vijaya jyothi
-
రెబల్‌గా బరిలోకి దిగుతున్న టీడీపీ అభ్యర్థి
నిన్న పొమ్మనలేక పొగబెట్టారు.. నేడు రా రామ్మని ఆహ్వానిస్తున్నారు.. బద్వేలు టీడీపీ టికెట్ విషయంలో భంగపడిన విజయజ్యోతి పరిస్థితి ఇది.. పార్టీలో అడుగడుగునా అవమానాలు ఎదుర్కొని తుదకు టికెట్ సైతం కాదన్న అధిష్టానం తీరుపై ఆమె విసిగి వేసారిపోయారు. తాజాగా స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీ రాజీ ధోరణికి రావాలని పంపుతున్న సంకేతాలను ఆమె తోసిపుచ్చుతున్నారు. ఎవరొచ్చినా తన నిర్ణయంలో మార్పు లేదంటూ ‘స్వతంత్ర’బాటలో పయనిస్తున్నారు. తొలుత సాదాసీదాగా భావించిన జిల్లా పార్టీ నాయకులకు తాజా పరిణామాలు తలనొప్పిగా తయారయ్యాయి. సాక్షి, అట్లూరు (కడప) : బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పటికే మూడు ముక్కలైన ఆ పార్టీలో తాజాగా మరో సంక్షోభం ఏర్పడింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ఎన్.విజయజ్యోతికి ఈ ఎన్నికల్లో టిక్కెట్ నిరాకరించడంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తిరిగి విజయజ్యోతిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు అధిష్టానం ఆపరేషన్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో విజయజ్యోతికి టిక్కెట్ దక్కకుండా చేయడంలో సఫలీకృతురాలైన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు ప్రస్తుతం అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు మింగుడుపడటం లేదని సమాచారం. మరోవైపు పార్టీలో ఐదేళ్లపాటు తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న విజయజ్యోతి ఎట్టి పరిస్థితిలోనూ టీడీపీలోకి తిరిగి వెళ్లొద్దని, స్వతంత్రంగానే పోటీలో ఉండి టీడీపీకి తమ తడాఖా ఏమిటో చూపించాలని కార్యకర్తలు ఆమెపై ఒత్తిడి చేస్తున్నారు. ఆమె కూడా ఇక ఆ పార్టీ వైపు కన్నెత్తి చూడకూడదని భావిస్తున్నట్లు తెలిసింది. నామినేషన్ల పర్వం ముగుస్తున్న దశలో టీడీపీలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఆ పార్టీలోని ఇరువర్గాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. నాడు ఉద్యోగానికి రాజీనామా చేసి.. బ్యాంకు అధికారిగా ఉన్న విజయజ్యోతి 2014లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఆ ఎన్నికల్లో అప్పటి వైఎస్సార్సీపీ అభ్యర్థి జయరాములు చేతిలో ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన వారినే అన్ని నియోజకవర్గాల్లో ఇన్చార్జిలుగా నియమించారు. బద్వేలులో మాత్రం ఇన్చార్జి బాధ్యతలు ఆమెకు ఇవ్వకుండా అవమానించారు. దీనికితోడు అన్ని విషయాల్లోనూ విజయమ్మ జోక్యం, పెత్తనమే కొనసాగుతూ వచ్చింది. విజయజ్యోతి ఎదుగుదలను అడుగడుగునా అడ్డుకుంటూ వచ్చారు. అయినా మనసు చంపుకుని అదే పార్టీలో కొనసాగారు. ఈ పరిస్థితుల్లో తాజా ఎన్నికల్లో ఆమె మరోసారి టీడీపీ టిక్కెట్ ఆశించారు. ఈమె అభ్యర్థిత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న విజయమ్మ తొలుత లాజరస్ లేదా ఓబులాపురం రాజశేఖర్‌కు టీడీపీ టిక్కెట్ ఇప్పించాలని చూశారు. దీనికితోడు ఆ నియోజకవర్గంలో పర్యటించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, జిల్లా మంత్రి ఆది నారాయణరెడ్డిలు సైతం పలు సందర్భాల్లో విజయమ్మ సూచించిన వారికే పార్టీ టిక్కెట్ కేటాయిస్తామంటూ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు విజయజ్యోతిని మరింత వేదనకు గురిచేశాయి. ఎన్ని అవమానాలు ఎదురైనా తనను నమ్ముకున్న కార్యకర్తలను ఆమె కాపాడుకుంటూ వచ్చారు. చివరి క్షణం వరకు తనకు టిక్కెట్ లభిస్తుందేమోనని ఆశగా ఎదురు చూశారు. అధిష్టానం మొండి చేయి చూపింది. పొమ్మనలేక పొగబెట్టారంటూ అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అంతవరకు విజయజ్యోతిని తక్కువ అంచనావేసిన అధిష్టానం ఉలిక్కిపడింది. ఎలాగైనా తిరిగి తీసుకురండి.. ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలోనూ రాజశేఖర్ కంటే విజయజ్యోతినే మెరుగైన అభ్యర్థి అనే విషయం స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమెను ఎలాగైనా పార్టీలోకి తీసుకురావాలని జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. తిరిగి పార్టీలోకి వెళ్లేందుకు విజయజ్యోతి ససేమిరా అంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అవమానించిన పార్టీలోకి తిరిగి ఎళా వెళతాం.. ఇండిపెండెంట్‌గానే పోటీలో ఉండి తమ తడాఖా ఏమిటో పార్టీకి చూపించాలని మెజార్టీ కార్యకర్తలు ఆమెకు సూచించినట్లు తెలిసింది. దీంతో అధిష్టానం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. పార్టీలో ఉన్నంతకాలం వేధింపులకు గురిచేసి ఇప్పుడు తిరిగి రమ్మంటే ఆత్మాభిమానం చంపుకుని ఆ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే ఉండదని పలువురు విజయజ్యోతి అభిమానులు పేర్కొంటున్నారు. వెరసి బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైందనే చెప్పవచ్చు. -
నువ్వూ.. నేనూ జంప్ జిలానీలమే..
వైఎస్సార్ జిల్లా, పోరుమామిళ్ల: బద్వేలు ఎమ్మెల్యే జయరాములు, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి విజయజ్యోతి శనివారం మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి (వాసు), మాజీఎమ్మెల్యే విజయమ్మలపై అగ్రహోదగ్రులయ్యారు. ఎమ్మెల్యే జయరాములు ఆదినారాయణరెడ్డి గురించి మాట్లాడుతూ ‘నువ్వు జంప్ జిలానీవే, నేనూ జంప్ జిలానీనే. నీ అదృష్టం బాగుండి మంత్రివి అయ్యావు... నేను కాలేదు. బ్లాక్ మనీ దాచుకునేందుకు పదవి ఉపయోగించుకుంటున్నావు. రాజకీయాల్లో డబ్బు సంపాదనకు నువ్వు వస్తే మేము ప్రజాసేవకు వచ్చాం. ఎమ్మెల్యేను నాకు తెలియకుండా పోరుమామిళ్లలో బైక్ ర్యాలీ ఎలా నిర్వహిస్తారు? మీ నియోజకవర్గంలో మేము చేస్తే ఒప్పుకుంటావా? పార్టీ కార్యక్రమాలకు ఎమ్మెల్యేను పిలువరా? పైగా ఆహ్వానించినా రాలేదని, విజయమ్మతో కలసి పోలేదని విమర్శలా?’ అంటూ విరుచుకు పడ్డారు. ఎస్సీ నియోజకవర్గంలో నీ పెత్తనమేమిటి?: విజయజ్యోతి టీడీపీ ఇన్చార్జి విజయజ్యోతి రెచ్చిపోయి మాట్లాడారు. ‘ఎస్సీ నియోజకవర్గంలో మీ పెత్తనమేమిటని ప్రశ్నించారు. ఇతర నియోజక వర్గాల్లోకి వెళ్లి ఇలాగే మాట్లాడతారా? ఎస్సీ ఎమ్మెల్యేగా గెలిచాక పెత్తనం మాకే ఉంటుందని, మీకెందుకు ఉండాలి. ఏవైనా సలహాలు ఇచ్చేంత వరకే మీ బాధ్యత. విజయమ్మ బొట్టు పెట్టినవారికే టికెట్ అంటున్నారు? మీరు, విజయమ్మ కాదు టికెట్ ఇచ్చేది, కళా వెంకట్రావు, చంద్రబాబు, లోకేష్ ముగ్గురూ నిర్ణయిస్తారు. విజయమ్మ మూడు సార్లు బొట్టు పెడితే అడ్రసులు గల్లంతయ్యాయి. విజయమ్మపై మీకు అభిమానముంటే, బంధుత్వముంటే ఇంటికి తీసుకుపోయి చీర పెట్టండి, ఇక్కడకు వచ్చి దళితులమని మమ్మల్ని ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించం. పదవి రాలేదని నిరసన వ్యక్తం చేస్తే జిల్లా నాయకులుగా సర్దిచెప్పాలేగాని బెదిరించడం సరికాదు. అందరం కలిసి పోదామని మేము చేసిన ప్రయత్నాలు విజయమ్మ సాగనిచ్చిందా? మొన్నటికి మొన్న బద్వేలులో ఎమ్మెల్యే దీక్షకు కూర్చుంటే అందరం అక్కడే కూర్చుం దామని, వేర్వేరుగా శిబిరాలు వద్దంటే విజ యమ్మ వినకుండా, ప్రత్యేకంగా శిబిరం పెట్టలేదా? ఎమ్మెల్యే,నేనూ ఉన్నతోద్యోగం నుంచి వచ్చామని, మాకు బాధ్యత తెలుసు, మీ కింద తొత్తులుగా ఉండం. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా మేము పార్టీ విజయానికి కృషి చేస్తాం. ఇలా ఎవరి కిందో పని చేయం. దళితులమని చిన్నచూపు చూస్తే సహించం.’ అని హెచ్చరించారు. సమావేశంలో సర్పంచులు చిన్నారెడ్డి, శ్రీనివాసులు, గురుమూర్తి, ఎంపీటీసీలు నడిపి వెంకటసుబ్బయ్య, ప్రభాకరరెడ్డి, నరసింహులు, జయరామిరెడ్డి, పోలిరెడ్డి, టీడీపీ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
టీడీపీలో ఆధిపత్య కుమ్ములాటలు
బద్వేలు:బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఈమేరకు పార్టీ నియోజకవర్గ బాధ్యతలు తమకే కావాలంటూ పార్టీలోని నాయకులు కుమ్ములాడుకుంటున్నారు. గతంలో బద్వేలు బాధ్యతలు మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి కుమార్తె విజయమ్మ చేసేవారు. ఈ నేపథ్యంలో 2008లో బద్వేలు నియోజకవర్గం ఎస్సీకి రిజర్వు అయింది. అప్పట్లో కూడా నియోజకవర్గ బాధ్యతలు ఆమే చూసేవారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలు శాసనసభ అభ్యర్థిగా బ్యాంక్ మేనేజర్ విజయజ్యోతిని నిలిపారు. కాంగ్రెస్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణారావు కూడా ఈమెకు మద్ధతు పలికారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో శివరామకృష్ణారావు టీడీపీలో చేరారు. దీంతో బద్వేలు నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఎన్నికల ముందు చంద్రబాబు అభ్యర్థి విజయజ్యోతిని ఇన్చార్జి గా నియమించారు. అయితే మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మాత్రం పలు దఫాలు తానే ఇన్‌ఛార్జి అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఎన్నికల్లో ఓడిపోయిన వారినే చంద్రబాబు నియోజకవర్గ బాధ్యులుగా నియమించారు. ఇక్కడ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని విజయజ్యోతి, కాదు తనకు కావాలంటూ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గట్టిగా పట్టుబట్టారు. దీంతో నియోజకవర్గ బాధ్యులు ఎవరనేది నాయకుల్లో, కార్యక ర్తల్లో గందరగోళం సృష్టిస్తోంది. తాజాగా మూడు రోజుల క్రితం ఈ పంచాయతీ పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు చేరింది. దీనిపై అభిప్రాయ సేకరణ చేసే బాధ్యతను సీఎం రమేష్‌కు అప్పగించినట్లు తెలిసింది. మరో రెండు, మూడు రోజుల్లో దీనిపై కడపలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని నియోజకవర్గంలోని ముఖ్యమైన నాయకులకు చేరవేసే పనిలో నేతలున్నారు. మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణారావుతో పాటు సీఎం సురేష్ నాయుడు, మేడా మల్లికార్జునరెడ్డి విజయజ్యోతికి మద్ధతు తెలుపుతున్నట్లు సమాచారం. శివరామకృష్ణయ్య ఇప్పటికే తన వర్గానికి సమాచారం అందించడంతో పాటు విజయజ్యోతిని ఇన్చార్జిగా నియమించేందుకు అవసరమైన మార్గాలను అన్వేషించే పనిలో పడినట్లు తెలిసింది. రెండు రోజుల్లో అభిప్రాయ సేకరణ సమావేశం జరగనున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కూడా నియోజకవర్గానికి చేరుకుని నాయకుల మద్ధతు కోరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొంతమంది ఆమె వర్గీయులు గోపవరంలోని నేతలను కలిసి తమకు మద్ధతు పలకాలని కోరారని సమాచారం. ఎన్నికల సమయంలో కూడా శివరామకృష్ణయ్య , విజయమ్మ మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడ్డాయి. ఇన్చార్జి నియామకం కోసం వీరిమధ్య మరోసారి అంతర్యుద్ధం ప్రారంభమైందని ఆపార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. మరో రెండు,మూడు రోజుల్లో ఏవిషయం తేలుతుందని నేతలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.