నిన్న పొమ్మనలేక పొగబెట్టారు.. నేడు రా రామ్మని ఆహ్వానిస్తున్నారు.. బద్వేలు టీడీపీ టికెట్ విషయంలో భంగపడిన విజయజ్యోతి పరిస్థితి ఇది.. పార్టీలో అడుగడుగునా అవమానాలు ఎదుర్కొని తుదకు టికెట్ సైతం కాదన్న అధిష్టానం తీరుపై ఆమె విసిగి వేసారిపోయారు. తాజాగా స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీ రాజీ ధోరణికి రావాలని పంపుతున్న సంకేతాలను ఆమె తోసిపుచ్చుతున్నారు. ఎవరొచ్చినా తన నిర్ణయంలో మార్పు లేదంటూ ‘స్వతంత్ర’బాటలో పయనిస్తున్నారు. తొలుత సాదాసీదాగా భావించిన జిల్లా పార్టీ నాయకులకు తాజా పరిణామాలు తలనొప్పిగా తయారయ్యాయి.
సాక్షి, అట్లూరు (కడప) : బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పటికే మూడు ముక్కలైన ఆ పార్టీలో తాజాగా మరో సంక్షోభం ఏర్పడింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ఎన్.విజయజ్యోతికి ఈ ఎన్నికల్లో టిక్కెట్ నిరాకరించడంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తిరిగి విజయజ్యోతిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు అధిష్టానం ఆపరేషన్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో విజయజ్యోతికి టిక్కెట్ దక్కకుండా చేయడంలో సఫలీకృతురాలైన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు ప్రస్తుతం అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు మింగుడుపడటం లేదని సమాచారం. మరోవైపు పార్టీలో ఐదేళ్లపాటు తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న విజయజ్యోతి ఎట్టి పరిస్థితిలోనూ టీడీపీలోకి తిరిగి వెళ్లొద్దని, స్వతంత్రంగానే పోటీలో ఉండి టీడీపీకి తమ తడాఖా ఏమిటో చూపించాలని కార్యకర్తలు ఆమెపై ఒత్తిడి చేస్తున్నారు. ఆమె కూడా ఇక ఆ పార్టీ వైపు కన్నెత్తి చూడకూడదని భావిస్తున్నట్లు తెలిసింది. నామినేషన్ల పర్వం ముగుస్తున్న దశలో టీడీపీలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఆ పార్టీలోని ఇరువర్గాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
నాడు ఉద్యోగానికి రాజీనామా చేసి..
బ్యాంకు అధికారిగా ఉన్న విజయజ్యోతి 2014లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఆ ఎన్నికల్లో అప్పటి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జయరాములు చేతిలో ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన వారినే అన్ని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలుగా నియమించారు. బద్వేలులో మాత్రం ఇన్‌చార్జి బాధ్యతలు ఆమెకు ఇవ్వకుండా అవమానించారు. దీనికితోడు అన్ని విషయాల్లోనూ విజయమ్మ జోక్యం, పెత్తనమే కొనసాగుతూ వచ్చింది. విజయజ్యోతి ఎదుగుదలను అడుగడుగునా అడ్డుకుంటూ వచ్చారు. అయినా మనసు చంపుకుని అదే పార్టీలో కొనసాగారు. ఈ పరిస్థితుల్లో తాజా ఎన్నికల్లో ఆమె మరోసారి టీడీపీ టిక్కెట్ ఆశించారు. ఈమె అభ్యర్థిత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న విజయమ్మ తొలుత లాజరస్ లేదా ఓబులాపురం రాజశేఖర్‌కు టీడీపీ టిక్కెట్ ఇప్పించాలని చూశారు.
దీనికితోడు ఆ నియోజకవర్గంలో పర్యటించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, జిల్లా మంత్రి ఆది నారాయణరెడ్డిలు సైతం పలు సందర్భాల్లో విజయమ్మ సూచించిన వారికే పార్టీ టిక్కెట్ కేటాయిస్తామంటూ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు విజయజ్యోతిని మరింత వేదనకు గురిచేశాయి. ఎన్ని అవమానాలు ఎదురైనా తనను నమ్ముకున్న కార్యకర్తలను ఆమె కాపాడుకుంటూ వచ్చారు. చివరి క్షణం వరకు తనకు టిక్కెట్ లభిస్తుందేమోనని ఆశగా ఎదురు చూశారు. అధిష్టానం మొండి చేయి చూపింది. పొమ్మనలేక పొగబెట్టారంటూ అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అంతవరకు విజయజ్యోతిని తక్కువ అంచనావేసిన అధిష్టానం ఉలిక్కిపడింది.
ఎలాగైనా తిరిగి తీసుకురండి..
ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలోనూ రాజశేఖర్ కంటే విజయజ్యోతినే మెరుగైన అభ్యర్థి అనే విషయం స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమెను ఎలాగైనా పార్టీలోకి తీసుకురావాలని జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. తిరిగి పార్టీలోకి వెళ్లేందుకు విజయజ్యోతి ససేమిరా అంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అవమానించిన పార్టీలోకి తిరిగి ఎళా వెళతాం.. ఇండిపెండెంట్‌గానే పోటీలో ఉండి తమ తడాఖా ఏమిటో పార్టీకి చూపించాలని మెజార్టీ కార్యకర్తలు ఆమెకు సూచించినట్లు తెలిసింది. దీంతో అధిష్టానం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. పార్టీలో ఉన్నంతకాలం వేధింపులకు గురిచేసి ఇప్పుడు తిరిగి రమ్మంటే ఆత్మాభిమానం చంపుకుని ఆ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే ఉండదని పలువురు విజయజ్యోతి అభిమానులు పేర్కొంటున్నారు. వెరసి బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైందనే చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment