అంతా అధిష్టానమే చేసింది!
పదేళ్లు కార్యకర్తలను పట్టించుకోలేదు
పదవులు పంచలేదు.. నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదు
బంధుప్రీతి, ఆధిపత్యపోరుతో ఓడిపోయాం
క్షేత్రస్థాయిలో శ్రేణులను గౌరవిస్తేనే మనుగడ
కాంగ్రెస్ బృంద సమీక్షల్లో ద్వితీయ శ్రేణి నేతల ఆవేదన
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ‘అధిష్టానం వైఖరే పార్టీ కొంపముంచింది. క్షేత్రస్థాయి కార్యకర్తలను ఏనాడూ పట్టించుకోలేదు. ఇదే పార్టీ అడ్రస్ గల్లంతయ్యే దుస్థితికి దారి తీసింది. అధికారంలో ఉన్నన్నాళ్లు పదవులు అనుభవించిన నాయకులే దీని కంతటికీ కారణం’ అని కాంగ్రెస్ ద్వితీ యశ్రేణి నాయకులు కుండబద్దలు కొట్టారు. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయలేదు.
పార్టీ పదవుల్లోనూ ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా ఓటమికి కారణంగా విశ్లేషించారు. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన బృంద సమీక్షల్లో పార్టీ బలోపేతంపై ముఖ్య నేతలు అభిప్రాయాలను తెలుసుకున్నారు. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఆరు గ్రూపులు పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేశారు.
కార్యకర్తను గౌరవించకపోతే...
‘పార్టీకి పూర్వవైభవం కార్యకర్తలను గౌరవించాలి. భజనపరులకు, బంధుప్రీతికి తావివ్వకుండా పదవుల భర్తీలో గ్రామస్థాయి కమిటీల సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలి’ అని పార్టీ నాయకులు ముక్తకంఠంతో తీర్మానించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలీయశక్తిగా మార్చేందుకు సీనియర్లు విరివిగా పర్యటించాలని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర ఉద్యమించాలని సూచించారు.
బృంద సమీక్షల్లో వెల్లడైన అభిప్రాయాల మేరకు పార్టీ ఏఐసీసీ దిశానిర్దేశం చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, సుధీర్‌రెడ్డి, యువనేత కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.