీంతో కందుకూరు ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలో రాష్ట్రమే నిర్ణయించాలని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకులు రామాయపట్నం పోర్టు వచ్చేలాగా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాల్సింది పోయి అసలు పట్టించుకోవడంలేదనేది ప్రజల ఆరోపణ. సందిగ్ధంలో ఉద్యానవన కళాశాల.. గుడ్లూరు మండలంలో చినలాటిపి గ్రామంలో ఉద్యానవన కళాశాల ఏర్పాటు చేయాలని 235 ఎకరాల భూమి కేటాయించారు. ఈ ఏడాది నుంచి తరగతులు మొదలు కావాల్సి ఉంది. ఆరు నెలలవుతున్నా కళాశాల కమిటీ సభ్యులు మూడు సార్లు సందర్శించి వెళ్లారు. తరగతులు ప్రారంభించడానికి, విద్యార్ధులు ఉండటానికి వసతి గృహాలను, గుడ్లూరు, కందుకూరులో పరిశీలించారు. ఇప్పటికి ఎమ్మెల్యే, శివరాం చర్యలు తీసుకోలేదు. నత్తనడకన సోమశిల ఉత్తరకాలువ... సోమశిల ఉత్తకాలువ నత్తనడకన సాగుతోంది. ఈ కాలువ పూర్తయితేనే రాళ్ళపాడు ప్రాజెక్ట్ కింద ఉన్న భూమలు సస్యశ్యామలమవుతాయి. పదేళ్లుగా కా>లువ నిర్మాణం ఏ మాత్రం ముందుకు సాగడంలేదు. మూలిగేనక్కపై తాటికాయ పడినట్టు కాలవ పనులు పూర్తి కాకా నీళ్లే రాకపోతే రాళ్ళపాడు ప్రాజెక్ట్ నుంచి 1.5 టీఎంసీ నీటిని కొండాపురం మండలం చింతలదీవి వద్ద ఉన్న కామథేనువు ప్రాజెక్ట్ తరలింపునకు ప్రభుతం మంజూరు చేసినా జీవో 40 రాళ్లపాడు ప్రాజెక్టు రైతులకు కనీళ్లు తెప్పిస్తోంది. ఈ జీవో రద్దు చేయించడంలో ఇద్దరు నాయకులు విఫలం చెందారు. పత్తాలేని పార్కు... గత ప్రభుత్వంలో రామతీర్ధం జలాశయం మంచినీటి పధకం పక్కన కోటి రూపాలయ నిధులతో పార్కు పనులు మొదలు పెట్టారు అది పిల్లర్లు దశలోనే ఆగిపోయింది. పట్టణంలో చేపల మార్కెట్ సమీపంలో రూ. 50 లక్షలతో మటన్ మార్కెట్ నిర్మించాలని భూమిపూజ చేశారు. అది అంతటితోనే ఆగిపోయింది. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను అధిక మించేందుకు ఓవీ రోడ్డులోని మాల్యాద్రి కాలనీ మీదుగా పామూరు ప్రశాంతి నగర్ సమీపం వరకు బైపాస్‌రోడ్డు మంజూరైంది. ఇప్పటికి అది కూడా కార్యరూపం దాల్చలేదు. -
అధికార పార్టీలో ఆధిపత్య పోరు..
► ఎడతెగని వర్గపోరు ► ఆత్మకూరులో కన్నబాబు వర్సెస్ ఆనం ► గూడూరులో సునిల్ వర్సెస్ జ్యోత్స్నలత ► నెల్లూరులోనూ ఎవరికి వారే సాక్షి, నెల్లూరు : అధికార తెలుగుదేశం పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆధిపత్య పోరు తాజా పరిణామాలతో భగ్గుమంటోంది. ఆత్మకూరులో జన్మభూమి కమిటీల మార్పుతో మొదలైన చిచ్చు జిల్లా అంతటా రాజుకుంటోంది. నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు నేతలు హడావుడి చేస్తుండటం.. ఎవరికి వారే తమకు అనుకూలంగా పావులు కదుపుతుండటంతో టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఓ వైపు జన్మభూమి కమిటీల వివాదం, మరోవైపు పార్టీలో ద్వితీయ శ్రేణి నేతల పనులు చేయించలేకపోవడం, ప్రతిచోటా బహునాయకత్వం ఉండటం వంటి పరిస్థితులు ఆ పార్టీని ఇరుకున పెడుతున్నాయి. సమస్యల ‘ఆన'ం తాజాగా ఆత్మకూరు నియోజకవర్గంలో జన్మభూమి కమిటీల మార్పు చిచ్చు రేపింది. గూటూరు కన్నబాబు ఆత్మకూరులో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఏడాది క్రితం కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డిని ఆత్మకూరు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా నియమించారు. దీంతో ఇరువురు మధ్య వివాదాలకు తెరలేచింది. తాజాగా నియోజకవర్గంలో కన్నబాబు వర్గానికి చెందిన 72 మంది జన్మభూమి కమిటీ సభ్యులను తొలగించిన రామనారాయణరెడ్డి వారి స్థానంలో తన అనుచర గణాన్ని నియమించుకున్నారు. ఆత్మకూరు వ్యవహారంపై నెలన్నరగా పార్టీలో రగడ కొనసాగుతూనే ఉంది. రెండు వారాల క్రితం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో తన సంగతి తేల్చాల్సిందిగా కన్నబాబు జిల్లా ఇన్చార్జి మంత్రి అమరనాథ్‌రెడ్డిని గట్టిగా నిలదీశారు. నియోజకవర్గంలో ఆనంతో ఇబ్బందిగా ఉందని, తనకు ఏ విషయం స్పష్టంగా తెలపాలని కోరారు. ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పిన మంత్రి విషయాన్ని దాటవేశారు. అంతకు ముందు జిల్లాకు చెందిన మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారాయణ సైతం ఇదేవిధంగా వ్యవహరించారు. ఈ క్రమంలో జన్మభూమి కమిటీ సభ్యుల తొలగింపుతో కన్నబాబు స్థాయి పార్టీలో తేలిపోయినట్టయ్యింది. ఇదే పరిస్థితి గూడూరు, నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లోనూ నెలకొంది. ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో గత ఎన్నికలలో పోటీ చేసిన జ్యోత్స్నలతకు వైఎస్సార్ సీపీ నుంచి అధికార పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యే పాశం సునిల్‌కుమార్‌కు మధ్య తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి. సునిల్‌కుమార్ చేరికను జ్యోత్స్నతోపాటు మాజీమంత్రి బల్లి దుర్గాప్రసాద్‌రావు తీవ్రంగా వ్యతిరేకించారు. సునిల్‌కుమార్ చేరికతో పార్టీలో తమకు ప్రాధాన్యత తగ్గిపోయిందనే ఆవేదన వారిద్దరిలోనూ ఉంది. అధికారిక కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు జ్యోత్స్నలతను, దుర్గాప్రసాద్‌ను ఎమ్మెల్యే ఆహ్వానించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వారిద్దరూ ఈ విషయాన్ని పార్టీ ముఖ్యుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. పనులు, పర్సంటేజీలు మొదలుకొని అన్ని విషయాల్లోనూ వీరిమధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వర్గపోరు తారస్థాయికి చేరిన తరుణంలోనూ జిల్లాకు చెందిన మంత్రులు చూసీచూడనట్టు వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోతన్నారు. నెల్లూరులోనూ ఎవరికి వారే నెల్లూరు నగరం, రూరల్ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఎవరికి వారే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. నగర పార్టీ ఇన్చార్జిగా ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్చార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. నగరంలో పట్టుకోసం, తమ వారి ప్రాధాన్యత కోసం నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నిరంతరం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి వారే వ్యక్తిగతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మాజీమంత్రి తాళ్లపాక రమేష్ దంపతులు పార్టీ కార్యకలాపాలకు కొంత దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితి పార్టీకి తలనొప్పిగా మారింది. -
ర్యా గింగ్ రూపం మార్చింది?
నచ్చిన కళాశాలలో సీటు దొరికిందని.. కొత్త స్నేహాలు చిగురిస్తాయని.. ఓ కొత్త లోకంలో విహరించ వచ్చని.. ఇలా కొత్త కొత్త ఆశలతో కళాశాలకు అడుగుపెడతాడు విద్యార్థి.. పల్లెటూరు నుంచి పట్నానికి వచ్చినా.. పదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌లో చేరినా.. ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల్లో సీటు పొందినా.. అతనిలో ఎక్కడో తెలియని బెరుకు.. బెంగ.. భయం ఉంటాయి. అలాంటి వారిని సహృదయంతో సీనియర్లు ఆదరించి.. వారిలో ఆ భయాన్ని పొగొట్టాలి. ఎందుకంటే సీనియర్లు.. గతంలో జూనియర్లు కాబట్టి.. కానీ సీనియర్లలో కొందరు ఆకతాయిలు జూనియర్ పట్ల వికృత చేష్టలకు పాల్పడి వారి భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారు. ర్యాగింగ్ చట్టంతో ఇది కొంత తగ్గినా.. ఇప్పుడా రాక్షస క్రీడ రూపం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. సీనియర్లు, జూనియర్ల మధ్య ఆధిపత్య పోరు దిశగా, వేర్వేరు కళాశాలల మధ్య చిచ్చురేపుతూ.. తన విస్తృతిని పెంచే దిశగా పయనిస్తోంది. మరి ఇది నియంత్రణ సాధ్యమా? - విజయనగరం అర్బన్ ఇటీవల విశాఖ నగరానికి దూరంగా ఉన్న ఓ కార్పొరేట్ విద్యా సంస్థలో 15 రోజుల కిందట ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అర్థరాత్రి సమయంలో కొట్లాటకు వెళ్లారు. ఈ గొడవ మొదటిగా ఓ సీనియర్ విద్యార్థి జూనియర్ని ర్యా గింగ్ చేయడంతో మొదలైంది. ఈ ఘటనలో ప దుల సంఖ్యలో విద్యార్థులకు గాయాలయ్యాయి. వారం రోజుల కిందట నగరంలో ప్రైవేట్ కళాశాలలకు చెందిన విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి ఈవ్ టీజింగ్‌లతో గొడవలకు దిగారు. ఈ ఘటనతో ఆ పరిసరాల్లో కొద్దిసేపు తీవ్ర అలజడి నెలకొంది. పరిచయాలతో మొదలైన ర్యాగింగ్ ఇప్పుడు సీనియర్లు, జూనియర్లు, వేర్వేరు కళాశాలల విద్యార్థుల మధ్య ఆధిపోత్య పోరుగా మారింది. పరిచయాలతో మొదలై.. కళాశాలకు వచ్చే విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. కొత్తగా వచ్చే వారికి సీనియర్ల సమన్వయంతో ఉండాలని ఉపాధ్యాయులు చెప్పే సూచనలతో పరిచయాలు పెంచుకోవడానికి పలకరింపులు మొదలుపెడతారు. ఇంజినీరింగ్ విద్యా సంస్థలు పెరిగిన తర్వాత ఈ సంస్కృతి మరింత విస్తరించింది. సీనియర్లకి జూనియర్లు ఇచ్చే గౌరవం కాస్తా వారికి అవకాశంగా మారింది. దీంతో కొందరు ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించడం, జూనియర్లతో అన్ని పనులు చేయించుకోవడం, చెప్పిన మాట వినకుంటే బెదిరించడం, చెబితే వింటున్నారనే ఉద్దేశంతో మరింత దారుణంగా పనులు చేయిస్తూ.. మానసికంగా, శారీరకంగా హింసించేవారు. ఈ నేపథ్యంలో ఎదురయ్యే వేధింపులు భరించలేక ఎంతో మంది విద్యార్థులు తమ జీవితాలను బలి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీటిపై సీరియస్‌గా యాక్షన్ తీసుకొని ర్యాగింగ్ నిరోధక చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ర్యాగింగ్ భూతం తన ఉనికి కోల్పోతూ వచ్చింది. చట్టానికి భయపడి సీనియర్లు ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌లు చేయడం చాలా వరకు తగ్గించారు. అయితే మరల కొద్ది రోజుల కిందట నగరంలో చోటుచేసుకున్న సంఘటనలతో ర్యాగింగ్ రూపం మార్చుకొని కలత చెందిస్తోంది. సీనియర్స్ వర్సెస్ జూనియర్స్.. ప్రస్తుతం సీనియర్స్ పరిచయాల పేరుతో ర్యాగింగ్ చేస్తే కొత్తగా కళాశాలల్లో చేరే విద్యార్థులు భరించే స్థితిలో లేరు. సీనియర్లు అయితే ఏంటి? వేధిస్తే సహించలా? అని ఎదురు తిరుగుతున్నారు. దీనిని భరించ లేని సీనియర్లు వారి మీద దాడులకు దిగుతున్నారు. అదే సమయంలో జూనియర్స్ కూడా సీనియర్స్ మీద తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోంది. అదే సమయంలో నగరంలో ప్రైవేట్ కళాశాలన్నీ ఒకే చోట ఉండటంతో వేర్వేరు కళాశాల విద్యార్థుల మధ్య మాటల యుద్ధం, ఈవ్ టీజింగ్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనల్లో కళాశాల విద్యార్థులు గొడవలకు దిగుతూ రోడ్ల మీదనే కొట్లాడుకుంటున్నారు. కళాశాలల్లో నాలుగు గోడల మధ్య జరిగే ర్యాగింగ్లు, టీజింగ్‌లు ఇప్పుడు ఆధిపత్య పోరుగా మారి రోడ్ల మీదకు వచ్చింది. మా కాలేజీ అమ్మాయిని కామెంట్ చేసావని ఒకరు, మా కాలేజీ స్టూడెంట్‌ని కొడతావా అంటూ మరొకరు.. ఇలా గొడవలకు దిగుతూ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఇవన్నీ ర్యాగింగ్‌లో భాగమే. జూనియర్లను, ఇతర విద్యార్థులను మాటల ద్వారా గాని, చేతల ద్వారాగాని వే ధిస్తే.. క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తిస్తూ, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ, విద్యార్థులను శారీరకంగా హింసించినా.. అటుగా ప్రోత్సహించినా.. విద్యార్థి చదువులపై ప్రభావం చూపిస్తూ.. అకాడమిక్ యాక్టివిటీస్‌కు అంతరాయానికి.. జూనియర్స్‌కి సీనియర్ విద్యార్థులు వారి అకాడమిక్ టాస్క్‌ని పూర్తి చేయాలని బలవంతం చేసినా.. విద్యార్థులైపై బలవంతంగా ఆర్థిక భారం పడేట్లు చేసినా.. శారీరక హింస, మానసిక హింసకు విద్యార్థిని గురిచేసినా.. మాటల ద్వారా గాని, ఈ-మెయిల్స్ రూపంలో గాని, సందేశాల రూపంలో గాని, ఫోన్ ద్వారా గాని హింసించడానికి ప్రయత్నించినా.. ఆలోచనలు ప్రభావితం చేస్తూ వారి మానసిక సామర్థ్యాన్ని తగ్గించే విధంగా ప్రవ ర్తించినా.. ర్యాగింగ్ కింద పరిగణిస్తారు. -
అంతా అధిష్టానమే చేసింది!
పదేళ్లు కార్యకర్తలను పట్టించుకోలేదు పదవులు పంచలేదు.. నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదు బంధుప్రీతి, ఆధిపత్యపోరుతో ఓడిపోయాం క్షేత్రస్థాయిలో శ్రేణులను గౌరవిస్తేనే మనుగడ కాంగ్రెస్ బృంద సమీక్షల్లో ద్వితీయ శ్రేణి నేతల ఆవేదన సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ‘అధిష్టానం వైఖరే పార్టీ కొంపముంచింది. క్షేత్రస్థాయి కార్యకర్తలను ఏనాడూ పట్టించుకోలేదు. ఇదే పార్టీ అడ్రస్ గల్లంతయ్యే దుస్థితికి దారి తీసింది. అధికారంలో ఉన్నన్నాళ్లు పదవులు అనుభవించిన నాయకులే దీని కంతటికీ కారణం’ అని కాంగ్రెస్ ద్వితీ యశ్రేణి నాయకులు కుండబద్దలు కొట్టారు. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయలేదు. పార్టీ పదవుల్లోనూ ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా ఓటమికి కారణంగా విశ్లేషించారు. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన బృంద సమీక్షల్లో పార్టీ బలోపేతంపై ముఖ్య నేతలు అభిప్రాయాలను తెలుసుకున్నారు. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఆరు గ్రూపులు పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేశారు. కార్యకర్తను గౌరవించకపోతే... ‘పార్టీకి పూర్వవైభవం కార్యకర్తలను గౌరవించాలి. భజనపరులకు, బంధుప్రీతికి తావివ్వకుండా పదవుల భర్తీలో గ్రామస్థాయి కమిటీల సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలి’ అని పార్టీ నాయకులు ముక్తకంఠంతో తీర్మానించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలీయశక్తిగా మార్చేందుకు సీనియర్లు విరివిగా పర్యటించాలని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర ఉద్యమించాలని సూచించారు. బృంద సమీక్షల్లో వెల్లడైన అభిప్రాయాల మేరకు పార్టీ ఏఐసీసీ దిశానిర్దేశం చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, సుధీర్‌రెడ్డి, యువనేత కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాకినాడ ‘దేశం’..ఆధిపత్య సమరం..
టీడీపీ నేతల మధ్య రచ్చకెక్కుతున్న విభేదాలు పార్టీ నగర అధ్యక్షుడు దొరబాబు, వాణిజ్య విభాగం నేత బాబ్జీ వర్గాల మధ్య పెరుగుతున్న దూరం సాక్షి ప్రతినిధి, కాకినాడ :కాకినాడ తీరంలో తెలుగు తమ్ముళ్లు ఆధిపత్య పోరులో కొట్టుకుపోతున్నారు. పలు అంశాల్లో పరస్పరం కయ్యానికి కాలు దువ్వుతున్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్, ట్యాంక్ ఓనర్స్ అసోసియేషన్, కాకినాడ పోర్ట వర్కర్స్ యూనియన్ల వ్యవహారాలు, మార్కెట్లో ఆర్థిక కార్యకలాపాలు, కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు.. ఇలా అనేక విషయాల్లో ‘దేశం’ నేతల మధ్య విభేదాలు పొడచూపుతూండడంపై కేడర్‌లో ఆందోళన నెలకొంది. ఈ అంశాల్లో టీడీపీ కాకినాడ నగర అధ్యక్షుడు నున్న దొరబాబు, పార్టీ వాణిజ్య విభాగం నాయకుడు, గోదావరి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంధి బాబ్జీ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది. చివరకు ఈ వివాదం.. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో సోమవారం రాత్రి బాబ్జీకి చెందిన ధనలక్ష్మి ఫౌండేషన్ ఆరో వార్షికోత్సవానికి మంత్రులు దూరమయ్యే పరిస్థితికి దారి తీయడం టీడీపీలో చర్చనీయాంశమైంది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకూ దొరబాబు, బాబ్జీ చెట్టపట్టాలేసుకునే తిరిగారు. అనంతరం కాకినాడ దిగుమర్తివారివీధిలో వినాయక చవితి పందిరి విషయంలో వారిమధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడవి చినికిచినికి గాలివానగా మారి, రెండు వర్గాలుగా విడిపోయే వరకూ వెళ్లింది. రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుందన్న సాకుతో చవితి పందిరిని తొలగించేందుకు ఆ పార్టీకి చెందిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై బాబ్జీ ఒత్తిడి తెచ్చారు. దీనిని దొరబాబు వర్గీయులు వ్యతిరేకించడంతో వారిమధ్య వివాదం మొదలైందని పార్టీ నేతలు బాహాటంగానే చెప్పుకున్నారు. ఈ విషయంలో దొరబాబుదే పైచేయి అయింది. దీంతో దొరబాబు వర్గానికి బాబ్జీ దూరంగానే ఉంటున్నారు. దీనికి ఆర్థికపరమైన సర్దుబాట్లలో తలెత్తిన విభేదాలు కూడా తోడవడంతో ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ధనలక్ష్మి ఫౌండేషన్ వార్షికోత్సవానికి పార్టీ నగర అధ్యక్షుడైన దొరబాబును ఆహ్వానించలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. పార్టీ నాయకులతోపాటు ఇతర పార్టీల నేతలను కూడా ఆహ్వానించి, కేవలం దొరబాబును మాత్రమే విస్మరించడం కావాలని చేసింది కాక మరేమిటని ఆ వర్గం ప్రశ్నిస్తోంది. దీనిపై ముఖ్యనేతల వద్ద తాడోపేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చిన దొరబాబు వర్గీయులు ధనలక్ష్మి ఫౌండేషన్ వార్షికోత్సవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకాకుండా చేయగలిగారని చెబుతున్నారు. అయినప్పటికీ దీనికి ఎమ్మెల్యే కొండబాబు హాజరవడాన్ని దొరబాబు వర్గీయులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పార్టీ కార్యక్రమం కాకున్నా అందరినీ ఆహ్వానించి, తనను పిలవకపోవడాన్ని అవమానంగా భావించి.. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వారు కార్యక్రమానికి హాజరు కాలేదని టీడీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ కయ్యం.. మేయర్ పీఠం కోసమేనా! బాబ్జీ, దొరబాబులు రెండు వర్గాలు కావడానికి కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు కూడా మరో కారణమని నేతలు విశ్లేషిస్తున్నారు. అసలు జరుగుతాయో లేదో తెలియని కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠం కోసమే వారు పరస్పరం కయ్యానికి కాలుదువ్వుతున్నారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన కాపు సామాజికవర్గానికే మేయర్ సీటు కట్టబెట్టాలని దొరబాబు, వైశ్య సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని బాబ్జీ చెరో అజెండాతో వర్గాలుగా విడిపోయారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేకి ఆర్థికంగా చేయూతనిచ్చిన అంశాన్ని తెరపైకి తెచ్చి, తన కుటుంబ సభ్యులకు మేయర్ సీటు ఇప్పించుకొనేందుకు బాబ్జీ ప్రయత్నిస్తున్నారని దొరబాబు వర్గం ఆగ్రహంతో ఉంది. అదే జరిగితే ఎంతకైనా వెళతామని వారు చెబుతున్నారు. ఈ విభేదాలు ఏ విపరిణామాలకు దారి తీస్తాయోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ వర్గ విభేదాలను ఎమ్మెల్యే కొండబాబు ఎలా దారికి తెస్తారనేది వేచి చూడాల్సిందే. -
తారస్థాయికి ‘తమ్ముళ్ల’ పంచాయతీ!
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నంలో తెలుగు తమ్ముళ్ల పంచాయతీ తారస్థాయికి చేరింది. టీడీపీలో రెండు వ ర్గాల ఆధిపత్య పోరు వీధిన పడింది. నగరపంచాయతీ చైర్మన్ కంభాలపల్లి భరత్‌కుమార్, వైస్ చైర్మన్ సుల్తాన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. కొంతకాలంగా వీరిద్దరి మధ్య కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో.. ఏకంగా చైర్మన్ కార్యాలయానికే తాళం వేసే వరకు వెళ్లింది. ప్రజా ప్రయోజనాలు కాకుండా.. కేవలం వ్యక్తిగత ప్రయోనాలు, ప్రతిష్టల కోసమే ఇదంతా జరుగుతోందని ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ.. నగర పంచాయతీ అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్ల సాక్షిగా.. తమ్ముళ్ల పంచాయతీ వెనక అసలు కథాకమామిషు.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇదీ జరిగింది.. ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ కార్యాలయంలోని చైర్మన్ భరత్‌కుమార్ చాంబర్లో ఆయనతో బుధవారం వైఎస్ చైర్మన్ సుల్తాన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు సమావేశమయ్యారు. ఈ క్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ శంకర్‌నాయక్‌కు సంబంధించి రూ.15 వేల బిల్లు డ్రా అయిన విషయం చర్చకు వచ్చింది. ఎక్కడా పోయని మట్టికి బిల్లు ఎలా మంజూరు చేస్తారంటూ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు చైర్మన్‌ను ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని కూడా కౌన్సిలర్లు వివరణ కోరారు. ఈ క్రమంలో చైర్మన్ భరత్‌కుమార్ ఓ వైపు, వైస్ చైర్మన్ సుల్తాన్, కొంతమంది కౌన్సిలర్లు మరో వైపు వాదోపవాదాలు, మాటల పంరంపర కొనసాగింది. నగర పంచాయతీలో జరిగే ప్రతీ విషయం కౌన్సిలర్లకు చెప్పాల్సిన పని లేదంటూ చైర్మన్ భరత్‌కుమార్ విసురుగా అక్కడినుంచి వెళ్లిపోయారు. వెళుతూ..వెళుతూ అక్కడే ఉన్న కుర్చీలను తన్నుకుంటూ వెళ్లారు. దీన్ని అవమానంగా భావించిన వైస్ చైర్మన్ సుల్తాన్.. కౌన్సిలర్ల సమక్షంలోనే చైర్మన్ భరత్‌కుమార్ కార్యాలయానికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లి పోయారు. కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరుకు ఈ ఘటన ఆజ్యం పోసినట్లయింది. రెండు వర్గాల మధ్య విభేదాలను మరింత రాజేసినట్లయిందని సొంత పార్టీవాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. బ్లాక్మెయిల్ చేస్తున్నారు: భరత్‌కుమార్, నగర పంచాయతీ చైర్మన్ చేయని పనులకు బిల్లులు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వైస్ చైర్మన్ సుల్తాన్ బ్లాక్‌మెయిల్‌కు భయపడి అవినీతికి పాల్పడను. నేను దళితుడి అయినందుకే అవమానించే విధంగా నా కార్యాలయానికి తాళం వేశారు. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడలేదు: సుల్తాన్, నగర పంచాయతీ వైస్ చైర్మన్ కౌన్సిలర్లకు ఎలాంటి సమాచారం లే కుండా, నగరపంచాయతీ తీర్మానం లేకుండా డ్రా అయిన బిల్లుల విషయంలో మాత్రమే చైర్మన్ భరత్‌కుమార్‌ను ప్రశ్నించాను. ఇదంతా తోటి కౌన్సిలర్ల సమక్షంలోనే జరిగింది. చైర్మన్ గదికి తాళం వేసేందుకు దారితీసిన పరిస్థితిపై విచారణ జరిపితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి. -
టీడీపీలో ఆధిపత్య కుమ్ములాటలు
బద్వేలు:బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఈమేరకు పార్టీ నియోజకవర్గ బాధ్యతలు తమకే కావాలంటూ పార్టీలోని నాయకులు కుమ్ములాడుకుంటున్నారు. గతంలో బద్వేలు బాధ్యతలు మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి కుమార్తె విజయమ్మ చేసేవారు. ఈ నేపథ్యంలో 2008లో బద్వేలు నియోజకవర్గం ఎస్సీకి రిజర్వు అయింది. అప్పట్లో కూడా నియోజకవర్గ బాధ్యతలు ఆమే చూసేవారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలు శాసనసభ అభ్యర్థిగా బ్యాంక్ మేనేజర్ విజయజ్యోతిని నిలిపారు. కాంగ్రెస్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణారావు కూడా ఈమెకు మద్ధతు పలికారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో శివరామకృష్ణారావు టీడీపీలో చేరారు. దీంతో బద్వేలు నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఎన్నికల ముందు చంద్రబాబు అభ్యర్థి విజయజ్యోతిని ఇన్చార్జి గా నియమించారు. అయితే మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మాత్రం పలు దఫాలు తానే ఇన్‌ఛార్జి అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఎన్నికల్లో ఓడిపోయిన వారినే చంద్రబాబు నియోజకవర్గ బాధ్యులుగా నియమించారు. ఇక్కడ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని విజయజ్యోతి, కాదు తనకు కావాలంటూ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గట్టిగా పట్టుబట్టారు. దీంతో నియోజకవర్గ బాధ్యులు ఎవరనేది నాయకుల్లో, కార్యక ర్తల్లో గందరగోళం సృష్టిస్తోంది. తాజాగా మూడు రోజుల క్రితం ఈ పంచాయతీ పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు చేరింది. దీనిపై అభిప్రాయ సేకరణ చేసే బాధ్యతను సీఎం రమేష్‌కు అప్పగించినట్లు తెలిసింది. మరో రెండు, మూడు రోజుల్లో దీనిపై కడపలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని నియోజకవర్గంలోని ముఖ్యమైన నాయకులకు చేరవేసే పనిలో నేతలున్నారు. మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణారావుతో పాటు సీఎం సురేష్ నాయుడు, మేడా మల్లికార్జునరెడ్డి విజయజ్యోతికి మద్ధతు తెలుపుతున్నట్లు సమాచారం. శివరామకృష్ణయ్య ఇప్పటికే తన వర్గానికి సమాచారం అందించడంతో పాటు విజయజ్యోతిని ఇన్చార్జిగా నియమించేందుకు అవసరమైన మార్గాలను అన్వేషించే పనిలో పడినట్లు తెలిసింది. రెండు రోజుల్లో అభిప్రాయ సేకరణ సమావేశం జరగనున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కూడా నియోజకవర్గానికి చేరుకుని నాయకుల మద్ధతు కోరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొంతమంది ఆమె వర్గీయులు గోపవరంలోని నేతలను కలిసి తమకు మద్ధతు పలకాలని కోరారని సమాచారం. ఎన్నికల సమయంలో కూడా శివరామకృష్ణయ్య , విజయమ్మ మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడ్డాయి. ఇన్చార్జి నియామకం కోసం వీరిమధ్య మరోసారి అంతర్యుద్ధం ప్రారంభమైందని ఆపార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. మరో రెండు,మూడు రోజుల్లో ఏవిషయం తేలుతుందని నేతలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. -
దేశం కుతకుత!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లా తెలుగుదేశం పార్టీలో పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇవ్వాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించడంపై పరిటాల వర్గం భగ్గుమంటోంది. తమను రాజకీయంగా దెబ్బతీయడానికే పయ్యావుల కేశవ్ జేసీ బ్రదర్స్‌ను టీడీపీలోకి తెస్తున్నారని పరిటాల వర్గం ఆరోపిస్తోంది. జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇస్తే పార్టీని వీడటానికి కూడా వెనుకాడబోమని ప్రకటించిన పరిటాల సునీత.. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో మంతనాలు సాగిస్తున్నారు. పరిటాల సునీత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయ విశ్లేషకుల మెదళ్లకు పనిపెట్టింది. వివరాల్లోకి వెళితే.. పరిటాల రవీంద్ర, పయ్యావుల కేశవ్ 1994 ఎన్నికల్లో ఒకేసారి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గం నుంచి పరిటాల రవీంద్ర, ఉరవకొండ నియోజకవర్గం నుంచిపయ్యావుల కేశవ్ గెలుపొంది, శాసనసభలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో పరిటాల రవీంద్రకు చోటు దక్కింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ఆ సమయంలో జిల్లా నుంచి గెలుపొందిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో ఒక్క పరిటాల రవీంద్ర మాత్రమే ఎన్టీఆర్ వైపు నిలిచారు. పయ్యావుల కేశవ్ సహా తక్కిన 11 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబుకు దన్నుగా నిలిచారు. మనస్థాపంతో ఎన్టీఆర్ మరణించిన తర్వాత పరిటాల రవీంద్ర అప్పటి సీఎం చంద్రబాబు గూటికే చేరారు. జిల్లాలో పరిటాల రవీంద్ర ఆధిపత్యాన్ని గండికొట్టేందుకు పయ్యావుల కేశవ్‌ను చంద్రబాబు ఎగదోశారు. ఇది జిల్లా టీడీపీలో వర్గ విభేదాలకు మొగ్గతొడిగేలా చేసింది. పరిటాల రవి కన్నుమూసే వరకూ ఇరు వర్గాలు ఉప్పునిప్పులా ఉండేవి. పరిటాల రవి చనిపోయిన తర్వాత జిల్లాలో టీడీపీపై పయ్యావుల కేశవ్ ఆధిపత్యాన్ని చాటుకుంటూ వస్తున్నారు. పయ్యావుల కేశవ్, జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబాల మధ్య ఆది నుంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో జేసీ దివాకర్‌రెడ్డి ఒంటరయ్యారు. ఇదే సమయంలో జేసీ బ్రదర్స్‌ను టీడీపీలోకి తేవడానికి పయ్యావుల కేశవ్ ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం రెండేళ్లుగా వ్యక్తమవుతోంది. మంగళవారం అది కార్యరూపం దాల్చింది. జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇవ్వాలని నిర్ణయించడంపై పరిటాల సునీత భగ్గుమంటున్నారు. ఇదే అంశంపై శాసనసభ లాబీల్లోనే పయ్యావుల కేశవ్‌ను ఆమె నిలదీశారు. జేసీ బ్రదర్స్‌ను పార్టీలోకి తేవడంలో తన పాత్ర ఏమీ లేదంటూ పయ్యావుల కేశవ్ ఇచ్చిన వివరణను పరిటాల సునీత కొట్టిపారేశారు. స్కూలు పిల్లాడిని అడిగినా జేసీ బ్రదర్స్‌ను పయ్యావుల కేశవ్ టీడీపీలోకి తెస్తున్నారని చెబుతున్నారని కుండబద్ధలు కొట్టినట్లు తెలిసింది. ఆది నుంచి తమను వ్యతిరేకిస్తోన్న పయ్యావుల కేశవ్ రాజకీయంగా తమను దెబ్బతీయడానికే టీడీపీలోకి జేసీ బ్రదర్స్‌ను తెస్తున్నారని పరిటాల వర్గం ఆరోపిస్తోంది. పరిటాల రవి హత్య కేసులో జేసీ దివాకర్‌రెడ్డిని నిందితునిగా చేర్చారని.. అలాంటి వ్యక్తి కుటుంబానికి టీడీపీ దన్నుగా నిలవడం ఏ మేరకు సబబు అని పరిటాల సునీత ప్రశ్నిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా టీడీపీ నేతలు, కార్యకర్తలను జేసీ కుటుంబం వేధిస్తూ వస్తోందని.. అలాంటి కుటుంబానికి నీడనిస్తే శ్రేణులకు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. తాడిపత్రిలో ఇటీవల ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభ వేదికగా పరిటాల సునీత మాట్లాడుతూ జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇస్తే పార్టీని వీడటానికి కూడా వెనుకాడబోమని ప్రకటించడం అప్పట్లో సంచలనం రేపింది. పరిటాల సునీత బెట్టు చేస్తోండటంతోనే జేసీ బ్రదర్స్ టీడీపీలో చేరే ముహూర్తం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోందనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇచ్చే ముహూర్తాన్ని మంగళవారం ఖరారు చేసిన నేపథ్యంలో పరిటాల సునీత క్రియాశీలకమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై తమ అనుచరులతో జోరుగా చర్చలు సాగిస్తున్నారు. తాడిపత్రిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభ వేదికగా చేసిన ప్రకటనకు పరిటాల సునీత కట్టుబడతారా..? మరేదైనా సంచలన నిర్ణయం ప్రకటిస్తారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. -
ఇసుక మాఫియాలో ఆధిపత్య పోరు
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆయా వాగుల్లో ఇసుక భారీగా వచ్చింది. దీంతో ఇసుక వ్యాపారులు పండగ చేసుకుంటున్నారు. ఓ వైపు ఇసుకకు రోజురోజుకూ డిమాండ్ పెరిగిపోతుండడంతో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా. ఇటీవల ఇసుక మాఫియాలో అలజడి రేగింది. మిర్యాలగూడ సమీపంలోని పాలేరు వాగుపై ఇసుక వ్యాపారుల కన్ను పడింది. వర్షాలకు వేములపల్లి, మిర్యాల గూడ మండలాల్లో ఉన్న పాలేరు వాగులో ఇసు క వచ్చింది. ఒక్క లారీ ఇసుక లోడు చేసి పంపి స్తే రూ 15 వేలు వస్తున్నాయి. దాంతో గ్రామాల లో ఇసుక మాఫియా ముఠాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇసుక దందాలో ఆధిపత్య పోరుకు రాజకీయ రంగు పులుముకుంది. ఇసుక దందాతో రాజకీయ పార్టీ నాయకుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీన వేములపల్లి మండలం రావులపెంటలో ఒక పార్టీ వారు నిర్వహించిన వేలం పాటను అడ్డుకోవడానికి మరో పార్టీ వారు ప్రయత్నించడంతో ఘర్షణ నెలకొన్నది. దాం తో రెవెన్యూ అధికారులు నాలుగు రోజులుగా రావులపెంట సమీపంలోని పాలేరు వాగు వద్ద గస్తీ ఏర్పాటు చేశారు. ఇరువర్గాలకు చెందిన 32 మందిపై కేసు కూడా నమోదు చేశారు. ఇటీవల మిర్యాలగూడ మండలంలోని తడకమళ్ల వద్ద ఒక పార్టీకి చెందిన వారు ఇసుక దందా నిర్వహిస్తుండగా మరో రాజకీయ పార్టీకి చెంది న వారు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి మూడు లారీలు, ఒక జేసీబీని పట్టించారు. రాత్రికి రాత్రి డంప్‌లు, రవాణా రాత్రికి రాత్రి ఇసుక డంప్‌లు చేయడంతో పా టు లారీలలో రవాణా కూడా చేస్తున్నారు. పాలే రు వాగులోని ఇసుకను జేసీబీతో ట్రాక్టర్లో లోడ్ చేసి ఆ తర్వాత మిర్యాలగూడ మండలంలోని ఎడమ కాలువ సమీపంలో డంప్ చేస్తున్నారు. ఆ వెంటనే అక్కడ మరో జేసీబీతో లారీలోకి ఇసుకను ఎత్తుతున్నారు. కేవలం 10 నిమిషాల్లో లారీలోడు చేసుకొని వెళ్తున్నారు. వేములపల్లి మండలం కామేపల్లి నుంచి పాలేరు వాగు నుంచి జోరుగా ఇసుక డంప్‌లు చేసి రవాణా చేస్తున్నారు. మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్రగూడెంలో అద్దంకి - నార్కట్‌పల్లి రహదారి వెంట కూడా రాత్రికి రాత్రి ఇసుక డంప్ చేసి లారీలలో రవాణా చేస్తున్నారు. అయినా కనీసం అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇసుక మాఫియాకు రాజకీయ అండదండలతో పాటు అధికారులూ తోడవ్వడంతో ఈ దందా జోరుగా సాగుతోంది. గ్రామాలలో వేలం పాటలు ఇసుక రవాణా చేసుకోవడానికి గ్రామాలలో బహిరంగంగా వేలం పాటలు నిర్వహించి దం దా నిర్వహిస్తున్నారు. అయినా అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 10వ తేదీన వేములపల్లి మండలంలోని రావులపెంటలో వేలం పాట నిర్వహించగా నెలకు రూ 1.80 లక్షలు వేలంపాటలో అధికార పార్టీకి చెందిన నాయకుడు దక్కించుకున్నాడు. అదే విధంగా వేములపల్లి మండలంలోని కామేపల్లిలో వేలం పాట నిర్వహించి ఇసుక రవాణా చేస్తున్నారు. సల్కునూరు. బొమ్మకల్లు, భీమనపల్లి, ఆగామోత్కూర్, చిరుమర్తి, కల్వెలపాలెం గ్రామాలలో కూడా ఇసుక వేలం పాటలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
డబుల్ ధమాకా!
సికింద్రాబాద్, న్యూస్‌లైన్: ఒకే కార్యాలయం.. ఒకే రోజు.. రెండు ప్రారంభోత్సవాలు.. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? శనివారం పలుచోట్ల చోటు చేసుకున్న ఈ ఘటనలు మన ప్రజాప్రతినిధుల ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉందని చెప్పేందుకు నిదర్శనాలు. లాలాగూడ రైల్వే వర్క్‌షాపు సమీపంలోని పురాతన తపాలా కార్యాలయాన్ని ఇటీవల ఆధునికీకరించారు. శనివారం 11 గంటలకు ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించిన అధికారులు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. అయితే, అరగంట ముందే అక్కడికి చేరుకున్న ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్.. ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగేది లేదని, రిబ్బన్ కట్ చేసి వెళ్లిపోయారు. 11.30 గంటల సమయంలో ఎమ్మెల్యే జయసుధ అక్కడికి చేరుకున్నారు. ఏం చేయాలో పాలుపోని అధికారులు అంజన్ రిబ్బన్ కట్ చేసిన ప్రవేశ్ ద్వారానికే మరో రిబ్బన్ ఏర్పాటు చేసి ఆమెతో కట్ చేయించారు. ఇలా ఒకే తపాలా కార్యాలయానికి గంట వ్యవధిలో రెండుసార్లు ప్రారంభోత్సవాలు జరిగాయి. అటు, బోయిన్‌పల్లిలో కేంద్ర మంత్రి, ఎంపీ సర్వే సత్యనారాయణ కంటే ముందే ‘ప్రాజెక్ట్ యారో పోస్టాఫీసు’ను ఎమ్మెల్యే శంకర్రావు ప్రారంభించి వెళ్లిపోయారు. ఆ తర్వాత వచ్చిన సర్వే మరోమారు రిబ్బన్ కట్ చేశారు. బొల్లారంలోనూ దాదాపు ఇదే సీన్ రిపీట్ అయింది.