సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న నాయీ బ్రాహ్మణులు
సాక్షి, గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): సెలూన్ షాపులు ఉన్న నాయీ బ్రాహ్మణులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.10వేలు ఆర్థిక సహాయం ప్రకటించడంపై నాయీ బ్రాహ్మణ నంద యువసేన హర్షం ప్రకటించింది. ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపేందుకు యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఇంటూరి బాబ్జీ ఆధ్వర్యంలో మంగళవారం నాయీబ్రాహ్మణ యువకులు కంట్రోల్‌రూం వద్ద వైఎస్సార్ పార్క్‌కు చేరుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పాలాభిషేకం కార్యక్రమానికి ముందస్తు అనుమతి తీసుకోవాలని పోలీసులు నిర్వాహకులను అడ్డుకున్నారు. దీంతో నాయీ బ్రాహ్మణ యువసేన కార్యకర్తలు గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్ ఆవరణలోనే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్ర పటం పెట్టుకుని ఆర్థిక సహాయం ప్రకటించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఇంచార్జీ సీఐ సూర్యనారాయణ పోలీసు స్టేషన్‌లో ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు. ఏ కార్యక్రమానికైనా మందస్తు అనుమతి తీసుకోవాలని వారికి సూచించారు.
అనంతరం గుణదల గంగిరెద్దులదిబ్బలోని నాయిబ్రాహ్మణ కమ్యూనిటీ భవనంలో కృష్ణా జిల్లా నందయువసేన ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నాయిబ్రాహ్మణ సెలూన్ షాపులకు సంవత్సరానికి రూ.10,000 ఫిబ్రవరి లోపు అందించాలని నిర్ణయించినందుకు, 100 రోజుల పాలన జనరంజకంగా పూర్తి చేసినందుకు పాలాభిషేకం నిర్వహించారు. యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఇంటూరి బాబ్జీ, కృష్ణా జిల్లా అధ్యక్షుడు నాగరాజు నంద, వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ నంద, దేవాలయాల కల్యాణకట్టల జేఎసీ అధ్యక్షుడు రామదాసు, వాయిద్యకళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష్యులు యలమందరావు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు పవన్ నంద, జిల్లా కార్యవర్గసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment