సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లా తెలుగుదేశం పార్టీలో పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇవ్వాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించడంపై పరిటాల వర్గం భగ్గుమంటోంది. తమను రాజకీయంగా దెబ్బతీయడానికే పయ్యావుల కేశవ్ జేసీ బ్రదర్స్‌ను టీడీపీలోకి తెస్తున్నారని పరిటాల వర్గం ఆరోపిస్తోంది. జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇస్తే పార్టీని వీడటానికి కూడా వెనుకాడబోమని ప్రకటించిన పరిటాల సునీత.. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో మంతనాలు సాగిస్తున్నారు. పరిటాల సునీత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయ విశ్లేషకుల మెదళ్లకు పనిపెట్టింది.
వివరాల్లోకి వెళితే.. పరిటాల రవీంద్ర, పయ్యావుల కేశవ్ 1994 ఎన్నికల్లో ఒకేసారి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గం నుంచి పరిటాల రవీంద్ర, ఉరవకొండ నియోజకవర్గం నుంచిపయ్యావుల కేశవ్ గెలుపొంది, శాసనసభలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో పరిటాల రవీంద్రకు చోటు దక్కింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ఆ సమయంలో జిల్లా నుంచి గెలుపొందిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో ఒక్క పరిటాల రవీంద్ర మాత్రమే ఎన్టీఆర్ వైపు నిలిచారు. పయ్యావుల కేశవ్ సహా తక్కిన 11 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబుకు దన్నుగా నిలిచారు. మనస్థాపంతో ఎన్టీఆర్ మరణించిన తర్వాత పరిటాల రవీంద్ర అప్పటి సీఎం చంద్రబాబు గూటికే చేరారు.
జిల్లాలో పరిటాల రవీంద్ర ఆధిపత్యాన్ని గండికొట్టేందుకు పయ్యావుల కేశవ్‌ను చంద్రబాబు ఎగదోశారు. ఇది జిల్లా టీడీపీలో వర్గ విభేదాలకు మొగ్గతొడిగేలా చేసింది. పరిటాల రవి కన్నుమూసే వరకూ ఇరు వర్గాలు ఉప్పునిప్పులా ఉండేవి. పరిటాల రవి చనిపోయిన తర్వాత జిల్లాలో టీడీపీపై పయ్యావుల కేశవ్ ఆధిపత్యాన్ని చాటుకుంటూ వస్తున్నారు. పయ్యావుల కేశవ్, జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబాల మధ్య ఆది నుంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో జేసీ దివాకర్‌రెడ్డి ఒంటరయ్యారు. ఇదే సమయంలో జేసీ బ్రదర్స్‌ను టీడీపీలోకి తేవడానికి పయ్యావుల కేశవ్ ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం రెండేళ్లుగా వ్యక్తమవుతోంది.
మంగళవారం అది కార్యరూపం దాల్చింది. జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇవ్వాలని నిర్ణయించడంపై పరిటాల సునీత భగ్గుమంటున్నారు. ఇదే అంశంపై శాసనసభ లాబీల్లోనే పయ్యావుల కేశవ్‌ను ఆమె నిలదీశారు. జేసీ బ్రదర్స్‌ను పార్టీలోకి తేవడంలో తన పాత్ర ఏమీ లేదంటూ పయ్యావుల కేశవ్ ఇచ్చిన వివరణను పరిటాల సునీత కొట్టిపారేశారు. స్కూలు పిల్లాడిని అడిగినా జేసీ బ్రదర్స్‌ను పయ్యావుల కేశవ్ టీడీపీలోకి తెస్తున్నారని చెబుతున్నారని కుండబద్ధలు కొట్టినట్లు తెలిసింది. ఆది నుంచి తమను వ్యతిరేకిస్తోన్న పయ్యావుల కేశవ్ రాజకీయంగా తమను దెబ్బతీయడానికే టీడీపీలోకి జేసీ బ్రదర్స్‌ను తెస్తున్నారని పరిటాల వర్గం ఆరోపిస్తోంది. పరిటాల రవి హత్య కేసులో జేసీ దివాకర్‌రెడ్డిని నిందితునిగా చేర్చారని.. అలాంటి వ్యక్తి కుటుంబానికి టీడీపీ దన్నుగా నిలవడం ఏ మేరకు సబబు అని పరిటాల సునీత ప్రశ్నిస్తున్నారు.
మూడు దశాబ్దాలుగా టీడీపీ నేతలు, కార్యకర్తలను జేసీ కుటుంబం వేధిస్తూ వస్తోందని.. అలాంటి కుటుంబానికి నీడనిస్తే శ్రేణులకు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. తాడిపత్రిలో ఇటీవల ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభ వేదికగా పరిటాల సునీత మాట్లాడుతూ జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇస్తే పార్టీని వీడటానికి కూడా వెనుకాడబోమని ప్రకటించడం అప్పట్లో సంచలనం రేపింది. పరిటాల సునీత బెట్టు చేస్తోండటంతోనే జేసీ బ్రదర్స్ టీడీపీలో చేరే ముహూర్తం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోందనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇచ్చే ముహూర్తాన్ని మంగళవారం ఖరారు చేసిన నేపథ్యంలో పరిటాల సునీత క్రియాశీలకమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై తమ అనుచరులతో జోరుగా చర్చలు సాగిస్తున్నారు. తాడిపత్రిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభ వేదికగా చేసిన ప్రకటనకు పరిటాల సునీత కట్టుబడతారా..? మరేదైనా సంచలన నిర్ణయం ప్రకటిస్తారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.
దేశం కుతకుత!
Published Thu, Jan 9 2014 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement
Advertisement