కందుకూరు అర్బన్: కందుకూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ఇద్దరూ ఉనికిని కాపాడుకోవడం కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రామారావు కస్సుమంటే, శివరాం బుస్సు మంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆపార్టీ కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా దివి శివరాం రెండేళ్లపాటు కొనసాగారు. ఆ రెండేళ్లలో కార్యకర్తలను విస్మరించారని, కొంతమందినే చేరదీశారనేది ఆ పార్టీ కార్యకర్తల ఆరోపణ. ముఖ్యంగా అధికార యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకుని స్వప్రయోజనాలే ధ్యేయంగా అభివృద్ధిని పాతాళానికి తొక్కారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఏదీ అభివృద్ధి..?
అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు అభివృద్ధి పేరుతో అధికార పార్టీలో చేశారు. టీడీపీ కండువా కప్పుకొని 15 నెలలు గడుస్తున్నా నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కొత్త నిధులు మంజూరు సంగతి దేవుడెరుగు కనీసం ఉన్న నిధులు కూడా సద్వినియోగం చేసుకోవడంలో విఫలం చెందారని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
మున్సిపాలిటీ అధికారులు మూడు నెలల క్రితం రూ.10 కోట్లకు టెండర్లు పిలవగా ఎమ్మెల్యే కాంట్రాక్ట్లర్లను పిలిచి రూ.5 కోట్లకు టెండర్లు వేసుకోవాలని, మిగిలిన 5 కోట్ల టెండర్లు తమ కార్యకర్తలకు ఇస్తామని సూచించినట్టు తెలిసింది. ఇది తెలిసిన శివరాం తన మనుషులతో టెండర్లు వేయించారు. దీంతో రామారావు ఆ టెండర్లను రద్దు చేయించారు. శివరాం అనుచరులను కూడగట్టుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆదే స్థాయిలో రామారావు కూడా తమ వర్గం జారిపోకుండా కాపాడుకునే
ప్రయత్నంలో పడ్డారు. ఇద్దరు బయటకు ఒకరిపై ఒకరు ప్రేమ ఒలకబోసుకుంటూనే మరో వైపు పార్టీ సమావేశాలు జరిగిన ప్రతి సారీ తమ అనుచరులతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయించుకొంటున్నారు. దీంతో కందుకూరు అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది.
పోర్టు సాధనలో విఫలం..
రామాయపట్నం పోర్టు వస్తే దానికి అనుబంధ పరిశ్రమలు ఏర్పడి దాదాపు లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. కూలీలకు ఉపాధి దొరుకుతుంది. ఇతర వ్యాపారాలు పెరుగుతాయి. దీంతో కందుకూరు ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలో రాష్ట్రమే నిర్ణయించాలని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకులు రామాయపట్నం పోర్టు వచ్చేలాగా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాల్సింది పోయి అసలు పట్టించుకోవడంలేదనేది ప్రజల ఆరోపణ.
సందిగ్ధంలో ఉద్యానవన కళాశాల..
గుడ్లూరు మండలంలో చినలాటిపి గ్రామంలో ఉద్యానవన కళాశాల ఏర్పాటు చేయాలని 235 ఎకరాల భూమి కేటాయించారు. ఈ ఏడాది నుంచి తరగతులు మొదలు కావాల్సి ఉంది. ఆరు నెలలవుతున్నా కళాశాల కమిటీ సభ్యులు మూడు సార్లు సందర్శించి వెళ్లారు. తరగతులు ప్రారంభించడానికి, విద్యార్ధులు ఉండటానికి వసతి గృహాలను, గుడ్లూరు, కందుకూరులో పరిశీలించారు. ఇప్పటికి ఎమ్మెల్యే, శివరాం చర్యలు తీసుకోలేదు.
నత్తనడకన సోమశిల ఉత్తరకాలువ...
సోమశిల ఉత్తకాలువ నత్తనడకన సాగుతోంది. ఈ కాలువ పూర్తయితేనే రాళ్ళపాడు ప్రాజెక్ట్ కింద ఉన్న భూమలు సస్యశ్యామలమవుతాయి. పదేళ్లుగా కా>లువ నిర్మాణం ఏ మాత్రం ముందుకు సాగడంలేదు. మూలిగేనక్కపై తాటికాయ పడినట్టు కాలవ పనులు పూర్తి కాకా నీళ్లే రాకపోతే రాళ్ళపాడు ప్రాజెక్ట్ నుంచి 1.5 టీఎంసీ నీటిని కొండాపురం మండలం చింతలదీవి వద్ద ఉన్న కామథేనువు ప్రాజెక్ట్ తరలింపునకు ప్రభుతం మంజూరు చేసినా జీవో 40 రాళ్లపాడు ప్రాజెక్టు రైతులకు కనీళ్లు తెప్పిస్తోంది. ఈ జీవో రద్దు చేయించడంలో ఇద్దరు నాయకులు విఫలం చెందారు.
పత్తాలేని పార్కు...
గత ప్రభుత్వంలో రామతీర్ధం జలాశయం మంచినీటి పధకం పక్కన కోటి రూపాలయ నిధులతో పార్కు పనులు మొదలు పెట్టారు అది పిల్లర్లు దశలోనే ఆగిపోయింది. పట్టణంలో చేపల మార్కెట్ సమీపంలో రూ. 50 లక్షలతో మటన్ మార్కెట్ నిర్మించాలని భూమిపూజ చేశారు. అది అంతటితోనే ఆగిపోయింది. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను అధిక మించేందుకు ఓవీ రోడ్డులోని మాల్యాద్రి కాలనీ మీదుగా పామూరు ప్రశాంతి నగర్ సమీపం వరకు బైపాస్‌రోడ్డు మంజూరైంది. ఇప్పటికి అది కూడా కార్యరూపం దాల్చలేదు.
Comments
Please login to add a commentAdd a comment