టీడీపీ చెట్టు నీడలో...వికసించని కమలం! | BJP - TDP dominant in srikakulam | Sakshi
Sakshi News home page

టీడీపీ చెట్టు నీడలో...వికసించని కమలం!

Published Sun, Feb 4 2018 11:36 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

BJP - TDP dominant in srikakulam - Sakshi

ఒక్క ఎమ్మెల్యే లేడు... ఎమ్మెల్సీ కూడా లేడు... ఎంపీపీలు, జెడ్పీటీసీలు కూడా లేరు... చివరకు గ్రామస్థాయిలో ఒక్క సర్పంచ్‌ కూడా లేడు! ఇదీ జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో టీడీపీని భాగస్వామిని చేసుకున్న భారతీయ జనతాపార్టీ పరిస్థితి! గత సాధారణ ఎన్నికల్లో పొత్తుధర్మంలో భాగంగా ఇచ్ఛాపురం, నరసన్నపేట అసెంబ్లీ సీట్లు బీజేపీకి కేటాయించినా ఆఖరి నిమిషంలో టీడీపీ నాయకులు నిరసనకు దిగడంతో చేజారిన సంగతి తెలిసిందే. కనీసం గత ఏడాది స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ కోరినా ఫలితం దక్కలేదు. ఇక అనేక రాజకీయ పరిణామాల మధ్య పట్టభద్రుల కోటాలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటు పీవీఎన్‌ మాధవ్‌కు దక్కినా గెలవడానికి అష్టకష్టాలు పడాల్సివచ్చింది! మొత్తంమీద పొత్తుధర్మం అంటూనే టీడీపీ శ్రేణులు తమను తొక్కేస్తున్నారని బీజేపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: భారతీయ జనతా పార్టీ ఉనికి జిల్లాలో రెండు దశాబ్దాలుగా ఉంది. కానీ ఆయా వర్గాలన్నీ టీడీపీతోనే ఎక్కువకాలం భాగస్వాములుగా ఉన్నాయి. గత సాధారణ ఎన్నికలలో టీడీపీతో పొత్తు వల్ల జిల్లాలో బలపడతామని ఆశించినప్పటికీ అదెక్కడా ఆచరణలో కానరాలేదు. కనీసం అటు కేంద్ర ప్రభుత్వంలో టీడీపీని భాగస్వామిని చేసుకున్నా, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో టీడీపీతో జతకట్టినా జిల్లాలో తమకు ఎలాంటి అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం చేయట్లేదని, కనీసం ప్రభుత్వపరమైన, అధికారిక కార్యక్రమాలకు సైతం ఆహ్వానం కూడా ఉండట్లేదనే బీజేపీ శ్రేణుల ఆవేదన అరణ్యరోదనే అవుతోంది.

నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లున్నా...
టీడీపీని నమ్ముకోకుండా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాలని బీజేపీ జిల్లా నాయకులు తలపోస్తున్నాయి. అయితే వారిలో మాజీ ఎంపీ కణితి విశ్వనాథం, పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలం తదితర ఒకరిద్దరు నాయకులు తప్ప శ్రేణులను కార్యోన్ముఖులను చేసేవారే పార్టీలో కరువయ్యారు. కణితి విశ్వనాథం గత సాధారణ ఎన్నికల వరకూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. కానీ రాజకీయ పరిణామాలతో ఆయన బీజేపీ పంచన చేరారు. పలాస నియోజకవర్గంలో ఆయనతో పాటు వెళ్లిన కొద్దిమంది సర్పంచులు మాత్రమే గ్రామస్థాయిలో కొంతమేర పనిచేయగలుగుతున్నారు. అంతకుమించి బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, కమలం గుర్తుపై గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేకపోవడం పెద్దలోటు. దీంతో అధికారిక వేదికలు, రాజకీయ సమావేశాల్లో బీజేపీ వాణి వినిపించే నాయకులు లేకపోవడం పెద్దలోటుగా ఉంది.

టీడీపీతో తగాదాలు మామూలే...
జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలోనే టీడీపీ ఆధిపత్యం బీజేపీపై స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం ఉండట్లేదు. ఇక్కడ బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నా వారికి గౌరవం ఇచ్చిన దాఖలాలు లేవు. అంతేకాదు బీజేపీలోనూ వర్గవిభేదాలకు టీడీపీ నాయకులు ఆజ్యం పోస్తున్నారు. బీజేపీలో అంతర్గత కుమ్ములాటలతో టీడీపీ నాయకులు క్యాష్‌ చేసుకుంటున్నారు.

ఎచ్చెర్ల నియోజక వర్గం జి.సిగడాంలో దీపం పథకం గ్యాస్‌ సిలిండర్ల పంపకంలో టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీడీవో బదిలీ వరకు వెళ్లాయి. గత 20 ఏళ్ల నుంచి బీజేపీలో ఉన్నా తమకు టీడీపీ నాయకులు గౌరవించటం లేదని కమలం పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. పింఛన్లు, ఇళ్లు, రేషన్‌ కార్డుల మంజూరులో తమ సిఫారసులకు జన్మభూమి కమిటీలు పట్టించుకోవటం లేదని చెబుతున్నారు.

రాజాం నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆధిపత్యంతో బీజేపీ కేడర్‌ చిత్తయింది. అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు తమకు ఆహ్వానాలు ఉండట్లేదని రాజాం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు, పురిపండ శ్రీనివాస్‌ వంటివారే ఆవేదన చెందుతున్నారు.

గత సాధారణ ఎన్నికలలో నరసన్నపేట సీటు బీజేపీకి మొదట్లో కేటాయించారు. కానీ టీడీపీ నాయకులు వెంకయ్యనాయుడుతో మాట్లాడుకొని తామే లాగేసుకున్నారు. అప్పటినుంచి నరసన్నపేట నియోజకవర్గంలో టీడీపీపై బీజేపీ నాయకులు గుర్రుగా ఉన్నారు.

పలాస నియోజకవర్గంలో బీజేపీ నాయకుల సిఫారసుతో ఏ సంక్షేమ పథకానికి దరఖాస్తులు వచ్చినా పక్కన పెట్టేస్తున్నారు. ఇది పార్టీని అణచివేయడమేనని బీజేపీ నాయకులు కణితి విశ్వనాథం, పలాస పట్టణ కన్వీనర్‌ పాలవలస వైకుంఠరావు, నియోజకవర్గ కన్వీనర్‌ కొర్రాయి బాలకృష్ణ ఆరోపిస్తున్నారు.

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో  తెలుగుదేశం పార్టీ నేతలు బీజేపీ శ్రేణులను ఏ విషయంలోనూ భాగస్వామ్యం చేయలేదు. జన్మభూమి కమిటీల్లోనూ చోటు దక్కట్లేదు. కంచిలి మండలంలో గోకర్ణపురం, శాసనాం పంచాయతీల సర్పంచ్‌లు బీజేపీ తీర్థం పుచ్చుకున్నా అక్కడ టీడీపీ నేతలను జన్మభూమి కమిటీ సభ్యులుగా నియమించి, స్థానికంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఆ పంచాయతీల్లో బీజేపీకి టీడీపీ నేతలే ప్రతిపక్షంగా మారిపోయారు. ఒక సందర్భంలో గోకర్ణపురం పంచాయతీలో జన్మభూమి కార్యక్రమంలో ఇరువర్గాలు కొట్టుకున్నారు. ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి.

పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది మొదలు బీజేపీని ఎదగనీయకుండా అడ్డుకుంది. జన్మభూమి కమిటీల్లో, అధికారిక కమిటీల్లో అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టం చేసింది. ఇటీవల తమ పార్టీ నాయకుడు, వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు కొన్నాళ్ల క్రితం పాలకొండ వచ్చినప్పుడు వారంతా తమ గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేకపోయింది.

ఆమదాలవలస నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ పొత్తు సక్రమంగా కొనసాగుతోంది. కుల రాజకీయాలతో బంధుత్వాలు కలుపుకొని బీజేపీ, టీడీపీ కార్యకర్తలు, నాయకులు తమతమ పనులను ఎప్పటికప్పుడు చక్కదిద్దుకొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement