మేం రె‘ఢీ’ | all politcal parties redy to ghmc electon | Sakshi
Sakshi News home page

మేం రె‘ఢీ’

Published Tue, Feb 3 2015 12:06 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

all politcal parties redy to ghmc electon

ఎన్నికలకు సిద్ధం: రాజకీయ పక్షాలు
వరాలు కురిపించనున్న టీఆర్‌ఎస్
వ్యూహాలకు విపక్షాల పదును

 
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యల నేపథ్యంలో నగర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని... విజయం తమదేనని వివిధ పార్టీల ముఖ్యనేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమన్వయంతో వెళ్లిన ఎంఐఎం వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో కలిసి సాగే అవకాశం ఉంది. బీజేపీ - టీడీపీలు ఒక కూటమిగా, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, లోక్‌సత్తా, వామపక్షాలు ఎవరికి వారుగా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.

వరాల వర్షం కురిపించనున్న టీఆర్‌ఎస్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్ విశ్వనగరం దిశగా చేపట్టిన పథకాలకు పరుగులు పెట్టించనుంది. గత ఏడాదిసాధారణ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో మూడు శాసనసభ స్థానాల్లో విజయం సాధించి... అనేక స్థానాల్లో ప్రత్యర్థులతో నువ ా్వనేనా అన్నట్లుగా పోటీ పడిన టీఆర్‌ఎస్ గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇస్తాంబుల్ తరహాలో పాతబస్తీ అభివృద్ధి, ముస్లింలకు రిజర్వేషన్లతో పాటు, స్లమ్ ఫ్రీ సిటీ, రెండు గదుల ఇళ్ల నిర్మాణం,పేదల భూముల క్రమబద్దీకరణ, నగరంలో మౌలిక సదుపాయాల కల్పన అంశాలకు పెద్దపీట వేసే దిశగా కార్యాచరణను వేగిరం చేయనుంది. మంగళవారం నగరంలో జరిగే టీఆర్‌ఎస్ రాష్ట్ర స్థాయి సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.

కొత్త ప్రాంతాలపై ఎంఐఎం దృష్టి

షహర్ హమారా, మేయర్ హమారా నినాదంతో ఎంఐఎం పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో పాతబస్తీని దాటి ఇతర ప్రాంతాల్లోనూ విస్తరించే వ్యూహంతో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో విజయాలతో పాటు జూబ్లీహిల్స్, అంబర్‌పేట, ముషీరాబాద్ తదితర స్థానాల్లో భారీగా ఓట్లను రాబట్టుకోగలిగింది. టీఆర్‌ఎస్‌తో ప్రత్యక్ష పొత్తు లేదా పరోక్ష పొత్తు ఉన్నా కొత్త స్థానాలకు విస్తరించాలన్న లక్ష్యంతో పనిచేసే అవకాశం ఉంది.

 కూటమిగా టీడీపీ,బీజేపీ: సాధారణ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, టీడీపీలు వచ్చే ఎన్నికల్లో ఒకే కూటమిగా ముందుకెళ్లే అవకాశం ఉంది. బీజేపీ ఈసారి మెజారిటీ స్థానాలను కోరుకునేందుకు సన్నద్ధమవుతోంది. శివారు ప్రాంతాల్లోనూ బీజేపీ మెజారిటీ స్థానాల్లో పోటీకి కసరత్తు చేస్తోంది.

ఒంటరిగానే కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్

గ్రేటర్ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేసేందుకు కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. త్వరలో కాంగ్రెస్ నియోజకవర్గాల వారిగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ సోమవారం జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి... శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది.
 
విజయమే లక్ష్యం

జీహెచ్‌ఎంసీకి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం బీజేపీ కూటమిదే. ప్రధాని నరేంద్రమోడీ హవాను నగరంలోనూ రుజువు చేస్తాం. స్థానిక సంస్థలకు గడువులోగా ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధనను మేం గౌరవిస్తాం. మిత్రులతో కలిసి గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం.    - కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
 
సత్తా చూపిస్తాం

గ్రేటర్ ఎన్నికలు తక్షణ మే నిర్వహించాలి. నగరంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులున్నాయి. ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. మేయర్ పీఠాన్ని మరోసారి దక్కించుకుంటాం.
 - దానం నాగేందర్, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షులు
 
 విజయం కోసం పనిచేస్తాం


 కోర్టు ఆదేశం మేరకు వీలైనంత త్వరగాా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తున్నాం. అన్ని స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు. విజయమే లక్ష్యంగా పనిచేస్తాం.
 - కె.శివకుమార్, వైఎస్సార్ కాంగ్రెస్
 
బలం లేకే వెనుకాడుతున్న టీఆర్‌ఎస్

 ఎన్నికలకు వెళ్లేందుకు భయపడుతున్నందునే టీఆర్‌ఎస్ గతంలోహైకోర్టు ఆదేశించినా వార్డుల విభజన చేయలేదు. ఇప్పుడు గట్టిగా మందలించడంతో నిర్వహించక తప్పదు. ఇతర పార్టీల నేతలను అరువు తీసుకునేందుకు పడుతున్న పాట్లను పాలనపై చూపితే బాగుండేది. నగరంలో తగిన బలం, కార్యకర్తలు, నాయకులు లేక అల్లాడుతున్నందునే టీఆర్‌ఎస్ ప్రభుత్వం వెనుకాడుతోంది. ఇకనైనా వెంటనే ఎన్నికలు జరపాలి.
 - సి. కృష్ణయాదవ్, టీడీపీ అధ్యక్షుడు, హైదరాబాద్ జిల్లా
 
మెం రెడీ వార్తకు కలుపుకోవాలి

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం, టీఆర్‌ఎస్ పార్టీ రెడీగా ఉన్నాయి. గతంలో   డివిజన్ల విభజనఅస్తవ్యస్తంగా జరిగినందున అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండేందుకు, పునర్విభజన సవ్యంగా జరపాలనేదే ప్రభుత్వ లక్ష్యం. అంతే తప్ప ఎన్నికలకు వెనుకాడే ప్రసక్తే లేదు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. అధికారులు ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా మేం సిద్ధంగా ఉన్నాం.
 - తలసాని శ్రీనివాస యాదవ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి
 
 ఎన్నికలు వేంటనే నిర్వహించాలి


 స్థానిక సంస్థల హక్కులు హరించటం సరికాదు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీకి వేంటనే ఎన్నికలు జరపాలి. కోర్టు ఆదేశాలను గౌరవించాలి. లేని పక్షంలో ఎన్నికల కోసం పోరాడుతాం. బలమున్న స్థానాల్లో వామపక్షాల కూటమి అభ్యర్థులు పోటీ చేస్తారు.
 - సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
 
 గత ప్రభుత్వాలకు...ప్రస్తు ప్రభుత్వాలకు తేడా లేదు


గత ప్రభుత్వాలకు, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఏ మాత్రం తేడా  లేదు. గతంలోని టీడీపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు కోర్టులు ఆదేశిస్తే తప్ప స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించని పరిస్థితిని చూశాం. ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రభుత్వం అదే బాటలో ఎన్నికలు నిర్వహించకుండా హక్కులు కాలరాస్తోంది. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా బలమున్న స్థానాల్లో పోటీ చేస్తాం.    - చాడా వెంకటరెడ్డి, కార్యదర్శి సీపీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement