టీడీపీలో ఆధిపత్య కుమ్ములాటలు
బద్వేలు:బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఈమేరకు పార్టీ నియోజకవర్గ బాధ్యతలు తమకే కావాలంటూ పార్టీలోని నాయకులు కుమ్ములాడుకుంటున్నారు. గతంలో బద్వేలు బాధ్యతలు మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి కుమార్తె విజయమ్మ చేసేవారు. ఈ నేపథ్యంలో 2008లో బద్వేలు నియోజకవర్గం ఎస్సీకి రిజర్వు అయింది. అప్పట్లో కూడా నియోజకవర్గ బాధ్యతలు ఆమే చూసేవారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలు శాసనసభ అభ్యర్థిగా బ్యాంక్ మేనేజర్ విజయజ్యోతిని నిలిపారు. కాంగ్రెస్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణారావు కూడా ఈమెకు మద్ధతు పలికారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో శివరామకృష్ణారావు టీడీపీలో చేరారు. దీంతో బద్వేలు నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది.
ఎన్నికల ముందు చంద్రబాబు అభ్యర్థి విజయజ్యోతిని ఇన్‌చార్జి గా నియమించారు. అయితే మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మాత్రం పలు దఫాలు తానే ఇన్‌ఛార్జి అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఎన్నికల్లో ఓడిపోయిన వారినే చంద్రబాబు నియోజకవర్గ బాధ్యులుగా నియమించారు. ఇక్కడ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని విజయజ్యోతి, కాదు తనకు కావాలంటూ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గట్టిగా పట్టుబట్టారు. దీంతో నియోజకవర్గ బాధ్యులు ఎవరనేది నాయకుల్లో, కార్యక ర్తల్లో గందరగోళం సృష్టిస్తోంది. తాజాగా మూడు రోజుల క్రితం ఈ పంచాయతీ పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు చేరింది. దీనిపై అభిప్రాయ సేకరణ చేసే బాధ్యతను సీఎం రమేష్‌కు అప్పగించినట్లు తెలిసింది. మరో రెండు, మూడు రోజుల్లో దీనిపై కడపలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
ఈ విషయాన్ని నియోజకవర్గంలోని ముఖ్యమైన నాయకులకు చేరవేసే పనిలో నేతలున్నారు. మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణారావుతో పాటు సీఎం సురేష్ నాయుడు, మేడా మల్లికార్జునరెడ్డి విజయజ్యోతికి మద్ధతు తెలుపుతున్నట్లు సమాచారం. శివరామకృష్ణయ్య ఇప్పటికే తన వర్గానికి సమాచారం అందించడంతో పాటు విజయజ్యోతిని ఇన్‌చార్జిగా నియమించేందుకు అవసరమైన మార్గాలను అన్వేషించే పనిలో పడినట్లు తెలిసింది. రెండు రోజుల్లో అభిప్రాయ సేకరణ సమావేశం జరగనున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కూడా నియోజకవర్గానికి చేరుకుని నాయకుల మద్ధతు కోరేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే కొంతమంది ఆమె వర్గీయులు గోపవరంలోని నేతలను కలిసి తమకు మద్ధతు పలకాలని కోరారని సమాచారం. ఎన్నికల సమయంలో కూడా శివరామకృష్ణయ్య , విజయమ్మ మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడ్డాయి. ఇన్‌చార్జి నియామకం కోసం వీరిమధ్య మరోసారి అంతర్యుద్ధం ప్రారంభమైందని ఆపార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. మరో రెండు,మూడు రోజుల్లో ఏవిషయం తేలుతుందని నేతలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.