మంత్రి ఆదిని ఉద్దేశించి మాట్లాడుతున్న విజయజ్యోతి, చిత్రంలో ఎమ్మెల్యే జయరాములు
వైఎస్సార్ జిల్లా, పోరుమామిళ్ల: బద్వేలు ఎమ్మెల్యే జయరాములు, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి విజయజ్యోతి శనివారం మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి (వాసు), మాజీఎమ్మెల్యే విజయమ్మలపై అగ్రహోదగ్రులయ్యారు. ఎమ్మెల్యే జయరాములు ఆదినారాయణరెడ్డి గురించి మాట్లాడుతూ ‘నువ్వు జంప్ జిలానీవే, నేనూ జంప్ జిలానీనే. నీ అదృష్టం బాగుండి మంత్రివి అయ్యావు... నేను కాలేదు. బ్లాక్ మనీ దాచుకునేందుకు పదవి ఉపయోగించుకుంటున్నావు. రాజకీయాల్లో డబ్బు సంపాదనకు నువ్వు వస్తే మేము ప్రజాసేవకు వచ్చాం. ఎమ్మెల్యేను నాకు తెలియకుండా పోరుమామిళ్లలో బైక్ ర్యాలీ ఎలా నిర్వహిస్తారు? మీ నియోజకవర్గంలో మేము చేస్తే ఒప్పుకుంటావా? పార్టీ కార్యక్రమాలకు ఎమ్మెల్యేను పిలువరా? పైగా ఆహ్వానించినా రాలేదని, విజయమ్మతో కలసి పోలేదని విమర్శలా?’ అంటూ విరుచుకు పడ్డారు.
ఎస్సీ నియోజకవర్గంలో నీ పెత్తనమేమిటి?: విజయజ్యోతి
టీడీపీ ఇన్‌చార్జి విజయజ్యోతి రెచ్చిపోయి మాట్లాడారు. ‘ఎస్సీ నియోజకవర్గంలో మీ పెత్తనమేమిటని ప్రశ్నించారు. ఇతర నియోజక వర్గాల్లోకి వెళ్లి ఇలాగే మాట్లాడతారా? ఎస్సీ ఎమ్మెల్యేగా గెలిచాక పెత్తనం మాకే ఉంటుందని, మీకెందుకు ఉండాలి. ఏవైనా సలహాలు ఇచ్చేంత వరకే మీ బాధ్యత. విజయమ్మ బొట్టు పెట్టినవారికే టికెట్ అంటున్నారు? మీరు, విజయమ్మ కాదు టికెట్ ఇచ్చేది, కళా వెంకట్రావు, చంద్రబాబు, లోకేష్ ముగ్గురూ నిర్ణయిస్తారు. విజయమ్మ మూడు సార్లు బొట్టు పెడితే అడ్రసులు గల్లంతయ్యాయి. విజయమ్మపై మీకు అభిమానముంటే, బంధుత్వముంటే ఇంటికి తీసుకుపోయి చీర పెట్టండి, ఇక్కడకు వచ్చి దళితులమని మమ్మల్ని ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించం.
పదవి రాలేదని నిరసన వ్యక్తం చేస్తే జిల్లా నాయకులుగా సర్దిచెప్పాలేగాని బెదిరించడం సరికాదు. అందరం కలిసి పోదామని మేము చేసిన ప్రయత్నాలు విజయమ్మ సాగనిచ్చిందా? మొన్నటికి మొన్న బద్వేలులో ఎమ్మెల్యే దీక్షకు కూర్చుంటే అందరం అక్కడే కూర్చుం దామని, వేర్వేరుగా శిబిరాలు వద్దంటే విజ యమ్మ వినకుండా, ప్రత్యేకంగా శిబిరం పెట్టలేదా? ఎమ్మెల్యే,నేనూ ఉన్నతోద్యోగం నుంచి వచ్చామని, మాకు బాధ్యత తెలుసు, మీ కింద తొత్తులుగా ఉండం. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా మేము పార్టీ విజయానికి కృషి చేస్తాం. ఇలా ఎవరి కిందో పని చేయం. దళితులమని చిన్నచూపు చూస్తే సహించం.’ అని హెచ్చరించారు. సమావేశంలో సర్పంచులు చిన్నారెడ్డి, శ్రీనివాసులు, గురుమూర్తి, ఎంపీటీసీలు నడిపి వెంకటసుబ్బయ్య, ప్రభాకరరెడ్డి, నరసింహులు, జయరామిరెడ్డి, పోలిరెడ్డి, టీడీపీ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment