
తుంకూర్: భోజనం వడ్డించ లేదని భార్యతో తగవుపెట్టుకున్నాడు. పట్టరాని కోపంతో ఆమె తలను నరికేశాడు. అంతటితో ఆగక చర్మం ఒలి చేయడం మొదలుపెట్టాడు. తెల్లవారేదాకా ఒలుస్తూనే ఉన్నాడు. ఉదయం తాము ఉంటున్న ఇంటి యజమానికి ఈ ఘోరం వివరించాడు. దీంతో దారుణం వెలుగులోకి వచ్చింది.
కర్ణాటక రాష్ట్రం తుంకూరు జిల్లా కునిగల్ తాలుకాలోని హళియూరుదుర్గ పట్టణంలో సోమవారం రాత్రి ఘటన చోటుచేసుకుంది. శివరామ, పుష్పలత(35)లకు పదేళ్ల క్రితం కులాంతర వివాహమైంది. వారికి ఎనిమిదేళ్ల కుమారుడున్నాడు. శివరామ కోత మిల్లులో కార్మికుడు. తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కోతమిల్లు నుంచి ఇంటికి వచ్చిన భర్తకు పుష్పలత భోజనం వడ్డించలేదు.
ఇద్దరిమధ్య మొదలైన గొడవ తీవ్రమైంది. శివరామ ఆగ్రహంతో కొడవలితో భార్య తలనరికాడు. తర్వాత ఇతర అవయవాలను వేరు చేశాడు. చర్మం ఒలిచేయడం మొదలుపెట్టాడు. ఇల్లంతా రక్తపు మడుగులా మారింది. పేగులు చెల్లాచెదురుగా పడిపోయాయి. తెల్లవారేదాకా చర్మం ఒలుస్తూనే ఉన్నాడు. కుమారుడు అటు పక్కనే నిద్రిస్తుండగానే ఇదంతా జరిగిపోయింది.
ఉదయం తాము ఉంటున్న యజమానికి శివరామ విషయం తెలిపాడు. అతడు పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులొచ్చి ఈ బీభత్సాన్ని స్వయంగా చూసిన తర్వాతే దారుణం బయటకు వచ్చింది. శివరామను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు నేరం అంగీకరించాడని తుంకూర్ ఎస్‌పీ అశోక్ వెంకట్ గురువారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment