కాకినాడ ‘దేశం’..ఆధిపత్య సమరం.. | TDP leaders dominant Fighting in Kakinada | Sakshi
Sakshi News home page

కాకినాడ ‘దేశం’..ఆధిపత్య సమరం..

Published Wed, Jan 21 2015 3:41 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

కాకినాడ ‘దేశం’..ఆధిపత్య సమరం.. - Sakshi

కాకినాడ ‘దేశం’..ఆధిపత్య సమరం..

టీడీపీ నేతల మధ్య రచ్చకెక్కుతున్న విభేదాలు
     పార్టీ నగర అధ్యక్షుడు దొరబాబు,
     వాణిజ్య విభాగం నేత బాబ్జీ వర్గాల మధ్య
     పెరుగుతున్న దూరం
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ :కాకినాడ తీరంలో తెలుగు తమ్ముళ్లు ఆధిపత్య పోరులో కొట్టుకుపోతున్నారు. పలు అంశాల్లో పరస్పరం కయ్యానికి కాలు దువ్వుతున్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్, ట్యాంక్ ఓనర్స్ అసోసియేషన్, కాకినాడ పోర్‌‌ట వర్కర్స్ యూనియన్ల వ్యవహారాలు, మార్కెట్‌లో ఆర్థిక కార్యకలాపాలు, కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు.. ఇలా అనేక విషయాల్లో ‘దేశం’ నేతల మధ్య విభేదాలు పొడచూపుతూండడంపై కేడర్‌లో ఆందోళన నెలకొంది. ఈ అంశాల్లో టీడీపీ కాకినాడ నగర అధ్యక్షుడు నున్న దొరబాబు, పార్టీ వాణిజ్య విభాగం నాయకుడు, గోదావరి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంధి బాబ్జీ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది. చివరకు ఈ వివాదం.. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో సోమవారం రాత్రి బాబ్జీకి చెందిన ధనలక్ష్మి ఫౌండేషన్ ఆరో వార్షికోత్సవానికి మంత్రులు దూరమయ్యే పరిస్థితికి దారి తీయడం టీడీపీలో చర్చనీయాంశమైంది.
 
 గత ఏడాది జరిగిన సార్వత్రిక  ఎన్నికల  వరకూ దొరబాబు,  బాబ్జీ చెట్టపట్టాలేసుకునే తిరిగారు. అనంతరం కాకినాడ దిగుమర్తివారివీధిలో  వినాయక చవితి పందిరి విషయంలో వారిమధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడవి చినికిచినికి గాలివానగా మారి, రెండు వర్గాలుగా విడిపోయే వరకూ వెళ్లింది. రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుందన్న సాకుతో చవితి పందిరిని తొలగించేందుకు ఆ పార్టీకి చెందిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై బాబ్జీ ఒత్తిడి తెచ్చారు. దీనిని దొరబాబు వర్గీయులు వ్యతిరేకించడంతో వారిమధ్య వివాదం మొదలైందని పార్టీ నేతలు బాహాటంగానే చెప్పుకున్నారు. ఈ విషయంలో దొరబాబుదే పైచేయి అయింది. దీంతో దొరబాబు వర్గానికి బాబ్జీ దూరంగానే ఉంటున్నారు.
 
 దీనికి ఆర్థికపరమైన సర్దుబాట్లలో తలెత్తిన విభేదాలు కూడా తోడవడంతో ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ధనలక్ష్మి ఫౌండేషన్ వార్షికోత్సవానికి పార్టీ నగర అధ్యక్షుడైన దొరబాబును ఆహ్వానించలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. పార్టీ నాయకులతోపాటు ఇతర పార్టీల నేతలను కూడా ఆహ్వానించి, కేవలం దొరబాబును మాత్రమే విస్మరించడం కావాలని చేసింది కాక మరేమిటని ఆ వర్గం ప్రశ్నిస్తోంది. దీనిపై ముఖ్యనేతల వద్ద తాడోపేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చిన దొరబాబు వర్గీయులు ధనలక్ష్మి ఫౌండేషన్ వార్షికోత్సవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకాకుండా చేయగలిగారని చెబుతున్నారు. అయినప్పటికీ దీనికి ఎమ్మెల్యే కొండబాబు హాజరవడాన్ని దొరబాబు వర్గీయులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పార్టీ కార్యక్రమం కాకున్నా అందరినీ ఆహ్వానించి, తనను పిలవకపోవడాన్ని అవమానంగా భావించి.. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వారు కార్యక్రమానికి హాజరు కాలేదని టీడీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి.
 
 ఈ కయ్యం.. మేయర్ పీఠం కోసమేనా!
 బాబ్జీ, దొరబాబులు రెండు వర్గాలు కావడానికి కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు కూడా మరో కారణమని నేతలు విశ్లేషిస్తున్నారు. అసలు జరుగుతాయో లేదో తెలియని కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠం కోసమే వారు పరస్పరం కయ్యానికి కాలుదువ్వుతున్నారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన కాపు సామాజికవర్గానికే మేయర్ సీటు కట్టబెట్టాలని దొరబాబు, వైశ్య సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని బాబ్జీ చెరో అజెండాతో వర్గాలుగా విడిపోయారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేకి ఆర్థికంగా చేయూతనిచ్చిన అంశాన్ని తెరపైకి తెచ్చి, తన కుటుంబ సభ్యులకు మేయర్ సీటు ఇప్పించుకొనేందుకు బాబ్జీ ప్రయత్నిస్తున్నారని దొరబాబు వర్గం ఆగ్రహంతో ఉంది. అదే జరిగితే ఎంతకైనా వెళతామని వారు చెబుతున్నారు. ఈ విభేదాలు ఏ విపరిణామాలకు దారి తీస్తాయోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ వర్గ విభేదాలను ఎమ్మెల్యే కొండబాబు ఎలా దారికి తెస్తారనేది వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement