సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో టీడీపీ–బీజేపీల వైరం ఉప్పు, నిప్పులా తయారైంది. ఇక్కడి జిల్లా, రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలకు సైతం టీడీపీ నేతలు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వారి సూచనలు పట్టించుకునేవారు లేరు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం ఉండదు. వారి అభిప్రాయాలకు తావు లేదు. అడుగడుగునా టీడీపీ నేతలు, బీజేపీ నేతలను అణగదొక్కుతున్నారు. ఒకరిద్దరు టీడీపీ నుంచి బీజేపీలో చేరే ప్రయత్నం చేసినా అధికారం, అధికారులను అడ్డుపెట్టి వారిని అష్టకష్టాలు పెడుతున్నారు. బీజేపీని నామం జపించాలంటేనే భయపడేలా చేస్తున్నారు. జిల్లాలో బీజేపీ, టీడీపీ వైరం పతాకస్థాయికి చేరింది. బీజేపీ నేతలు సైతం టీడీపీ నేతలపై బహిరంగ విమర్శలకు వెనుకాడటం లేదు.
ప్రియమైన శత్రువులు..
జిల్లా స్థాయిలో కొందరు బీజేపీ సీనియర్ నేతలు, మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి నేతలతో సన్నిహితం నడిపినా ఇక్కడి వారికి ప్రాధాన్యత లేదు. అధికార టీడీపీ నేతల ఒత్తిడుల పుణ్యమా అని ఇక్కడి బీజేపీ నేతలకు చిన్న పదవులు కూడా వచ్చినా దాఖలాలు కూడా లేవు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి టీడీపీ మిత్రపక్షంగా ఉన్నా తమ పట్ల టీడీపీ నేతలు శత్రువుల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు వాపోతున్నారు. ఇప్పటికీ చంద్రబాబు సర్కారు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ తమ పథకాలుగా చెప్పుకుంటూ ప్రచారం సాగిస్తోంది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి గృహనిర్మాణ పథకానికి సైతం ఎన్‌టీఆర్ గ్రామీణ్ పేరు పెట్టి తమ పథకంగా చెప్పుకుంటోంది. ఇక పింఛన్లు మొదలుకొని ఉపాధి హామీ పనుల వరకు పలు పథకాలు కేంద్రం నిధులతో నడుస్తున్నా రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు ఆ పథకాలకు తమ పేర్లు తగిలించి తమవిగానే ప్రచారం చేస్తున్నారు. కేంద్రం నిధులతో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు బీజేపీ నేతలను ఆహ్వానించడం లేదు. కందుకూరులో పీఎంజీఎస్‌వై కింద గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభిస్తే ప్లెక్సీలో సైతం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే పోతుల రామారావు, మంత్రి నారాయణ ఫొటోలు మినహా ప్రధాని ఫోటో లేదని, కనీసం స్థానిక నేతలకు సమాచారం కూడా ఇవ్వలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దర్శిలో కేంద్ర ప్రభుత్వంపై ప్రకటించిన డ్రైవింగ్ స్కూలు శంకుస్థాపన కార్యక్రమానికి సైతం జిల్లా బీజేపీ నేతలకు ఆహ్వానం లేకపోవడంతో వారు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
సిఫార్సులనూ పట్టించుకోని టీడీపీ నేతలు..
బీజేపీ, టీడీపీ సంబంధాలు పూర్తిగా చెడిపోయాయన్న దానికి త్రిపురాంతకం ఘటన ఓ ఉదాహరణ. అధికార పార్టీలో ఇమడలేక త్రిపురాంతకం ఎంపీపీ చెన్నమ్మ గత ఏడాది అక్టోబర్ 28న కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డిల సమక్షంలో ఐదు మంది ఎంపీటీసీలు, ఒక కోఆప్షన్ మెంబర్‌తో సహా బీజేపీలో చేరారు. అప్పటి నుంచి అధికార టీడీపీ స్థానిక ఎంపీడీఓపై ఒత్తిడి తెచ్చి ఎంపీపీతో పాటు వారి వర్గాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ విషయంపై జిల్లా కలెక్టరేట్ వద్ద బీజేపీ శనివారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరై చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని దుమ్మెతిపోశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దశాబ్దాలుగా బీజేపీ కోసం పని చేసిన నేతలను సైతం టీడీపీ రాజకీయంగా ఎదగనివ్వడం లేదన్న విమర్శలున్నాయి. కనీసం జన్మభూమి కమిటీలో కూడా వారికి ప్రాధాన్యత లేదు. నామినేటెడ్ పోస్టుల్లో ఏ మాత్రం చోటు కల్పించడం లేదు. అంతేందుకు వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే వారే లేరు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు వారిని ఆహ్వానించడం లేదు.
దీంతో వారు పైన మిత్రపక్షంగా ఉన్నా... జిల్లా పరిధిలో శత్రువుల్లాగే ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు టీడీపీ తీరుపై బహిరంగ విమర్శలు చేసేందుకు వెనుతీయడం లేదు. పేరుకు తాము మిత్రపక్షంగా ఉన్నా టీడీపీ నేతలే తమను మిత్రులుగా చూడటం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి సాక్షితో పేర్కొనడం గమనార్హం. తమ పార్టీ ఎదుగుదలను టీడీపీ జీర్ణించుకోలేకపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే వందలాది పథకాలను టీడీపీ ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటుందని కృష్ణారెడ్డి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment