babji
-
అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రజల ప్రాణాలను కాపాడాలి
గన్నవరం రూరల్: ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ (దవడ ఎముకల శస్త్ర చికిత్స)లో అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రజల ప్రాణాలు రక్షించాలని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కె.బాబ్జీ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని చిన అవుటపల్లిలో ఉన్న డాక్టర్స్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాలలో శుక్రవారం 15వ వార్షిక రాష్ట్రస్థాయి అసోసియేషన్ ఆఫ్ ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్ సదస్సును ఆయన ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాల రక్షణకు ట్రామా కేర్ సెంటర్లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిందని చెప్పారు. వీటిలో సైతం ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్‌ను నియమించాలన్నారు. ఈ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం గర్వించాల్సిన విషయమన్నారు. ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ అధ్యక్షుడు డాక్టర్ గుణశీలన్ రాజన్ మాట్లాడుతూ.. అతి చిన్న దేశమైన కొరియా ఇంప్లాంటేషన్స్ ఉత్పత్తిలో ముందుందని తెలిపారు. వారియర్స్ ఆఫ్‌ది ఫేస్ అనే థీమ్‌తో ఈ కాన్ఫరెన్స్‌లో ముఖానికి సంబంధించిన ఆధునాతన శస్త్ర చికిత్సలపై, ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వచ్చిన నూతన సర్జరీ పద్ధతులపై, ప్రమాదాల్లో ముఖాలకు గాయాలు, నోటి క్యాన్సర్ వంటి వాటికి శస్త్ర చికిత్స, అనాదిగా ఉన్న గ్రహణం మొర్రిని పూర్తిగా నిర్మూలించడంపై నిపుణులు రెండు రోజుల పాటు చర్చిస్తారు. ఏవోఎంఎస్‌ఐ జాతీయ ఉపాధ్యక్షుడు ఆర్.మణికందన్, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ కె.వై.గిరి, ఏవోఎంఎస్‌ఐ అధ్యక్షుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎన్.కోటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎన్.కిరణ్‌కుమార్, ఏవోఎంఎస్‌ఐ జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ షేక్, రాష్ట్ర మాజీ చైర్మన్ శివనాగేందర్‌రెడ్డి, డాక్టర్ సుధానాగేశ్వరరావు దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.రామోజీరావు, ఏవో వై.మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా వైద్యవిద్య అడ్మిషన్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలో 2023–24 సంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్లు పారదర్శకంగా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వీసీ డాక్టర్ కోరుకొండ బాబ్జి తెలిపారు. అందుకు సంబంధించి అడ్మిషన్స్ విభాగం వారితో కలిసి మూడుసార్లు మాక్ ట్రయల్ నిర్వహించామన్నారు. యూనివర్సిటీ పరిధిలోని సీట్లు, అడ్మిషన్ల ప్రక్రియ వంటి అంశాలను గురువారం ఆయన ‘సాక్షి’కి వివరించారు. తెలంగాణ జీవోపై నిర్ణయం.. 2014 జూన్ రెండు తర్వాత తెలంగాణలో కొత్తగా వచ్చిన వైద్య కళాశాలల్లోని యూజీ సీట్లలో 15 శాతం అన్ రిజర్వుడ్ కోటాలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఇచ్చేది లేదని అక్కడి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య కళాశాలల్లో మంజూరైన ఎంబీబీఎస్ సీట్లతో పాటు, పీజీ సీట్లు కూడా అన్ రిజర్వుడ్ కోటాలో తెలంగాణ విద్యార్థులకు నిలిపివేసే విషయంలో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల వైద్య కళాశాలల్లో 750 సీట్లు పెరిగాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,109 సీట్లు ఉన్నట్లు తెలిపారు. వాటిలో 15 శాతం ఆలిండియా కోటాలో పోగా, మిగిలిన సీట్లకు ఇక్కడ అడ్మిషన్లు జరుపుతామన్నారు. 18 ప్రైవేటు వైద్య కళాశాలల్లో 3,000 ఎంబీబీఎస్ సీట్లున్నాయని, వాటిలో 50 శాతం.. 1,500 సీట్లను ఏ కేటగిరిలో భర్తీ చేస్తామని వీసీ తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకేసారి డైనమిక్ కౌన్సెలింగ్ నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చిందని వీసీ తెలిపారు. ఏపీ, తెలంగాణలకు విభజన ఇబ్బందులు ఉన్న దృష్ట్యా ఈ ఏడాదికి పాత పద్ధతిలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, వచ్చే ఏడాది నుంచి నూతన విధానాన్ని అనుసరిస్తామని కేంద్రానికి చెప్పినట్టు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పీజీ, యూజీ అడ్మిషన్లు నిర్వహిస్తామని వివరించారు. -
ఏపీలో త్వరలోనే అందుబాటులోకి 4 వైద్య కళాశాలలు
గుంటూరు మెడికల్: ఆర్థోపెడిక్ వైద్య విభాగంలో పీజీ సీటు తీసుకునేందుకు ఒకప్పుడు వెనకడుగు వేసేవారని నేడు ఆర్థోపెడిక్‌కి డిమాండ్ పెరుగుతోందని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ కోరుకొండ బాబ్జి చెప్పారు. గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో శుక్రవారం ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 52వ వార్షిక సదస్సు ప్రారంభమైంది. ఈ నెల 26 వరకు ఈ సదస్సు జరగనుంది. డాక్టర్ బాబ్జి ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు కొత్తగా 5 వైద్య కళాశాలలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల కాలంలో విజయనగరం వైద్య కళాశాల ప్రారంభించామని, త్వరలోనే మిగతా 4 వైద్య కళాశాలలు ప్రారంభమవుతాయన్నారు. వీసీగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా గుంటూరు సదస్సుకు విచ్చేసిన డాక్టర్ బాబ్జిని సదస్సు నిర్వాహకులు సన్మానించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి మాట్లాడుతూ నొప్పి నివారణలో ఆర్థోపెడిక్ వైద్యుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ జాతీయ జనరల్ సెక్రటరీ డాక్టర్ నవీన్ ఠక్కర్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ కోసం ఏపీ నుంచి 134 మంది యువ వైద్యులు దరఖాస్తు చేసుకోవడం సంతోషకరమన్నారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చాగంటి పద్మావతి దేవి, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీలు డాక్టర్ సూరత్ అమర్నా«ధ్, డాక్టర్ యశశ్వి రమణ తదితరులు ప్రసంగించారు. -
నా కళ్లు చూసి హీరోయిన్గా అవకాశమిచ్చారు
సాయి దన్సిక, తేజ్ కూర పాటి, అభినవ్ మేడిశెట్టి, కేవీ ధీరజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం షికారు. హరి కొలగాని దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్న సందర్బంగా సోమవారం ఫిలిం ఛాంబర్లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బాబ్జి మాట్లాడుతూ.. 'కరోనా ఇబ్బందులు దాటుకొని సినిమా పూర్తి చేశాం, షికారు టైటిల్ లాగానే సినిమా కూడా బాగా వచ్చింది. మా హీరోయిన్ ధన్సిక, నలుగురు యువ హీరోలు చాలా బాగా చేశారు, సిద్ శ్రీ రామ్ పాడిన పాట బాగా వచ్చింది. ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ అవుతుంది, మా డైరెక్టర్ హరి గారు కధ చెప్పునప్పుడు ఎంత ఎక్సయిట్ అయ్యానో, సినిమా తీసిన విధానం చూసి అంతకు మించి ఎక్సయిట్ అయ్యాను. జనవరి 26న మా సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు. డైరెక్టర్ హరి మాట్లాడుతూ.. 'ఒక చిన్న సినిమా ముందుకు రావాలి అంటే ప్రొడ్యూసర్ కావాలి, ఇలాంటి సినిమాని డైరెక్ట్ చేయమని నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ బాబ్జిగారికి థాంక్స్, నేను ఏ ఆర్టిస్ట్ లు కావాలంటే వాళ్ళని నాకు ఇచ్చారు బాబ్జి గారు. రైటర్ కరుణ్ నాకు నా సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పాలి, ఆర్ట్ డైరెక్టర్ షర్మిల కూడా ఈ రోజు తన మ్యారేజ్ పనుల్లో బిజీ గా ఉండి ఇక్కడకి రాలేక పోయారు, తనకి నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను' అన్నారు. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. 'ప్రొడ్యూసర్ బాబ్జి ఇండస్ట్రీలో తెలుగు సినిమా చరిత్రలో ఆరువందల సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసారు. ప్రొడ్యూసర్‌గా చేయటం తన డ్రీం. ఈ సినిమా ఆయనకి నిర్మాతగా మంచి జర్నీకి పునాది కావాలి అని కోరుకుంటున్నాను' అని తెలిపారు. హీరోయిన్ సాయి ధన్సిక మాట్లాడుతూ.. 'ఈ సినిమా నాకు చాలా స్పెషల్, తమిళంలో చాలా ఫిల్మ్స్ చేశాను, కబాలిలో చేశాను, హరి గారు చెన్నయ్ వచ్చి కథ చెప్పారు. నా కళ్ళు చూసి ఈ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ అని హరి గారు చెప్పారు, ఈ క్యారెక్టర్ నాకు చాలా స్పెషల్' అని చెప్పుకొచ్చింది. -
రూ.10వేల ఆర్థిక సాయం ప్రకటనపై హర్షం
సాక్షి, గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): సెలూన్ షాపులు ఉన్న నాయీ బ్రాహ్మణులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.10వేలు ఆర్థిక సహాయం ప్రకటించడంపై నాయీ బ్రాహ్మణ నంద యువసేన హర్షం ప్రకటించింది. ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపేందుకు యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఇంటూరి బాబ్జీ ఆధ్వర్యంలో మంగళవారం నాయీబ్రాహ్మణ యువకులు కంట్రోల్‌రూం వద్ద వైఎస్సార్ పార్క్‌కు చేరుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పాలాభిషేకం కార్యక్రమానికి ముందస్తు అనుమతి తీసుకోవాలని పోలీసులు నిర్వాహకులను అడ్డుకున్నారు. దీంతో నాయీ బ్రాహ్మణ యువసేన కార్యకర్తలు గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్ ఆవరణలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్ర పటం పెట్టుకుని ఆర్థిక సహాయం ప్రకటించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఇంచార్జీ సీఐ సూర్యనారాయణ పోలీసు స్టేషన్లో ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు. ఏ కార్యక్రమానికైనా మందస్తు అనుమతి తీసుకోవాలని వారికి సూచించారు. అనంతరం గుణదల గంగిరెద్దులదిబ్బలోని నాయిబ్రాహ్మణ కమ్యూనిటీ భవనంలో కృష్ణా జిల్లా నందయువసేన ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నాయిబ్రాహ్మణ సెలూన్ షాపులకు సంవత్సరానికి రూ.10,000 ఫిబ్రవరి లోపు అందించాలని నిర్ణయించినందుకు, 100 రోజుల పాలన జనరంజకంగా పూర్తి చేసినందుకు పాలాభిషేకం నిర్వహించారు. యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఇంటూరి బాబ్జీ, కృష్ణా జిల్లా అధ్యక్షుడు నాగరాజు నంద, వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ నంద, దేవాలయాల కల్యాణకట్టల జేఎసీ అధ్యక్షుడు రామదాసు, వాయిద్యకళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష్యులు యలమందరావు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు పవన్ నంద, జిల్లా కార్యవర్గసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే బాబ్జీ
-
వైఎస్సార్సీపీలోకి పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే బాబ్జీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున నాయకులు తరలివస్తున్నారు. పార్టీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి (బాబ్జీ) మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో బాబ్జీ భేటీ అయ్యారు. అనంతరం పార్టీలో చేరిన ఆయనను వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం బాబ్జీ మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ఒక యజ్ఞమని కొనియాడారు. రాష్ట్ర అవసరాలు దగ్గరి నుంచి గమనించి.. వాటినుంచి వైఎస్ జగన్ ఎంతో నేర్చుకున్నారని తెలిపారు. చిన్న తరహా పరిశ్రమలతో రాష్ట్రానికి న్యాయం జరిగే అవకాశముందన్నారు. యంగ్ జనరేషన్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని, అవకాశమిస్తే తప్పకుండా పాలకొల్లు నుంచి పోటీ చేస్తానని చెప్పారు. -
వ్యక్తి దారుణ హత్య
తుని: తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్.అన్నవరంలో ఆదివారం దారుణ హత్య జరిగింది. బాబ్జీ(40) అనే వ్యక్తి తన ఇంటికి సమీపంలో హత్యకు గురయ్యాడు. సిమెంటు రాయితో తలపై బలంగా మోదడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు పాత గోనె సంచులు కొనడం, అమ్మడం చేస్తుంటాడు. ఇతనికి మద్యం అలవాటు ఉందని.. ఆ సందర్భంగా ఏదైనా గొడవ జరిగిన కారణంగా హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతనికి భార్య, కుమార్తె ఉన్నారు. -
బస్సు నుంచి జారిపడి యువకుడి దుర్మరణం
నరసన్నపేట : జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిలా రు కాలనీకి చెందిన యువకుడు మంత్రి బాబ్జీ (23) దుర్మరణం చెందా డు. శ్రీకాకుళం నుంచి శ్రీముఖలింగం వెళ్తున్న ఆర్టీసీ బస్‌లో బాబ్జీ ప్రయాణిస్తుం డగా కోమర్తి వద్దకు వచ్చే సరికి ముందు డోర్ నుంచి జారి పడిపోయాడు. ఇంతలో బస్సు వెనుక టైరు అతని పైనుంచి వెళ్లిపోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అనారోగ్యంతో బాధపడుతున్న బాబ్జీని అతని తండ్రి మల్లేసు శ్రీకాకుళంలో వైద్యుని వద్ద చూపించి తిరిగి బస్సులో వస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్ వెనుక కూర్చున్న మల్లేసు ప్రమాదాన్ని గమనించేలోపే బాబ్జీ మరణించడంతో ఆయన రోదించిన తీరు అక్కడివారిని కలచి వేసింది. సంఘటన స్థలాన్ని శ్రీకాకుళం ఆర్టీసీ-2 డిపో మేనేజరు అరుణకుమారి, నరసన్నపేట సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ చిన్నంనాయుడులు పరిశీలించారు. -
మంత్రి తండ్రిని కలవడానికి వచ్చా: అద్దాల విష్ణువతి
ఏలూరు: ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలోని పీతల సుజాత తండ్రి బాబ్జీ నివాసం వద్ద దొరికిన డబ్బుల సంచీ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. మహిళ వదిలి వెళ్లిన నగదు బ్యాగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర స్త్రీ శిశు, గనుల శాఖామంత్రి పీతల సుజాత తెలిపారు. తన తండ్రి ఇంటికి వచ్చిన మహిళకు మతి స్ధిమితం లేనట్టుందని.. పది లక్షలు రూపాయిలు ఎందుకు తీసుకొచ్చిందో తనకు తెలియదని ఆమె అన్నారు. ఆ మహిళ వచ్చిన సమయంలో తాను ఇంట్లో లేనన్నారు. మరోవైపు మంత్రి తండ్రిని కలవడానికి వచ్చినట్లు రిటైర్డ్ హాస్టల్ వార్డెన్ అద్దాల విష్ణువతి చెప్పటం విశేషం. తన తమ్ముడి కుమార్తె పెళ్లి కోసం డబ్బులను పాలకొల్లు ఎస్బీఐలో డ్రా చేసినట్లు ఆమె చెప్పారు. అయితే ఆ డబ్బుల బ్యాగ్‌ను మర్చిపోయి వెళ్లినట్లు అద్దాల విష్ణువతి తెలిపింది. అయితే విష్టువతి కుమార్తె మాత్రం భూమి కొనుగోలు కోసం పాలకొల్లు ఎస్బీఐ బ్యాంక్ నుంచి రూ. 10 లక్షలు డ్రా చేసినట్టు చెప్తుతోంది. ఆ నగదును చర్చిలో ప్రార్థన కోసం విష్టువతి తీసుకెళ్లినట్టు శ్రీలక్ష్మీ తెలిపింది. మంత్రిని కలవడానికి వెళ్లిన తన తల్లి డబ్బు సంచిని మర్చిపోయిందని ఆమె చెప్పింది. టీవీలో వచ్చిన వార్తలను చూసి డబ్బు సంచిని వదిలిలేసినట్టు గుర్తుకు వచ్చిందని శ్రీలక్ష్మీ తెలిపింది. -
కాకినాడ ‘దేశం’..ఆధిపత్య సమరం..
టీడీపీ నేతల మధ్య రచ్చకెక్కుతున్న విభేదాలు పార్టీ నగర అధ్యక్షుడు దొరబాబు, వాణిజ్య విభాగం నేత బాబ్జీ వర్గాల మధ్య పెరుగుతున్న దూరం సాక్షి ప్రతినిధి, కాకినాడ :కాకినాడ తీరంలో తెలుగు తమ్ముళ్లు ఆధిపత్య పోరులో కొట్టుకుపోతున్నారు. పలు అంశాల్లో పరస్పరం కయ్యానికి కాలు దువ్వుతున్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్, ట్యాంక్ ఓనర్స్ అసోసియేషన్, కాకినాడ పోర్ట వర్కర్స్ యూనియన్ల వ్యవహారాలు, మార్కెట్లో ఆర్థిక కార్యకలాపాలు, కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు.. ఇలా అనేక విషయాల్లో ‘దేశం’ నేతల మధ్య విభేదాలు పొడచూపుతూండడంపై కేడర్‌లో ఆందోళన నెలకొంది. ఈ అంశాల్లో టీడీపీ కాకినాడ నగర అధ్యక్షుడు నున్న దొరబాబు, పార్టీ వాణిజ్య విభాగం నాయకుడు, గోదావరి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంధి బాబ్జీ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది. చివరకు ఈ వివాదం.. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో సోమవారం రాత్రి బాబ్జీకి చెందిన ధనలక్ష్మి ఫౌండేషన్ ఆరో వార్షికోత్సవానికి మంత్రులు దూరమయ్యే పరిస్థితికి దారి తీయడం టీడీపీలో చర్చనీయాంశమైంది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకూ దొరబాబు, బాబ్జీ చెట్టపట్టాలేసుకునే తిరిగారు. అనంతరం కాకినాడ దిగుమర్తివారివీధిలో వినాయక చవితి పందిరి విషయంలో వారిమధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడవి చినికిచినికి గాలివానగా మారి, రెండు వర్గాలుగా విడిపోయే వరకూ వెళ్లింది. రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుందన్న సాకుతో చవితి పందిరిని తొలగించేందుకు ఆ పార్టీకి చెందిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై బాబ్జీ ఒత్తిడి తెచ్చారు. దీనిని దొరబాబు వర్గీయులు వ్యతిరేకించడంతో వారిమధ్య వివాదం మొదలైందని పార్టీ నేతలు బాహాటంగానే చెప్పుకున్నారు. ఈ విషయంలో దొరబాబుదే పైచేయి అయింది. దీంతో దొరబాబు వర్గానికి బాబ్జీ దూరంగానే ఉంటున్నారు. దీనికి ఆర్థికపరమైన సర్దుబాట్లలో తలెత్తిన విభేదాలు కూడా తోడవడంతో ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ధనలక్ష్మి ఫౌండేషన్ వార్షికోత్సవానికి పార్టీ నగర అధ్యక్షుడైన దొరబాబును ఆహ్వానించలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. పార్టీ నాయకులతోపాటు ఇతర పార్టీల నేతలను కూడా ఆహ్వానించి, కేవలం దొరబాబును మాత్రమే విస్మరించడం కావాలని చేసింది కాక మరేమిటని ఆ వర్గం ప్రశ్నిస్తోంది. దీనిపై ముఖ్యనేతల వద్ద తాడోపేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చిన దొరబాబు వర్గీయులు ధనలక్ష్మి ఫౌండేషన్ వార్షికోత్సవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకాకుండా చేయగలిగారని చెబుతున్నారు. అయినప్పటికీ దీనికి ఎమ్మెల్యే కొండబాబు హాజరవడాన్ని దొరబాబు వర్గీయులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పార్టీ కార్యక్రమం కాకున్నా అందరినీ ఆహ్వానించి, తనను పిలవకపోవడాన్ని అవమానంగా భావించి.. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వారు కార్యక్రమానికి హాజరు కాలేదని టీడీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ కయ్యం.. మేయర్ పీఠం కోసమేనా! బాబ్జీ, దొరబాబులు రెండు వర్గాలు కావడానికి కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు కూడా మరో కారణమని నేతలు విశ్లేషిస్తున్నారు. అసలు జరుగుతాయో లేదో తెలియని కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠం కోసమే వారు పరస్పరం కయ్యానికి కాలుదువ్వుతున్నారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన కాపు సామాజికవర్గానికే మేయర్ సీటు కట్టబెట్టాలని దొరబాబు, వైశ్య సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని బాబ్జీ చెరో అజెండాతో వర్గాలుగా విడిపోయారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేకి ఆర్థికంగా చేయూతనిచ్చిన అంశాన్ని తెరపైకి తెచ్చి, తన కుటుంబ సభ్యులకు మేయర్ సీటు ఇప్పించుకొనేందుకు బాబ్జీ ప్రయత్నిస్తున్నారని దొరబాబు వర్గం ఆగ్రహంతో ఉంది. అదే జరిగితే ఎంతకైనా వెళతామని వారు చెబుతున్నారు. ఈ విభేదాలు ఏ విపరిణామాలకు దారి తీస్తాయోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ వర్గ విభేదాలను ఎమ్మెల్యే కొండబాబు ఎలా దారికి తెస్తారనేది వేచి చూడాల్సిందే. -
రసపట్టులో టీడీపీ వర్గపోరు
మృణాళిని పేరుతో నామినేషన్ వేయించిన కళా భార్యను కాకుండా కుమార్తెను తెరపైకి తెచ్చిన బాబ్జీ జెడ్పీ పీఠంపై పట్టు వీడని ఇరువర్గాలు శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠంపై కింజరాపు, కళా వర్గాల మధ్య సాగుతున్న పోరు ఊహించని మలుపులతో మరింత రాజుకుంటోంది.కింజరాపు వర్గానికి చెందిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీ కుటుంబ సభ్యులకు జెడ్పీ పీఠం దక్కకుండా చేసేందుకు మాజీ మంత్రి కళావెంకటరావు వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండగా.. తామేం తక్కువ తినలేదన్నట్లు ఆయనకు దీటుగా కింజరాపు శిబిరం ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగానే ముందుగా అనుకున్నట్లు బాబ్జీ భార్యతోపాటు కాకుండా ఆయన కుమార్తె చైతన్యతో గురువారం ఎచ్చెర్ల జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేయించారు. మరోవైపు తన మరదలు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ కిమిడి మృణాళిని పేరుతో తన అనుచరుల చేత కళా వెంకట రావు జి.సిగడాం జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేయించారు. మృణాళినికి అవకాశమిచ్చే విషయంలో పార్టీ అధినేత నుంచి సానుకూలత వ్యక్తం కాకపోవచ్చన్న అనుమానంతో ముందుగానే తమ సామాజికవర్గానికే చెందిన సామంతుల దామోదర్‌తో పాలకొండ నుంచి నామినేషన్ వేయిం చిన ఆయన.. గురువారం మధ్యాహ్నం అనూహ్యంగా మృణాళిని పేరుతో నామినేషన్ వేయించారు. దీంతో కళా వర్గానికి చెందిన ఇద్దరు జెడ్పీ పీఠం బరిలో నిలిచారు. ముందు బాబ్జీ కుటుంబానికి పీఠం దక్కకుండా చేస్తే.. తర్వాత తన వర్గీయులిద్దరిలో ఒకరికి ఖరారు చేసుకోవచ్చన్నది కళా వ్యూహం. బాబ్జీ కుమార్తె నామినేషన్ వేసినప్పటికీ బి-ఫారం మాత్రం కళానే ఇవ్వాల్సి ఉంది. ఇక్కడకూడా కళా తన ప్రతాపం చూపించనున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.