సాక్షి, గుంటూరు: ఎన్నికల ముందు మిత్రపక్షంగా కలిసి పోటీ చేసిన బీజేపీ, టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. రాష్ట్రాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా అవమానిస్తోందని, బడ్జెట్ కేటాయింపుల్లోనూ చిన్న చూపు చూస్తుందని మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అయితే జిల్లాలో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తమని ఏ కార్యక్రమానికీ ఆహ్వానించడం లేదని, కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల్లోనూ తమకు కనీస వాటా ఇవ్వడం లేదని, ఘోరంగా అవమానిస్తున్నారని బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి, అధికారుల వద్ద జరిగే పనుల వరకు అన్నింట్లోనూ తమకు అన్యాయం జరుగుతోందంటున్నారు. మరోవైపు టీడీపీ నేతలు కూడా బీజేపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో తమ ప్రభుత్వం, పార్టీ ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉందంటున్నారు. ఇటీవల జరిగిన జన్మభూమి సభల్లో సైతం టీడీపీ, బీజేపీ నేతలు బాహాబాహీకి దిగిన ఘటన అందరికి తెలిసిందే. ఇలా జిల్లాలో మిత్ర పక్షాలుగా ఉన్న బీజేపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు కయ్యానికి కాలుదువ్వుతున్నారు.
పదవులు ఇస్తామని తూచ్...
అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు జిల్లాలో బీజేపీ నేతలను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఏ ఒక్క పథకాన్ని వారికి అప్పగించకుండా టీడీపీ కార్యకర్తలకే పూర్తిగా అప్పగిస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డుగా పేరొందిన గుంటూరు మిర్చి యార్డు పాలకవర్గంలో బీజేపీకి రెండు డైరెక్టర్ పోస్టులు ఇస్తామంటూ తొలుత చెప్పి, ఆ తర్వాత ఒక్కటి మాత్రమే ఇస్తామంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు హామీ ఇచ్చారు. అయితే అధికారికంగా ప్రకటించిన తరువాత అందులో బీజేపీకి చోటు దక్కకపోవడంతో జిల్లా బీజేపీ నేతలు దీనిపై తమ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ప్రతి పథకాన్ని మంజూరు చేసేందుకు అధికారికంగా నియమించిన జన్మభూమి కమిటీల్లోనూ బీజేపీ నేతలకు స్థానం కల్పించకపోవడంతో వారంతా గుర్రుగా ఉన్నారు.
సీట్ల విషయంలోనూ అసంతృప్తి..
ఎన్నికల ముందు జిల్లాలో బీజేపీకి గుంటూరు వెస్ట్, మంగళగిరి, సత్తెనపల్లి, బాపట్ల నియోజకవర్గాల్లో ఏదో ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించాలని కోరినప్పటికీ టీడీపీ ఓటమి పాలవుతుందని భావించిన నరసరావుపేటను తమకు కేటాయించారని మండిపడుతున్నారు. టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు పోటీ చేయకుండా వెళ్లిపోయిన నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించారంటున్నారు. ఓడిపోయిన నియోజకవర్గాల్లో పోటీ చేసిన వ్యక్తులను ఇన్‌చా ర్జిలుగా నియమించిన టీడీపీ ఇక్కడ మాత్రం ఓటమి చెందిన బీజేపీ అభ్యర్థి నల్లబోతు వెంకట్రావును పక్కన పెట్టడం దారుణమంటున్నారు. అక్కడ కోడెల తనయుడు శివరామకృష్ణ చెప్పిందే అధికారులు చేస్తున్నారని, బీజేపీ నేతలకు కనీస గౌరవం లేకుండాపోయిందని వాపోతున్నారు. గుంటూరు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులతో ఏర్పాటు చేస్తున్న శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు బీజేపీ నేతలకు కనీస ఆహ్వానం కూడా అందకపోవడంపై ఆ పార్టీ క్యాడర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఫొటో లేకపోవడంపై గుంటూరు నగరంలోని 26, 45, 51 డివిజన్లలో బీజేపీ నేతలు ప్రశ్నించారు. దీంతో బీజేపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ బాహాబాహీకి దిగారు. అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో సైతం తమకు గెలిచే సత్తా ఉన్నా నలుగురు ఎమ్మెల్యేలు కూర్చొని దౌర్జన్యంగా టీడీపీ నేతకు కట్టబెట్టారని బీజేపీ నేతలు రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ఏమాత్రం ప్రాధాన్యం లేదంటున్న బీజీపీ నేతలు..
గతేడాది గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో బీజేపీ నేతలు టీడీపీపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ నేతల అవినీతి తారస్థాయికి చేరిందని, దీని వల్ల బీజేపీకి కూడా చెడ్డ పేరు వస్తుందని బీజేపీ నేతలు ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. మరోవైపు టీడీపీ నేతలు సైతం బీజేపీ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారంటూ జిల్లాకు చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావుతో పాటు, పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు బహిరంగంగా కోప్పడిన విషయం తెలిసిందే. గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం ఎదురుగా టీడీపీ నేతల పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ‘బీజేపీతో పొత్తు – ఇంటికి రాదు విత్తు’ అంటూ రాయించడం కలకలం రేపింది. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య విభేదాలు అనేకం ఉన్నాయి.
నగరపాకల సంస్థ ఎన్నికల్లో 40శాతం సీట్లు అడుగుతాం
నగరపాలక సంస్థ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 40శాతం సీట్లు బీజేపీకి ఇవ్వాల్సిందే. అలా ఇవ్వని పక్షంలో సొంతంగా పోటీ చేస్తాం. మాతో కలిసి వచ్చే ఏ పార్టీతోనైనా మేం కలిసి పోటీ చేసేందుకు అధిష్టానాన్ని ఒప్పిస్తాం. నగరంలో జరిగే యూజీడీ పనుల నుంచి హౌసింగ్ ఫర్ ఆల్ పథకాల వరకూ కేంద్రం నిధులు మంజూరు చేస్తే శంకుస్థాపన కార్యక్రమాలకు కనీసం బీజేపీ నేతలకు ఆహ్వానం లేదు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధుల ద్వారా పథకాలు పెట్టి ఎక్కడా మోదీ పేరు గానీ, కేంద్ర ప్రభుత్వ ప్రస్తావన కానీ లేకుండా అంతా తామే చేస్తున్నామంటూ టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. వీటిని ఇప్పటికే మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం. మా పార్టీకి మార్కెట్ యార్డు డైరెక్టర్ పోస్టు ఇస్తామని మోసం చేశారు.
అమ్మిశెట్టి ఆంజనేయులు, బీజేపీ గుంటూరు నగర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment