BJP - tdp
-
టీడీపీ చెట్టు నీడలో...వికసించని కమలం!
ఒక్క ఎమ్మెల్యే లేడు... ఎమ్మెల్సీ కూడా లేడు... ఎంపీపీలు, జెడ్పీటీసీలు కూడా లేరు... చివరకు గ్రామస్థాయిలో ఒక్క సర్పంచ్ కూడా లేడు! ఇదీ జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో టీడీపీని భాగస్వామిని చేసుకున్న భారతీయ జనతాపార్టీ పరిస్థితి! గత సాధారణ ఎన్నికల్లో పొత్తుధర్మంలో భాగంగా ఇచ్ఛాపురం, నరసన్నపేట అసెంబ్లీ సీట్లు బీజేపీకి కేటాయించినా ఆఖరి నిమిషంలో టీడీపీ నాయకులు నిరసనకు దిగడంతో చేజారిన సంగతి తెలిసిందే. కనీసం గత ఏడాది స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ కోరినా ఫలితం దక్కలేదు. ఇక అనేక రాజకీయ పరిణామాల మధ్య పట్టభద్రుల కోటాలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటు పీవీఎన్ మాధవ్‌కు దక్కినా గెలవడానికి అష్టకష్టాలు పడాల్సివచ్చింది! మొత్తంమీద పొత్తుధర్మం అంటూనే టీడీపీ శ్రేణులు తమను తొక్కేస్తున్నారని బీజేపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: భారతీయ జనతా పార్టీ ఉనికి జిల్లాలో రెండు దశాబ్దాలుగా ఉంది. కానీ ఆయా వర్గాలన్నీ టీడీపీతోనే ఎక్కువకాలం భాగస్వాములుగా ఉన్నాయి. గత సాధారణ ఎన్నికలలో టీడీపీతో పొత్తు వల్ల జిల్లాలో బలపడతామని ఆశించినప్పటికీ అదెక్కడా ఆచరణలో కానరాలేదు. కనీసం అటు కేంద్ర ప్రభుత్వంలో టీడీపీని భాగస్వామిని చేసుకున్నా, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో టీడీపీతో జతకట్టినా జిల్లాలో తమకు ఎలాంటి అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం చేయట్లేదని, కనీసం ప్రభుత్వపరమైన, అధికారిక కార్యక్రమాలకు సైతం ఆహ్వానం కూడా ఉండట్లేదనే బీజేపీ శ్రేణుల ఆవేదన అరణ్యరోదనే అవుతోంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లున్నా... టీడీపీని నమ్ముకోకుండా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాలని బీజేపీ జిల్లా నాయకులు తలపోస్తున్నాయి. అయితే వారిలో మాజీ ఎంపీ కణితి విశ్వనాథం, పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలం తదితర ఒకరిద్దరు నాయకులు తప్ప శ్రేణులను కార్యోన్ముఖులను చేసేవారే పార్టీలో కరువయ్యారు. కణితి విశ్వనాథం గత సాధారణ ఎన్నికల వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ రాజకీయ పరిణామాలతో ఆయన బీజేపీ పంచన చేరారు. పలాస నియోజకవర్గంలో ఆయనతో పాటు వెళ్లిన కొద్దిమంది సర్పంచులు మాత్రమే గ్రామస్థాయిలో కొంతమేర పనిచేయగలుగుతున్నారు. అంతకుమించి బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, కమలం గుర్తుపై గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేకపోవడం పెద్దలోటు. దీంతో అధికారిక వేదికలు, రాజకీయ సమావేశాల్లో బీజేపీ వాణి వినిపించే నాయకులు లేకపోవడం పెద్దలోటుగా ఉంది. టీడీపీతో తగాదాలు మామూలే... జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలోనే టీడీపీ ఆధిపత్యం బీజేపీపై స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం ఉండట్లేదు. ఇక్కడ బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నా వారికి గౌరవం ఇచ్చిన దాఖలాలు లేవు. అంతేకాదు బీజేపీలోనూ వర్గవిభేదాలకు టీడీపీ నాయకులు ఆజ్యం పోస్తున్నారు. బీజేపీలో అంతర్గత కుమ్ములాటలతో టీడీపీ నాయకులు క్యాష్ చేసుకుంటున్నారు. ఎచ్చెర్ల నియోజక వర్గం జి.సిగడాంలో దీపం పథకం గ్యాస్ సిలిండర్ల పంపకంలో టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీడీవో బదిలీ వరకు వెళ్లాయి. గత 20 ఏళ్ల నుంచి బీజేపీలో ఉన్నా తమకు టీడీపీ నాయకులు గౌరవించటం లేదని కమలం పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. పింఛన్లు, ఇళ్లు, రేషన్ కార్డుల మంజూరులో తమ సిఫారసులకు జన్మభూమి కమిటీలు పట్టించుకోవటం లేదని చెబుతున్నారు. రాజాం నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆధిపత్యంతో బీజేపీ కేడర్ చిత్తయింది. అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు తమకు ఆహ్వానాలు ఉండట్లేదని రాజాం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు, పురిపండ శ్రీనివాస్ వంటివారే ఆవేదన చెందుతున్నారు. గత సాధారణ ఎన్నికలలో నరసన్నపేట సీటు బీజేపీకి మొదట్లో కేటాయించారు. కానీ టీడీపీ నాయకులు వెంకయ్యనాయుడుతో మాట్లాడుకొని తామే లాగేసుకున్నారు. అప్పటినుంచి నరసన్నపేట నియోజకవర్గంలో టీడీపీపై బీజేపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. పలాస నియోజకవర్గంలో బీజేపీ నాయకుల సిఫారసుతో ఏ సంక్షేమ పథకానికి దరఖాస్తులు వచ్చినా పక్కన పెట్టేస్తున్నారు. ఇది పార్టీని అణచివేయడమేనని బీజేపీ నాయకులు కణితి విశ్వనాథం, పలాస పట్టణ కన్వీనర్ పాలవలస వైకుంఠరావు, నియోజకవర్గ కన్వీనర్ కొర్రాయి బాలకృష్ణ ఆరోపిస్తున్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు బీజేపీ శ్రేణులను ఏ విషయంలోనూ భాగస్వామ్యం చేయలేదు. జన్మభూమి కమిటీల్లోనూ చోటు దక్కట్లేదు. కంచిలి మండలంలో గోకర్ణపురం, శాసనాం పంచాయతీల సర్పంచ్‌లు బీజేపీ తీర్థం పుచ్చుకున్నా అక్కడ టీడీపీ నేతలను జన్మభూమి కమిటీ సభ్యులుగా నియమించి, స్థానికంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఆ పంచాయతీల్లో బీజేపీకి టీడీపీ నేతలే ప్రతిపక్షంగా మారిపోయారు. ఒక సందర్భంలో గోకర్ణపురం పంచాయతీలో జన్మభూమి కార్యక్రమంలో ఇరువర్గాలు కొట్టుకున్నారు. ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది మొదలు బీజేపీని ఎదగనీయకుండా అడ్డుకుంది. జన్మభూమి కమిటీల్లో, అధికారిక కమిటీల్లో అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టం చేసింది. ఇటీవల తమ పార్టీ నాయకుడు, వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు కొన్నాళ్ల క్రితం పాలకొండ వచ్చినప్పుడు వారంతా తమ గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేకపోయింది. ఆమదాలవలస నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ పొత్తు సక్రమంగా కొనసాగుతోంది. కుల రాజకీయాలతో బంధుత్వాలు కలుపుకొని బీజేపీ, టీడీపీ కార్యకర్తలు, నాయకులు తమతమ పనులను ఎప్పటికప్పుడు చక్కదిద్దుకొంటున్నారు. -
ఉప్పు..నిప్పు!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో టీడీపీ–బీజేపీల వైరం ఉప్పు, నిప్పులా తయారైంది. ఇక్కడి జిల్లా, రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలకు సైతం టీడీపీ నేతలు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వారి సూచనలు పట్టించుకునేవారు లేరు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం ఉండదు. వారి అభిప్రాయాలకు తావు లేదు. అడుగడుగునా టీడీపీ నేతలు, బీజేపీ నేతలను అణగదొక్కుతున్నారు. ఒకరిద్దరు టీడీపీ నుంచి బీజేపీలో చేరే ప్రయత్నం చేసినా అధికారం, అధికారులను అడ్డుపెట్టి వారిని అష్టకష్టాలు పెడుతున్నారు. బీజేపీని నామం జపించాలంటేనే భయపడేలా చేస్తున్నారు. జిల్లాలో బీజేపీ, టీడీపీ వైరం పతాకస్థాయికి చేరింది. బీజేపీ నేతలు సైతం టీడీపీ నేతలపై బహిరంగ విమర్శలకు వెనుకాడటం లేదు. ప్రియమైన శత్రువులు.. జిల్లా స్థాయిలో కొందరు బీజేపీ సీనియర్ నేతలు, మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి నేతలతో సన్నిహితం నడిపినా ఇక్కడి వారికి ప్రాధాన్యత లేదు. అధికార టీడీపీ నేతల ఒత్తిడుల పుణ్యమా అని ఇక్కడి బీజేపీ నేతలకు చిన్న పదవులు కూడా వచ్చినా దాఖలాలు కూడా లేవు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి టీడీపీ మిత్రపక్షంగా ఉన్నా తమ పట్ల టీడీపీ నేతలు శత్రువుల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు వాపోతున్నారు. ఇప్పటికీ చంద్రబాబు సర్కారు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ తమ పథకాలుగా చెప్పుకుంటూ ప్రచారం సాగిస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి గృహనిర్మాణ పథకానికి సైతం ఎన్టీఆర్ గ్రామీణ్ పేరు పెట్టి తమ పథకంగా చెప్పుకుంటోంది. ఇక పింఛన్లు మొదలుకొని ఉపాధి హామీ పనుల వరకు పలు పథకాలు కేంద్రం నిధులతో నడుస్తున్నా రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు ఆ పథకాలకు తమ పేర్లు తగిలించి తమవిగానే ప్రచారం చేస్తున్నారు. కేంద్రం నిధులతో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు బీజేపీ నేతలను ఆహ్వానించడం లేదు. కందుకూరులో పీఎంజీఎస్‌వై కింద గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభిస్తే ప్లెక్సీలో సైతం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే పోతుల రామారావు, మంత్రి నారాయణ ఫొటోలు మినహా ప్రధాని ఫోటో లేదని, కనీసం స్థానిక నేతలకు సమాచారం కూడా ఇవ్వలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దర్శిలో కేంద్ర ప్రభుత్వంపై ప్రకటించిన డ్రైవింగ్ స్కూలు శంకుస్థాపన కార్యక్రమానికి సైతం జిల్లా బీజేపీ నేతలకు ఆహ్వానం లేకపోవడంతో వారు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. సిఫార్సులనూ పట్టించుకోని టీడీపీ నేతలు.. బీజేపీ, టీడీపీ సంబంధాలు పూర్తిగా చెడిపోయాయన్న దానికి త్రిపురాంతకం ఘటన ఓ ఉదాహరణ. అధికార పార్టీలో ఇమడలేక త్రిపురాంతకం ఎంపీపీ చెన్నమ్మ గత ఏడాది అక్టోబర్ 28న కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డిల సమక్షంలో ఐదు మంది ఎంపీటీసీలు, ఒక కోఆప్షన్ మెంబర్‌తో సహా బీజేపీలో చేరారు. అప్పటి నుంచి అధికార టీడీపీ స్థానిక ఎంపీడీఓపై ఒత్తిడి తెచ్చి ఎంపీపీతో పాటు వారి వర్గాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ విషయంపై జిల్లా కలెక్టరేట్ వద్ద బీజేపీ శనివారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరై చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని దుమ్మెతిపోశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దశాబ్దాలుగా బీజేపీ కోసం పని చేసిన నేతలను సైతం టీడీపీ రాజకీయంగా ఎదగనివ్వడం లేదన్న విమర్శలున్నాయి. కనీసం జన్మభూమి కమిటీలో కూడా వారికి ప్రాధాన్యత లేదు. నామినేటెడ్ పోస్టుల్లో ఏ మాత్రం చోటు కల్పించడం లేదు. అంతేందుకు వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే వారే లేరు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు వారిని ఆహ్వానించడం లేదు. దీంతో వారు పైన మిత్రపక్షంగా ఉన్నా... జిల్లా పరిధిలో శత్రువుల్లాగే ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు టీడీపీ తీరుపై బహిరంగ విమర్శలు చేసేందుకు వెనుతీయడం లేదు. పేరుకు తాము మిత్రపక్షంగా ఉన్నా టీడీపీ నేతలే తమను మిత్రులుగా చూడటం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి సాక్షితో పేర్కొనడం గమనార్హం. తమ పార్టీ ఎదుగుదలను టీడీపీ జీర్ణించుకోలేకపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే వందలాది పథకాలను టీడీపీ ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటుందని కృష్ణారెడ్డి విమర్శించారు. -
కత్తులు దూసుకుంటున్న మిత్రులు
సాక్షి, గుంటూరు: ఎన్నికల ముందు మిత్రపక్షంగా కలిసి పోటీ చేసిన బీజేపీ, టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. రాష్ట్రాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా అవమానిస్తోందని, బడ్జెట్ కేటాయింపుల్లోనూ చిన్న చూపు చూస్తుందని మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అయితే జిల్లాలో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తమని ఏ కార్యక్రమానికీ ఆహ్వానించడం లేదని, కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల్లోనూ తమకు కనీస వాటా ఇవ్వడం లేదని, ఘోరంగా అవమానిస్తున్నారని బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి, అధికారుల వద్ద జరిగే పనుల వరకు అన్నింట్లోనూ తమకు అన్యాయం జరుగుతోందంటున్నారు. మరోవైపు టీడీపీ నేతలు కూడా బీజేపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో తమ ప్రభుత్వం, పార్టీ ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉందంటున్నారు. ఇటీవల జరిగిన జన్మభూమి సభల్లో సైతం టీడీపీ, బీజేపీ నేతలు బాహాబాహీకి దిగిన ఘటన అందరికి తెలిసిందే. ఇలా జిల్లాలో మిత్ర పక్షాలుగా ఉన్న బీజేపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు కయ్యానికి కాలుదువ్వుతున్నారు. పదవులు ఇస్తామని తూచ్... అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు జిల్లాలో బీజేపీ నేతలను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఏ ఒక్క పథకాన్ని వారికి అప్పగించకుండా టీడీపీ కార్యకర్తలకే పూర్తిగా అప్పగిస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డుగా పేరొందిన గుంటూరు మిర్చి యార్డు పాలకవర్గంలో బీజేపీకి రెండు డైరెక్టర్ పోస్టులు ఇస్తామంటూ తొలుత చెప్పి, ఆ తర్వాత ఒక్కటి మాత్రమే ఇస్తామంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు హామీ ఇచ్చారు. అయితే అధికారికంగా ప్రకటించిన తరువాత అందులో బీజేపీకి చోటు దక్కకపోవడంతో జిల్లా బీజేపీ నేతలు దీనిపై తమ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ప్రతి పథకాన్ని మంజూరు చేసేందుకు అధికారికంగా నియమించిన జన్మభూమి కమిటీల్లోనూ బీజేపీ నేతలకు స్థానం కల్పించకపోవడంతో వారంతా గుర్రుగా ఉన్నారు. సీట్ల విషయంలోనూ అసంతృప్తి.. ఎన్నికల ముందు జిల్లాలో బీజేపీకి గుంటూరు వెస్ట్, మంగళగిరి, సత్తెనపల్లి, బాపట్ల నియోజకవర్గాల్లో ఏదో ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించాలని కోరినప్పటికీ టీడీపీ ఓటమి పాలవుతుందని భావించిన నరసరావుపేటను తమకు కేటాయించారని మండిపడుతున్నారు. టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు పోటీ చేయకుండా వెళ్లిపోయిన నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించారంటున్నారు. ఓడిపోయిన నియోజకవర్గాల్లో పోటీ చేసిన వ్యక్తులను ఇన్చా ర్జిలుగా నియమించిన టీడీపీ ఇక్కడ మాత్రం ఓటమి చెందిన బీజేపీ అభ్యర్థి నల్లబోతు వెంకట్రావును పక్కన పెట్టడం దారుణమంటున్నారు. అక్కడ కోడెల తనయుడు శివరామకృష్ణ చెప్పిందే అధికారులు చేస్తున్నారని, బీజేపీ నేతలకు కనీస గౌరవం లేకుండాపోయిందని వాపోతున్నారు. గుంటూరు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులతో ఏర్పాటు చేస్తున్న శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు బీజేపీ నేతలకు కనీస ఆహ్వానం కూడా అందకపోవడంపై ఆ పార్టీ క్యాడర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఫొటో లేకపోవడంపై గుంటూరు నగరంలోని 26, 45, 51 డివిజన్లలో బీజేపీ నేతలు ప్రశ్నించారు. దీంతో బీజేపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ బాహాబాహీకి దిగారు. అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో సైతం తమకు గెలిచే సత్తా ఉన్నా నలుగురు ఎమ్మెల్యేలు కూర్చొని దౌర్జన్యంగా టీడీపీ నేతకు కట్టబెట్టారని బీజేపీ నేతలు రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఏమాత్రం ప్రాధాన్యం లేదంటున్న బీజీపీ నేతలు.. గతేడాది గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో బీజేపీ నేతలు టీడీపీపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ నేతల అవినీతి తారస్థాయికి చేరిందని, దీని వల్ల బీజేపీకి కూడా చెడ్డ పేరు వస్తుందని బీజేపీ నేతలు ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. మరోవైపు టీడీపీ నేతలు సైతం బీజేపీ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారంటూ జిల్లాకు చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావుతో పాటు, పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు బహిరంగంగా కోప్పడిన విషయం తెలిసిందే. గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం ఎదురుగా టీడీపీ నేతల పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ‘బీజేపీతో పొత్తు – ఇంటికి రాదు విత్తు’ అంటూ రాయించడం కలకలం రేపింది. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య విభేదాలు అనేకం ఉన్నాయి. నగరపాకల సంస్థ ఎన్నికల్లో 40శాతం సీట్లు అడుగుతాం నగరపాలక సంస్థ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 40శాతం సీట్లు బీజేపీకి ఇవ్వాల్సిందే. అలా ఇవ్వని పక్షంలో సొంతంగా పోటీ చేస్తాం. మాతో కలిసి వచ్చే ఏ పార్టీతోనైనా మేం కలిసి పోటీ చేసేందుకు అధిష్టానాన్ని ఒప్పిస్తాం. నగరంలో జరిగే యూజీడీ పనుల నుంచి హౌసింగ్ ఫర్ ఆల్ పథకాల వరకూ కేంద్రం నిధులు మంజూరు చేస్తే శంకుస్థాపన కార్యక్రమాలకు కనీసం బీజేపీ నేతలకు ఆహ్వానం లేదు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధుల ద్వారా పథకాలు పెట్టి ఎక్కడా మోదీ పేరు గానీ, కేంద్ర ప్రభుత్వ ప్రస్తావన కానీ లేకుండా అంతా తామే చేస్తున్నామంటూ టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. వీటిని ఇప్పటికే మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం. మా పార్టీకి మార్కెట్ యార్డు డైరెక్టర్ పోస్టు ఇస్తామని మోసం చేశారు. అమ్మిశెట్టి ఆంజనేయులు, బీజేపీ గుంటూరు నగర అధ్యక్షుడు -
ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు...
బీజేపీతో చెలిమిపై ఎంపీ జయదేవ్ మంగళగిరి : తాము వచ్చే సాధారణ ఎన్నికల వరకు బీజేపీతో కలిసే నడుస్తామని, ఆ తర్వాత ఏం జరుగుతుందో తనకు తెలియదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మండలంలోని ఆత్మకూరు గ్రామంలో నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ గృహాలకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం విడతల వారీగా నిధులు అందజేస్తూ సహకరిస్తోందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తుందని కేంద్రంపై నమ్మకం వుందన్నారు. టీడీపీ ఎంపీలు రాష్ట్రాభివృద్ధి కోసం పని చేయలేదని పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించడం సమంజసం కాదన్నారు. పవన్ కళ్యాణ్‌ను కలిసి తాము ఏ విధంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నామో తెలియజేసి అనంతరం ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తానన్నారు. కార్యక్రమంలో మంగళగిరి మున్సిపల్ చైర్పర్సన్ గంజి చిరంజీవి, పార్టీ నాయకులు చావలి ఉల్లయ్య, నందం అబద్ధయ్య, సంకా బాలాజీగుప్తా పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీ డ్రామా
- లక్ష్యం సాధించే వరకు విశ్రమించం - అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కడప అగ్రికల్చర్ : ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే, తెచ్చే విషయంలో అటు బీజేపీ, ఇటు టీడీపీ డ్రామా లాడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దుయ్యబట్టారు. బస్సుయాత్రలో భాగంగా వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలో శుక్రవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై నాటి పార్లమెంటు సమావేశాల్లో హామీ ఇచ్చారని, ప్రత్యేకంగా నిధులు కూడా ఇస్తామని చెప్పారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రమంత్రులు, పార్టీ నేతలు పలు రకాలుగా మాట్లాడుతుండడం సిగ్గు చేటన్నారు. కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌భాష మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అంతకు మనుపు బళ్లారి-చెన్నై జాతీయ రహదారి నుంచి ర్యాలీగా నగరంలోకి బస్సుయాత్ర వచ్చింది. ఈ సభలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓబులేశు, ఏఐవైఎఫ్ రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కరీముల్లా, రాష్ట్ర మహిళా సమాఖ్య అధ్యక్ష, ఉపాధ్యక్షులు జయలక్ష్మీ, పద్మావతి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి రామసుబ్బారెడ్డి, కార్యదర్శి చంద్ర, సీనియర్ నాయకులు పులి కృష్ణమూర్తి, పాలెం చెన్నకేశవరెడ్డి, సుబ్బారెడ్డి, మహిళా నాయకురాలు విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. రాజంపేట రూరల్: ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే సీపీఐ వారు బస్సు యాత్ర చేపట్టారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్ సర్కిల్(పాతబస్టాండు)లో శుక్రవారం బస్సు యాత్ర చేపట్టిన సీపీఐ నాయకులకు ఆకేపాటి వైఎస్సార్సీపీ పట్టణ కన్వినర్ పోలా శ్రీనివాసులురెడ్డితో కలిసి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పాపినేని విశ్వనాథరెడ్డి, నాగినేని నాగేశ్వరనాయుడు, డి.భాస్కర్‌రాజు, పసుపులేటి సుధాకర్, గోవిందు బాలకృష్ణ, జీవీ సుబ్బరాజు, సీ.జ్యోతియాదవ్ తదితరులు పాల్గొన్నారు. నందలూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సీపీఐ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు చేపడుతున్న బస్సుయాత్ర నందలూరు మీదుగా వెళ్లిన సందర్భంగా స్థానిక సీపీఐ నాయకులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ నాయకులు మహేష్, మండల నాయకుడు శివరామకృష్ణ దేవర పాల్గొన్నారు. రైల్వేకోడూరు అర్బన్:రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎంత వరకైనా పోరాడుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బస్సుయాత్ర మార్గమధ్యంలోని రైల్వేకోడూరు పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి శంకరయ్య, రాధాకృష్ణ, సీనియర్ నాయకుడు కృష్ణమూర్తి, పండుగోల మణి, సుధాకర్, చైతన్య, చెన్నయ్య, విజయలక్ష్మీ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
'టీడీపీ, బీజేపీ దొందూ దొందే'
బీజేపీ ముసుగులో టీడీపీ రాజకీయ వ్యవహారాలు నడిపిస్తోంది. చంద్రబాబు తొమ్మిదేళ్లు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలను రాచి రంపాన పెట్టారు. పర్యటన పేరిట చిన్న చిన్న ఉద్యోగులను సస్పెండ్ చేశారు. చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి. అమరులను, రైతులను అవమానపరిచేలా వ్యవహరించారు. చంద్రబాబును ప్రజలను తిరస్కరించారు. బీజేపీకి తెలంగాణవాదుల పట్ల ప్రేమ ఉంటే ఉద్యమం సందర్భంగా నమోదైన రైల్వే కేసులను ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరేది. టీడీపీ, బీజేపీ దొందూ దొందే. -రామలింగారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే -
మేం రె‘ఢీ’
ఎన్నికలకు సిద్ధం: రాజకీయ పక్షాలు వరాలు కురిపించనున్న టీఆర్ఎస్ వ్యూహాలకు విపక్షాల పదును సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యల నేపథ్యంలో నగర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని... విజయం తమదేనని వివిధ పార్టీల ముఖ్యనేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమన్వయంతో వెళ్లిన ఎంఐఎం వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్తో కలిసి సాగే అవకాశం ఉంది. బీజేపీ - టీడీపీలు ఒక కూటమిగా, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, లోక్‌సత్తా, వామపక్షాలు ఎవరికి వారుగా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. వరాల వర్షం కురిపించనున్న టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ విశ్వనగరం దిశగా చేపట్టిన పథకాలకు పరుగులు పెట్టించనుంది. గత ఏడాదిసాధారణ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో మూడు శాసనసభ స్థానాల్లో విజయం సాధించి... అనేక స్థానాల్లో ప్రత్యర్థులతో నువ ా్వనేనా అన్నట్లుగా పోటీ పడిన టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇస్తాంబుల్ తరహాలో పాతబస్తీ అభివృద్ధి, ముస్లింలకు రిజర్వేషన్లతో పాటు, స్లమ్ ఫ్రీ సిటీ, రెండు గదుల ఇళ్ల నిర్మాణం,పేదల భూముల క్రమబద్దీకరణ, నగరంలో మౌలిక సదుపాయాల కల్పన అంశాలకు పెద్దపీట వేసే దిశగా కార్యాచరణను వేగిరం చేయనుంది. మంగళవారం నగరంలో జరిగే టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. కొత్త ప్రాంతాలపై ఎంఐఎం దృష్టి షహర్ హమారా, మేయర్ హమారా నినాదంతో ఎంఐఎం పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో పాతబస్తీని దాటి ఇతర ప్రాంతాల్లోనూ విస్తరించే వ్యూహంతో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో విజయాలతో పాటు జూబ్లీహిల్స్, అంబర్‌పేట, ముషీరాబాద్ తదితర స్థానాల్లో భారీగా ఓట్లను రాబట్టుకోగలిగింది. టీఆర్ఎస్తో ప్రత్యక్ష పొత్తు లేదా పరోక్ష పొత్తు ఉన్నా కొత్త స్థానాలకు విస్తరించాలన్న లక్ష్యంతో పనిచేసే అవకాశం ఉంది. కూటమిగా టీడీపీ,బీజేపీ: సాధారణ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, టీడీపీలు వచ్చే ఎన్నికల్లో ఒకే కూటమిగా ముందుకెళ్లే అవకాశం ఉంది. బీజేపీ ఈసారి మెజారిటీ స్థానాలను కోరుకునేందుకు సన్నద్ధమవుతోంది. శివారు ప్రాంతాల్లోనూ బీజేపీ మెజారిటీ స్థానాల్లో పోటీకి కసరత్తు చేస్తోంది. ఒంటరిగానే కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ గ్రేటర్ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేసేందుకు కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. త్వరలో కాంగ్రెస్ నియోజకవర్గాల వారిగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ సోమవారం జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి... శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. విజయమే లక్ష్యం జీహెచ్ఎంసీకి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం బీజేపీ కూటమిదే. ప్రధాని నరేంద్రమోడీ హవాను నగరంలోనూ రుజువు చేస్తాం. స్థానిక సంస్థలకు గడువులోగా ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధనను మేం గౌరవిస్తాం. మిత్రులతో కలిసి గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం. - కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సత్తా చూపిస్తాం గ్రేటర్ ఎన్నికలు తక్షణ మే నిర్వహించాలి. నగరంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులున్నాయి. ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. మేయర్ పీఠాన్ని మరోసారి దక్కించుకుంటాం. - దానం నాగేందర్, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయం కోసం పనిచేస్తాం కోర్టు ఆదేశం మేరకు వీలైనంత త్వరగాా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తున్నాం. అన్ని స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు. విజయమే లక్ష్యంగా పనిచేస్తాం. - కె.శివకుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ బలం లేకే వెనుకాడుతున్న టీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్లేందుకు భయపడుతున్నందునే టీఆర్ఎస్ గతంలోహైకోర్టు ఆదేశించినా వార్డుల విభజన చేయలేదు. ఇప్పుడు గట్టిగా మందలించడంతో నిర్వహించక తప్పదు. ఇతర పార్టీల నేతలను అరువు తీసుకునేందుకు పడుతున్న పాట్లను పాలనపై చూపితే బాగుండేది. నగరంలో తగిన బలం, కార్యకర్తలు, నాయకులు లేక అల్లాడుతున్నందునే టీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకాడుతోంది. ఇకనైనా వెంటనే ఎన్నికలు జరపాలి. - సి. కృష్ణయాదవ్, టీడీపీ అధ్యక్షుడు, హైదరాబాద్ జిల్లా మెం రెడీ వార్తకు కలుపుకోవాలి జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉన్నాయి. గతంలో డివిజన్ల విభజనఅస్తవ్యస్తంగా జరిగినందున అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండేందుకు, పునర్విభజన సవ్యంగా జరపాలనేదే ప్రభుత్వ లక్ష్యం. అంతే తప్ప ఎన్నికలకు వెనుకాడే ప్రసక్తే లేదు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. అధికారులు ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా మేం సిద్ధంగా ఉన్నాం. - తలసాని శ్రీనివాస యాదవ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి ఎన్నికలు వేంటనే నిర్వహించాలి స్థానిక సంస్థల హక్కులు హరించటం సరికాదు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీకి వేంటనే ఎన్నికలు జరపాలి. కోర్టు ఆదేశాలను గౌరవించాలి. లేని పక్షంలో ఎన్నికల కోసం పోరాడుతాం. బలమున్న స్థానాల్లో వామపక్షాల కూటమి అభ్యర్థులు పోటీ చేస్తారు. - సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గత ప్రభుత్వాలకు...ప్రస్తు ప్రభుత్వాలకు తేడా లేదు గత ప్రభుత్వాలకు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ మాత్రం తేడా లేదు. గతంలోని టీడీపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు కోర్టులు ఆదేశిస్తే తప్ప స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించని పరిస్థితిని చూశాం. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం అదే బాటలో ఎన్నికలు నిర్వహించకుండా హక్కులు కాలరాస్తోంది. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా బలమున్న స్థానాల్లో పోటీ చేస్తాం. - చాడా వెంకటరెడ్డి, కార్యదర్శి సీపీఐ